ఎవరన్నారు ర్యాగింగ్, ట్రోలింగ్‌లు.. కాలేజీలు, సోషల్ మీడియాలకు మాత్రమే పరిమితమని? రాజకీయాల్లోనూ వీర ర్యాగింగ్ చేయవచ్చు. కావాలంటే వైఎస్ జగన్ తాజా ప్రెస్‌మీట్ చూడండి!. కాలేజీలలో ర్యాగింగ్ నిషిద్ధం కానీ రాజకీయాలలో ప్రత్యర్థులను సమర్థంగా ఇరుకున పెట్టగలిగే ర్యాగింగ్‌పై అడ్డంకులేవీ లేవు. రఫ్ఫా రఫ్పా అన్న సినిమా డైలాగును ఫ్లెక్సీల్లో పెడితే ఏపీ పోలీసులు కేసులు పెట్టగలరేమో కానీ.. ఈటెల్లాంటి మాటలతో దాడి చేసే రాజకీయ ప్రత్యర్థులను బిత్తరపోయేలా రఫ్పాడిస్తే ఎవరైనా ఏం చేయగలరు చెప్పండి?.
వైఎస్ జగన్ ర్యాగింగ్‌కు తెలుగుదేశం పార్టీ కాని, ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ సమాధానం చెప్పలేని స్థితిలో పడ్డారు. దీంతో ఏవేవో అర్థం పర్థం లేని విమర్శలు చేశారు. మరి కొందరు పిచ్చి వ్యాఖ్యలు చేసి సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైఎస్ జగన్ వాదనతో బిత్తరపోయిన ఎల్లో మీడియా సహజంగానే దాన్ని తక్కువ చేసేందుకు, వక్రీకరించేందుకు అన్ని శక్తులూ ఒడ్డింది. ఇదంతా వారి ఉడుకుమోతు తనానికి నిదర్శనం అనుకోవాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర మీడియా సంస్థలు ఎంతసేపూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎలా కాపాడాలన్న ధోరణితో తప్ప, నిజానిజాలపై దృష్టి పెట్టడం మానేశాయి. జగన్‌పై రాస్తున్న ఏడుపుగొట్టు కథనాలే అందుకు నిదర్శనం.
జగన్ ర్యాగింగ్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే..
మొట్టమొదట అరటి రైతుల సమస్యల గురించి.. అరటి, మిర్చి, తదితర ఉద్యాన పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడుతున్న విషయాన్ని కూటమి ప్రభుత్వం పంటల బీమా సదుపాయాలు లేకుండా చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు దీనికి సమాధానం ఇవ్వలేదు. ‘‘సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎక్కడ అమలు చేశారు?’’ అని అడుగుతూ అది సూపర్ మోసం అని, చంద్రబాబుపై చీటింగ్ కేసుపెట్టాలని జగన్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు అమలుపై నిలదీశారు. అమలు చేసినట్లు చెప్పుకుంటున్న కొన్ని హామీలలోని డొల్లతనాన్ని, ఏడాది కాలం ఎగవేసిన వైనాన్ని కూడా ఎండగట్టారు. ఆయా స్కీములలో ఎగవేతల ద్వారా కూటమి సర్కార్ ప్రజలకు ఎంతెంత బాకీ పడింది లెక్కలు చెప్పారు. వీటికి కూడా టీడీపీ నుంచి నేరుగా జవాబు రాలేదు. కూటమి తన మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎలా హుళ్లక్కి చేసింది జగన్ సోదాహరణంగా వివరించారు. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు అడక్కుండా, ప్రైవేటు కంపెనీ కోసం టీడీపీ ఎంపీలు గనులు మంజూరు చేయడం గురించి అడగడంపై ఆయన మండిపడ్డారు. వీటన్నిటిపై తన ప్రశ్నల పరంపరతో చంద్రబాబును రాజకీయంగా జగన్ మాస్ ర్యాగింగ్ చేశారని చెప్పాలి. అయితే ఇది ఆరోగ్యకరమైన ర్యాగింగ్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ఉన్న అవకాశం.
