
గాల్లో కత్తులు దూయడం... శూన్యంలో యుద్ధాలు చేయడం రాజకీయ పార్టీలు, నేతలకు అలవాటైన విద్యే. తెలంగాణ స్థానిక ఎన్నికల వ్యవహారం ఇప్పుడు దీన్నే నిరూపిస్తోంది. అన్ని పార్టీలకూ తుది పరిణామం ఏమిటన్నది స్పష్టంగా తెలిసినా అందరూ ఏమీ తెలియనట్టే వ్యవహరిస్తూంటారు. ప్రత్యర్థులపై పైచేయికి వ్యూహాలు పన్నుతూంటారు. నిర్దిష్ట గడువులోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్వహణపై చిత్తశుద్ధి ఉంటే ఉండవచ్చు కానీ ఎన్నికల్లో అధిపత్యానికి బీసీ రిజర్వేషన్లను 42 శాతం చేయాలని సంకల్పించారు. అసెంబ్లీలో బిల్లులు పాస్ చేశారు.
కులగణన చేపట్టి రాష్ట్రంలో బీసీలు 56 శాతమని తేల్చారు కూడా. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం 42 శాతాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. జనాభాను బట్టి రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. స్థానిక సంస్థలలోనే కాక, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ బీసీలకురిజర్వేషన్లు ఉండాలని కొన్ని రాష్ట్రాల శాసన సభలు తీర్మానాలు కూడా చేశాయి. కాని సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లు ఏభై శాతానికి మించే వీలు లేదు. అయినా తాము అనుకున్న రిజర్వేషన్ల శాతంతో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టింది.
ఎవరైనా కోర్టుకు వెళితే అది ఆగిపోతుందని అంతా అనుకున్నదే. అయినా ఎవరికి వారు 42 శాతం రిజర్వేషన్ల అంశానికి మద్దతు ఇస్తూనే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ గడిపారు. అసెంబ్లీలో కూడా అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చాయి. కాని రాష్ట్ర గవర్నర్ ఈ బిల్లుకు ఆమోదం తెలపలేదు. గవర్నర్ సకాలంలో ఆమోదం తెలపకపోతే ఆ బిల్లు ఓకే అయిపోయినట్లే అని కొంతకాలం క్రితం సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్య ఆధారంగా తాము 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తదుపరి జీవో ఇచ్చింది. అయినా ఎవరికి ఇది అమలు అవుతుందన్న నమ్మకం లేదు. కాని ఎవరూ దీనికి అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వచ్చారు. ఆ జీవోపై హైకోర్టులో ఊహించినట్లే స్టే వచ్చింది. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఈలోగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం మరో చిత్రం. తదుపరి హైకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది.
ఈ గేమ్‌లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా భాగస్వామి అవడం గమనించదగిన అంశమే. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదని కమిషన్‌కు తెలియదా? తీర్పు వచ్చాక మళ్లీ రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శలు కొనసాగించాయి. రిజర్వేషన్ల జీవోను బీజేపీ, బీఆర్‌ఎస్‌లే అడ్డుకున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. కాగా రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందని, దీనిని ప్రజలలో ఎండగట్టాలని బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నాయకుడు కె.చంద్రశేఖరరావు కేడర్‌కు పిలుపు ఇచ్చారు. ఇక బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరుతోనే జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిందని విమర్శించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ తీరు దురదృష్టకరం అని ఆయన అన్నారు. ఈ మూడు పార్టీలలో ఏ ఒక్కరికైనా చిత్తశుద్ది ఉందా అన్న ప్రశ్న వస్తే సమాధానం దొరకదు. ఎవరికి వారు అడ్వాంటేజ్ తమకు రావడానికే గేమ్ ఆడారు తప్ప ఇంకొకటి కాదనిపిస్తుంది.
ఈ వ్యవహారానికి ముందు ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలు జరపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందని ఆరోపించేవి. రిజర్వేషన్ల అంశంపై మాత్రం అందరూ పోటాపోటీగా 42 శాతానికి మద్దతిస్తున్నట్లు మాట్లాడేవారు. కేసీఆర్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు ప్రయత్నిస్తే రేవంత్ విమర్శించేవారని, రిజర్వేషన్ల అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం నేరమన్నారని బీఆర్‌ఎస్ ఇప్పడు గుర్తు చేస్తోంది. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక తనే రిజర్వేషన్లు పెంచడానికి రాష్ట్రానికి అధికారం ఉందన్నట్లుగా బిల్లు ఆమోదింప చేశారు. జీవో కూడా ఇచ్చేశారు. మరి ఇది చెల్లదన్న సంగతి ఆయనకు తెలియదా? అంటే ఏమి చెబుతాం? కులగణనతో చాలా మార్పులు వచ్చేస్తాయని కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ అంటూ దేశంలో పర్యటిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా ఇప్పుడు వ్యవహారం మొదటికి వచ్చినట్లయింది.
తమిళనాడులో మాదిరి షెడ్యూల్ 9 లో చేర్చితేనే రిజర్వేషన్ లకు చట్టబద్దత వస్తుందని తెలిసినా, కాంగ్రెస్ పార్టీ బీహారు ఎన్నికలలో ప్రయోజనం కోసం ఈ డ్రామా ఆడిందని మాజీ స్పీకర్, శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. అయితే తమకు ఉన్న చిత్తశుద్దిని రుజువు చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఒకవేళ హైకోర్టులో స్టే రాకపోతే స్థానిక ఎన్నికలు జరిగిపోయేవి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచిన పార్టీగా పేరు తెచ్చుకునేది. ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన విధంగా చేశామనిపించుకునేది. గతంలో కేసీఆర్ కూడా ముస్లింలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించి ప్రచారం చేశారు.. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమని ఆయనకు కూడా తెలుసు. అయినా కావాలని అప్పట్లో అలా చేశారన్నది నిష్టుర సత్యం. అలాగే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం అదే పంథాలో సాగిందని చెప్పాలి. బీజేపీ కూడా తన వంతు పాత్ర పోషించి, అటు పాము చావకుండా, ఇటు కర్ర విరగకుండా వ్యవహరించింది. కేంద్రం మీదకు నెట్టాలని కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రం మీద నెపం ఉండేలా బీజేపీ ప్రయత్నం చేశాయి.
జాతీయ పార్టీలను తప్పుపట్టి తానే బీసీలకు అనుకూలం అన్న భావన కలిగించాలని బీఆర్‌ఎస్ యత్నం.వాస్తవానికి ఈ మూడు పార్టీలు తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికి శక్తివంచన లేకుండా కృషి చేశాయానిపిస్తుంది. కాకపోతే అమాయక గ్రామీణులు కొందరు నిజంగానే ఎన్నికలు వచ్చేస్తాయనుకుని తమ చేతులు కాల్చుకున్నారట. దసరా నాడు వారికి ఎన్నికల ఖర్చు రూపేణా బాగానే చేతి చమురు వదిలిందట. ఏతావాతా ఈ రిజర్వేషన్ల అంశాన్ని రాజకీయ పార్టీలు ఒక డ్రామాగా మార్చడం దురదృష్టకరం. తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు రావాలని ఆకాంక్షిస్తున్న బీసీ వర్గాలకు మరోసారి నిరాశే ఎదురైంది.తాజాగా సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ ఇందుకు భిన్నంగా తీర్పు వస్తే ఒక చరిత్రే అవుతుంది. ఏమి జరుగుతుందో చూద్దాం.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత