
‘నవ తెలంగాణ’ పత్రిక వార్షికోత్సవంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి చేసిన వ్యాఖ్యలు కొన్ని అభ్యంతరకరం. మరికొన్ని అర్ధసత్యాలు. ఇంకొన్ని పూర్తిగా అసత్యాలు. కొంతమంది తీరు చూస్తే చెంప చెళ్లుమనిపించాలని అనిపిస్తుందని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు అనడం భావ్యం కాదు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలలో పనిచేసే వారిని జర్నలిస్టులుగా గుర్తించేందుకు ఆయన ఇష్టపడకపోవచ్చు వారి వల్ల ఆయనకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉండవచ్చు కానీ.. మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రమైనా అంతా పద్దతిగా ఉందని ఆయన చెప్పగలరా? లోపాలు ఎక్కడైనా ఉండవచ్చు.
ప్రముఖ పత్రికలు, టీవీ ఛానళ్లు కొన్ని చేస్తున్న అసత్య ప్రచారాలు, వాటి యజమానులు కొందరు చేసే పైరవీలు, రాజకీయ బ్రోకరిజాలు రేవంత్‌కు తెలియవని అనుకుంటే పొరపాటే. ఒకరిద్దరితో ఆయనకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. వారు చెప్పిన మాట జవదాటరని కూడా కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. అలాంటి వారిలో రేవంత్‌కు సత్యసంధత కనిపిస్తోందా? అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం ఇస్తారు?. ప్రధాన మీడియా ఇవ్వని అనేక విశ్లేషణలు, ముఖ్యమైన వార్తా కథనాలను డిజిటల్ మీడియా ఇస్తోంది. రేవంత్ సహా పలువురు రాజకీయ వేత్తలు డిజిటల్ మీడియాను పూర్తిగా వాడుకుంటున్నారు. కొందరు పార్టీ కార్యాలయాలలో వందల సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తూ తమ అనుకూల స్టోరీలతోపాటు ప్రత్యర్థి పార్టీపై, గిట్టని నేతలపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. వీటిలో చాలా అబద్దాలు ఉంటున్నాయన్న అభిప్రాయం ఉంది. సాధారణ జర్నలిస్టులు నిర్వహించే యూట్యూబ్ ఛానళ్ల కన్నా, రాజకీయ పక్షాలు నడిపే ఛానళ్లే సమాజానికి హానికరంగా మారుతున్నాయని. వాటి గురించి రేవంత్ ఏమి చెబుతారు!.
రాజకీయాలలో మాదిరే జర్నలిజంలో కూడా విలువలు తగ్గిన మాట నిజమే. నాలుగు ముక్కలు రాయడం రాకపోయినా ప్రతి వాడు జర్నలిస్టునే అని చెప్పుకుంటున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇందులో కొంతవరకు నిజం లేకపోలేదు. అక్షర జ్ఞానం అవసరమే కావచ్చు. కానీ, మారిపోయిన కాలమాన పరిస్థితులను కూడా ఆయన అర్థం చేసుకోవాలి. గతంతో పోలిస్తే సాంకేతికంగా చాలా మార్పులు వచ్చాయి. సెల్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి జర్నలిస్టు కావచ్చంటారు. వారందరిని జర్నలిస్టులు అనాలా?.. వద్దా అన్నది ప్రభుత్వ ఇష్టం. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ప్రధాన స్రవంతిలో ఉన్న జర్నలిస్టుల కన్నా, సోషల్ మీడియాలో, ప్రత్యేకించి యూట్యూబ్ ఛానళ్లు నిర్వహిస్తున్న కొందరు చెప్పే విషయాలను జనం శ్రద్దగా వింటున్నారు. వారికి లక్షల సంఖ్యలో వ్యూస్ కూడా వస్తున్నాయి.
ఈ మధ్య కొన్ని సామాజిక సమస్యలపై ఒక మహిళా జర్నలిస్టు ఇచ్చిన కథనాలు, ఇంటర్వ్యూలు బాగా ప్రాచుర్యం పొందాయి. కర్ణాటకలోని ధర్మస్థళలో యువతులపై జరిగిన ఘోర అకృత్యాలు, అనేక మంది కనిపించకుండా పోయిన ఘటనపై యూట్యూబ్ మీడియానే సంచలనాత్మక స్టోరీలు ఇచ్చింది. కొందరు రాజకీయ పార్టీలకు సంబంధించి ఇస్తున్న విశ్లేషణలు కూడా గుర్తింపు పొందుతున్నాయి. ఫ్రొఫెసర్ నాగేశ్వర్ వంటి వారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తారంగా వస్తుంటాయి. జర్నలిస్టులకు ఇది ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది. స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. జర్నలిస్టు అంటే ఎవరన్నది నిర్వచించడం కష్టమైన పరిస్థితి ఇది. యూట్యూబ్ ఛానల్లో పని చేసే వారికి ప్రభుత్వపరమైన ప్రత్యేక గుర్తింపు లేదు. సాయం ఉండదు. కాకపొతే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ల పేరుతో బ్లాక్ మెయిలింగ్, పైరవీలు వంటివి చేస్తుంటారు. ఆహ్వానం లేకపోయినా ఆయా కార్యక్రమాలలో పాల్గొనడం, అర్థం పర్థం లేని ప్రశ్నలు వేయడం వంటివి చేస్తుండవచ్చు. అలాంటి వారి వల్ల రేవంత్‌కు చికాకు కలిగి ఉండవచ్చు. కాని కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి వారి చెంపపై కొట్టాలనిపిస్తుందని ఎలా అంటారో అర్థం కాదు.
రాజకీయాలలో ఉన్న వారంతా సుద్దపూసలని ఆయనే అంగీకరించ లేదు. వారిలో చాలామందికి పెద్దగా పదవులు ఉండవు. ఆయా నేతల వెనుక అనుచరులమని చెప్పుకుని తిరుగుతుంటారు. దందాలు కూడా చేస్తుంటారు. భూ కబ్జాలు జరుగుతుంటాయి. రాజకీయ నేతలపై ఎవరిపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలిపే సంస్థలు ఉన్నాయి. అలా కేసులు ఉన్నవారు పదవులలోకి ఎలా వస్తారని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఉండదు. రేవంతే ఒక సందర్భంలో చెప్పినట్లు ఆయనపై చాలా కేసులు ఉన్నాయి. అవన్ని నిజమైనవా? కావా? అన్నది వేరే చర్చ. కొందరు చిన్న, చితక రాజకీయ నేతలు విజిటింగ్ కార్డులు పెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతూ పైరవీలు సాగిస్తుంటారు. వారందరిని అరికట్టే వ్యవస్థ ప్రభుత్వంలో ఉందా అన్నది ప్రశ్న. ఇంటి పేరు మాదిరి జర్నలిస్టు అని తగిలించుకుంటున్నారని రేవంత్ అనడం సబబు కాదు. ఎవరి స్వేచ్చ వారిది. వారు తమ ప్రతిభను చాటుకోగలిగితే జర్నలిస్టుగా పేరు తెచ్చుకుంటారు. రాణించగలుగుతారు. రోడ్లపై ఆవారాగా తిరిగేవారు, తిట్లు వచ్చిన వారు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారని అన్నారు. రాజకీయాల్లోనూ ఇదే రీతిలో పలువురు వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఉంది.
రాజకీయ పార్టీలకు అనుబంధంగా మీడియా గురించి కూడా మాట్లాడారు. కొన్ని పత్రికలు తాము ఫలానా పార్టీకి చెందిన విషయాన్ని ఓపెన్ గానే చెప్పుకోగలుగుతున్నాయి. వాటిలో ఇబ్బంది లేదు. అవి రాసే, లేదా టీవీలలో ప్రసారం చేసే వాటిపై స్పష్టత ఉంటుంది. కాని స్వతంత్ర పాత్రికేయం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ, ఇతర పార్టీలపై పచ్చి అబద్దాలను ప్రచారం చేసే మీడియాతోనే ఇప్పుడు ఉన్న సమస్య. కాంగ్రెస్ పార్టీ కూడా మీడియాను నిర్వహించేది. అలాగే వామపక్షాలకు చాలాకాలంగా మీడియా ఉంది. ఒకప్పుడు నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు మీడియాపై విరుచుకుపడే వారు. కానీ, ఇప్పుడు అదే మీడియాను, అవే పార్టీలను రేవంత్ పొగుడుతున్నారు. తప్పులేదు. కాలం మారింది. కొన్నిసార్లు కాంగ్రెస్, వామపక్షాలు కలిసి పోటీచేసి అధికారంలోకి వస్తున్నాయి. కొన్నిసార్లు విబేధించుకుంటున్నాయి.
