
బీహార్‌లో మాదిరిగా తెలంగాణలోనూ ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) జరుగుతుందన్న కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి ప్రకటన కీలకమైందే. రాజధాని హైదరాబాద్‌లోనే మూడు నుంచి నాలుగు లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, సవరించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. తద్వారా ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవ్యవస్థను ఆయన అంగీకరించినట్లయింది.
బీహారులో ఎస్.ఐ.ఆర్ పేరుతో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా ఓట్లను మాయం చేశారన్నది విపక్షం ఆరోపణ. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తూంటే... ఇతరదేశాల వారు అక్రమంగా ఓటర్ల జాబితాలోకి చేరి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ, మిత్రపక్షాలు అంటున్నాయి. నిజానికి ఈ రెండింటిలో ఏది జరిగినా అది ప్రజాస్వామ్య బలహీనతలకు ఉదాహరణలవుతాయి.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓట్‌చోరీపై మీడియా సమావేశంలో వెల్లడించింది మొదలు దేశంలో రాజకీయంగా వేడి పుంజుకుంది. ఓటర్ల జాబితాలోని లోపాలను ప్రజలకు ఎత్తి చూపే లక్ష్యంతో రాహుల్ బీహార్‌లో ఓట్ అధికార్ యాత్ర కూడా చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఓట్ల నమోదులో జరిగిన పలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు దాదాపు కోటి ఓట్లు అదనంగా చేర్చారని, అవన్ని బోగస్ ఓట్లని ఆయన ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోఇన మహదేవపుర అసెంబ్లీ నియోజజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన అక్కడ ఏ రకంగా లక్షకుపైగా ఓట్లను చేర్చింది సోదాహరణంగా వివరించారు. ఈ బోగస్ ఓట్లతోనే బీజేపీ, మహారాష్ట్ర అసెంబ్లీ, కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించగలిగిందని రాహుల్ ఆరోపించారు.
రాహుల్ విమర్శలకు ఎన్నికల సంఘం నేరుగా జవాబు ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. అదే టైమ్‌లో బీహారులో తొలగించిన ఓట్లపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ప్రత్యేక విస్తృత ఓట్ల రివిజన్‌ను ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా ఓటు నమోదుకు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆయా రాజకీయ పక్షాల వారు ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారని చెబుతున్నారో వారితో మళ్లీ దరఖాస్తు చేయించుకోవాలని సలహ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది రాజకీయ వివాదం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి కాంగ్రెస్, ఎంఐఎంలు దీనిని వ్యతిరేకించవచ్చు. అయితే..
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఈ రివిజన్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ సహజంగా ఎంఐఎం ఓట్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పాతబస్తీలో పలు చోట్ల డబుల్ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. అందులో కొంత నిజం ఉండవచ్చు కూడా. పాతబస్తీలో అధికారులు ఏ మార్పు తీసుకు వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు గతంలో అక్కడ విద్యుత్ బిల్లులు చెల్లించని వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని ప్రయత్నిస్తే పెద్ద ఆందోళన వచ్చింది. స్థానికులు కొందరు అధికారులపై తిరగబడ్డారు. ఓట్ల విషయానికి వస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా స్థిరపడ్డ రోహింగ్యాల వంటివారు, పాకిస్తాన్ చెందినవారు కూడా పాతబస్తీలో అధికంగా ఉన్నారని, వారికి కూడా ఓట్లు ఉన్నాయని,వాటిని తొలగించాలని బీజేపీ చెబుతుంటుంది. నిజంగానే ఇతర దేశాలకు చెందినవారు కాని, అనర్హులైనవారు కాని ఓటర్ల జాబితాలో ఉంటే ఆ పేర్లను తొలగించడం తప్పు కాదు. కానీ ఆ ముసుగులో బీజేపీకి ఓటు వేయరన్న అనుమానం ఉన్న అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తే తప్పు అవుతుంది.
తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల గడువు ఉంది. ఇప్పుడు ఓట్ల రివిజన్ జరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి పెట్టి అర్హులైన వారు ఎవరైనా ఓటు కోల్పోతే మళ్లీ చేర్చవచ్చు. బీజేపీ మతపరమైన విమర్శలను చేస్తుంటుంది. ఆ ప్రాతిపదికన ఓట్లు తొలగిస్తుందేమో అన్న భయం ఇతర పార్టీలకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కనుక, కింది స్థాయి అధికారులు వారి అదీనంలో ఉంటారు కనుక అలా ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసివేయడమో, చేర్చడమో జరుగుతుంటే పట్టుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల జాబితాను తమకు అనకూలంగా ఉండే విధంగా మార్చే ప్రయత్నిస్తే అది మరో వివాదం అవుతుంది. ఎన్నికల సంఘం నిజంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయదలిస్తే ముందుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలలో, ప్రతిపక్ష పార్టీలలో ఉన్న అనుమానాలు తీర్చాలి.
