
అవాకులు చెవాకులు పేలడం.. అభిమానంతో దగ్గరకొచ్చిన వారికి చెంపదెబ్బలు తగిలించడం ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కొత్తేమీ కాదు కానీ.. అసెంబ్లీ వేదికగా ఆయన సహనటుడు చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ పార్టీ అధినేత జగన్‌పై చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆయన వ్యక్తిత్వాన్ని మరోసారి బట్టబయలు చేసింది. కొందరి బలహీనతలు, కొందరి అహంకారం, ఇంకొందరి విచక్షణ, విజ్ఞతలను ప్రజల ముందుంచింది. అంతేకాదు.. తరచూ రాజకీయ విన్యసాలు సాగిస్తూ, ఏది వాస్తవమో, ఏది అబద్దమో తెలియని స్థాయిలో మాట్లాడే నేతలు కొందరి నిజరూపం కూడా వెల్లడించింది.
తనను కలిసేందుకు వచ్చిన సినీ పరిశ్రమ వారిని సీఎం హోదాలో జగన్ ఎంత గౌరవంగా చూసింది ప్రపంచానికి తెలిసినట్లయింది. జగన్ విజ్ఞత అందరికి తెలిస్తే, చిరంజీవి కాస్త లేటుగా అయినా స్పందించి తన వ్యక్తిత్వాన్ని కొంతవరకైనా నిలబెట్టుకున్నారనిపిస్తుంది. మొత్తం ఎపిసోడ్‌లో సోదికి వెళితే ఏదో బయటపడిందన్నట్లుగా సోషల్ మీడియా పుణ్యమా అని అనేక పాత విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయినా బాలకృష్ణ క్షమాపణ చెప్పకపోవడం, సారీ చెప్పాలని కూటమి నేతలు కోరలేకపోవడం గమనించాల్సిన అంశాలే.
శాసనసభలో జగన్‌ను, చిరంజీవిని అవమానిస్తుంటే ప్రేక్షకపాత్ర పోషించిన గౌరవ సభ్యులు, గౌరవ ఉప సభాపతి గురించి ఏమనగలం? బాలకృష్ణ సంస్కార రహితంగా వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు నోరు విప్పలేకపోవడంతో వారు బాగా ఎక్స్‌పోజ్ అయ్యారు. జగన్‌ను సైకో అనడం ద్వారా బాలకృష్ణ తన పాత చరిత్ర అంతా తవ్వించుకున్నారు. బాలకృష్ణ ఏ రకంగా సైకోనో వివరించే అనేక దృష్టాంతాలు వెల్లడయ్యాయి. అసెంబ్లీ సమావేశాలలో కొందరు టీడీపీ సభ్యులు ప్రజల సమస్యలను ప్రస్తావిస్తే ప్రభుత్వ పరువు తీస్తారా అంటూ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు నాయుడు తన బావమరిది బాలకృష్ణను మాత్రం ఒక్క మాట అనలేకపోయారు.
మెగాస్టార్ చిరంజీవిని అలా అనడం తప్పు అని చంద్రబాబు చెప్పలేకపోయారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితి మరీ దారుణం. ఆయన మరో సోదరుడు నాగబాబు నోరు పెగలలేదు. జనసేన కేడర్, సామాజిక వర్గం, సాధారణ ప్రజలు బాలకృష్ణ వైఖరిని తీవ్రంగా నిరసించినా పవన్, నాగబాబులు మాత్రం కనీసం కిమ్మనలేకపోయారు. పదవిలో ఉన్న మజా అలాంటిదేమో!
బాలకృష్ణ జనసేన కార్యకర్తలను అలగా జనం అన్నారని ఒకసారి వాపోయిన పవన్ ఆ తరువాత ఆయనతోనే చెట్టాపట్టాలేసుకుని తిరగడం అందరూ గమనించే ఉంటారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంలో బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి మా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అంటూ కామెంట్ చేసినా వీరు ఎవరూ పెద్దగా ఫీల్ అయినట్లు లేదు. నాగబాబు కొంతవరకూ దీటుగా సమాధానం చెప్పినప్పటికీ ఆ తరువాత టీడీపీ పదవుల ఆశతో అన్నీ మరచిపోయారు.
చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టైతే రోడ్డుమీద పడి నానా యాగీ చేసిన పవన్ కళ్యాణ్ సొంత అన్నకు అవమానం జరిగితే జ్వరం పేరుతో హైదరాబాద్ వెళ్లి బెడ్‌పై ఉండిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. బాలకృష్ణ మాటలను ఖండిస్తే ఎక్కడ తన ఉప ముఖ్యమంత్రి పదవి పోతుందో అని పవన్ బెంగపట్టినట్టుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు ఏమీ చేసినా భరించాల్సిందే అని పవన్ గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
సమస్యంతా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అసందర్భ ప్రేలాపనతో మొదలైంది. ఆయన ఏ పార్టీనో ఆయనకే గుర్తుండదు. చంద్రబాబు మెప్పుదల కోసం జగన్‌పై లేని పోని అభాండాలు మోపి, చిరంజీవి వద్ద మార్కులు కొట్టేయాలనుకుని బోల్తాపడ్డారు. చిరంజీవి తదితర నటులు జగన్‌ను కలిసినప్పుడు ఏదో అవమానం జరిగిందని అచ్చం టీడీపీ నేత మాదిరి ఒక కల్పిత కథ సృష్టించే యత్నం చేసి దెబ్బతిన్నారు. చివరికి శాసనసభ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తను మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి తొలగించాలని ఆయనే స్వయంగా కోరుకున్నారు. అయినా అప్పటికే జరగవలసిన డామేజీ జరిగిపోయింది.
ఆ కల్పిత కథలో చిరంజీవిని పొగడడం విని తట్టుకోలేకపోయిన బాలకృష్ణ మైకు అందుకుని సభా మర్యాదలతో సంబంధం లేకుండా నెత్తిపై గాగుల్స్, ఫ్యాంట్ జేబుల్లో రెండు చేతులు పెట్టుకుని మాట్లాడిన తీరు ఆయన అహంకారం బయటపెట్టిందన్న విమర్శ వచ్చింది. ఎందుకంటే బావ ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, తానేమో ఎన్టీఆర్ కుమారుడిని అన్న గర్వం ఆయనలో ఉందన్న భావన ఏర్పడింది. చిరంజీవిని ఎవడు అనడం, జగన్ ఇంటిలో గట్టిగా మాట్లాడే ధైర్యం చిరంజీవికి లేదన్నట్లుగా మాట్లాడడం అందరిని విస్మయపరిచింది.
జగన్‌ను దూషిస్తున్నప్పుడే స్పీకర్ ఛైర్‌లోఉన్నవారు వారించగలిగితే ఇది ఆగి ఉండేది. సీఎం బావమరిది కావడంతో అలా చేయలేకపోయారు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు వైఎస్సార్ కాంగ్రెస్, ఇటు చిరంజీవి అభిమానులు బాలకృష్ణపై మండిపడ్డారు. పేర్నినాని వంటివారు అసలు సైకో బాలకృష్ణే అంటూ ఆయనకు ఉన్న మెంటల్ సర్టిఫికెట్ తో సహా పలు అంశాలను గుర్తు చేసి పరువు తీశారు.
ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి.అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బాలకృష్ణ జరిపిన కాల్పుల వల్ల నిర్మాత బెల్లంకొండ సురేష్, జ్యోతిష్కుడు సత్యనారాయణలు తీవ్రంగా గాయపడ్డారు. ఆ కేసులో బాలకృష్ణ జైలుకు వెళ్లకుండా మెంటల్ సర్టిఫికెట్‌ను తీసుకుని కాపాడినట్లు ప్రముఖ వైద్యులు, దివంగత కాకర్ల సుభ్బారావు చెప్పిన విషయం వీడియోలలో నిక్షిప్తమై ఉంది.
ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. రక్తపు మరకల సాక్ష్యాధారాలు చెరిపి వేశారని అప్పట్లో బాలకృష్ణ భార్య వసుంధరపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఆమె కోర్టులో సరెండరై బెయిల్ కూడా పొందారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్‌పై అనవసరంగా నోరు పారేసుకునే చంద్రబాబు తన సమీప బంధువు నిజంగా అలా సాక్ష్యాలు చెరిపేసిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతూంటారని ఇప్పుడు ప్రజల దృష్టికి వచ్చింది.
చట్టపరంగా కాల్పుల కేసులో బాలకృష్ణను జైలులో పెట్టాలి. అలా చేయలేదు. బాలివుడ్ నటుడు సంజయ్ దత్ వద్ద తుపాకులు దొరికితేనే జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అదే బాలకృష్ణ కాల్పులు జరిపితే కూడా జైలుకు వెళ్లలేదని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ఎన్టీఆర్ కుమారుడు అన్న సానుభూతి, ఆ రోజుల్లో కాంగ్రెస్‌లో ఉన్న దగ్గుబాటి దంపతులు, తదితరుల విజ్ఞప్తిని గమనంలోకి తీసుకుని వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ కేసును తేలికగా వదలి వేసిందని అంటారు. చట్టప్రకారం అలా చేయకూడదు.అయినా చేశారు.
ఆ కృతజ్ఞత కూడా బాలకృష్ణకు ఆ తర్వాత కాలంలో లేకపోయింది. సినిమాల పరంగా, ఇతరత్రా సాయం, గౌరవం పొందినప్పటికీ జగన్‌ను పట్టుకుని బాలకృష్ణ పిచ్చి వ్యాఖ్య చేయడం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. వైఎస్సార్ కాబట్టి రాజకీయంగా ఆలోచించకుండా బాలకృష్ణకు, ఆయన భార్యకు సాయం చేశారని, అదే పరిస్థితి వైఎస్సార్ సన్నిహితులు ఎవరికైనా వచ్చి అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉండిఉంటే, రాజకీయంగా ఎంతగా వాడుకునే వారో అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
మెంటల్ సర్టిఫికెట్ ఉన్నా, బాలకృష్ణకు టీడీపీ ఇక్కెట్ ఇవ్వడం, హిందుపూరం ప్రజలు ఎన్నుకోవడం విశేషమే. ఆ తర్వాత కాలంలో ఆయన తన అభిమానులపై దురుసుగా వ్యవహరించిన ఘట్టాలు కూడా ఉన్నాయి. అయినా ఆయనను ఎవరూ మందలించలేదు. ఆయన కూడా తాను తప్పు చేశానని అనుకోవడం లేదు. అమ్మాయిలపై బాలకృష్ణ చేసిన ఒక వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆ కామెంట్ చేసినప్పుడు అక్కడ ఉన్న సినీ ప్రముఖులు కాని, సభలో పాల్గొన్నవారు ఎవరూ బాలకృష్ణను ఏమీ అనలేదు. పైగా అంతా నవ్వుతూ కూర్చున్నారు. తదనంతర కాలంలో ఆయనకు పద్మభూషణ్ బిరుదు రావడం కూడా మరో విశేషం. ప్రధానమంత్రి మోడీని పట్టుకుని అనుచిత వ్యాఖ్యలు చేసినా బాలకృష్ణకు ఏమీ ఇబ్బంది రాలేదు. పైగా బిరుదు కూడా వచ్చింది. బీజేపీ నేతలు ఇందుకు సిగ్గుపడినట్లు కనిపించలేదు.
చంద్రబాబుకేమో తన బావమరిది జోలికి వెళితే ఇంకేమవుతుందో అన్న భయం ఉండవచ్చని, అందుకే ఆయన కూడా దీనిపై స్పందించలేదేమో అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక చిరంజీవి మూడేళ్లపాటు ఈ అంశంపై మౌనంగా ఉండి తన తమ్ముడికి రాజకీయంగా సాయపడ్డారని, ఇప్పుడు బాలకృష్ణ చేసిన అవమానాన్ని తట్టుకోలేక బయటకు వచ్చారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లు అబద్దపు ప్రచారం చేస్తున్నప్పుడే జగన్ తమను గౌరవంగా చూసుకున్నారని చిరంజీవి చెప్పి ఉంటే ఎంతో మర్యాదగా ఉండేదన్న భావన ఉంది. ఇప్పటికైనా చిరంజీవి స్పందించడం బాగానే ఉంది
కాకపోతే సొంత తమ్ముళ్ల నుంచే ఆయనకు మద్దతు కొరవడడం కాస్త అప్రతిష్టే. కొద్ది మంది చిరంజీవి అభిమానులు తమ నిరసన చెప్పారు. మరో ప్రముఖ నటుడు ఆర్.నారాయణ మూర్తి అసెంబ్లీలో జరిగిన ఘట్టాన్ని ఖండిస్తూ సినిమా ప్రముఖులందరిని జగన్ గౌరవంగా చూశారని, చిరంజీవి రాసిన లేఖలో ఉన్న అంశాలు వాస్తవమైనవని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియాలో మాత్రం బాలకృష్ణను ఉతికి ఆరేశారు. పవన్ నుంచి సానుభూతి దక్కకపోయినా, వైసీపీ వారు మాత్రం చిరంజీవికి ఎంతొకొంత మద్దతు ఇచ్చారు. ఈ రకంగా బాలకృష్ణ ఉదంతంలో ఆయనతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,నాగబాబుల అసలు రంగు బయటపడినట్లయిందా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.