
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై జనసేన అధ్యక్షుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనపరుస్తున్న విధేయత, విశ్వాసం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన పరువును సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానని పలుమార్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు చంద్రబాబు వరుస తప్పులపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం జనసేన కార్యకర్తలు, ఎమ్మెల్యేలందరిని నిశ్చేష్టులను చేస్తోంది. ఎమ్మెల్యేలు, కార్యకర్తల్లో ప్రభుత్వ తీరుపట్ల, టీడీపీ తమను తక్కువ చేసి చూస్తున్న వైనంపై తీవ్రమైన అసంతృప్తి నెలకొని ఉంది. అయితే అధినేతే కిక్కురుమనకుండా ఉండటంతో వీరు కూడా నోరె మెదపలేని పరిస్థితి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి సంతృప్తిగా ఉన్నారన్నది విశ్లేషకుల వ్యాఖ్య.
చంద్రబాబు ద్వారా తనకు అందుతున్న సౌకర్యాలకు అలవాటుపడిన పవన్ తన ప్రతిష్టను పణంగా పెట్టి మరీ ప్రశ్నించకుండా ఉంటున్నారని ఆయనను దగ్గరగా చూసిన ఒక ప్రముఖు జర్నలిస్టు వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి కేసు అంశంలో పవన్ కళ్యాణ్ మాటమార్చిన వైనం, ఆ బాలిక తల్లి పార్వతీ బాయినే పరోక్షంగా విమర్శిస్తున్న తీరు చూసిన ప్రజటు ముక్కున వేలేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్‌లో మస్తు షేడ్స్ ఉన్నాయని, ఎప్పుడు ఏమాటైనా అనగల సమర్థుడని, చంద్రబాబును మించి అబద్దాలు ఆడగలరని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది. ఎన్నికలకు ముందు పవన్ సుగాలి ప్రీతి తల్లి ఇంటికి వెళ్లి ఆడిన డ్రామా అంత ఇంత కాదు. రెండు లక్షల మందితో కలిసి తాను సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించానని చెప్పుకుని ఎన్నికల ప్రచారం చేసుకున్న ఆయన ప్రస్తుతం తానేమీ చేయలేనని చేతులెత్తేశారు.
ఇక్కడ కూడా చంద్రబాబుపై ఈగ వాలకుండా మాట్లాడి, మొత్తం నెపాన్ని అంతటిని గత ముఖ్యమంత్రి జగన్‌పై నెట్టేసి తన అసలు రంగు బయటపెట్టుకున్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయి. అయినా ఏ పార్టీకి ఆ పార్టీ ఒక వ్యక్తిత్వం, కొన్ని విధానాలు కలిగి ఉంటుంది. ఆ పార్టీ అధినేతను పొత్తులోని ఇతర పార్టీల నేతలు గౌరవప్రదంగా చూసే పరిస్థితి ఉంటుంది. వాటన్నిటికి పవన్ తిలోదకాలు ఇచ్చేశారు. ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరుగుతుంటే అవసరమైతే ప్రశ్నిస్తుంటారు. కాని పవన్ వాటన్నిటిని వదలివేశారని ఆ పార్టీవారే చెబుతున్నారు. టీడీపీ వారు సైతం ఇది తమ జేబులో ఉండే పార్టీ అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జనసేన క్యాడరే వాపోతోంది.
2017 ఆగస్టులో సుగాలి ప్రీతిపై కొందరు నీచులు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. అప్పుడు అధికారంలో ఉన్నది పవన్ మద్దతిచ్చిన టీడీపీనే. చంద్రబాబు సీఎం. ఈ కేసులో కొందరు నిందితులను అరెస్టు చేసినా, వారికి 23 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఆ సమయంలోనే డీఎన్‌ఏ శాంపిల్స్ కలవలేదన్న నివేదిక కూడా వచ్చింది. అంటే తప్పు చంద్రబాబు ప్రభుత్వానిదే కదా? అయినా పవన్ కళ్యాణ్ ఆ అంశం ప్రస్తావించరు. తమ ఒత్తిడి వల్ల ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఒకరికి ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నారు. అది జగన్ ప్రభుత్వం ఇచ్చిందన్న సంగతిని మరుగుపరచి తమ వల్లే లభించిందని క్రెడిట్ పొందే యత్నం చేశారు. పోనీ అంతటితో ఆగారా? జగన్‌పై విమర్శలు చేశారు. ఆ రోజుల్లో జగన్ ప్రభుత్వం ఎవరిని మాట్లాడనివ్వలేదట.స్వేచ్చ లేదట. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతీ కుటుంబాన్ని పలకరించడానికి ఈయన తానే రెండు లక్షల మందితో ఎలా వెళ్లగలిగారు? జగన్‌ను నోటికి వచ్చినట్లు ఎలా దూషించగలిగారు? ఈ అంశాన్నే కాదు.