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికలలో పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాడు సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా లెక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు చెలరేగాయి. కొందరు హైకోర్టుకు వెళ్లినా తేలలేదు. రాజకీయంగా కూడా ఫిర్యాదు చేసిన ఒక మాజీమంత్రిని దానిపై మరింత గొడవ చేయకుండా మేనేజ్ చేశారన్న అభియోగమూ లేకపోలేదు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా వినతిపత్రం సమర్పించింది. కౌంటింగ్ నాడు అసంబధ్దంగా పెరిగిన 12.5 శాతం ఓట్ల ప్రభావం 88 నియోజకవర్గాలపై ఉందని వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి కాని ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, ఆయా రాష్ట్రాలలో ఇలాంటి ఆరోపణలపై స్పందించాలి. అందులో నిజం లేదని బహిరంగంగా రుజువు చేయాలి. ఈవీఎంలపై నిర్దిష్ట అనుమానాలు వచ్చాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను పోల్చి లెక్కించడం, బ్యాటరీ ఛార్జ్‌లో అనుమానాలు రావడం, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అధిక పోలింగ్ జరిగిందన్నట్లుగా లెక్కలు రావడం, దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వడానికి నిరాకరించడం, వీవీప్యాట్ స్లిప్పులను పది రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి ఎన్నికల కమిషన్ నిజాయితీని శంకించేవిగా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణల్లో దొంగ ఓట్లు చేర్చడం అన్నది కొత్త కాదు. లక్షల మంది హైదరాబాద్‌లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. వారికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. ఎన్నికల రోజున వందల బస్సుల్లో, వేల కార్లలో హైదరాబాద్ నుంచి ఏపీకి బయల్దేరి వెళ్లడం ఇందుకు నిదర్శనం. అనేక జిల్లాలు, రాష్ట్రాలలో డబుల్ ఓట్ల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం వెతక్కుండా ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం పెద్ద సమస్యగా ఉంది. వారు కోరిన విధంగా ఎన్నికల సమయాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయడం, కావల్సిన వారిని నియమించుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇలాంటివాటి వల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే స్పెషల్ రివిజన్ ఎందుకు చేయాలని తలపెట్టారో కిషన్ రెడ్డి చెప్పాలి. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాలలో కూడా చేస్తారా? అదనంగా చేరాయన్న దొంగ ఓట్లను తొలగిస్తారా? లేదా? లేక తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈ రివిజన్‌ను వాడుతారా?
ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఈ ఓటర్ల జాబితాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో చాలా అనుభవం ఉందని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. పశ్చిమ బెంగాల్‌లో బంగ్లా దేశీయులు అనేక మంది ఓటర్ల జాబితాలో చేరారని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపిస్తుంటుంది. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, దొంగ ఓట్లను చేర్చకుండా, లేదా అసలైన ఓటర్లను తొలగించకుండా ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలి. ఆధార్ కార్డును విదేశీయులకు జారీ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం చేస్తోంది. అంటే మన దేశంలో ఒక వ్యవస్థకు, మరో వ్యవస్థకు సమన్వయం కొరవడుతోందన్నమాట.
అమెరికా వంటి దేశాలలో కాన్పు జరిగి పుట్టిన రోజునే గుర్తింపు కార్డు ఇచ్చే సిస్టమ్ ఉంటుంది. మన దేశంలో కూడా అలాంటి పద్దతి వస్తే మంచిది. పుట్టిన రోజు సర్టిఫికెట్ ఆధారంగా వారికి నిర్ణీత ఏజ్ వచ్చాక ఆటోమాటిక్‌గా ఓటింగ్ హక్కు ఇచ్చే విధంగా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేసుకోవడం వంటివి చేయవచ్చేమో పరిశీలించాలి. ఓటర్ల జాబితాలలో అక్రమాలు నిజంగా ఎక్కడ జరిగినా తప్పే.వీటన్నిటిని అరికట్టడానికి ఒక స్పష్టమైన విదానాన్ని రూపొందించనంత కాలం ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఎప్పటికి వస్తుందో!

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.