
రాజకీయంగా అనూహ్యంగా ఉన్నత స్థానానికి చేరుకున్న వ్యక్తుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించినా పాత వాసనలు మాత్రం పోగొట్టుకోలేక పోతున్నట్లు అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఒక్కోసారి ఆత్మరక్షణలో పడిపోతున్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో ఏర్పడ్డ సంక్షోభంలో తన పాత్ర లేదని చెప్పే ప్రయత్నంలో ఆయన ఆ పార్టీ నేతలపై కొన్ని అభ్యంతరకరమైన పదాలు ప్రయోగించడం, తెలుగుదేశం పార్టీని పొగడటం ఇలాంటిదే. కొందరి కుట్రల వల్ల తెలంగాణలో తెలుగుదేశం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కానీ అదో అద్భుతమైన పార్టీ అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతవరకూ ఓకే. కానీ అందుకు ప్రకృతి ప్రతీకారం తీర్చుకుందని, అన్ని దుర్మార్గాలు చేసిన మీరు (బీఆర్‌ఎస్) మాత్రం ఎలా మనుగడ సాగిస్తారని ప్రశ్నించడంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ అంత గొప్ప పార్టీనే అయితే రేవంత్ ఎందుకు వదిలిపెట్టారు? దాన్ని వృద్ధిలోకి తీసుకురాకుండా కాంగ్రెస్‌లో చేరారు ఎందుకు? ఇదిలా ఉంటే.. ఆయా సందర్భాల్లో రేవంత్ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పనిగట్టుకుని ప్రశంసించడం కాంగ్రెస్ నేతలు చాలామందికి రుచించడం లేదు. సీఎం కాబట్టి పెద్దగా ప్రశ్నించడం లేదని అంటున్నారు. కాంగ్రెస్‌లో ఒకసారి విమర్శించడం మొదలైందంటే గోల, గోల అవుతుందన్న సంగతి రేవంత్‌కు తెలియనిది కాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు సహకరించిందన్నది వాస్తవం. కొంతమంది టీడీపీ జెండాలు పట్టుకుని ఏకంగా గాంధీభవన్‌కే వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో సత్సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ అంశం కూడా కలిసిరావడంతో రేవంత్ సీఎం కాగలిగారని చాలా మంది అభిప్రాయం.
రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో చేరడానికి ముందుగా చంద్రబాబు అనుమతి తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మిగిలి ఉన్న టీడీపీ అభిమానుల మద్దతు పొందడానికి ఆయన ఇలా మాట్లాడారా? స్థానిక ఎన్నికలలో కాని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాని వారి సహకారం పొందడానికి ఈ వ్యూహంలో వెళుతున్నారా ? అన్న సంశయం వస్తుంది. అయితే రేవంత్ వ్యాఖ్యలు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు చికాకు తెప్పిస్తాయి. కాంగ్రెస్ సీఎంగా ఉండి టీడీపీని పొగుడుతుంటే నష్టం కదా? అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చాక, కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండే వారు. రహస్య సంబంధాలు పెట్టుకున్నా, బయటికి మాత్రం ఘాటుగా మాట్లాడేవారు. కానీ రేవంత్ ఆ పార్టీతో ఏ స్థాయిలో సంబంధాలు కొనసాగిస్తున్నారో తెలియదు కాని, ఇలా వేరే పార్టీని బహిరంగంగా పొగడడమేమిటని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు.
1982లో ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం రాజకీయ పోరు కాంగ్రెస్, టీడీపీల మధ్యే సాగింది. రేవంత్ ఈ విషయాన్ని ఎలా విస్మరిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో చంద్రబాబు వ్యూహం కారణంగానే టీడీపీ కనుమరుగైంది కానీ నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్‌ల వల్ల కాదని కొందరి విశ్లేషణ. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టాలనో, ఇరుకున పెట్టాలనో చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్‌ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయాలని ప్రయత్నించడం, దానికి రేవంత్‌ను వాడుకోవడం, పోలీసులు నిఘా పెట్టి పట్టుకుని కేసు పెట్టడం, రేవంత్ జైలుకు వెళ్లడం.. ఇదంతా చరిత్రే. ఆ తర్వాత కేసీఆర్‌తో రాజీలో భాగంగా చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదలుకుని ఏపీకి వెళ్లిపోయారు.
పలితంగా ఆయనపై కేసు లేకుండా చేసుకోగలిగారు. ఇన్ని దుర్మార్గాలు చేసిన వారు ఎలా మనుగడ సాగించగలరని అనడం ద్వారా బీఆర్‌ఎస్‌కు ఇక భవిష్యత్తు లేదన్న అభిప్రాయం కలిగించారు. బిఆర్ఎస్‌ను చచ్చిన పాముతో పోల్చారు. ఒకసారి ఓడిపోతేనే ఏ పార్టీకైనా ఫ్యూచర్ లేకపోతే, కాంగ్రెస్ పదేళ్ల తర్వాత మళ్లీ ఎలా అధికారంలోకి వచ్చింది? కాంగ్రెస్ తెలంగాణలో 2014 నుంచి రెండుసార్లు ఓడిపోయింది. అయినా మూడోసారి విజయం సాధించింది. దేశంలోనే తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది. 2014 నుంచి కేంద్రంలో అధికారానికి దూరమైంది. అంతమాత్రాన ఇక కాంగ్రెస్ దేశంలో ఉండదని చెప్పగలమా? 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అధికారం రాకపోయినా, ప్రతిపక్ష హోదా సాధించే స్థితిలో గెలవగలిగింది కదా? తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని కేసీఆర్ కూడా అనేవారు.
అయినా ఇప్పుడు అధికారంలోకి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తన లక్ష్యమని చెప్పే రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీని, దాని అధినేత చంద్రబాబును పదే, పదే ప్రశంసించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏపాటి మేలు జరుగుతుందో కూడా చెప్పాలి. వ్యక్తిగతంగా ఆయనకు ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో తెలియదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సభలో మాట్లాడుతూ రెండు రూపాయలకు కిలో బియ్యం స్కీమ్ ఎన్టీఆర్‌దని అని చెప్పారు. అది టీడీపీ వారు చెప్పుకోవలసిన విషయం. నిజానికి ఎన్టీఆర్ ఈ స్కీమ్ ప్రతిపాదించి ప్రచారం ఆరంభించగానే, ఆనాటి కాంగ్రెస్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి రూపాయి తొంభై పైసలకే పేదలకు బియ్యం అందించే పథకాన్ని అమలు చేశారు. కాంగ్రెస్ వారు ఆ విషయం చెప్పుకోకుండా టీడీపీ స్కీమ్ అని వ్యాఖ్యానించడం ఏ మాత్రం తెలివి అవుతుంది.
అలాగే అంతకుముందు ఒక కార్యక్రమంలో హైటెక్ సిటీ నిర్మాణం ప్రస్తావన తెచ్చి చంద్రబాబు ను మెచ్చుకున్నారు. చంద్రబాబు ఒక భవనం నిర్మించిన మాట నిజమే. కాని అంతకు ముందే నేదురుమల్లి జనార్ధనరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సాప్ట్ వేర్ టెక్నాలజీ పార్కు కు శంకుస్థాపన చేసిన విషయాన్ని కాంగ్రెస్ నేతలే మర్చిపోతే ఏమి చేయాలన్న అసంతృప్తి పార్టీలో ఏర్పడుతోంది. చంద్రబాబు తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే వంటివి నిర్మించారు. రేవంత్ వైఎస్ ప్రస్తావనను తెస్తున్నప్పటికి, చంద్రబాబుకు ఇస్తున్న ప్రాధాన్యత మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. తదుపరి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలం అయ్యారు. జెడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచారు.
తదుపరి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. లోక్‌సభ ఎన్నికలలో టీడీపీ పక్షాన 2014లో మల్కాజిగిరి నుంచి పోటీ చేయాలని ఆయన ప్రయత్నించారు. ఆ సమయంలో విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డికి టీడీపీ టిక్కెట్ లభించినప్పుడు పార్టీపై, నాయకత్వంపై రేవంత్ చేసిన విమర్శలు ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. అద్భుతమైన పార్టీ అయితే సొంత అల్లుడు ఎన్టీఆర్‌ను ఎందుకు కూలదోశారో చెప్పాలి. కొన్నిసార్లు వామపక్షాలు, మరికొన్నిసార్లు బీజేపీ, ఇంకోసారి కాంగ్రెస్‌తో, మరోసారి టీఆర్‌ఎస్‌తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకున్నదో, అది ఏపాటి అద్భుతమో చెప్పాలి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని లేఖ ఇచ్చి, ఆ తర్వాత తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని దెయ్యంతో పోల్చిన టీడీపీ ఎలా అద్భుతమో రేవంత్‌కే తెలియాలి. బీఆర్‌ఎస్‌పై రాజకీయ విమర్శలు చేయడం తప్పుకాదు.
కాని వ్యక్తిగతంగా నేతలను ఉద్దేశించి చెత్తగాళ్లు అని వ్యాఖ్యానించడం సీఎం హోదాకు తగదని చెప్పాలి. బీఆర్‌ఎస్‌లో తాను సంక్షోభం సృష్టించలేదని చెబుతున్నప్పటికీ రాజకీయ వర్గాలలో మాత్రం నమ్మకం కుదరడం లేదు. బీఆర్‌ఎస్ కాలగర్భంలో కలిసిపోతుందని రేవంత్ భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఆ ప్రయత్నం చేయడం తప్పుకాదు. కాని రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించడానికి, కాలగర్భంలో కలిసిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. బీఆర్‌ఎస్ స్వయంకృతాపరాధం కాంగ్రెస్‌కు ,రేవంత్ కు కలిసి వచ్చింది. తనకు వచ్చిన అవకాశాన్ని ఎలా నిలబెట్టుకోవాలన్న దానిపై రేవంత్ దృష్టి పెడితే మంచిది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.