
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే చిట్కాలు చిత్రంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎరువులకు కొరత ఉంది అన్నామనుకోండి.. వెంటనే వాడకం తగ్గించుకోమంటారు. ధాన్యం కొనుగోళ్లు ఇష్టం లేకపోతే... వరి వేయడం వేస్ట్ అనేస్తారు. పోనీ ఈ సలహాలేమైనా సకాలంలో ఇస్తారా? ఊహూ. అన్ని అయిపోయాక ఉచిత సలహాలు పారేస్తూంటారంతే. రాజకీయంగానూ అంతే. తన అసమర్థత బయటపడుతుందన్న అనుమానం వస్తే చాలు.. రాజకీయం మొదలుపెడతారు. నెపం ప్రత్యర్థి పార్టీలపై తోసేసే ప్రయత్నం చేస్తూంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత విషయంలోనూ జరిగింది ఇదే. సమస్యను తీర్చే ప్రయత్నం చేయకపోగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై దూషణలకు పరిమితమవుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు ఇంకోలా వ్యవహరించడం కూడా చంద్రబాబుకున్న నైపుణ్యం!
ఏపీ, తెలంగాణల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజుల తరబడి ఎదురు చూస్తున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి. క్యూలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలు కూడా యూరియా కొరతపై కొన్ని వార్తలైనా ఇవ్వక తప్పలేదంటే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థమవుతుంది. ఈ కష్టం రైతులకు మాత్రమే తెలుస్తుంది. ఏసీ రూములో కూర్చుని ఉండే మంత్రికి, ముఖ్యమంత్రికి ఎలా తెలుస్తుంది? బఫే డిన్నర్లో మాదిరిగానే యూరియా కోసమూ నిలబడమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్య రైతులు అవమానించడమే అవుతుంది. తెలంగాణలో యూరియా కొరత ఉన్నా కాంగ్రెస్ మంత్రులు కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. అదేసమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రైతులపై నోరు పారేసుకోవడం లేదు.
ఏపీలో చంద్రబాబు అటు కేంద్రాన్ని అనలేరు. ఇటు ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేరు. అందుకే రైతులు, సోషల్ మీడియా, సాక్షిలపై ఆయన తన అక్కసు తీర్చుకుంటున్నారేమో! యూరియా కొరత సమస్యపై చంద్రబాబు మాట్లాడుతూ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబడ్దార్ అని అన్నారట యూరియా అందుబాటులో ఉందని ఆయన చెబుతున్నారు. రైతులకు ఒక క్రమపద్దతిలో ఒక టైమ్ ప్రకారం యూరియాను పంపిణీ చేస్తే ఇబ్బంది ఉండదు. అలాకాకుండా యూరియా దొరుకుతుందో ,లేదో తెలియని అయోమయ స్థితిలో రైతులను ఎందుకు ఉంచుతున్నారు? ఎరువుల కొరతపై తప్పుడు పోస్టులు పెడితే చర్యలే అని ఆయన రైతులను, సోషల్ మీడియా వారిని బెదిరిస్తున్నారు. ఏపీలో అచ్చంగా పోలీసు యంత్రాంగంపై ఆధారపడి ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లు ఉంది తప్ప, ప్రజలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్లు కనబడదు.