30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని, వారిని వలంటీర్లు కిడ్నాప్ చేశారని కేంద్రం నుంచి తనకు సమాచారం వచ్చిందని ఎలా చెప్పగలిగారు? ఇంకో ఎన్నో అనుచిత భాషణలు చేసిన పవన్‌పై ఆ రోజుల్లో ఒక్క కేసు కూడా పెట్టలేదు. అదే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పడితే అలా కేసులు పెట్టి వైఎస్సార్‌సీపీ వారినే కాకుండా అనలిస్టులను, జర్నలిస్టులను కూడా వేధిస్తూంటే ఇది మాత్రం పవన్ కు స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు పాలన సమయంలో సుగాలి ప్రీతి హత్య కేసు జరిగిందని మాట మాత్రం అనలేకపోవడమే విడ్డూరం. చంద్రబాబుపై ఈగ వాలినా సహించలేని స్థితికి పవన్ చేరుకున్నారు అన్నమాట. ప్రత్యేక విమానాలలో తిరగడం, తన శాఖలను గాలికి వదలి సినిమా షూటింగ్‌లలో పాల్గొనడం, పవన్ సినిమా ప్రమోషన్లు చేసుకున్నా చంద్రబాబు ఒక్క మాట అనకపోవడం వంటి సౌకర్యాల కారణంగానే పవన్ నోరు విప్పడం లేదని పలువురు భావిస్తున్నారు. 2014 టర్మ్‌లో అప్పుడప్పుడైనా పవన్ ప్రశ్నించినట్లు కనిపించేవారు.
ఆ వెంటనే ఏ కామినేని శ్రీనివాస్ వంటివారో వచ్చి పవన్‌ను స్పెషల్ ఫ్లైట్ లో చంద్రబాబు వద్దకు తీసుకుని వెళ్లేవారు. ఆ తర్వాత ఏదో సర్దుబాటు చేసుకునేవారు. కొన్నిసార్లు హైదరాబాద్‌లో చంద్రబాబు ఇంటిలో కూర్చుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ప్రశ్నలు ఆగిపోయేవి. ఇప్పుడు జనసేన కూడా అధికారంలో భాగస్వామి. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానీ పదవే పరమాన్నంగా మారిపోయింది. తమకు అవమానాలు జరుగుతున్నాయని పార్టీ సమావేశంలో పలువురు కార్యకర్తలు వాపోయినా, పవన్ వారిని బుజ్జగించారే తప్ప అలా జరగకుండా చూస్తానని గట్టి హమీ ఇవ్వలేదు.పైగా కింది స్థాయిలో సర్దుకు పోలేకపోవడం వారి అసమర్థత అన్నట్లుగా కూడా మాట్లాడారు.
చంద్రబాబుతో తాను మాట్లాడతానని అన్నప్పటికీ ఈ పరిస్థితిలో ఎంత న్యాయం జరుగుతుందోనని జనసేన కార్యకర్తలు సంశయంతోనే ఉన్నారు. ఇంతకీ సుగాలి ప్రీతి కుటుంబానికి ఆర్థిక సాయం ఇవ్వాలని పవన్ ఆ రోజుల్లో డిమాండ్ చేశారా? లేక కేసులో నిందితులకు శిక్ష పడాలని కోరారా? డబ్బు ఇచ్చేస్తే కేసు క్లోజ్ చేయవచ్చని ఇప్పుడు భావిస్తున్నారా? తానేమీ చేయలేనని చేతులెత్తేయడం ద్వారా తనేమిటో ప్రజలకు అర్ధం అయ్యేలా ఆయనే చేసుకున్నారన్న భావన కలుగుతుంది. సినిమాలలోనే కాదు. రాజకీయాలలోనూ నటించి, అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన విషయాన్ని పవన్ కళ్యాణ్ అంగీకరిస్తున్నట్లు అనిపించడం లేదూ!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత