పాలన నిరంతర ప్రక్రియ. పార్టీలు మారవచ్చేమో కాని, ప్రభుత్వ వ్యవస్థలు నిరంతరం కొనసాగుతూంటాయి. అయితే ఏ ప్రభుత్వమైనా అమలు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. కాకపోతే గత ప్రభుత్వంలో అమలు చేసినవాటిని కూడా తమ ఘనతగా చెప్పుకోవడం.. ప్రచారం చేసుకోవడం నగుబాటుకు దారితీసే అవకాశాలే ఎక్కువ. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్నది అదే. చంద్రబాబు క్రెడిట్ చోరీ గురించి మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ఇప్పటికే చాలాసార్లు విమర్శించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఇందులో వాస్తవమూ లేకపోలేదు.
ఇతరుల శ్రమను తనదిగా చెప్పుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యే. ఎదుటివారు నమ్ముతారా? లేదా? అన్న పట్టింపు కూడా అస్సలు ఉండదు. అన్నమయ్య జిల్లాలో ఇటీవలి ఘటననే ఉదాహరణగా తీసుకుందాం. పేదల కోసం నిర్మించిన ఇళ్ల ఆవిష్కరణ ఇది. బోలెడంత ఖర్చు చేసి దీనిపై ప్రకటనలూ గుప్పించారు. కానీ.. ఈ ఇళ్లన్నీ 2024 తరువాత నిర్మించినట్టుగా చెప్పుకోవడంతో చిక్కు వచ్చిపడింది. గత ప్రభుత్వం మంజూరు చేసి, కొంతమేర పూర్తి చేసిన ఇళ్లను తాము పూర్తి చేశామని చెప్పి సరిపోయేదేమో కానీ.. అంతా తమ ఘనతేనని చెప్పుకోవడంతో పూర్వాపరాలపై ఆరాదీయాల్సి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యాక పేదలెవరికి ఇంటి స్థలం ఇచ్చినట్లుకాని, కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లుగాని లేదు.
దీంతో అంతలోనే మూడు లక్షల ఇళ్లు ఎలా పూర్తి చేశారన్న సందేహం వచ్చింది. రికార్డులు పరిశీలిస్తే చంద్రబాబు క్రెడిట్ చోరీ వ్యవహారం తెలిసింది. ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు పరిశీలిస్తే అందరికీ 2021-22లోనే స్థల కేటాయింపు, నిర్మాణ వ్యయం మంజూరీలు జరిగినట్లు స్పష్టంగా ఉంది. అప్పట్లో జగన్ ఇచ్చిన సెంటు భూమి శవం పూడ్చేందుకు సరిపోతుందని ఇదే చంద్రబాబు విమర్శించిన విషయం ప్రజలకు గుర్తుండే ఉంటుంది.
తాను అధికారంలోకి వస్తే మూడు సెంట్లు ఇస్తానని చెప్పి... క్రెడిట్ చోరీకి మాత్రమే పరిమితమైపోయారు. ఇదే కార్యక్రమంలో ఒక అధికారి సీఎంను ఆకాశానికి ఎత్తేశారు. దేవుడితోనూ పోల్చారు. మరీ అంత స్వామి భక్తా? అని ముక్కున వేలేసుకోవడం ప్రజలవంతైంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ మొత్తమ్మీద 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పది లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలూ జరిగిపోయాయి. ఇవే జగనన్న కాలనీలు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేరును ఎన్టీఆర్ కాలనీలుగా మార్చారు. అంతే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబును నాటకాల రాయుడు అంటూ జగన్ ఎద్దేవ చేశారు.
రాష్ట్రానికి తెచ్చిన కంపెనీల విషయంలోనూ బాబు సర్కారు క్రెడిట్ చోరీకి పాల్పడిందన్న విమర్శలున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది కానీ.. ప్రజల్లో నవ్వులపాలవడంతో వాయిదా వేసుకుంది. పైగా... జగన్ హయాంలో పరిశ్రమలే రాలేదని, ఉన్నవాటిని తరిమేసిందంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌లు తప్పుడు ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక అవే అబద్ధాలు వల్లెవేస్తున్నారు.
సంప్రదాయేతర ఇంధన వరుల రంగంలో ఆంధ్రప్రదేశ్ భారీగా పెట్టుబడులు ఆకర్శిస్తోందంటూ మంత్రి లోకేశ్ ఇటీవల ఎక్స్ వేదికగా పంచుకున్నది కూడా జగన్ హయాంలో జరిగిన విశాఖ సమ్మిట్‌లో తెచ్చిన ప్రతిపాదనే. అప్పటి ప్రభుత్వం శ్రీసత్యసాయి జిల్లాలో భూమి కేటాయిస్తే కూటమి ప్రభుత్వం కర్నూలు జిల్లాకు తరలించి అదేదో కొత్త ప్రాజెక్టు అన్న కలరింగ్ ఇస్తోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యాఖ్యలు వచ్చాయి. విశాఖలో అదాని డేటా సెంటర్ విషయంలోనూ ఇదే జరిగింది. గూగుల్ డేటా సెంటర్ అన్నట్లుగా ప్రచారం చేసుకున్నారు. అందువల్లనేమో అదాని కూడా ఒక ఆంగ్ల పత్రికలో వ్యాసం రాస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి ఆదాని డేటా సెంటర్ క్రెడిట్ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
అప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేసిందన్న విమర్శ వచ్చింది. గతాన్ని తరచి చూస్తే.... హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ ఎయిర్ పోర్టు తదితర అభివృద్ది కార్యక్రమాలు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సాగాయి. కొన్ని ఆయన టైమ్‌లోనే పూర్తి అయ్యాయి. కాని అవన్ని తనవల్లేనని చంద్రబాబు క్రెడిట్ తీసుకునే యత్నం చేశారు. చివరికి హైదరాబాద్‌లో పాతబస్తీ ముస్లింలను కోటీశ్వరులను చేశానని, హైదరాబాద్ బిర్యానిని, ముత్యాలను తానే పాపులర్ చేశానని.. చెప్పుకోవడం ఆయనకే చెల్లింది.
నిజాం నవాబు ప్రపంచంలోనే అత్యంత ధనికులలో ఒకరని, హైదరాబాద్‌లో కోటీశ్వరులకు ఎన్నడూ కొరత లేదన్న ఓ యూట్యూబర్ సమాధానమైనా చంద్రబాబు కళ్లు తెరిపించిందేమో తెలియదు! అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేయడం కూడా తన పనే అని చెబుతుంటారు. విశేషం ఏమిటంటే ఆదాని డేటా సెంటర్ క్రెడిట్ అణు పరీక్షల్లో కీలక భూమిక పోషించిన కలాం అప్పటికే సుప్రసిద్ధుడు. వాజ్ పేయి వంటి నేతలకు సన్నిహితుడు. అయినా ఆ క్రెడిట్ కూడా తనదేనన్న భ్రమ కల్పించడానికి చంద్రబాబు యత్నించారని ఆ రోజుల్లో వ్యాఖ్యలు వచ్చాయి.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


