
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఎవరివల్ల చెడ్డ పేరు వస్తోంది? అధినేతల లోపాల వల్ల ఎమ్మెల్యేలకు డ్యామేజ్ అవుతోందా? లేక ఎమ్మెల్యేల అక్రమాలు, అలసత్వాలు ప్రభుత్వం పరువును దిగజారుస్తున్నాయా? రెండూ కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే...ఎందుకంటే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కీలక మంత్రి లోకేశ్‌లు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేసిన భ్రమ కల్పించాలని చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆగ్రహం పెరిగేందుకు కారణమవుతున్నాయి.
అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపివ్వడం మంచిదే. ప్రజల్లో తిరిగితే కదా వారి మనోభావాలు, ప్రభుత్వం పనితీరు, రెడ్‌బుక్ హడావుడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం జరిగిందా? లేదా? అన్నది తెలిసేది? విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నేతల వేధింపులు, అక్రమ అరెస్ట్, నిర్బంధాలతో సామాన్యులకు ఒరిగిందేమిటని కూడా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చు. ఏడాది కాలంలో తామోన్నో ఎన్నో విజయాలు సాధించేశామని చంద్రబాబు అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు అన్ని విషయాలు తెలిసినా ఆయన చెప్పినదానికి ఊ కొట్టడం తప్ప మరో గత్యంతరం ఉండదు. ముందుగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం గురించి ఏమి అనుకుంటున్నారో తెలుసుకుని ఆ తర్వాత తొలి అడుగో, మలి అడుగో వేస్తే అదో పద్దతి కాని, అదేమీ లేకుండా తాము బ్రహ్మాండంగా పనిచేస్తున్నామని, ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చిందని, లోటుపాట్లు ఏమైనా ఉంటే అవి ఎమ్మెల్యేలవే అన్నట్లుగా మాట్లాడితే ఆశ్చర్యం పోవడం తప్ప వేరే ఏమి ఉంటుంది?.
👉ఏడాది కాలం ఏ ప్రభుత్వానికైనా ముఖ్యమైనదే. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా గత ప్రభుత్వం ఒక ఏడాదిలోనే నెరవేర్చిన హామీలెన్ని? తెచ్చిన సంస్కరణలు ఏమిటి? ప్రజలకు ఎలా ఇళ్ల వద్దే ప్రభుత్వ సేవలు అందించింది అందరికి తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చాక వాటన్నిటిని గాలికి వదలివేసి ప్రజలను రోడ్లపైకి తెచ్చిందన్నదీ పలువురు ఎమ్మెల్యేల భావన. ఉదాహరణకు జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.ఐదు వేల నుంచి రూ.పది వేలు చేస్తామని చంద్రబాబు ఉగాది నాడు దైవపూజ చేసి మరీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా తాము ఎవరి పొట్టగొట్టబోమని ఊదరగొట్టారు. కానీ..
👉.. అధికారంలోకి వచ్చాక అసలుకే ఎసరు పెట్టారా? లేదా? రేషన్ సరుకులను ప్రజల ఇళ్లవద్దకే చేర్చే వ్యవస్థ గతంలో ఉంటే, ఇప్పుడు దానిని ఎత్తివేశారా? లేదా? ప్రభుత్వ పరంగా గ్రామ సచివాలయాలు, విలేజ్ హెల్త్ క్లినిక్స్ రైతు భరోసా కేంద్రాలు వంటివాటిని గ్రామ, గ్రామానా, పట్టణాలలో వార్డు, వార్డులో జగన్ ప్రభుత్వం నెలకొల్పితే వాటన్నిటిని నీరు కార్చుతున్నారా? లేదా ?వారికి ఈ వ్యవస్థలపై నమ్మకం లేకపోతే, మంచివి కావని భావిస్తే ఎన్నికల ముందే ఆ విషయం చెప్పి ఉండవచ్చు. అలా కాకుండా, అవన్నీ యథాతథంగా కొనసాగుతాయని ప్రచారం చేసి, తీరా పవర్ లోకి వచ్చాక అన్నిటిని నిర్వీర్యం చేస్తే ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అవుతుందా? లేక చెడ్డ ప్రభుత్వం అవుతుందా?. హామీలపై ప్రజలకు బాండ్లు ఇచ్చారు కదా?. వాటిలో పెన్షన్ రూ.వెయ్యి రూపాయలు పెంచడం తప్ప మొదటి ఏడాదిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదే!
గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చి సరిపెట్టారే.
తల్లికి వందనం, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఏబై ఏళ్లకే బలహీన వర్గాలకు పెన్షన్ మొదలైన వాటన్నిటికి తొలి ఏడాది ఎగనామం పెట్టారా? లేదా?
ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారికి ఇచ్చిన బాండ్ల గురించి ,ఆయా వాగ్దానాల గురించి ప్రశ్నిస్తే వారందరిని వైఎస్సార్‌సీపీ వారి కింద జమకట్టి కేసులు పెడతామని బెదిరిస్తారా? ముఖ్యమంత్రే స్వయంగా వైఎస్సార్‌సీపీ వారు నిలదీయడానికి లేదని, అలా చేస్తే తాట తీస్తామని అనడం దేనికి సంకేతం. రెండో ఏడాదిలో తల్లికి వందనం కొంతవరకు అమలు చేసినా, మొదటి ఏడాది బకాయిల మాటేమిటి? అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి జవాబు చెప్పాలి? తల్లికి వందనం ఈ మాత్రం అయినా అమలు అయిందంటే అది జగన్ ప్రభావం వల్లే అన్న సంగతి అందరికి తెలుసు. జగన్ ఎప్పటికప్పుడు దీని గురించి నిలదీస్తున్న ఫలితంగా ఈ స్కీమ్ ఈ మాత్రం అయినా ఇవ్వక తప్పలేదు.
విద్యుత్ చార్జీలు పెంచబోమని, తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికలలో వాగ్దానం చేసిన విషయాన్ని గుర్తు చేసి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తెగ బాదుతున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారి నాలుక మందమని ఎమ్మెల్యేలు అనగలరా? ప్రభుత్వాన్ని చంద్రబాబు నడుపుతున్నారో, లేక ఆయన కుమారుడు నడుపుతున్నారో అర్థం కాని పరిస్థితి గురించి ఎవరైనా అడిగితే జవాబు ఏమని చెబుతారు?.
👉మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఆరోపణలు చేస్తూ కాలం గడపాలని చంద్రబాబు సర్కార్ చేస్తున్న యత్నాలను ప్రజలు అర్థం చేసుకోలేరా? జగన్ టైమ్‌లో అప్పుల గురించి అనేక అసత్యాలు ప్రచారం చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు ప్రభుత్వం ఒక ఏడాదిలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పులు చేసి రికార్డు సృష్టించింది కదా! అప్పట్లో 'దాన్ని తనఖా పెట్టారు.. దీన్ని తనఖా పెట్టార"ని ప్రచారం చేశారు. కాని ఇప్పుడు ఏకంగా అప్పులు ఇచ్చేవారికి ట్రెజరీనే తాకట్టు పెట్టి ఘన చరిత్ర నెలకొల్పారే. దాని గురించి ఎవరైనా మాట్లాడితే అంగీకరిస్తారా? లేక వారిని కోప్పడతారా? వైసీపీ వారు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని చెబుతున్న చంద్రబాబు అవేమిటో వివరించాలి కదా?.
👉నిత్యం విధ్వంసం అంటూ నిందలు వేసే చంద్రబాబు అదేమిటో ఎన్నడైనా చెప్పారా? కేవలం సినిమా డైలాగులు చెప్పి ప్రజలను మభ్య పెట్టే యోచన కాకుండా వాస్తవ దృక్పథంతో వ్యవహరిస్తే ఎమ్మెల్యేలు అర్థం చేసుకుంటారు.అలా కాకుండా ప్రభుత్వ వైఫల్యాలన్నిటిని ఎమ్మెల్యేలపైకి నెట్టేసి తప్పుకోవాలని చూస్తే వారు గుసగుసలాడు కోకుండా ఉంటారా? 1995 లొ ముఖ్యమంత్రి అయింది మొదలు ఎప్పుడు అధికారంలో ఉన్నా, ఎమ్మెల్యేలపై అసంతృప్తి అంటూ లీకులు ఇవ్వడం ఆయనకు అలవాటే. ప్రస్తుతం కూడా అదే బాటలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల వైఫల్యాలు లేవా అంటే చాలానే ఉన్నాయి.
అనేక చోట్ల ఇసుక, మద్యం, గనులు, పరిశ్రమలు తదితర లావాదేవీలలో ఎమ్మెల్యేల దందా పై ప్రజలలో విపరీతమైన వ్యతిరేకత ఏర్పడింది. అక్రమ సంపాదనకు అలవాటు పడిన కొందరు కూటమి ఎమ్మెల్యేలు, వారి అనుచరుల వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. వెరసి అటు ప్రభుత్వం, ఇటు ఎమ్మెల్యేలు రెండువైపులా సాగుతున్న దందాల వల్ల ప్రజలు నలిగిపోతున్నారు.ఈ నేపథ్యంలో ప్రజలలోకి వెళ్లాలంటే భయం ఏర్పడిన మాట నిజం. కొనమెరుపు ఏమిటంటే కీలకమైన తొలి అడుగు సన్నాహక సమావేశానికి 56 మంది టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.