సాక్షి, ఏయూ క్యాంపస్: రుషికొండ భవనాలపై బీజేపీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం బీచ్‌రోడ్డులోని మాజీ ప్రధాని వాజ్‌పేయి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. రుషికొండ భవనాల వినియోగంలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు.
రుషికొండను ఆదాయ వనరుగా చూడకూడదన్నారు. ఈ భవనాలను స్టార్ హోటల్స్‌కు ఇచ్చి సామాన్యులకు దూరం చేయవద్దని కోరారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, పార్టీ పరంగా మాట్లాడటం లేదన్నారు. విశాఖ అంటే సాఫ్ట్‌వేర్ పెట్టుబడులే కాదని, ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి చేయాలని అన్నారు. రుషికొండ భవనాల గురించి పునరాలోచించాలని సూచించారు. మంత్రుల కమిటీ తమ అభిప్రాయాలు తీసుకోలేదన్నారు. తనను కానీ, ఇతర ఎమ్మెల్యేలను కానీ ఎవరూ అభిప్రాయం అడగలేదన్నారు.
ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని చెప్పారు. మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేస్తామనడం తగదన్నారు. బడా హోటల్స్‌కు ఈ భవనాలు ఇవ్వాలని నిర్ణయించిన విషయం వార్తాపత్రికల్లోనే తెలుసుకున్నానని తెలిపారు. ఈ భవనాలను టీటీడీకి ఇచ్చి వివాహ వేదిక నిర్మించి, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే వేదికగా నిలపాలని విష్ణుకుమార్ రాజు సూచించారు.


