
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది.
అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీ, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్‌ఎస్ పక్షాన మరో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన అబ్జర్వేషన్స్‌ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఈ వాద ప్రతివాదాలలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేము.
ఈ సందర్భంలో గతంలో ఆయా ప్రభుత్వాలపై వేసిన కమిషన్‌లతో ఎవరికి ఇబ్బంది కలగలేదనే చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారెవ్వరూ ఈ తరహా కేసులు ఎదుర్కోలేదు. చలన చిత్రాభివృద్ది సంస్థ అవకతవకలకు సంబంధించి జరిగిన కమిషన్ విచారణకు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హాజరయ్యారు. కమిషన్ నివేదికలో ఆయనను తప్పు పట్టలేదు. ఒక భూ సేకరణ స్కాంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఇంకో మాజీ సీఎం స్టే పొందారు. విభజన తర్వాత ఏపీలో రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాటలో 29 మంది మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబే విచారణ సంఘాన్ని నియమించుకున్నారు. అందులో ఆయనను కమిషన్ ఆక్షేపించలేదు. ఇప్పుడు కేసీఆర్ ఈ విచారణ సంఘం నివేదికను ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తికరం. రేవంత్ ప్రభుత్వం ఆయనపై కేసు పెడుతుందా? అరెస్టు చేస్తారా?.
ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్కాంలపై దర్యాప్తు జరిపించి అంతకుముందు సీఎంగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై కేసులు పెట్టింది. కొన్ని కేసుల్లో ఆయన బెయిల్ తెచ్చుకోగా, ఒక కేసులో అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతుందో అప్పుడే చెప్పలేం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ అనుభవం రీత్యా కేసీఆర్‌ను కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ ఉన్నప్పటికీ తాము కక్ష రాజకీయాలు చేయబోమని అంటున్నారు. పైగా కేసీఆర్‌కు ఫాం హౌసే ఒక జైలు అని, వేరే జైలు ఎందుకు అని వ్యాఖ్యానించి అరెస్టు జరగక పోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇది ఒక్క కేసీఆర్‌కే వర్తిస్తుందా? హరీష్ రావు, ఇతర అధికారులకు కూడా వర్తిస్తుందా అన్నది చెప్పలేం. మేడిగడ్డ బ్యారేజీ పగుళ్లు ఇచ్చి కుంగిన ఘటన కేసీఆర్, హరీష్‌రావులకు, బీఆర్‌ఎస్‌కు అప్రతిష్ట తెచ్చిందన్నది వాస్తవం.
అదే సమయంలో కేసీఆర్ లక్ష్య శుద్ధితోనే కాళేశ్వరం ప్రాజెక్టును సంకల్పించారని చెప్పాలి. కాకపోతే నిర్మాణం వేగంగా చేయాలన్న తొందరపాటులో ఆయన తీసుకున్న నిర్ణయాలు సమస్యలకు దారి తీసి ఉండవచ్చునని అనిపిస్తుంది. కమిషన్ పరిశీలనల్లో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా, కేసీఆర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారన్నది ఒకటి. మంత్రివర్గం నుంచి పాలనాపరమైన అనుమతులు తీసుకోలేదన్నది ఇంకో పరిశీలన. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి, బరాజ్‌ను మేడిగడ్డకు మార్చడంలో నిజాయితీ కొరవడిందన్నది మరో వ్యాఖ్య. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ వ్యతిరేకత తెలిపినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి రూ.84 వేల కోట్ల అప్పు చేయడాన్ని కూడా తప్పు పట్టారు. ఈ విషయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఘోష్ కమిషన్ నివేదికను ఆధారం చేసుకుని బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ దాడి పెంచింది. అయితే, వెంటనే ఏం చేయాలన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోయింది. అసెంబ్లీలో ఎటూ ఈ నివేదికను పెడతారు. అందులో ఆయా పార్టీల ఎమ్మెల్యేలు తమ వైఖరికి అనుగుణంగానే మాట్లాడుతారు తప్ప కొత్తగా చెప్పేది ఉంటుందా అన్నది సందేహం. అయినా అసెంబ్లీలో చర్చించడం మంచిదే. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. ప్రస్తుత సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు జోలికి కమిషన్ వెళ్లలేదని చెబుతున్నారు. బారేజ్‌ను మేడిగడ్డకు మార్చడం వల్ల ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయపడిందని కథనం. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టుకు అయిన దాదాపు లక్ష కోట్ల వ్యయం వృథా అయినట్లే అన్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టులో మరో రెండు బారేజీలు, కాల్వలు, టన్నెల్స్ తవ్వకం, రిజర్వాయర్ల నిర్మాణం వంటివి కూడా ఉన్న విషయాన్ని ప్రజలలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారని అనిపిస్తుంది.
స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో కేసీఆర్ వివరించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. పైగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ప్రాజెక్టుకు ప్రశంసించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవీస్ స్వయంగా ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరై కేసీఆర్‌ను మెచ్చుకున్నారు. మరో పాయింట్ ఏమిటంటే ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా, కాళేశ్వరం సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఈ ప్రాజెక్టును సమర్థించినట్లే కదా!. దానిపై ఏం చెబుతారు?. ప్రాణహిత-చేవెళ్లకు ప్రత్యామ్నాయంగా తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మాణం చేసి ఘనత తెచ్చుకోవాలన్న క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం కొన్ని తప్పులు కూడా చేసినట్లు అర్దం అవుతుంది.
అయితే, అవి పెద్ద తప్పులా? కాదా? అన్నది పరిశీలించాలి. ఈ నేపథ్యంలోనే రేవంత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.. అది కూడా మంచిదే. మామూలుగా అయితే ఈ నివేదిక ఆధారంగా కేసులు పెట్టి ఉండవచ్చు. కానీ, అలా చేయకుండా అసెంబ్లీలో చర్చిస్తామని చెబుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ప్రాజెక్టుపై విచారణకు సీబీఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందా? అన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్‌ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయి ఇంతకాలమైనా ప్రభుత్వం మరమ్మతులకు సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దీనివల్ల ప్రాజెక్టు నిరర్థకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఉన్న ప్రాజెక్టును వినియోగించుకుంటూనే ప్రభుత్వం తదుపరి చర్యలకు వెళ్లితే మంచిదే.
ఇక మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని, అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. కేబినెట్ ఆమోదం కూడా ఉందన్నది ఆయన వాదన. మొత్తం 665 పేజీల రిపోర్ట్ కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా? అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ తన నివేదికలో అందుకు విరుద్దంగా ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. అసెంబ్లీలో చర్చ జరిగిన మాట అయితే వాస్తవం. దానిని కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదా అన్నది చూడాలి. ఎన్నికల ముందు చోటు చేసుకున్న ఈ ఉదంతం బీఆర్‌ఎస్‌కు నష్టం చేసింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలడం, పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం వంటి వాటిని ఈ సందర్భంగా హరీష్, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. గుజరాత్‌లో ఒక వంతెన కూలిన ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు మరణించిన ఉదంతాన్ని కూడా ఉటంకిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దానిని ముఖ్యమంత్రికి అంటగడితే, ఇప్పుడు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటుందా అన్నది సందేహమే. రాజకీయంగా తమకు ప్రయోజనం అనుకుంటేనే అలా చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్‌ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తుంది.
అందుకే కేసీఆర్ దీనిని కాంగ్రెస్ కమిషన్ నివేదిక అని ధ్వజమెత్తితే, కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అని వ్యాఖ్యానించారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా.. ఏ మాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బారేజీకి రిపేర్లు చేయించి, నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తం అని చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.