ఇది అత్యయిక స్థితిని తలపిస్తుంది తప్ప, ప్రజాస్వామ్య యుతంగా ఉండదు. ఒకవైపు టీడీపీ తరపున పచ్చి అబద్దాలను తమ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తుంటారు. అదే టైమ్ లో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టిస్తుంటారు. ఇలా తయారైంది ఏపీలో పరిస్థితి అని పలువురు చెబుతున్నారు. వైసీపీ చేసే రాజకీయాలలో రైతులు భాగస్వాములు కావద్దని, ఎరువు లేదని ఎవరైనా చెబితే తానే అక్కడకు వెళ్లి చూస్తా.. తప్పు ఉంటే చర్య తీసుకుంటా.. లేకుంటే సోషల్ మీడియా సంగతి చూస్తా అని చంద్రబాబు అనడం ఏ పార్టి విజ్ఞత అన్నది ఆయనే ఆలోచించుకోవాలి. అంటే సీఎం స్వయంగా వెళితే తప్ప సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం లేదని ఆయనే ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. ఇన్నాళ్లుగా ఎన్నిసార్లు ఎన్ని చోట్ల యూరియా కోసం నిలబడిన రైతుల క్యూల వద్దకు ఆయన వెళ్లారు. నిత్యం ఏదో ఒక చోటకు హెలికాప్టర్ వేసుకుని టూర్ చేస్తుంటారు కదా? ఎక్కడా ఆయనకు ఈ క్యూలు కనిపించలేదా? వీటి గురించి మాట్లాడరు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులపై ఒత్తిడి లేదట. ఆత్మహత్యలు లేవట. అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ఇది ఏ మేరకు నిజమో ఆయనకు తెలుసు. రైతులకు తెలుసు. జగన్ టైమ్ లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి,రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర అవసరాలను తీర్చడానికి కృషి చేసినమాట అవాస్తవమా?అప్పట్లో ప్రతి ఏటా 13500 రూపాయల చొప్పున ఆర్దిక సాయం అందించారా? లేదా?అయినా రైతులపై ఒత్తిడి ఉందా? తాము అధికారంలోకి వస్తే ఇరవై వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వలేదా? దానిని ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారా? లేదా? ఈ ఏడాది కేంద్రం ఇచ్చేదానితో కలిసి ఏడువేలే ఇచ్చారే? వరి, మిర్చి, మామిడి, ఉల్లి, తదితర పంటలకు సరైన ధరలు లేక వారంతా ఆందోళనకు దిగుతున్న మాట నిజం కాదా ? అయినా రైతులపై ఇప్పుడు ఒత్తిడి లేదని చంద్రబాబు అనడం చూస్తే, ఎంత ధైర్యంగా అబద్దాలు చెప్పగలుగుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
తమ టైమ్ లో రైతులు ఎక్కడైనా రోడ్డెక్కవలసిన అవసరం వచ్చిందా? అలాంటి దృశ్యాలు కనిపించాయా అని వైసీపీ వారు అడుగుతున్నారు. సరిపడా యూరియా సరఫరా నిజంగా ఉంటే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రోడ్డు ఎక్కవలసి వస్తోందన్న ప్రశ్న వస్తోంది.అంటే వ్యాపారులు పక్కదారి పట్టించి బ్లాక్ లో అమ్ముకుంటున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల అరకొరగా ఇస్తున్న యూరియా ఏమాత్రం సరిపోవడం లేదని రైతులు అధికారులను నిలదీస్తున్నారు. కొన్నిచోట్ల అధికార పార్టీ నేతల సిఫారసులుంటే తప్ప ఇవ్వడం లేదు. మరికొన్ని ప్రాంతాలలో యూరియా పొందాలంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని షరతులు పెడుతున్నారట. సాక్షి మీడియాలోనే కాకుండా ఎల్లో మీడియాలో కూడా అప్పుడప్పుడు యూరియా కొరత సమస్యల వార్తలు వస్తున్నాయి.
జనంలో ఎల్లో మీడియా క్రెడిబిలిటి పోయిందనుకున్నారో, ఏమో కాని, సాక్షి మీడియాపైనే చంద్రబాబు విరుచుకుపడుతుండడం అలవాటుగా చేసుకున్నారు.దీనిని బట్టి సాక్షి మీడియానే జనం నమ్ముతున్నారని ఆయన చెప్పకనే చెప్పారు. అందుకే ఆయన ఎక్కువ కంగారు పడుతున్నారనుకోవాలి. జనంలో ఎవరైనా నిలదీస్తే వారికి వైసీపీ ముద్ర వేసి సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తున్నారు. యూరియా గందరగోళంపై చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి జగన్ గట్టిగా ప్రశ్నించారు.తనకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని జగన్ ఎద్దేవ చేశారు.
రైతులకు తమ ప్రభుత్వంలో జరిగిన మేలు , ప్రస్తుతం రైతులు పడుతున్న పాట్లను జగన్ వివరించారు. ప్రతిపక్షంగా ఆయన చేసిన విమర్శలను పరిగణనలోకి తీసుకుంటారా లేదా?అన్నది చంద్రబాబు ఇష్టం. కాని రాష్ట్రంలో రైతులు యూరియా కోసం, గిట్టుబాటు ధరల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నది గమనించి చర్య తీసుకోవడం అత్యవసరం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ష్యూరిటీ అంటే భవిష్యత్తుకు మోసం గ్యారంటీ అని జగన్ , ఇతర వైసీపీ నేతలు ఎద్దేవ చేస్తున్నారు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.