సాక్షి ప్రతినిధి, బాపట్ల: రోడ్డుపైనే ఏఎస్‌ఐ, సీఐ ఘర్షణ పడిన ఘటన బాపట్ల జిల్లా చీరాలలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. చీరాల రూరల్ ఏఎస్‌ఐ రవికుమార్ బుధవారం అర్ధరాత్రి చీరాల చర్చి సెంటర్‌లో కారు పార్కు చేశారు. అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉన్న ఆ కారును పక్కకు తీయాలని స్థానిక పోలీసులు చెప్పారు.
దీంతో ఏఎస్‌ఐ ఆగ్రహిస్తూ..తనకారునే తీయమంటారా అంటూ వారిపై చిందులు తొక్కాడు. పోలీసులకు, ఏఎస్‌ఐకి మధ్య మాటామాటా పెరగడంతో అక్కడకు వన్‌టౌన్ సీఐ సుబ్బారావు వచ్చారు. అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్లిపోవాలని ఏఎస్‌ఐని ఆదేశించారు. దీంతో మరింతగా ఆగ్రహించిన ఏఎస్‌ఐ..సీఐతో వాగ్వాదానికి దిగాడు. ఏఎస్‌ఐని అక్కడినుంచి పంపించేయాలని పోలీసులకు సీఐ చెప్పి వెళ్తుండగా అతడిని ఏఎస్‌ఐ వెంబడించి దూషించాడు.
ఓ దశలో సీఐ వైపు ఏఎస్‌ఐ దూసుకురావడంతో ఇరువురూ కలియబడ్డారు. దీంతో పోలీసులు ఏఎస్‌ఐకు నాలుగు దెబ్బలు వేసి స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఈ గొడవనంతా స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఏఎస్‌ఐ ప్రవర్తనే గొడవకు దారి తీసిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులకు వన్‌టౌన్ సీఐ ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఏఎస్‌ఐను వీఆర్‌కు పంపించి శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు.