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాన్ పెట్టింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని అణచివేసింది. నక్సలిజానికి వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకుంది. కానీ, ఇప్పుడు అదే సాయుధ పోరాటం గొప్పది అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ప్రముఖ గాయకుడు గద్దర్ వంటి నక్సల్ నేతల పేరు మీద సినీ అవార్డులు కూడా ఇస్తున్నాయి. అంతెందుకు కాంగ్రెస్‌ను, సోనియా గాంధీని రేవంత్ ఎంతగా దునుమాడింది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎంతగా పొగుడుతున్నది చూస్తున్నాం. తప్పులేదు. కాలం మారింది. రాజకీయాలు మారాయి.
మరో సంగతి చూద్దాం. కొన్ని పత్రికలు ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి, మరో రాష్ట్రంలో ఇంకో పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి బహిరంగంగా మద్దతు ఇచ్చే ఒక వర్గం మీడియా తెలంగాణకు వచ్చేసరికి కాంగ్రెస్‌కు సపోర్టు చేస్తోంది. అంతకు ముందు ఇదే మీడియాలో ఒక భాగం బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండేది. రాజకీయ పార్టీలు కూడా తెలుగు రాష్ట్రాలలో తమాషా రాజకీయాలు చేస్తున్నాయి. బీజేపీ కూటమిలోని టీడీపీ ప్రభుత్వానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా సహకరిస్తోందన్న ప్రచారం ఉంది. ఏపీలో కాంగ్రెస్ కూడా బీజేపీ కూటమికే పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న అభిప్రాయం ఉంది. అది నైతికమా?. అలా చేసే రాజకీయ నేతలను నిరోధించగలమా?. ప్రజలను మోసం చేయకపోతే వారు ఓట్లు వేయరన్న ఫిలాసఫీ కూడా రాజకీయ నేతలలో ఉంది కదా!. అమెరికాలో ఒక సందర్భంలో రేవంత్ చేసిన ఆ తరహా వ్యాఖ్యలు ఇప్పటికీ సోషల్ మీడియాలో కనిపిస్తాయి. ఆయన నిజమే చెప్పి ఉండవచ్చు. కానీ, అది మోసం చేయడం అవ్వదా అన్నది పాయింట్. తాను నిజాలు చెప్పకపోవచ్చని, కాని అబద్దాలు ఆడనని రేవంత్ అంటున్నారు. దానికి, దీనికి పెద్ద తేడా ఉంటుందా?.
రాజకీయ నేతల మాదిరే జర్నలిస్టులు కూడా వారి స్వేచ్చకు అనుగుణంగా ఉండవచ్చు. ఎటు వచ్చి అబద్దాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు, తిట్ల పురాణాల జోలికి వెళ్లనంతవరకు ఓకే. అలా కాకపోతే ఎటూ చట్టాలు ఉండనే ఉన్నాయి. కాకపోతే తమకు నచ్చని యూట్యూబ్ ఛానళ్లపై ప్రభుత్వాలు దాడులు చేస్తుంటాయి. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను బాగా వాడుకున్న వ్యక్తే అని అంటారు. ఇప్పుడు దానిపై ఆయనకు ఎందుకు ఏవగింపు కలిగిందో తెలియదు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డిజిటల్ మీడియా బాగా ఉపయోగపడిందన్న భావన కూడా ఉంది. ఏది ఏమైనా ఏ మీడియా అయినా, ఏ రాజకీయ సమాజం అయినా బాధ్యతగా ఉండటమే శ్రేయస్కరం.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్టు, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.