హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా తెలంగాణ నేతల వ్యాఖ్యలు చూస్తే రాజకీయాల్లో బ్లాక్‌మెయిలింగ్ ఎంత కీలకమైపోయిందో అర్థమవుతుంది. ఫీజు రీయంబర్స్‌మెంట్ విషయంలో కాలేజీలు ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తే.. బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అసలు బ్లాక్‌మెయిలర్ సీఎం అని విమర్శించారు. హరీశ్ ఇంకో అడుగు ముందుకేసి సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ పారిశ్రామిక వేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించేవారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్‌లు హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతూ బ్యాడ్ బ్రదర్స్‌గా మారారని రేవంత్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆయా వర్గాలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తూ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన‍్నంతా దీనికోసమే వాడేస్తున్నారు. చంద్రబాబు అనుంగు శిష్యుడిగా పేరొందిన రేవంత్ రెడ్డి కూడా అదే బాట పట్టినట్లు కనిపిస్తోంది.
తెలంగాణలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం కాలేజీలు బంద్‌కు దిగాయి. ఒక రోజు బంద్ తర్వాత చర్చలు జరిగి కొంత పలించాయి. ఈలోగానే రేవంత్ మీడియాతో మాట్లాడుతూ ఆ కాలేజీలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామని చెప్పినా వినకుండా కాలేజీలను బంద్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ పార్టీల అండ చూసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకోనని స్పష్టం చేశారు. కాలేజీల యాజమాన్యాలు జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్‌ను నష్టపరచేలా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయంతో సీఎం అంత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ప్రభుత్వం వైపు ఉన్న లోపాలను కూడా సరి చేసుకుంటామని చెప్పి ఉండాల్సింది. ఈ క్రమంలో ఆయన చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యపరిచాయి.
ప్రభుత్వాలు ఇంత అధ్వాన్నంగా పని చేస్తున్నాయా అన్న భావన కలిగించాయి. విద్య సేవ మాత్రమే అని, వ్యాపారంలా చేస్తూ సహించేది లేదని ఆయన అన్నారు. వ్యాపార తెలివితేటలు చూపిస్తే చట్టప్రకారంగా ముందుకు వెళతానని కూడా రేవంత్ హెచ్చరించారు. భవనాలు, ల్యాబ్‌లు ఫ్యాకల్టీ, విద్యార్థులు ఉన్నారో, లేరో చూడడానికి విజిలెన్స్ అధికారులు వస్తారంటే ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. విద్యార్థుల నుంచి ఎంత మొత్తం డొనేషన్లు వసూలు చేస్తారో తమకు తెలుసునని, వచ్చేసారి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తానని రేవంత్ అన్నారు. ఈ మాటలు వింటే ముఖ్యమంత్రే కాలేజీలను బెదిరిస్తున్నారన్న భావన కలగదా? కాలేజీల యాజమాన్యాలకు ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేసే శక్తి ఎంత ఉంటుందన్నది ఒక ప్రశ్న. సమయం చూసి ఆయా సంఘాల వారు ప్రభుత్వాలను బెదిరించేలా వ్యవహరించడం కొంత వాస్తవమే కావచ్చు. ఎన్నికల సమయంలో ఉద్యోగ సంఘాలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతుంటాయి.
అవి నెరవేర్చకపోతే సమ్మెలు చేస్తామని కూడా హెచ్చరిస్తుంటాయి. అయితే కాలేజీల డిమాండ్ సహేతుకత ఉందో, లేదో చూడాలి. సుమారు 1200 కాలేజీలకు సుమారు రూ.3600 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వీరి ఆందోళనలు స్పందించిన ఆర్థిక మంత్రి మల్లు భట్టి చర్చలు జరిపి రూ.300 కోట్లు విడుదలకు అంగీకరించారు. కానీ అందులో రూ.60 కోట్లు మాత్రమే విడుదలైనట్లు సమాచారం. దీంతో కాలేజీలు మళ్లీ బంద్ పిలుపు ఇచ్చాయి. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. ఉప ఎన్నిక సమయంలో ఇది పెద్ద ఇష్యూగా చేయవచ్చని, ప్రభుత్వం దిగి వస్తుందని అనుకుని ఉండవచ్చు. తదుపరి మల్లు భట్టి వీరితో మళ్లీ చర్చలు జరిపి రూ. 900 కోట్లు విడుదల చేస్తామని చెప్పి రాజీపడ్డారు.
ఈలోగానే రేవంత్ కాలేజీలపై తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. కాలేజీల యాజమాన్యాలపై ఆయన ఆరోపణలు చేసిన తీరులో ప్రభుత్వ బలహీనతలు కూడా బయటపడ్డాయి. కాలేజీలు తగిన మౌలిక సదుపాయాలు లేకుండానే కాలేజీలు నడుపుతున్నట్లు.. ఆ మేరకు ప్రభుత్వంలోని వారిని మేనేజ్ చేస్తున్నట్లు ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి. లేదా తమను డబ్బు అడగనంతవరకు ఎలాగోలా చేసుకునివ్వులే అని వదలివేసినట్లే కదా!దీనివల్ల విద్యా ప్రమాణాలు పడిపోయినా, విద్యార్ధులకు సరైన బోధన జరగకపోయినా, ప్రభుత్వం రాజీ పడినట్లే కదా! అధికారులు తమ బాధ్యతలు నిర్వహించడం లేదని వెల్లడైనట్లే కదా!
విద్య అన్నది సేవ అని, వ్యాపారం కాదని రేవంత్ చెప్పడం బాగానే ఉంది. కాని కాలేజీల నిర్వహణకు డబ్బులు అవసరం. రీయంబర్స్‌మెంట్ హామీలిచ్చిన రాజకీయ పార్టీలు దాన్ని నెరవేర్చకపోతే కాలేజీలు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. లేదా విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాయి. కాలేజీలు డొనేషన్లు వసూలు చేస్తున్నాయని అన్నారు. వచ్చేసారి అలా జరగనివ్వబోమని కాలేజీలను రేవంత్ బెదిరిస్తున్నారా! అసలు డొనేషన్లు ఎలా వసూలు చేస్తున్నారు? వాటిలో రాజకీయ పార్టీల నేతలకు ఎంత మేర వాటాలు ఇస్తున్నారు? వాటిని నియంత్రించవలసిన ప్రభుత్వమే ఇలా మాట్లాడితే వ్యవస్థలో ఉన్న డొల్లతనం తెలిసిపోవడం లేదా?ప్రభుత్వం తన విధులను సక్రమంగా చేయడం లేదని అంగీకరించినట్లే అవుతుంది కదా!యాజమాన్యాల నేత ఆరోరా రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగారని సీఎం వెల్లడించారు. వాటిని ఇవ్వనందునే బ్లాక్ మెయిల్‌కు దిగారని ఆయన ఆరోపించారు.
ఒకవేళ ఆరోరా రమేష్ తప్పు చేస్తుంటే చర్య తీసుకోవల్సిన సీఎం ఇలా బేలగా మాట్లాడడం ఏమిటో తెలియదు. కాలేజీలను బంద్ పెట్టిన తర్వాత చర్చించడానికి ఏముంది అని రేవంత్ అన్నప్పటికి, మరో వైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి వీరితో సంప్రదింపులు జరిపి రాజీ కుదుర్చుకున్నారు.బహుశా రేవంత్ అనుమతితోనే ఇది జరిగి ఉంటుంది. ఈలోగానే ఆయన ఇన్ని మాటలు మాట్లాడితే పలచన అయ్యేది ఆయన ప్రభుత్వమే కదా!కొద్ది కాలం క్రితం ఏపీలో ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.3000 కోట్లు రాబట్టుకునేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు సమ్మె చేశాయి. ప్రభుత్వం ఆసుపత్రుల యజమానులను బెదిరించినట్టుగా వార్తలొచ్చాయి. చివరకు కొంతమేరకు నిధుల విడుదలతో సమ్మె విరమణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కాలేజీల ఫీ రీయంబర్స్‌మెంట్ మొత్తం కూడా రూ.4000 కోట్ల వరకూ ఉంది. సకాలంలో చెల్లించకపోవడం వల్ల విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందడం లేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు.
ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవారిపై కేసులు పెడుతూ నిత్యం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతోంది. తెలంగాణలో సైతం అదే మాదిరి ప్రభుత్వాన్ని నడపడానికి యత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి కొంత బెటర్ అయినప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వల్ల ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది.ఇదే సందర్భంలో రేవంత్ మరికొన్ని విషయాలు చెప్పారు.ప్రభుత్వానికి నెలకు వచ్చే ఆదాయం రూ.18500 కోట్లు అని, ఇందులో వేతనాలు,పెన్షన్లకు రూ.6500 కోట్లు, కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీతోసహా అసలు కట్టడానికి రూ.6500 కోట్లు పోతే మిగిలేది 5500 కోట్లేనని వెల్లడించారు. ఈ మొత్తంతోనే అభివృద్ది కార్యక్రమాలు, ఫీజ్ రీయంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర స్కీములు అంటూ పెద్ద జాబితానే చదివి వీటిలో దేనిని ఆపాలో,దేనిని అమలు చేయాలో చెప్పాలని ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణ మాదిగ చెప్పాలని అనడం వింతగా ఉంటుంది.
