
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నొక్కడమే ధ్యేయంగా ఐటీ చట్టాన్ని సవరించేందుకు కూటమి ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా, వారి సిఫార్సులు న్యాయస్థానాల్లో నిలబడవని వైఎస్సార్‌సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ, మాజీ అడిషినల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేంద్ర పరిధిలో ఉన్న ఐటీ చట్టానికి మార్పులు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండవని తెలిసీ మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడం అవివేకమైన చర్యగా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న ప్రభుత్వ చర్యలు ఎప్పటికీ నెరవేరవని గట్టిగా బదులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్ ఇన్ఫర్మేషన్‌కి చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్ అని, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీని నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి విష ప్రచారం చేశారని, ఒకవేళ కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా వారిమీదనే పెట్టాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా బీఎన్ఎస్ సెక్షన్ 111 ప్రయోగించి వారి జీవితాలను కూటమి ప్రభుత్వం నాశనం చేయాలని చూసిందని, వైఎస్ జగన్ ఆదేశాలతో న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ కృషి ఫలించి సోషల్ మీడియా కేసుల్లో 111 సెక్షన్ విధించడంపై పలుమార్లు పోలీసులకు కోర్టులు మొట్టికాయలు వేసిన విషయాన్ని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
ప్రశ్నించే గొంతు నొక్కుతున్న నియంత పాలన
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది. ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కి నియంత పాలన సాగిస్తున్నారు. ఈ 16 నెలల్లోనే సుమారు 2వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహిస్తోంది. వారి మీద అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. ఒక్కొక్కరి మీద రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారు. ఇదంతా చాలదన్నట్టు సోషల్ మీడియా కట్టడికి మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం మొదటి ప్రపంచయుద్ధంలో హిట్లర్ మాదిరిగా వ్యవహరిస్తోంది. వరుసపెట్టి ఒక్కో వర్గాన్ని ఎలాగైతే అంతం చేశాడో సీఎం చంద్రబాబు సైతం అదేవిధానాలను అవలంభించబోతున్నారు. అందులో భాగంగానే ముందుగా సోషల్ మీడియా యాక్టివిస్టుల అణచివేతకు వ్యూహరచన చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలు ఉద్యమించకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏ వర్గాన్ని ఈ ప్రభుత్వం ఊరికే వదిలిపెట్టదు. అంగన్‌వాడీలు, టీచర్లు, ఉద్యోగ సంఘాలు, కార్మికులు.. ఆఖరుకి రైతులను కూడా.. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టి వేధింస్తున్నట్టే వారినీ ఇలాగే వేధిస్తారు.
బీఎన్ఎస్ 111 సెక్షన్ పై కోర్టు మొట్టికాయలు వేసినా...
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యాక్టివిస్టుల మీద బీఎన్ఎస్ 111 సెక్షన్, పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు. ఈ కేసు రుజువైతే వారు జీవితకాలం జైలుకు పోతారని ఈ ప్రభుత్వానికి తెలియదా? మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో వైయస్సార్సీపీ లీగల్ సెల్ పోరాడితే 111 సెక్షన్ ని కోర్టులు స్వ్కాష్ చేశాయి. ప్రభుత్వానికి పలు సందర్భాల్లో మొట్టికాయలు వేసినా పోలీసుల్లో మార్పు రావడం లేదు. 2 వేల మంది మీద కేసులు పెట్టారు. యాక్టివిస్టులను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి దారుణంగా దాడి చేసి కొట్టారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే యథేచ్ఛగా చట్టాలను ఉల్లంఘిస్తున్నారు.
టీవీలో హోస్ట్‌గా ఉన్నందుకే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు మీద పోలీసులు అక్రమ కేసు బనాయించి వేధిస్తే.. నవ్వినా, మాట్లాడినా కేసులు పెడతారా అంటూ ఈ ప్రభుత్వం, పోలీసుల మీద సుప్రీంకోర్టు మండిపడింది. పాలన సరిగా లేదని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వారి మీద అక్రమ కేసులు పెడుతున్న ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగానే ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తిస్తే మంచిది. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన కూటమి నాయకులు అదే రాజ్యాంగం తమకు వర్తించదు అన్నట్టు నియంతృత్వంగా ప్రవర్తిస్తున్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు ప్రశ్నించడం అనేది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణమైన విషయం మర్చిపోతే ఎలా?
ఫేక్ ఫ్యాక్టరీని నడిపిస్తుంది చంద్రబాబే
ఫేక్ ప్రచారం చేయడంలో మొదటి దోషి చంద్రబాబు అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న రెండో ముద్దాయి ఐటీడీపీయే. ఎన్నో ఫేక్ అకౌంట్లతో ప్రతిపక్ష నాయకుడి మీద ఇప్పటికీ బురదజల్లుతూనే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద విష ప్రచారం చేశారు. అలాంటిది వీళ్లే ఇప్పుడు సోషల్ మీడియాను కట్టడి చేస్తామంటూ చట్ట సవరణకు ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉంది. నియంతృత్వ పోకడలు మరింత పెరిగిపోతే ఏపీలోనూ నేపాల్ మాదిరిగా జెన్‌జీ ఉద్యమం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పౌరుల హక్కుగా రాజ్యాంగం ఇచ్చిన చట్టాలను అపహాస్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రపంచంలో జరిగిన ఎన్నో సంఘటనలు రుజువు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్, ఆయన కుటుంబంతోపాటు పార్టీ నాయకుల మీద సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న విషప్రచారంపై ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో డీజీపీ స్థాయి అధికారి నుంచి కింది స్థాయి వరకు ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయడం లేదు. అధికార పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చట్టాలు వర్తించవా అని ప్రశ్నిస్తున్నా. వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధించడానికి ప్రయత్నిస్తున్న కూటమి ప్రభుత్వం, ఇవే కేసులు అధికార పార్టీ వారికి కూడా వర్తిస్తాయని చెప్పగలరా అని ప్రశ్నిస్తున్నా.
మీరు చేసిన తప్పుడు ప్రచారానికి కేసులు పెట్టొద్దా?
సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని సూచించడానికి మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ వాస్తవానికి ఫేక్ ఫ్యాక్టరీని నడుపుతున్నది తెలుగుదేశం పార్టీయే. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర టీడీపీ నాయకులు ఎన్నో పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన విషప్రచారం చేశాడు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే వారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అందులో ప్రథమ ముద్దాయి చంద్రబాబే అవుతాడు. 34 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ నాడు పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేశాడు. మిస్ ఇన్ఫర్మేషన్‌కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే.
వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని, రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, శ్రీలకం చేశాడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నాటి బీజేపీ అధ్యక్షురాలు పురంధరీశ్వరి పథకం ప్రకారం విషం చిమ్మారు. అమ్మాయిలు అదృశ్యమయ్యారంటూ చేసిన ప్రచారం అబద్ధమేనని ఎన్‌సీఆర్‌బీ లెక్కలతో తేలిపోయింది. అంతా ఉత్తుదేనని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లోనూ చెప్పాడు.
వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులు రూ. 3.70 లక్షల కోట్లేనని ఇటీవలే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో ప్రజల్లో భయాందోళనలు కలిగించిన కూటమి నాయకులు, అధికారంలోకి వచ్చాక అదే చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉచితంగా ఇసుక పేరుతో ప్రచారం చేసుకున్నారు. కానీ ఇప్పుడు రెట్టింపు ధర చెల్లించినా రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి నెలకొంది. విశాఖ వేదికగా వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ రాష్ట్రంలోకి వచ్చాయని తప్పుడు ప్రచారం చేశారు. అదంతా అబద్ధమేనని తేలిపోయింది. వీటన్నింటిపైనా తప్పుడు ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల మీద ఎందుకు కేసులు నమోదు చేయకూడదు?
ఐటీ యాక్ట్ కేంద్ర పరిధిలోని అంశం
సోషల్ మీడియా ఐటీ యాక్ట్ 2000 పరిధిలోకి వస్తుంది. దీనికి కేంద్రం, రాష్ట్రం, ఉమ్మడిగా మూడు వేర్వేరు చట్టాలున్నాయి. వాటి అధికారం, పరిధులు వేర్వేరుగా ఉంటాయి. ఉమ్మడి చట్టమైనా కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేయడం మినహా రాష్ట్రం మార్పులు చేయలేదు. తిరగరాయడం సాధ్యం కాదు. ఐటీ యాక్ట్ అనేది రిసిడ్యూరీ లిస్టులో ఉంటుంది. కాబట్టి కేంద్రం మాత్రమే దీనికి చట్టం చేయగలదు. దీనిలో రాష్ట్రం ఏమాత్రం కలగజేసుకోవడం సాధ్యపడదు. అయినా సోషల్ మీడియాను కట్టడి చేసే పేరుతో ప్రత్యేకంగా మంత్రులతో కమిటీని ఏర్పాటు చేయడమంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశం పరిధిలో లేదని చంద్రబాబు అనుకుంటున్నారా? మాకొక ప్రత్యేక రాజ్యాంగం ఉందని ఆయన చెప్పదలుచుకున్నారా? అయినా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లడం చూస్తుంటే వారిది అవివేకం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అర్థం కావడం లేదు. కోర్టుల ముందు ఇలాంటి చట్టాలు నిలబడవని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
సోషల్ మీడియా పోస్టులు, కట్టడికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించి నవంబర్ లోపు కోర్టు ముందు ఉంచాలని మార్చి 25న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఐటీ యాక్ట్ కేంద్రం పరిధిలో ఉంది కాబట్టే నేరుగా సుప్రీంకోర్టు కేంద్రానికి సూచనలు చేస్తే, అందులో రాష్ట్ర ప్రభుత్వం తగుదునమ్మా అని ఎలా దూరిపోతుంది? రెసిడ్యూరీ లిస్టులో ఉన్న ఐటీ యాక్టుకి పార్లమెంట్‌లో మాత్రమే చట్టం చేయడానికి వీలుపడుతుందే తప్ప, ఇందులో ఏ రాష్ట్ర అసెంబ్లీలు కలుగజేసుకోలేవు. ఐటీ యాక్టులో ఇప్పటికే చట్టాలున్నప్పుడు వీరు కొత్తగా ఏం తీసుకొస్తారో అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీలో ఏ ఒక్కరూ లా అండ్ జస్టిస్‌కి సంబంధించిన మంత్రి లేకపోవడం ఇక్కడ మరీ విచిత్రంగా ఉంది. ఐటీ యాక్టుని నిర్దేశించేది గృహ నిర్మాణం, సివిల్ సప్లయిస్, వైద్యారోగ్య శాఖకు చెందిన మంత్రులా అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.