కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌.. కాంగ్రెస్‌, రేవంత్‌కు నష్టమేనా? | KSR Comments On Minister Konda Surekha Family Controversy Episode, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

కొండా ఫ్యామిలీ ఎపిసోడ్‌.. కాంగ్రెస్‌, రేవంత్‌కు నష్టమేనా?

Oct 23 2025 10:23 AM | Updated on Oct 23 2025 10:35 AM

KSR Comments On Minister Konda Surekha Family Episode

గజం మిథ్య, పలాయనం మిథ్య అని నానుడి. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో కొన్ని ఘటనలు ఇలానే ఉంటాయి. మంత్రి కొండా సురేఖ వివాదమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఏదో జరిగిపోతుందన్న భావన ముందు కలుగుతుంది. ఆ తర్వాత పరిస్థితి.. అసలేమీ జరగలేదేమో అనేలా మారుతుంది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్ధరాత్రి వేళ కొండా సురేఖ నివాసానికి వెళ్లడం, ఓఎస్డీ సుమంత్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయడం ఆ తరువాత మంత్రి స్వయంగా అతడిని కారులో ఎక్కించుకుని రక్షించడం, అదే టైమ్‌లో సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి, మరికొందరు మంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం మనందరం చూశాము.

ఆ తరువాత మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరయ్యారు సురేఖ. పార్టీ అధిష్టానం ప్రతినిధి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రభృతులు జోక్యం చేసుకుని రేవంత్, కొండా దంపతుల మధ్య రాజీ కుదిర్చి పరిస్థితిని అదుపు చేశారు. కాంగ్రెస్ నేతలంతా గప్ చుప్ అయిపోయారు. అయితే విపక్షం ఊరుకోదు కదా! తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందని, ముఖ్యమంత్రిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన ఆరోపణల మాటేమిటి? అంటూ బీఆర్‌ఎస్‌, బీజేపీలు ధ్వజమెత్తాయి.  

మంత్రి కొండ సురేఖ విషయం ఎందుకంత సీరియస్ అయింది? ఆ తర్వాత ఎలా సద్దుమణిగింది అన్నది ఆసక్తికరమైన అంశమే. ప్రాంతీయ పార్టీల్లో ఎవరైనా సీఎంపై తీవ్ర విమర్శలు చేస్తే ఆ వ్యక్తి పదవి పోయినట్లే. కాంగ్రెస్‌లో అలా ఉండదు. ఢిల్లీలోని హైకమాండ్ పెద్దలను ఏమీ అనకుండా, రాష్ట్ర స్థాయిలో ఎవరు, ఎవరిని విమర్శించుకున్నా పెద్దగా పట్టించుకోరు. కాకపోతే పిలిచి మాట్లాడి రాజీలు చేస్తుంటారు. దేశంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఇందుకు కారణం కావచ్చు. అయితే సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్ రెడ్డిలు అప్రతిష్ట పాలయ్యారు. మంత్రి సురేఖ తొలుత ఆత్మరక్షణలో పడినప్పటికీ, ఆ తర్వాత వ్యూహాత్మకంగా రాజీ కుదుర్చుకోవడం ద్వారా పదవిని నిలబెట్టుకున్నారని భావించాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న సమయం కావడం, బీసీలకు కాంగ్రెస్ ప్రాధాన్యం ఇస్తోందన్న భావన  కలిగించే యత్నం చేస్తున్న తరుణంలో ఒక బీసీ మంత్రిని పదవి నుంచి తప్పిస్తే రాంగ్ సంకేతాలు వెళతాయన్న  అభిప్రాయం కూడా ఇందులో ఉండవచ్చు.

సీనియర్ నేత, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఒక సిమెంట్ కంపెనీ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేయడానికి సురేఖ ఓఎస్డీ సుమంత్ తుపాకితో బెదిరించారన్న ఫిర్యాదు వచ్చింది. అతనితోపాటు మరో కాంగ్రెస్ నేత రోహిత్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని చెబుతున్నారు. ఈ సమాచారం ఆధారంగా సీఎం ఆఫీస్ వెంటనే సుమంత్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తనకు చెప్పకుండా ఎలా చేస్తారన్నది సురేఖ ప్రశ్న. గతంలో పలుమార్లు హెచ్చరించినా మంత్రి పట్టించుకోలేదన్నది రేవంత్ కార్యాలయ వర్గాల వాదన. ఆ తర్వాత పోలీసులు సుమంత్ అరెస్టుకు ప్రయత్నించారు. మంత్రి ఇంటిలోనే రక్షణ పొందుతున్నారని తెలుసుకుని అక్కడకు వెళ్లారు. అది తీవ్ర కలకలం రేపింది. కానీ, సురేఖ  పోలీసులకు అవకాశం ఇవ్వకుండా ఓఎస్డీని అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. సహ మంత్రుల వద్దకు వెళ్లి ఆమె దీనిపై తన వాదన వినిపించారని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్న కొందరిని కలిసినట్లు వార్తలు వచ్చాయి.

హోంశాఖ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కావాలనే ఇలా చేశారన్నది సురేఖ వర్గం ఆరోపణగా ఉంది. సురేఖ కుమార్తె ఈ విషయాన్ని నేరుగా ప్రస్తావించి పలు ఆరోపణలు గుప్పించడం రేవంత్‌కు ఇరకాటంగా మారింది. రేవంత్ రెడ్డి, మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, తదితరులపై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుల పేర్లు చెప్పి మరో ఆరోపణ సంధించారు. తన తల్లి సురేఖను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆమె అన్నారు. ఏకంగా రెడ్లు తమపై కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. మేడారం వద్ద అభివృద్ది పనుల కాంట్రాక్టులు, దేవాదాయ శాఖకు సంబంధించిన భూముల వివాదం మొదలైన విషయాలలో ఏర్పడిన అభిప్రాయ బేధాలు ఈ వర్గ పోరుకు కారణం అయ్యాయని చెబుతున్నారు.

వరంగల్ కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో కూడా ఇదే తరహా గొడవలు నడుస్తుండటం, వారి మద్య రాజీ చేయడానికి పీసీసీ కృషి చేయడం, అవేవి ఒక కొలిక్కి రాకముందే ఈ పరిణామం సంభవించడం కాంగ్రెస్‌కు చికాకు అయింది. తదుపరి మీనాక్షి సమక్షంలో సురేఖ తన వాదన వినిపించి వచ్చారు.  కాగా, తమ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్‌పై చేసిన ఆరోపణలను పట్టించుకోవద్దని, ఆవేశంలో అన్న మాటలు అని మంత్రి భర్త, ఎమ్మెల్సీ మురళీ సర్దిచెప్పే యత్నం చేశారు. సురేఖ మంత్రి పదవి వదలుకోవాల్సి వస్తుందేమో అన్న ప్రచారం జరిగింది. కానీ, ఆమె వ్యూహాత్మకంగా వ్యవహరించి ప్రస్తుతానికి ఆ ఇబ్బంది నుంచి బయటపడ్డారని అనిపిస్తుంది. కొండా దంపతులు స్వయంగా రేవంత్‌ను కలిసి శాలువా కప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని తాము కోరుకున్న విషయాన్ని గుర్తు చేశారట. ఓఎస్డీని దూరం పెట్టండని రేవంత్ సూచించారట. తమ కుమార్తె చేసిన విమర్శలు ఆవేశంలో చేసినవని వీరు విచారం వ్యక్తం చేశారట. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ ప్రాసెస్‌లో కీలక భూమిక పోషించినట్లుగా ఉంది. కానీ, ఒకసారి విభేదాలు పొడసూపాక అవి అంత తేలికగా పోవు. కాంగ్రెస్‌లో సద్దుమణిగినప్పటికీ, పలు  ప్రశ్నలు అటు రాజకీయ వర్గాలలోను, ఇటు ప్రజలలోను  మిగిలే ఉంటాయి!.

ఇంతకీ సుమంత్ గన్ తో బెదిరించారా లేదా? దానిపై వచ్చిన ఫిర్యాదును హ్యాండిల్‌ చేయడంలో రేవంత్ కార్యాలయం విఫలమైందా? అర్దరాత్రి వేళ మంత్రి ఇంటికి పోలీసులను పంపించడం తప్పు అన్న అభిప్రాయం కాంగ్రెస్ ముఖ్యనేతలలో, అధిష్టానంలో కలిగిందా? మంత్రి సురేఖ ఒక కేసులో నిందితుడికి ఆశ్రయం కల్పించడం తప్పా? కాదా? మొదలైన ప్రశ్నలన్ని అలాగే ఉండిపోయాయి. కొండా సురేఖ దంపతుల రాజకీయ ప్రస్థానం అంతా ఎప్పుడూ వివాదాలు, గ్రూపుల గొడవలు, ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో ఘర్షణలతోనే సాగిందని చెప్పాలి. సురేఖ, మురళీలు తొలుత కాంగ్రెస్ లోనే ఉండేవారు. అప్పట్లో టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకరరావుతో తీవ్రంగా ఘర్షణ పడేవారు. కాంగ్రెస్ వర్గ రాజకీయాలలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మద్దతుగా ఉండేవారు. వైఎస్ ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి రోశయ్యతో సరిపడలేదు. అంతలో వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో ఆమె ఈ పార్టీలోకి వచ్చారు.

ఎమ్మెల్యే పదవిని కూడా వదలుకున్నారు. తదుపరి వచ్చిన ఉప ఎన్నికలో పోటీ చేసి స్వల్ప తేడాతో టీఆర్‌ఎస్‌ చేతిలో ఓడిపోయారు. కొంతకాలం టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటాలు సాగించేవారు. మళ్లీ పరిణామాలు మారడంతో ఆమె వైఎస్సార్‌సీపీకి దూరమయ్యారు. రాష్ట్ర  విభజన జరగడంతో ఆమె టీఆర్‌ఎస్‌కు దగ్గరవడం, వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అయినా కొండా వర్గం ఆశించినట్లుగా సురేఖ మంత్రి కాలేకపోయారు. తదుపరి టీఆర్‌ఎస్‌పైన, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌పైన విమర్శలు చేసి మళ్లీ కాంగ్రెస్ వైపు పయనించారు. కాంగ్రెస్‌కు కూడా జిల్లాలో గట్టిగా నిలబడే నాయకత్వం అవసరమైంది. అది కొండా దంపతులకు కలిసి వచ్చింది. 2023లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలిచారు. తదుపరి రేవంత్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు.

ఈ ప్రస్థానంలో మంత్రి సురేఖ ప్రజలకు కనిపించే ఫేస్ అయితే, వెనుక ఆమె భర్త మురళీ చేసే రాజకీయమే కీలకం అని చెబుతారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కుని మూడు  దశాబ్దాలుగా వరంగల్ జిల్లా రాజకీయాలలో తమదైన శైలిలో ఒక ప్రముఖ పాత్రను పోషించడం కొండ దంపతుల  విశిష్టత. ఏతావాతా ఈ మొత్తం ఎపిసోడ్‌లో అటు రేవంత్‌కు, ఇటు సురేఖకు నష్టం జరిగాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలలో కొంత పలచన అవడానికి కూడా ఇది దోహద పడిందని అంగీకరించాలి.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement