
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రులు కమీషన్లు తీసుకోకుండా సంతకాలు చేయరు అని మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీంతో, ఆమె వ్యాఖ్యలపై తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. ఏయే మంత్రి ఎంత కమీషన్లు తీసుకున్నారో దర్యాప్తు చేపట్టాలని రేవంత్ సర్కార్‌ను డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కొండా సురేఖ మంత్రులు కమిషన్లు తీసుకోవడం కామన్ అనడం బాధాకరం. అంటే రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని ఒప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఏయే శాఖ మంత్రి ఎంత తీసుకున్నారో దర్యాప్తునకు ఆదేశించాలి. మంత్రులు తీసుకున్న కమీషన్లు బయట పెట్టాలి అని వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర..
ఇదే సమయంలో తిరంగా యాత్రపై మాట్లాడుతూ.. పహల్గాం ఘటనలో 26 మందిని ఉగ్రమూకలు హతమార్చారు. మానవత్వం లేకుండా పిల్లల ముందు తండ్రిని, భార్య ముందు భర్తను పేర్లు అడిగి హతమార్చారు. మానవ సమాజానికే సవాల్ గా మారిన ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. పాకిస్తాన్‌లో 9 ఉగ్రవాద స్థావరాలను పేల్చివేశాం. ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేయడం జరిగింది. ఉగ్రవాద చర్యలతో మనదేశం బలవుతూనే ఉంది. జమ్ముకశ్మీర్‌లోనే 46 వేల మందిని ఉగ్రమూకలు బలితీసుకున్నాయి. మన సైనికులు నూతన చరిత్రను ప్రారంభించారు.
గతంలో ఉగ్రమూకలు దాడి చేసినప్పుడు.. మరణించినవారి ఫోటో దగ్గర గులాబీ పువ్వు పెట్టడం వరకే పరిమితం అయ్యే వాళ్ళం. 2009లో 40 మందిని ఊచకోత కోశారు. భారత్‌పై దాడి చేస్తే ప్రతీకారం ఎలా ఉంటుందో చూపించాం. ఉగ్రవాదుల శిక్షణ కార్యక్రమాలు, ఉగ్రవాదుల నివాసాలను ధ్వంసం చేశాం. కరడుకట్టిన ఉగ్రవాదులను అంతం చేశాం. పాకిస్తాన్ పిల్ల చేష్టలతో దాడికి ఒడిగట్టింది.. భారత సైన్యం తిప్పికొట్టింది. ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. ఇంకా కొనసాగుతోంది. రక్షణ రంగంలో ప్రతి సైనికుడు రాణించారు. S-400, బ్రహ్మాస్త్రం పనితీరు దేశ ప్రజలు గమనించారు. భారత ఆర్మీకి అన్ని రకాలుగా సమకూర్చడం జరిగింది.
ఆర్మీకి అవసరమైన వాటిలో 35 శాతం మనమే సమకూర్చుకున్నాం. మిథానీ, DRDAలో వసతులు మెరుగు పరుస్తున్నాం. ఆర్డినెన్సు ఫ్యాక్టరీలను మరింత సంసిద్ధం చేసుకున్నాం. పాకిస్తాన్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాం. భారత సైనికులు అనుసరించిన స్ట్రాటజీని ప్రపంచం మొత్తం చూసింది. రాజకీయాలకు అతీతంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.