
‘ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా’ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన హెచ్చరిక ఇది. అయితే ఇదంతా కేవలం ఉపన్యాసం కోసం చేసిందేనని, చిత్తశుద్ధి లేనిదని ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు ప్రసంగం ప్రచురితమైన రోజే ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరిగిన దాష్టీకాల వార్తలూ ప్రముఖంగా వచ్చాయి. కొన్నింటిలో చంద్రబాబు సొంతపార్టీ ఎమ్మెల్యేల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇప్పటివరకూ చంద్రబాబు వారిపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఇందుకు తగ్గట్టుగానే బాబుకు వత్తాసు పలికే మీడియా కూడా టీడీపీ నేతల అక్రమాలను కప్పిపుచ్చుతూంటుంది. కానీ.. ఈ ఘటనలన్నీ ఇతర మాధ్యమాల్లో వస్తుండటంతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యేల ఇతర దందాల సంగతి పక్కనపెట్టినా.. వీరూ, వీరి అనుచరులు మహిళలపై చేస్తున్న వేధింపుల ఉదాహరణలు చూద్దాం. ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ దూషించిన ఆడియో తీవ్ర కలకలం రేపింది. సినిమా విడుదలకు తన అనుమతి కావాలన్న ఆ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోలేదు. ఆమదాలవలస నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై ఒక కథనం వచ్చింది. దాని ప్రకారం ఆయన శ్రీకాకుళంలోని కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను ఫోన్ ద్వారా వేధిస్తున్నారు. తనతో వీడియో కాల్‌లోనే మాట్లాడాలన్నది ఆయన హుకుం!. మాట వినకపోతే బదిలీ ఖాయమని సిబ్బంది ద్వారా బెదిరింపులకు దిగుతున్నట్లు ఈ కథనం చెబుతోంది.
రాత్రి పది గంటల సమయంలోనూ పార్టీ ఆఫీసుకు రావాలని మహిళా ఉద్యోగులను పిలుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ వేధింపులు భరించలేక ఆ దళిత మహిళా ప్రిన్సిపాల్ ఆత్మహత్య యత్నం చేసుకోవడమే కాకుండా.. ఎమ్మెల్యేపై బహిరంగంగానే ఆరోపణలు చేశారు. కూన రవికుమార్ ఇతర మహిళా ఉద్యోగులను కూడా వేధించారని ఆమె అంటున్నారు. మరి ఇవన్నీ ఆడబిడ్డ జోలికి వెళ్లడమే కదా? మరి చంద్రబాబు తాట ఎంతవరకు తీశారు? కొంతకాలంగా ఈ గొడవ సాగుతూనే ఉన్నా పట్టించుకోలేదని చెబుతున్నారు. చంద్రబాబుకు అన్ని విషయాలు చేరవేయడానికి పనిచేసే నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్లు?.
ఇక మరో ఎమ్మెల్యే ఉదంతం చూద్దాం. గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ ఒక మహిళకు వీడియో కాల్ చేసి ముద్దు పెడుతున్నట్లు పెదాలు కదుపుతున్న దృశ్యం సన్నివేశాలు వైరల్ అయ్యాయి. ఆ ఎమ్మెల్యేకి టీడీపీకే చెందిన ఒక మహిళా నేతతో సంబంధం ఉందట. దీంతో ఆ మహిళా నేత భర్తే సంబంధిత వీడియోని ప్రచారంలో పెట్టారట. ఈ విషయాన్ని సూఫియా అనే మరో టీడీపీ నేత ఎమ్మెల్యేకి చెబితే తొలుత ఆమెను కామ్‌గా ఉండమని చెప్పారట. తదుపరి అక్రమ సంబంధం ఉన్న మహిళ కుటుంబంతో సెటిల్‌మెంట్ చేసుకుని, తదుపరి తనను కేసులో ఇరికించాలని చూస్తున్నారని సూఫియా అంటున్నారు. దీనిపై వాస్తవాలు వెలికి తీయకుండా పోలీసులు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేశారు.
కళ్యాణదుర్గంలో జరిగిన ఘటన అత్యంత విషాద భరితం. శ్రావణి అనే గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమె ఒక ఆడియో రికార్డు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నారని ఆమె పోలీసు స్టేషన్‌లో కేసు పెట్టారు. అయితే భర్త టీడీపీకి చెందిన వాడు కావడంతో కళ్యాణదుర్గం మాజీ మున్సిపల్ ఛైర్మన్, మాజీ వైస్ చైర్మన్ తదితరుల ఒత్తిడితో పోలీసులు ఆ కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నించారని శ్రావణి ఆరోపించారు. తన ఆత్మహత్యకు టీడీపీ ప్రభుత్వం, పోలీసులు కారణమని ఆమె చెప్పిన ఆడియో వింటే ఎవరికైనా బాధ కలుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో సుగాలి ప్రీతి అనే మహిళ హత్య కేసు గురించి గొంతెత్తి అరిచేవారు. ఎన్నికల తర్వాత ఆయనకు పదవి రావడంతో ఆ మాటే ఎత్తడం లేదు. ఆ మీదట సుగాలి ప్రీతి తల్లి నిరసన యాత్ర చేయాలని తలపెట్టినా అనుమతించడం లేదట. జగన్ పాలన సమయంలో ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వలంటీర్లే కిడ్నాప్‌లకు పాల్పడ్డారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటూ పవన్ కళ్యాణ్ విపరీతమైన ప్రచారం చేశారు. తీరా అధికారం వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. అధికారం సాధించడానికి గాను మహిళలను అడ్డు పెట్టుకుని అంత ఘోరమైన ఆరోపణలు చేయవచ్చా? అది వారిని అవమానించినట్లా? కాదా?.
2014-19 మధ్య కాలంలో కూడా మహిళలపై పలు అఘాయిత్యాలు జరిగాయి. ముసునూరు మహిళా ఎమ్మార్వో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోబోగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మనుషులు ఆమెను తీవ్రంగా అవమానించిన ఘటన అప్పట్లో పెను సంచలనం. అయితే చంద్రబాబు ఎమ్మార్వోనే మందలించి రాజీ చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పుడే కాదు.. కొద్ది నెలల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక టీడీపీ మహిళా నేత తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆయనపై నామమాత్రంగా చర్య తీసుకున్నా, ఆ తర్వాత ఆ కేసే లేకుండా రాజీ చేశారని వార్తలు వచ్చాయి.
శ్రీకాళహస్తి జనసేన మహిళా నేత వినూత వ్యక్తిగత వీడియోల కేసు చివరికి వారి పీఏ హత్యకు దారి తీసింది. వినూత దంపతులు ఇదంతా టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వల్లే జరిగిందని ఆరోపించారు. అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వపరంగా చర్యలు శూన్యమే. అందుకే చంద్రబాబు చెప్పే మాటలను ఎంత వరకు నమ్మాలో అర్థం కాని పరిస్థితి!.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.