ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రాజకీయమంతా... అబద్దాలు, డాబుసరి కబుర్లు, వక్రీకరణలు, బురద జల్లుడులపైనే ఆధారపడి ఉంటోంది. ఈ విషయం ఇప్పటికే పలుమార్లు రుజువైంది. తాజాగా మరోసారి బట్టబయలైంది. గోదావరి జిల్లా రాయవరం వద్ద పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా చంద్రబాబు అబద్ధాలు బహిరంగమయ్యాయి.
‘‘పట్టాదారు పాసుపుస్తకాలు అందరికీ అందాయా?’’ అనే చంద్రబాబు ప్రశ్నకు అసలు సమాధానమే లేకపోయింది. అందిన వారు చేతులెత్తాలంటే ఎవరూ స్పందించలేదు. ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు ఒకరిద్దరిని నేరుగా అడిగారు. ‘‘అందలేదు’’ అని వారు ఠకీమని సమాధానం చెప్పడంతో ఏం మాట్లాడాలో తెలియకుండా పోయింది చంద్రబాబుకు. ఆ అసంతృప్తిని కాస్తా అక్కడి అధికారులపై విసుక్కుని తీర్చుకున్నారు. ‘‘సరిగా ఆర్గనైజ్ చేయడం రాదా’’ అంటూ జాయింట్ కలెక్టర్‌పై కూడా విసుగు చూపించారు. ఆర్గనైజ్ చేయడం అంటే రైతులను మభ్యపెట్టడం అన్న అర్థం వస్తుంది. చంద్రబాబు అప్పటికే ఒకట్రెండు కుటుంబాలతో కలిసి పొలాల్లోకి వెళ్లి పాస్ పుస్తకాలు అందినట్లు హడావుడి చేశారు. ఆయా కుటుంబాల వాళ్లు కూడా తాము సంతోషపడుతున్నట్టుగానే చెప్పారు. కానీ సభలో మాత్రం దీనికి భిన్నమైన స్పందన రావడంతో పట్టాదారు పాసు పుస్తకాల విషయంలో ఏం జరగలేదని అందరికీ తెలిసిపోయింది. ఆ సభలో ఒకవైపు చంద్రబాబు మాట్లాడుతూండగానే ప్రజలు ఒక్కరొక్కరుగా వెళ్లిపోవడమూ కనిపించింది.
నిజానికి ఈ సర్వే కొత్తగా చేపట్టిందేమీ కాదు. జగన్ సీఎంగా ఉండగా భూముల రీసర్వే చేపడితే చంద్రబాబు, ఎల్లోమీడియా విపరీతమైన దుష్ప్రచారం చేసింది. జగన్ భూములు లాగేసుకుంటారని రైతులను భయపెట్టే ప్రయత్నం చేసింది. అధికారంలోకి వచ్చాక టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేశామని చెబుతున్నారు. దానివల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటి? కేంద్రం ఆదేశాల ప్రకారమే జగన్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి భూముల రీసర్వే నిర్వహించారు. అంతేకాక భూముల సర్వే పూర్తి అయ్యాక, అభ్యంతరాలుంటే రెండేళ్లలోపు తెలపాలని, ఆ తర్వాత ప్రభుత్వం రైతులకు భూమి గ్యారంటీ పత్రాన్ని ఇస్తుందని చట్టంలో ఉంది. వైసీపీ ప్రభుత్వం శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావుల కేశవ్ దానిని బలపరిచారు కూడా. కాని ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఇదే రీసర్వేపై చిలవలు, పలవలు చేసి, ఏదో అయిపోతుందంటూ వదంతులు సృష్టించారు. జగన్ ఫోటో ఉంటే భూములు అన్ని పోయినట్లు అబద్దాన్ని నూరిపోసి రైతులలో భయం నింపే యత్నం చేశారు.
ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా ఈ అంశంపై చేసిన నీచమైన ప్రచారానికి అంతేలేదు.. ఎలాగైతే రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రీసర్వేని ఆపారా అంటే లేదు. జగన్ ప్రభుత్వం టైమ్‌లో నిర్వహించిన సర్వేనే కొనసాగించి, కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆరంభించారు. జగన్ సర్వేని సమర్థంగా అమలు చేసినందుకు కేంద్రం ఇచ్చిన ఇన్సెంటివ్ సుమారు రూ.400 కోట్లను కూటమి ప్రభుత్వం పొందింది. ఇంత లబ్ది పొందినా, కూటమి ప్రభుత్వం రాకపోతే మీ భూములు గోవిందా అయ్యేవి అని చంద్రబాబు స్పీచ్ ఇచ్చారు. ఇది అసత్యమని ఆయనకు తెలుసు. అయినా తను ఆడిన అబద్దాన్ని నమ్మే స్థితిలోనే జనం ఉండాలన్నది ఆయన సిద్ధాంతం అన్నమాట. కాని వాస్తవం ఎప్పటికైనా జనానికి తెలియకుండా పోతుందా! సర్వే రాళ్లపై ఉన్న పటం కారణంగా రూ.700 కోట్లు వృథా అయ్యాయని అర్థం లేకుండా మాట్లాడారు. అంటే ఆ రాళ్లను వృథా చేయబోతున్నామని చెబుతున్నారు. అదే జరిగితే బాధ్యత చంద్రబాబు సర్కార్‌దే అవుతుంది కదా!
మాజీ ముఖ్యమంత్రి జగన్ భూముల రీసర్వేపై ప్రతిపక్షంగా చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఆడిన నాటకాన్ని... అధికారం దక్కిన తరువాత చేస్తున్న మోసాలను, క్రెడిట్ చోరీని మీడియాకు పూస గుచ్చినట్లు వివరించారు. ఈ విమర్శలు వేటికీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జవాబు ఇవ్వలేకపోయారు. కాకపోతే యథాప్రకారం జగన్‌ను దూషించడానికి మాత్రమే పరిమితమయ్యారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వ టైమ్‌లోనే 6800 గ్రామాలలో సర్వే పూర్తయిన విషయాన్ని అంగీకరించక తప్పలేదు. ఒక వైపు అమరావతి పేరుతో రైతుల భూములు వేల ఎకరాలను కైవసం చేసుకుంటున్న చంద్రబాబు గత ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేస్తుంటారు. జగన్ 22ఎ నిబంధన తెచ్చి భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. తీరా చూస్తే ఆ నిబంధనను అమలు చేసింది చంద్రబాబు ప్రభుత్వంలోనేనని వెల్లడవుతోంది.
దీనిపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్నినాని సవాల్ చేస్తూ జగన్ టైమ్‌లో ఒక్క భూమిని అయినా నిషేధిత జాబితాలో చేర్చారేమో రుజువు చేయాలని అన్నారు. పైగా ఆ జాబితా నుంచి వేల ఎకరాల భూమిని విడిపించి జగన్ రైతులకు న్యాయం చేశారని అన్నారు. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆధునిక సర్వే వ్యవస్థనే అమలు చేస్తూ బ్లాక్, క్లౌడ్ అంటూ రైతులకు అర్థం కాని పదాలు వాడుతూ మభ్య పెట్టే యత్నం చేస్తున్నారని నాని వ్యాఖ్యానించారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీయడం తప్ప, కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని అన్నారు. చంద్రబాబు గతంలో ఈ సేవ సర్టిఫికెట్లపై తన ఫోటో ఎలా వేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. బురద వేయడమే తప్ప, ఎదుటివారు వేసే ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోవడం చంద్రబాబు ప్రత్యేకత.
రైతులను చంద్రబాబు పాస్ పుస్తకాల గురించే కాక మరికొన్ని ప్రశ్నలు వేసి ఉండాల్సింది. రైతులకు అన్నదాత సుఖీభవ కింద ఇవ్వవలసిన రూ.నలభై వేలలో రూ.ఐదు వేలే ఇచ్చారు. ఆ స్కీమ్ అందిందా? లేదా? యూరియా అందుతోందా? రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయా? లేక ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ప్రభుత్వం పని చేయడం బాగుందా? అన్న ప్రశ్నలు రైతులకు వేసి సమాధానాలు తెలుసుకోవాల్సింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి అప్పగించడం సరైనదేనా? కాదా? 99 పైసలకే పాతిక ఎకరాలు ప్రైవేటు కంపెనీకి అప్పగిస్తున్నాం.. మీకు సంతోషమేనా అని అడిగితే తన ప్రభుత్వం గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నది తెలిసేది కదా!. దేశ రాజ్యాంగం బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం బాగుందా?అని ప్రశ్నించగలిగితే ఇంకా బాగుండేది. పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో అయినా తన ప్రభుత్వం ఎంత అసమర్థంగా ఉంది చంద్రబాబుకు తెలియడం కొంతలో కొంత బెటర్.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


