ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో! | KSR Comments On Phone Tapping Case Filled With Twists And How It Turns Into Political Drama, More Details | Sakshi
Sakshi News home page

ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో!

Jan 31 2026 10:56 AM | Updated on Jan 31 2026 11:08 AM

KSR Comment: Phone Tapping Case Filled With Twists

తెలంగాణాలో ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణ తీరు ఒక డ్రామాగా మారిపోతోంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుతున్నట్లుగా ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ అనేది సమర్థనీయం కాదు కానీ.. ఇది బీఆర్‌ఎస్‌ పాలనలో మాత్రమే జరిగిందన్నట్టుగా వ్యవహరించడం సమస్యకు మూలమవుతోంది. ట్యాపింగ్‌ గుట్టు పోలీస్‌ అధికారులందరికీ తెలిసిన విషయమే. సంఘ విద్రోహశక్తుల విషయంలో టెలిఫోన్‌ ట్యాపింగ్‌ వాడటం అన్నది చాలాకాలంగా జరుగుతున్నదే. ఇందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. అయితే కొందరు రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు దుర్వినియోగం చేస్తున్నారన్నది అభియోగం. 

ఆసక్తికరంగా ఈ పని చేసేది కూడా పోలీసు అధికారుల పర్యవేక్షణలోనే. ప్రభుత్వం ఏదైనా, ముఖ్యమంత్రి, కీలక మంత్రి ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్‌ చేయాలని కోరితే అధికారులు ఎందుకు నిరాకరించడం లేదు? లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని అడుగుతున్నారా? ఇలాంటి సందేహాలు సామాన్యులకు రావచ్చు. అధికారంలో ఉన్న  రాజకీయ నేతలను  ప్రసన్నం చేసుకునే పనిలో ఉండే పోలీసు అధికారులకు అలాంటి ఆలోచనలు రాకపోవడమే బాధాకరం. 

తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కొందరు మాజీ పోలీసు అధికారులు కూడా అరెస్టు అయ్యారు. మాజీ మంత్రులు  హరీశ్‌రావు, తారక రామారావు, మాజీ ఎంపీ సంతోష్ తదితరులు విచారణకు హాజరయ్యారు కూడా. తాజాగా సిట్ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా నోటీసు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరో తేదీ నిర్ణయించాలని ఆయన కోరారు. అలాగే హైదరాబాద్‌లోని నందినగర్ లో కాకుండా ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో విచారణ చేయాలన్న కేసీఆర్‌ విజ్ఞప్తిని సిట్ అధికారులు తోసిపుచ్చారు. ఈ కేసులో ఎన్ని ట్విస్టులు ఉంటాయో చూడాల్సిందే. 

కేటీఆర్‌ను పోలీసు అధికారులు అడిగిన కొన్ని కీలకమైన ప్రశ్నలలో బీఆర్‌ఎస్‌కు కోట్ల రూపాయల ఎన్నికల బాండ్లు ఎలా వచ్చాయి అన్నది కూడా ఉంది. నిజానికి ఈ ప్రశ్న వేయడం వల్ల వచ్చే కొత్త సమాచారం ఏమీ ఉండదు. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి బెదిరించారా? అని అడిగితే  ఎవరైనా అవునని చెబుతారా? బెదిరించడం వల్లే కోట్ల రూపాయల విరాళాలు వస్తున్నాయని అనుకుంటే, మిగిలిన రాజకీయ పక్షాలకు ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు కూడా అది వర్తిస్తుంది కదా!. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా రూ.6,000 కోట్ల విరాళాలు ఎలా వచ్చాయి? కాంగ్రెస్ పార్టీకి రూ.900 కోట్లు మాత్రమే ఎందుకు వచ్చాయని అడిగితే జవాబు ఏమి ఉంటుంది?  నిజంగానే ఎవరినైనా బెదిరించి విరాళం పొందితే వారు పోలీసులకు ఫిర్యాదు చేయకపోతే అది కేసు అవ్వడం కష్టం కదా! ఒక వేళ చేసినా వాటిని రుజవు చేయడం అంత తేలిక కాకపోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే ఈ విధంగా విరాళాలు తీసుకోవడంలోనే లోపం ఉంది. ఆ పద్ధతిని మార్చే అధికారం పోలీసులకు ఉండదు! ఫోన్‌ చేసి మాట్లాడితే బెదిరింపు అవుతుందా అన్నది ఒక ప్రశ్న. 

ఏపీలో తెలుగుదేశం మీడియా.. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సంబంధించిన వారి సంస్థ అని ఒక కంపెనీపై పలు వ్యతిరేక కథనాలు ఇచ్చేది. కాని ఆ సంస్థ అప్పట్లో విపక్షంలో ఉన్న టీడీపీకి సుమారు రూ.40 కోట్ల విరాళం ఇచ్చింది. అదెలా జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక ఆ కంపెనీకి యథాప్రకారం ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తోంది. టీడీపీ మీడియా ఆ కంపెనీపై నెగిటివ్ వార్తలు రాయడం నిలిపివేసింది. మరి ఇందులో మతలబు ఏంటి? అందుకే బీజేపీ, కాంగ్రెస్‌, టీడీపీలకు వచ్చిన విరాళాల మాటేమిటి అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 

అధికారంలో ఉన్న వారెవ్వరూ ఫోన్ ట్యాపింగ్‌కు లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వరు. నమ్మకంగా ఉండే అధికారులతో అనధికారికంగా జరుగుతుంటాయి. ఫోన్ ట్యాపింగ్‌ వల్ల సంచలన  విషయాలు బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2015లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేయడానికి ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేకి రూ.ఏభై లక్షలు ఇచ్చారన్న అభియోగాలు వచ్చాయి. ఈ ఉదంతం బయటపడడానికి, అప్పట్లో విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఆ కొనుగోలు లావాదేవీకి భరోసా ఇస్తూ ‘‘మనవాళ్లు భ్రీఫ్డ్‌ మీ’’ అని  ఫోన్ చేసిన ఆడియో టేప్ బయటకు రావడానికి ఫోన్ ట్యాపింగ్‌ కూడా కారణం కావచ్చు. ఈ కేసులో ఫోన్‌ ట్యాపింగ్‌ను సమర్థించాలా? వ్యతిరేకించాలా? అయితే చంద్రబాబు నాయుడు తనపై కేసు రాకుండా చేసుకోవడానికి కేసీఆర్‌పై ఏపీలో ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎదురు  కేసులు పెట్టి హడావుడి చేశారు. చివరికి బీజేపీ పెద్దలు కొందరు రాజీ చేశారు. ఆ కేసు ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు పలుమార్లు ఉన్నా నిందితుడుగా నమోదు కాలేదు. మరి పోలీసు అధికారులు దీన్నెలా సమర్ధించుకుంటారు? అంటే అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు తప్ప నిబధనల ప్రకారం కాదని అర్థం అవుతుంది కదా!. 

ప్రస్తుతం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును టేకప్ చేసింది. ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేశారన్న కారణంతోనే రేవంత్ కక్ష కట్టి ఇలా చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ విమర్శిస్తోంది. కేటీఆర్‌ వేసిన కొన్ని ప్రశ్నలు ఆసక్తికరమైనవని. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్లు ట్యాప్‌ కావడం లేదా అని ఆయన అడిగారు. కొందరు మంత్రులే తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని ప్రకటించారని కేటీఆర్‌ చెప్పారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కొందరు సినీ హీరోయిన్ల ఫోన్లు ట్యాప్‌ చేశానని లీక్ ఇచ్చారని, ఆ తర్వాత పోలీసులే అలాంటిది లేదని ఎలా తెలిపారని ఆయన ప్రశ్నించారు. 

ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించి గత చరిత్ర చూస్తే 1988లో కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ఈ ఆరోపణలపై రాజీనామా చేశారు. ఆ తర్వాత ఎవరిపై అభియోగాలు వచ్చినా ఏమీ కాలేదు. కాకపోతే కొన్నాళ్లు రాజకీయ దుమారం సాగుతుంటుంది. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రభుత్వం ఆనాటి విపక్ష నేత సిద్దరామయ్యతో సహా పలువురి ఫోన్లు ట్యాప్‌ చేసిందన్న విమర్శలు వచ్చాయి. అలాగే మరో సీఎం కుమారస్వామి తమ  ఫోన్లు ట్యాప్‌ చేయించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆరోపించారు. తాజాగా కర్ణాట గవర్నర్ ఫోన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్‌ చేస్తోందంటూ విపక్ష బీజేపీ ఆరోపించింది. దీనిపై కర్ణాటక శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. తమిళనాడులో ఎంజీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన మంత్రివర్గ సభ్యులపై నిఘా పెట్టడానికి అధికారులతో సంప్రదింపులు జరిపారట. కేంద్ర ప్రభుత్వంపై కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి జ్ఞాని జైల్‌సింగ్‌తో విబేధాలు వచ్చినప్పుడు ఫోన్ బగ్గింగ్ జరిగిందన్న అనుమానాులు ఉన్నాయని అప్పట్లో కీలకంగా పనిచేసిన ఒక అధికారి తన పుస్తకంలో రాశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తదితర కొన్ని జాతీయ పత్రికలలో వచ్చిన వ్యాసాలు చదవితే టాపింగ్, బగ్గింగ్‌కు సంబంధించిన పలు విశేషాలు కనిపిస్తాయి. ప్రధానిగా చంద్రశేఖర్ ఉన్నప్పుడు ఆయన కార్యాలయంలోనే బగ్గింగ్ జరిగిందన్న ప్రచారం కూడా ఉందట. 

ఏపీలో 23 మంది ఎమ్మెల్యేల కొనుగోలులో ఒక సీనియర్ పోలీసు అధికారి పాత్రపై పలు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్‌ చేస్తోందంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు కూడా వెళ్లారు. కాగా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయంటూ టీడీపీ మీడియా ఒక పచ్చి అబద్ధపు కథనాన్ని సృష్టించింది. దానిపై ఏ విచారణ అయినా చేసుకోవచ్చని జగన్ ప్రభుత్వం హైకోర్టుకు తెలపడం విశేషం. ఆ తర్వాత ఆ కేసు  మందుకు వెళ్లినట్లు లేదు. ఇంత ధైర్యంగా చెప్పిన ప్రభుత్వం జగన్‌దే కావచ్చు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అంటున్నారు. అది ఆయన బీఆర్‌ఎస్‌పై కోపంతో అన్నారా? లేక నిజంగానే  ఆధారాలు ఉన్నాయో తెలియదు. అది కరెక్టయితే తన చేతిలో ఉన్న హోం శాఖ ద్వారా ఎందుకు చేయించలేదన్న  ప్రశ్న వస్తుంది. ఫోన్ ట్యాపింగ్‌ అన్నది అధికారంలో ఉన్నవారికి ఒక ఆయుధంగా మారకుండా చేయగలిగితే మంచి విషయమే అవుతుంది. 

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement