ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటీకరణ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రైవేటు వారికి రాసివ్వడానికి కూటమి ప్రభుత్వం భూమిక సిద్ధం చేస్తోంది. ఇందుకు ఎల్లోమీడియా ఈనాడు విషపూరిత కథనాల ప్రచురణతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడింది.
‘అభివృద్ది కోసమే పీపీపీ’ అంటూ ఇటీవల ప్రచురించిన కథనం ఈ కోవలోనిదే. వీటి ప్రకారం.. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలతోపాటు పోర్టులు తదితర ప్రాజెక్టులు కూడా ప్రైవేటుపరం కానున్నాయి. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి కేటాయిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’’ అనిపించకతప్పదు. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పనంగా ప్రజల సొమ్ము అప్పగించి వారి సంపద పెంచే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోండటం గమనార్హం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే ఈనాడు ఇలాంటి కథనం ప్రచురించడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కూడా సొంతంగా వైద్యకళాశాలలను నిర్మిస్తుంటే.. చత్తీస్‌గఢ్‌లోనూ ప్రభుత్వమే కళాశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం అన్ని వసతులూ సమకూర్చి సిద్ధం చేసిన కాలేజీలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తారట.
దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని కాపాడగల వైద్యకళాశాలకు రూ.5,000 కోట్లు కేటాయించలేక... రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగిస్తారన్న మాట. అన్నీ సిద్ధంగా ఉన్న కాలేజీలకు టెండర్లు పిలిస్తే అది ప్రభుత్వ సమర్థత అని పొగిడే స్థాయికి ఈనాడు దిగజారిపోయింది. పైగా పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే వైద్యకళాశాలలను కట్టడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతని కూడా నిస్సిగ్గుగా రాసుకుంది ఈనాడు. అలాగే రాష్ట్ర వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేయగల సామర్థ్యమున్న పోర్టుల నిర్మాణంపై కూడా ఈనాడు జగన్ ప్రభుత్వంపై ఆడిపోసుకుంది. ప్రైవేటు వారికి అప్పగించడాన్ని సమర్థతగా చెబుతోంది.
ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన తరువాత రాష్ట్రాన్ని మౌలిక వసతుల సమస్య వేధిస్తోందని ఈనాడు రాసింది. మరి... మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామ, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రుల బాగుచేత వంటివన్నీ మౌలిక వసుతులు ఎలా కాకుండా పోయాయో కూడా ఈనాడు వివరించి ఉండాల్సింది. రిషికొండపై జగన్ రూ.250 కోట్లతో సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఒక ఆస్తిని సమకూరిస్తే దాన్ని ప్రైవేటువారికి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆత్మవంచన చేసుకుంటోంది.
కేంద్ర ప్రభుత్వం పీపీపీ కింద ప్రాజెక్టుల చేపట్టడానికి ప్రతిపాదనలు అడిగితే ఏపీ రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కోరిందట. విచిత్రంగా ఈ జాబితాలో ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన మూలపేట, రామాయంపేట పోర్టులు ఉన్నాయి. రామాయంపేట పోర్టులో ఒక బెర్త్ పూర్తయ్యేదశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని నిలిపేసింది.
తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, నాగార్జునసాగర్, కుప్పం, అమరావతి ఎయిర్ పోర్టులు పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయానికి విమానాలే రాని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలకు ఎవరు వస్తారు? విశాఖ, విజయవాడ విమానాశ్రయాలే నష్టాలలో ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలకు ఆశపడి మాత్రమే ఎవరైనా ఈ చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు కట్టేందుకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలను ఎగవేసినా అడిగేవారు ఉంటారా?అన్నది సందేహం. దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందో అందరికి తెలిసిందే.
తెలుగుదేశం, బీజేపీలకు చెందిన కొందరు ప్రముఖులు వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి హాపీగా పదవులలో ఉంటున్నారు కదా! ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అమలైతే ఆ జాబితాలోకి మరింత మంది చేరవచ్చేమో! వీటితోపాటు అప్పర్ సీలేర్‌లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి పరషరా పథకం ప్రైవేటువారికి అప్పగిస్తారట. వారు ఈ స్కీమ్‌ను అమలు చేశాక డబ్బులు తిరిగి రాబట్టడం కోసం ఎంత వసూలు చేస్తారో తెలియదు.
అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, తిరుపతి క్రీడా ప్రాంగణం, తిరుపతి బస్టాండ్ మొదలైనవి ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నట్టు ఈనాడు తన కథనంలో చెప్పింది. వీటన్నిటిలో ఒకటి అరా ఏమైనా పూర్తి అవుతాయేమో చెప్పలేం. ఏ ప్రైవేటు వ్యక్తి తన సొంత డబ్బు వినియోగించి ప్రజలకు సేవ చేయడు. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులలో అధిక శాతం బ్యాంకు రుణాల రూపంలోనే తీసుకుంటారు. ఎటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ సొమ్ము వస్తుంది. అయినా నడపలేక చేతులెత్తేస్తే చేసేదేమీ ఉండదు. బాగా నడిచేవి ఉంటే అవన్ని ప్రైవేటు వారికి సొంత ఆస్తులుగా మారతాయి. పైగా వాటిని వినియోగించేవారి నుంచి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తారు. రోడ్లకు, పేదవాడికి ఉపయోగపడే వైద్యకళాశాలలకు తేడా లేకుండా ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది.
గతంలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లోనే వాటిలో అధిక భాగం మూతపడడమో, లేక ప్రైవేటు వ్యక్తుల పరమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే, వాటిలో అధిక భాగం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి వారికి సంపద తెచ్చిపెట్టాయి. స్థూలంగా చూస్తే లాభాలు వస్తే ప్రైవేటుకు, నష్టాలు వస్తే ప్రభుత్వానికి అన్నమాట. ఇదే అభివృద్ది అని జనం మోసపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ ప్రక్రియ మళ్లీ మొదలవుతోందా!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


