
ప్రజాకర్షక పథకాలు, వారసత్వ రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ వ్యాఖ్యలు చేసిన సమయం సందర్భం వెనుక ఉద్దేశం ఏమిటా? అనేదీ చర్చనీయాంశంగా మారింది. ఉచితాల గురించి ఆయన గతంలోనూ కొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చేసినప్పటికీ.. సంక్షేమ పథకాలను రాజకీయం కోసం వాడుకుంటున్న వారికి మద్దతిచ్చి విమర్శలకు గురయ్యేవారు. అలాంటిది తాజాగా..
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘స్వర్ణ భారతి ట్రస్టు’లో వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణాల వంటివి మహిళలకు కాకుండా దివ్యాంగులకైతే అమలు చేయవచ్చునని, ఉచిత పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి ప్రస్తావిస్తూ ఐదేళ్లలో ఎంత అప్పు చేస్తారన్న దానిపై స్పష్టత ఉండాలని, అప్పులను ఎలా తీర్చుతారో కూడా ప్రజలకు తెలియ చేయాలని ఆయన సూచించారు. విద్య, వైద్య రంగాలను అభివృద్ది చేస్తే పేదరికం తగ్గుతుందని, ఉచితాల వల్ల కాదని అన్నారు(Venkaiah Naidu Shocking Comments On CBN Govt).
వెంకయ్య నాయుడు వ్యాఖ్యలలో తప్పేమీ లేదు కానీ.. ఏపీ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన ఏపీ సర్కారును సంక్షోభం నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేక చంద్రబాబుతో కాస్త తేడా వచ్చిందా అన్న అనుమానం వస్తుంది. అయితే వెంకయ్య నాయుడు, చంద్రబాబు, లోకేశ్‌లు ఇటీవలే ఒక కార్యక్రమంలో కలిసి పాల్గొన్నారు. దీన్నిబట్టి ఊస్తే పొరపచ్చాలు వచ్చే అవకాశాలు తక్కువేనని చెప్పాలి.
ఇదీ చదవండి: అడ్డగోలు ఉచితాలెందుకు? ఏపీ సర్కార్‌పై ఘాటు వ్యాఖ్యలు
ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అలవిగాని హామీలను అమలు చేయలేక నానా పిల్లిమొగ్గలు వేస్తున్న విషయం తెలిసిందే. సూపర్ సిక్స్‌సహా సుమారు 150 వరకూ వాగ్ధానాలిచ్చిన కూటమి నేతలు ఏడాదిపాటు వాటి అమలును ఎగవేసి ఆ తరువాత కూడా అరకొరగా కొన్నింటిని మాత్రమే ఇస్తున్నట్లు ప్రకటించాయి. అది కూడా ప్రజల నిరసన నుంచి తప్పించుకునేందుకు మాత్రమే. ఎన్నికల సమయంలో మహిళలు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి షరతుల్లేకుండా తిరగవచ్చని ఊరించిన చంద్రబాబు అధికారం వచ్చిన తరువాత మాత్రం ఏసీ బస్సుల్లో ఎక్క కూడదని, సుదూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లోనూ అనుమతించమని, పదహారు రకాల బస్సు సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత స్కీము అమలు మొదలుపెట్టారు. అంతేకాకుండా..
బస్సు సర్వీసులను బాగా తగ్గించి నడుపుతూండటంతో ఉచిత స్కీము ఉన్నా లేనట్టుగా మారిపోయింది. మరోవైపు ఈ స్కీము వల్ల ఆటోలు నడుపుకునే వారు ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆందోళనకు దిగడంతో రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చారు. ప్రచారం సమయంలో 13 లక్షల మంది ఆటోల వారు ఉన్నారని చెప్పి, మూడు లక్షల మందికే ఈ సాయం ఇచ్చారు. రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు సంపాదించుకునే తమకు ఇప్పుడు రూ.200 నుంచి రూ.500 రావడమే గగనం అవుతోందని వాపోతున్నారు. ప్రభుత్వం రోజుకు రూ.45 చొప్పున ఇస్తే ఏ అవసరం తీరుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు గమనించదగినవే. కాకపోతే ఎన్నికల మానిఫెస్టో ప్రకటించినప్పుడే ఈ కామెంట్లు చేసి ఉంటే అంతా మెచ్చుకునేవారు.
ఆనాటి ముఖ్యమంత్రి జగన్ టీడీపీ, జనసేనలు సూపర్ సిక్స్ ద్వారా ప్రజలను ఎలా మోసం చేయబోతున్నారో వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి చేసిన వాగ్దానాల విలువ ఏడాదికి దాదాపు రూ.1.5 లక్షల కోట్లు అవుతుందని లెక్కగట్టి మరీ చెప్పారు. అయినా అప్పట్లో వెంకయ్య నాయుడు వంటివారు దానిపై కూటమి నేతలను ప్రశ్నించలేదు. పరోక్షంగా సహకరించారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉచిత పథకాలను వ్యతిరేకిస్తూ మాట్లాడడం ద్వారా చంద్రబాబు సర్కారుకు వాటి నుంచి బయటపడడానికి ఒక మార్గం చూపుతున్నారా? అనే సందేహం వస్తుంది.
గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే చేశారు. 1996 ఎన్నికల సమయంలో మద్య నిషేధం, కిలో రెండు రూపాయల బియ్యం పథకం వంటి వాటిని అమలు చేస్తామని ప్రచారం చేసిన ఆయన తదుపరి ఆ స్కాముల వల్ల నష్టం జరుగుతోందని, ప్రజాభిప్రాయం సేకరణ తంతును నిర్వహించి వాటన్నిటిని రివర్స్ చేశారు. గత టర్మ్‌లో రైతులకు పూర్తిగా రుణాల మాఫీ చేస్తామని ప్రకటించారు కాని చేయలేకపోయారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం మీడియాను, వెంకయ్య వంటివారితో ముందుగా ప్రచారం చేయించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టామని చెప్పి, స్కీములకు ఎగనామం పెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరగుతోందా? అనే సందేహం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే..
టీడీపీ మీడియా కూడా కొన్నాళ్ల క్రితం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా కథనాలు ఇచ్చింది. ఇదే మీడియా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అద్భుతం అంటూ ప్రచారం చేసేది. అధికారం వచ్చాక చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా ప్రజలను మాయ చేయడానికి తన వంతు పాత్ర పోషిస్తోంది. ఆ విన్యాసాలలో వెంకయ్య నాయుడు వంటివారు భాగస్వాములు కారాదని అంతా కోరుకుంటారు. విద్య, వైద్యానికి సంబంధించి జగన్ చేసిన కృషి కళ్లకు కనబడుతున్న విషయమే. అయినా వెంకయ్య నాయుడు ఎన్నడూ మెచ్చుకోలేదు. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు ఎవరిమీదో ప్రేమతో కాకుండా, వాస్తవ పరిస్థితికి అనుగుణంగా మాట్లాడితే మంచి విలువ వస్తుంది. వెంకయ్య ఆ పని చేశారా అన్నది ప్రశ్న. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. కాని తెలుగుదేశంలోని వారసత్వ రాజకీయాల గురించి ఎందుకు ఆయన ప్రస్తావించరన్న సంశయం వస్తుంది.
చంద్రబాబు తన కుమారుడు లోకేశ్‌ను రాజకీయంగా ప్రోత్సహిస్తున్న విధానం గురించి తన అబిప్రాయం చెప్పి ఉంటే బాగుండేది. ఈ పదిహేడు నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం చేసిన రూ.2.10 లక్షల కోట్ల రుణం గురించి కూడా వెంకయ్య కామెంట్ చేసి ఉండాల్సింది. అంతేకాదు. ఈ మధ్యకాలంలో బీహారు ఎన్నికల నేపథ్యంలో 75 లక్షల మంది మహిళలకు రూ.పది వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. దానికి ప్రదాని మోదీ బటన్ నొక్కారు. 2014లో బీజేపీలో వెంకయ్య నాయుడుకు ముఖ్య భూమికే ఉండేది. అయినా ఆ పార్టీ చేసిన వాగ్ధానాలతో ఎన్ని ప్రజాకర్షక విధానాలు ఉన్నాయో ఆయనకు తెలియవా? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
గతంలో.. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తీసుకు వచ్చి రూ.15 లక్షల చొప్పున పంచుతామని బీజేపీ నేతలు ప్రచారం చేసేవారు. అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ ఈ విషయాలన్ని పలుమార్లు ప్రస్తావించేవారు. ఆ తర్వాత కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు కూడా మంత్రి. పార్టీ ఫిరాయింపులపై కూడా వెంకయ్య నాయుడు స్పందించారు. కాని ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీలో విలీనం చేసిన తీరు కూడా విమర్శలకు గురైంది. ఎన్డీయేకి దూరమైన సీనియర్ నేత శరద్ యాదవ్ విషయంలో ఎంత వేగంగా అనర్హత వేటు వేసింది కూడా చర్చనీయాంశమైంది. 2014 టర్మ్‌లో ఏపీలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్న అంశం గురించి కూడా వెంకయ్య పల్లెత్తు మాట అన్నట్టు లేదు.
చేతిలో అధికారం ఉన్నప్పుడు గట్టిగా స్పందించి ఉంటే ఇప్పుడు ఆయన మాటకు విలువ వచ్చేది. మరో సంగతి కూడా చెప్పాలి. ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబు కష్టాలలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు కూడా తన పరపతి ఉపయోగించి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రాజీ కుదర్చిన వారిలో ఉన్నారని చెబుతారు. తాజాగా ఏపీలో బయటపడ్డ నకిలీ మద్యం ప్లాంట్లు, అందులో టీడీపీ నేతల పాత్రపై కూడా వెంకయ్య నాయుడు గట్టిగా మాట్లాడి ఉంటే సమాజానికి మంచి సందేశం ఇచ్చినవారై ఉండేవారేమో కదా!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత