ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. అయితే ఆంధ్రప్రదేశ్ సకల శాఖల మంత్రి నారా లోకేశ్ పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. ఈయనేమో ఐటీ, విద్యాశాఖల మంత్రి. కానీ ముఖ్యమంత్రి తనయుడిగా ఇతర శాఖలన్నీ తనవే అన్నచందంగా వ్యవహరిస్తూంటారు. ఒకపక్క రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య ఏటా లక్షల్లో తగ్గిపోతూంటే దాన్ని పట్టించుకోకపోగా.. ఇతర శాఖలపై పెత్తనం ఏమిటన్నది ప్రశ్న. చిత్రంగా ఎల్లోమీడియా మాత్రం లోకేశ్ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో బోలెడన్ని మార్పులు తీసుకొచ్చేశారని ఊదరగొడుతూంటుంది. అందుకే చాలామంది రెండు శాఖలలోను లోకేశ్ పనితీరు అంతంతమాత్రమేనంటున్నారు. తాజా సమాచారం ద్వారా తెలుస్తున్నది కూడా ఇదే.
ఎలివేషన్ ఇచ్చేందుకేమో... చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్‌కు కీలకమైన విద్య ఐటీ శాఖల మంత్రిగా చేశారు. యువకుల్లో లోకేశ్‌కు ఒక గుర్తింపు వస్తుందని కూడా భావించి ఉండవచ్చు. తల్లికి వందనం స్కీమ్ లోకేశ్ ఐడియానే అని చంద్రబాబు చెప్పడం కూడా ఎలివేషన్‌లో భాగమే. కాకపోతే ఈ పథకాన్ని జగన్ ‘అమ్మ ఒడి’ పేరుతో మొదలుపెడితే.. క్రెడిట్ లోకేశ్‌కు ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఐటీ శాఖకు సంబంధించి కూడా.. ఇదే రకమైన ఎలివేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు. గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖకు తెప్పించానికి లోకేశ్ కృషి చేసినట్టుగా చెప్పారు ఆయన.
ఆసక్తికరంగా ఈ ప్రయత్నాలేవీ ఫలించలేదు. బెడిసికొట్టాయి కూడా. చంద్రబాబు బ్రాండ్ చూసి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు పరుగులు పెడతాయని ఒకప్పుడు ఊదరగొట్టిన లోకేశ్ ఆ తరువాత ఆ విషయం ఎత్తకపోగా.. ఐటీ అభివృద్ది పేరుతో 99 పైసలకే ఎకరాలకు ఎకరాల భూమి కంపెనీలకు కట్టబెట్టడం మొదలుపెట్టారు. పోనీ అలాగైనా కంపెనీలు వచ్చాయా? ఊహూ లేదు. అది చాలదన్నట్టు మంత్రివర్గం స్థాయిలో తీసుకోవాల్సిన భూ కేటాయింపు నిర్ణయాలను తానే తీసుకుంటూ విమర్శలకు గురయ్యారు. తొంభై తొమ్మిది పైసలకే భూములెలా పంచుతారంటే అహంకారపూరిత ధోరణిలో తన నిర్ణయాలను సమర్థించుకుంటున్న తీరును అందరూ తప్పు పడుతున్నారు.
లోకేశ్ శాఖల పరిస్థితి ఇలా ఉంటే.. ఇతర శాఖల విషయంలో జోక్యం చేసుకోవడం ,ముఖ్యంగా రెడ్‌బుక్ అంటూ హోం శాఖను తానే నడుపుతున్నట్లుగా ప్రవర్తించడం, పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం వంటివి ఆయన ఇమేజ్‌ను డామేజీ చేస్తున్నాయి. గత ప్రభుత్వం విద్య,ఆరోగ్య రంంగాలకు విశేష ప్రాధాన్యత ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. కాని కూటమి ప్రభుత్వం ఈ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నదని గణాంకాలు తెలియచేస్తున్నాయి.దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహిస్తారా?లేక ఆయన కుమారుడైన మంత్రి లోకేశ్ బాధ్యులవుతారా? కాని ఏపీ ప్రభుత్వం తీరుతెన్నులు ఏ మాత్రం బాగోలేదని ఈ విషయం స్పష్టం చేస్తుంది. మీడియా కథనం ప్రకారం.. 2023-24తో పోలిస్తే చంద్రబాబు పాలనలో హైస్కూలు స్థాయి లోపు 18 లక్షల మంది విద్యార్ధులు చదువులకు దూరం అయ్యారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే ఐదు శాతం మంది తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రాథమికోన్నత స్థాయిలో ఒక శాతం, హైస్కూలు దశలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది.
జగన్ ప్రభుత్వం విన్నూత్న కార్యక్రమాల ద్వారా, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు విద్యపై ఆసక్తి రేకెత్తించారు. పేదలు తమ పిల్లలను పనులకు తీసుకువెళ్లకుండా స్కూళ్లలో చేర్చే అవకాశాలు కల్పించారు. ‘‘నాడు-నేడు’’ కింద ప్రభుత్వ పాఠశాల భవనాల రూపురేఖలను పూర్తిగా మార్చేసి వాటికి కొత్త కళ తీసుకొచ్చారు. స్కూల్ పిల్లలకు ఉపయోగపడే డిజిటల్ బోర్డులు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చారు. ఎనిమిదో తరగతి నుంచి ట్యాబ్‌లు ఇచ్చారు. ఎల్లో మీడియా విష ప్రచారం చేసేది. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశపెట్టారు.
అమ్మ ఒడి ద్వారా తల్లులకు ఏటా రూ.14 వేల చొప్పున ఇచ్చారు. మధ్యాహ్న భోజనంలో మెనూ గురించి కూడా శ్రద్దపెట్టారు. పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్, బూట్ల నుంచి అన్నింటినీ టైమ్‌కు అందించే ఏర్పాటు చేశారు. కానీ టీడీపీ, ఎల్లో మీడియాలు మాత్రం టీచర్లను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టాయి. టీచర్లు కూడా కొంత వరకూ వీరి ట్రాప్‌లో పడినట్లు చెబుతారు. కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటివరకు ఉన్న పద్దతులను యధాతధంగా పాటించినా మంత్రి లోకేశ్‌కు మంచి పేరే వచ్చేదేమో! కానీ.. ఏడాది పాటు తల్లికి వందనం ఎగవేయడం, రెండో ఏడాది అరకొరగా మాత్రమే అమలు చేయడంతో విద్యార్థులు చదువులకు దూరమై ఉండవచ్చని చెబుతున్నారు. గ్రామాలలో, పట్టణాలలో మనీ సర్కులషన్ బాగా పడిపోయిందని అంటున్నారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నారు.దీని ప్రభావం కార్మికరంగంపై కూడా ఉంటుంది.
వ్యాపారాలు సరిగా లేవని వ్యాపారస్తులు చెబుతున్నారు. జగన్ హయాంలో వివిధ స్కీముల ద్వారా జనంలో డబ్బు చెలామణిలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. కొన్ని జిల్లాల్లో పనుల్లేక జనాలు వలస వెళుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థులు పాఠశాలలకు దూరం కాకుండా చూసేందుకు ప్రయత్నించడం అత్యవసరం. 
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