ఇక్కడే కొన్ని ప్రశ్నలు వస్తాయి.ఎన్నికల సమయంలో ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తామని ఎలా చెప్పగలిగారు?అప్పుడు ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చెబితే, సూపర్ సిక్స్ అంటూ ఏపీలో తెలుగుదేశం,జనసేన కూటమి ఊదరగొట్టింది.వంద రోజుల్లో గ్యారంటీలను చట్టబద్దం చేసి, అన్నిటిని అమలు చేసి చూపుతామని పిసిసి అధ్యక్షుడి హోదాలో ఆ రోజుల్లో ఎలా చెప్పారు?చంద్రబాబు అయితే తనకు సంపద సృష్టించడం తెలుసునని, తద్వారా సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేస్తానని ప్రచారం చేశారు.తీరా అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ ఇప్పుడు ఆర్దిక కష్టాల గురించి ఏకరువు పెడుతున్నారు. కేసీఆర్ అప్పుల కుప్ప చేసేశారని రేవంత్ ఆరోపించడం వవల్ల ఉపయోగం ఏమి ఉంటుంది. అవన్ని తెలిసే ఆనాడు మాట్లాడారా?లేదా? చంద్రబాబు నాయుడు సైతం ఖజానా ఖాళీగా కనబడుస్తోందంటూ ప్రజల ముందు మాట్లాడుతున్నారు.
రెండు రాష్ట్రాలలోను ప్రస్తుతం ప్రభుత్వం అప్పులు చేయడం లేదా? ఏపీలో రికార్డుస్థాయిలో అప్పులు చేశారే? ఎదుటివారిపై ఆరోపణలు చేయడానికి ముందు తాము ఏమి చేస్తున్నామో కూడా గమనించాలి కదా!అధికారంలోకి రావడానికి ముందేమో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం, అధికారంలోకి వచ్చాక ఇలా వ్యవహరించడం చూస్తే దీనిని బ్లాక్ మెయిలింగ్ అని ప్రతిపక్షాలు విమర్శించవా?అందుకే రేవంత్ పై హరీశ్ రావు ఆరోపణలు గుప్పించారు. సమాచార హక్కు చట్టాన్ని వాడుకుని విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ పరిశ్రమల వారిని, రియల్ ఎస్టేట్ వారిని బ్లాక్ మెయిల్ చేసేవారని, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కాలేజీలు,తదితర వర్గాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తమ బకాయిలు అడిగితే ఇలా బ్లాక్ మెయిల్ చేయడం ఏమిటి అని హరీశ్ ప్రశ్నించారు.కాగా జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్‌ఎస్ గెలిస్తే పథకాలు ఆగిపోతాయన్నట్టుగా రేవంత్ మాట్లాడడాన్ని కూడా బ్లాక్ మెయిలింగ్ అన్న ప్రచారం జరిగింది. రేవంత్ కూడా ఇలా ప్రసంగం చేసి ఉండాల్సింది కాదు. గతంలో నంద్యాల ఉప ఎన్నిక జరిగితే ఆనాడు కూడా సీఎంగా ఉన్న చంద్రబాబు తను వేసిన రోడ్లను వాడుకుంటూ తనకు ఎందుకు ఓటు వేయరని, తను ఇచ్చిన ఇల్లు, తను ఇచ్చిన బాత్ రూమ్ ఉపయోగించుకుంటున్నారని,కనుక తన పార్టీకే ఓటు వేయాలని ప్రజలను హెచ్చరించిన ఘట్టాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు.కాగా హైడ్రా పేరుతో ప్రజలను భయపెడుతున్నారని, కేటీఆర్ ఆరోపిస్తే, హైడ్రా ద్వారా ప్రజలకు మేలు చేస్తుంటే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.ఏది ఏమైనా రాజకీయ పార్టీలు అధికారం కోసం ఎన్నికలకు ముందు ఒకరకంగాను, ఆ తర్వాత మరో రకంగాను వ్యవహరించడం మామూలు అయింది.ఈ పరిస్థితి ఇప్పటికిప్పుడు మారుతుందా అన్నది సందేహమే.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


