
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన సమాధానాలు విచిత్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో యూరియా కొరత, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూండటం, సూపర్ సిక్స్ హామీల అమల్లో వైఫల్యం తదితర అంశాలపై జగన్ విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అదే రోజు ఇంకో సమావేశంలో చంద్రబాబు యథాప్రకారం జగన్ దూషణకు పరిమితమయ్యారు.
జగన్ సంధించిన నిర్దిష్ట ప్రశ్నలు ఒక్కదానికి కూడా నేరుగా చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. కూటమి అట్టర్ ఫ్లాఫ్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలా అన్న జగన్ ప్రశ్న వాస్తవానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే.. సూపర్‌సిక్స్ సూపర్ హిట్ పేరుతో అనంతపురంలో జరిపిన హడావుడికి చాలాచోట్ల నుంచి ప్రజలను బలవంతంగా తీసుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. స్కీములు కావాలంటే సభకు రావాల్సిందేనని కొన్ని గ్రామాల్లో చాటింపు వేశారంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. కొందరు అధికారులు, డ్వాక్రా గ్రూపు సభ్యులు, ప్రభుత్వ పథకాలు పొందుతున్న వారు సభకు రాకపోతే రూ.200 జరిమానా పడుతుందని హెచ్చరించారట. ఇక వేల ఆర్టీసీ బస్సులతో జనాన్ని బలవంతంగా తరలించారు. ఈ నేపథ్యంలోనే జగన్ బలవంతపు విజయోత్సవాలు అన్న వ్యాఖ్య అర్ధవంతంగానే ఉందనిపిస్తుంంది.
బలవంతపు విజయోత్సవాలు అనేదానికి.. చంద్రబాబు దీనిపై ఎక్కడా స్పందించలేదు. సూపర్ సిక్స్ హిట్ అయినందుకే జనం తరలి వచ్చారన్నట్లుగా బిల్డప్ ఇచ్చే యత్నం చేశారు. సూపర్ సిక్స్ హిట్ అయిందా? లేదా? అంటూ చంద్రబాబు ప్రశ్నించినప్పుడు జనం ననుంచి పెద్దగా స్పందన రాలేదు. చప్పట్లు కొట్టాలని ఒకటి రెండుసార్లు సార్లు ఆయనే అడిగినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి.
👉చంద్రబాబు చేసిన మోసాలు ఇవి అంటూ జగన్ కొన్ని అంశాలను ఉదహరించారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇచ్చావా చంద్రబాబూ అని ఆయన అడిగారు. దీనికి చంద్రబాబు సమాధానం ఇవ్వలేకపోయారు.
👉నిరుద్యోగ యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలు ఇవ్వాలి కదా! రెండేళ్లకు రూ.72 వేలు బాకీ పడుతున్నావు కదా? అని జగన్ వేసిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమే లేదు.
👉సూపర్ సిక్స్‌తోపాటు టీడీపీ, జనసేనల ఎన్నికల ప్రణాళికలో ఉన్న ఇతర హామీల మాటేమిటి అని అంటూ ఏభై ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారికి నెలకు రూ.నాలుగు వేల ఫించన్ ఇస్తానన్న వాగ్ధానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేదన్న జగన్ వ్యాఖ్యకు చంద్రబాబు నుంచి బదులు లేదు.
👉వృద్ధాప్య ఫించన్‌లో సుమారు 5 లక్షల మందికి కోత పెట్టారని జగన్ చేసిన ఆరోపణపైన చంద్రబాబు ఏమీ మాట్లాడలేకపోయారు.
సూపర్ సిక్స్ కు సంబంధించి ఎన్నికల ముందు టీడీపీ మీడియాలో ఇచ్చిన ప్రకటనల్లోని అంశాలకు, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఇస్తున్న ప్రచార ప్రకటనలలోని తేడాలను చూపించి జగన్ కూటమిని నిలదీశారు. ఆడబిడ్డ నిధి, ఏభై ఏళ్లకే పెన్షన్ వంటి హామీలను ఇప్పుడు హామీల ప్రచార ప్రకటన నుంచి తొలగించడాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కళ్లార్పకుండా అబద్దాలు ఆడతారని అంటూ, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వీడియోలు, ఇప్పుడు చెబుతున్న మాటలతో పోల్చి జగన్ ఆధారసహితంగా విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో బాండ్లు ఇచ్చారని, మెహరాజ్ బేగం షేక్ అనే ఆమె కుటుంబానికి 2024 జూన్ నుంచి వివిధ స్కీముల కింద రూ.3.34 లక్షల ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబు సంతకం చేసి ఇచ్చిన బాండ్ ఉందని, ఆ మేరకు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ఇవ్వకపోవడం జనాన్ని మోసం చేయడం కాదా? అని నిలదీశారు.
తల్లికి వందనం స్కీమ్ లో కోతలు పెట్టడం, వంట గ్యాస్ సిలిండర్లు గత ఏడాది ఒకటే ఇవ్వడం, ఈ ఏడాది ఇంకా ఇవ్వకపోవడం మొదలైన విషయాలను లేవనెత్తారు. చంద్రబాబు మాత్రం ఈ స్కీములను కొన్నిటిని ప్రస్తావిస్తూ అవన్ని అమలు చేసేసినట్లు, సూపర్ హిట్ అయిపోయినట్లు ప్రజలలో భ్రాంతి కల్పించే యత్నం చేశారు. ఉదాహరణకు అన్నా క్యాంటిన్లలో 5.60 కోట్ల మంది భోజనం చేశారని ఆయన అన్నారు. అవి కాకిలెక్కల్లా కనిపిస్తున్నాయన్నది పలువురి భావన. అయినా అది అమలు చేశారని అనుకున్నా, మిగిలినవాటి సంగతేమిటి? తల్లికి వందనం లో రూ.15 వేలు ఇస్తానని ఒక ఏడాది ఎగవేసి, రెండో ఏడాది రూ.13 వేలు చొప్పునే ఇచ్చింది వాస్తవమా? కాదా? అందులోను చాలామందికి కోత పడిందా? లేదా? అన్న జగన్ ప్రశ్నకు జవాబు రాలేదు.
ఉచిత బస్సు గురించి మీరు ఇచ్చిన హామీ ఏమిటి? ఎక్కడికైనా రాష్ట్రంలో మహిళలు ఉచితంగా ఆర్టిసి బస్ ప్రయాణం చేయవచ్చని చెప్పారా?లేదా? అని అంటూ, అప్పట్లో చంద్రబాబు దానికి సంబందించి చేసిన ప్రసంగం క్లిప్పింగ్ ను కూడా జగన్ చూపించారు. ఆ విషయానికి చంద్రబాబు బదులు ఇవ్వకుండా, ఫ్రీ బస్ హిట్ అయిందని, ఐదు కోట్ల మంది ప్రయాణాలు చేసేశారని సభలో తెలిపారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు కేవలం కూటమి ప్రభుత్వమే రైతులకు ఇస్తుందని ఎన్నికలకు ముదు హామీ ఇచ్చి ,ఒక ఏడాది ఇవ్వకుండా, ఈ ఏడాది రూ.ఐదు వేలు మాత్రమే ఇచ్చింది నిజం కాదా అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సమాధానం రాలేదు. తొలివిడతలో రూ.ఏడు వేలు ఇచ్చామని సభలో చెప్పారు. మరి హామీ నెరవేర్చినట్లు అవుతుందా? అందువల్ల ఇది హిట్టా? ఫట్టా అని అంటే ఫట్ కాకపోయినా, రైతులను మోసం చేసినట్లే అవుతుందన్న విశ్లేషణ వస్తుంది.
ఇక మెడికల్ కాలేజీల గురించి జగన్ మాట్లాడుతూ తమ హయాంలో 17 కాలేజీలు తెచ్చిన వైనం, అందులో కొన్నిటిని పూర్తి చేసిన సంగతి చెప్పారు. సంబంధిత కాలేజీల భవనాలు,క్లాస్ రూమ్‌ల ఫోటోలను ,వీడియో క్లిప్పింగ్ లను కూడా ఆయన చూపించారు. ఈ అంశంలో చంద్రబాబు ఏకంగా అబద్దం చెప్పడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీనే ఈ మెడికల్ కాలేజీలను తీసుకు వచ్చినట్లు ఆయన చెప్పేశారు. కాలేజీలకు భూమి ఇచ్చి శంకుస్థాపన చేస్తే సరిపోతుందా? అని మరోసారి అన్నారు. అయితే సమాచార శాఖ మంత్రి పార్థసారథి క్యాబినెట్ సమావేశం తర్వాత గత ప్రభుత్వం 17 కాలేజీలను కేంద్రం ద్వారా తీసుకు వచ్చిందని వెల్లడించి, అందులో ఏడు పూర్తి అయ్యాయని, పదింటిని పీపీపీ పద్దతిలోకి మార్చుతున్నామని చెప్పారు.
ఈ వీడియో క్లిప్పింగ్‌ను ,చంద్రబాబు అనంత సభలో చెప్పిన అబద్దాన్ని కలిపి కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇంత సీనియర్ అయిన చంద్రబాబు ఇలా అసత్యాలు కాకుండా, జగన్ ప్రభుత్వం వీటిని తెచ్చిందని, వాటిని ఎందువల్ల తాము పిపిపి మోడల్ గా మార్చుతున్నామో వివరించి ఉంటే గౌరవంగా ఉండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం ఏభై సీట్లు ఇస్తే, తమకు వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడం దుర్మార్గం కాదా? అని జగన్ ప్రశ్నించారు. ఈ విషయం గురించి చంద్రబాబు మాట్లాడనే లేదు.
యూరియా కొరత లేదని తొలుత కొన్నాళ్లపాటు డబాయించిన చంద్రబాబుఈ సభలో మాత్రం యూరియా కొరత లేకుండా చూస్తామని చెప్పడం గమనించదగ్గ విషయమే. ఏది ఏమైనా జగన్ తనదైన శైలిలో పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడితే , వాటికి చంద్రబాబు జవాబులు ఇవ్వలేకపోయారు.తమ సూపర్ సిక్స్ హిట్ కాదని కూటమి నేతలకు కూడా తెలుసు. ప్రజలలో వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను కప్పిపుచ్చడానికే డైవర్షన్ రాజకీయాలలో భాగంగా చంద్రబాబు అనంతపురంలో సూపర్ హిట్ అంటూ సభ పెట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.