చంద్రబాబు సత్యాసత్యాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థులపై బురద చల్లుతుంటారు. జగన్ అలా కాకుండా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్‌తో మాట్లాడుతుంటే టీడీపీ, జనసేన, బీజేపీలకి ముచ్చెమటలు పట్టి ఉంటాయనడంలో సందేహం లేదు. తిరుమల లడ్డూ ప్రసాదం, పరకామణి కేసుల గురించి జగన్ చెప్పిన విషయాలు వింటే ఎవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది. లడ్డూ ప్రసాదంపై నిరాధార నిందలేసి ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడాన్ని ప్రశ్నించారు. ఈ కేసులో జంతు కొవ్వు ఆరోపణలు చేసిన చంద్రబాబు, పవన్‌లను సిట్ ముందుగా ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే పెద్ద అనుమానం. అంతేకాక టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిందని చెబుతున్న బోలేబాబా సంస్థకు అనుమతి ఇచ్చిందే చంద్రబాబు సర్కార్ టైమ్‌లో అన్న సంచలన వాస్తవాన్ని జగన్ వెల్లడించడంతో కూటమి పెద్దలు, ఎల్లో మీడియా కిక్కురమనలేకపోయాయి. అప్పట్లో టీటీడీ బోర్డు చేసిన తీర్మానం కాపీని కూడా జగన్ ప్రదర్శించడం విశేషం. ఆ రోజుల్లో ఒక అధికారిక బృందం వెళ్లి బోలేబాబా కంపెనీలను తనిఖీ చేసి వచ్చీ మరీ ధ్రువీకరించాయన్న సంగతి బయటపడింది. ఇక్కడ ఇంకో సంగతి గమనించాలి.
చంద్రబాబు కూడా హెరిటేజ్ పేరుతో డెయిరీ సంస్థను నడుపుతున్నారు. ఆయనకు బోలే బాబా కంపెనీ గురించి ముందే తెలిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు అది సరైన కంపెనీ కాకపోతే అప్పుడే తప్పించి ఉండాలి కదా! అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొన్ని నెయ్యి ట్యాంకులను తిప్పి పంపడం, మళ్లీ తర్వాత వాటిలో కొన్నిటిని అనుమతించడం వంటి విషయాలను కూడా జగన్ వెలుగులోకి తీసుకురావడంతో ప్రభుత్వ పెద్దలకు ,ఎల్లో మీడియాకు దిమ్మదిరిగినంత పనైంది. వీటిపై వీరెవ్వరూ నోరు విప్పితే ఒట్టు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒకసారి తిరస్కరణకు గురైన నెయ్యిని వాడారని, అయినా చైర్మన్, అధికారులపై ఎందుకు కేసులు పెట్టలేదని జగన్ ప్రశ్నించారు. పరకామణి కేసు గురించి మాట్లాడుతూ తమ ప్రభుత్వ టైమ్‌లోనే నిందితుడిని పట్టుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ కేసులో నిందితుడి ఆస్తి మొత్తం స్వామి వారికి రాసిస్తే అది తప్పన్నట్లుగా ప్రభుత్వం ప్రచారం చేయడం ఏమిటో తెలియదు.
చంద్రబాబు ప్రభుత్వ టైమ్‌లో కూడా ఈ నిందితుడు దొంగతనాలు చేసి ఉండవచ్చు కదా! అదే కదా సీఎం పరోక్షంగా అంగీకరిస్తున్నది?. అలాంటప్పుడు! అప్పుడెందుకు పట్టుకోలేకపోయారు. అంతేకాదు. తిరుమల, ఇతర ఆలయాలలో అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగాయి. వారు పట్టుబడితే కేసులు పెట్టి చర్య తీసుకుంటారు. అంతే తప్ప ఆస్తుల స్వాధీనం వరకు వెళ్లరు. కానీ, ఈ కేసులో లోక్ అదాలత్ నిర్ణయం మేరకు ఆస్తి మొత్తం రాయించుకుంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకెంత చోరీ చేశారో అని అడుగుతున్నారు. దీనిపై ఇప్పటికే ఉన్న సిట్ ఆ విషయం విచారించి ఉంటుంది కదా! ఇంకేమైనా ఆస్తులు ఎవరికైనా రాసిచ్చారా అన్నది పట్టుకునేవారు కదా! ఈ కేసును ఏదో రకంగా మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డికి పులమాలని విశ్వప్రయత్నం చేసి విఫలం అయ్యారు. ఈ అంశాలన్నిటినీ ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య ఈ కేసుకు సంబంధించి ఉన్నత స్థాయి జడ్జి ఒకరు సిఫారసు చేశారని చెప్పిన వీడియోను జగన్ ప్రదర్శించారు. ఆ జడ్జి టీడీపీకి దగ్గరగా ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు ఆయనను కూడా విచారించవలసి ఉంటుంది కదా!
అలాగే పరకామణి కేసులో ఆరోపణలు చేసిన లోకేశ్ తదితర మంత్రులను కూడా పిలిచి మాట్లాడి ఉండాలి కదా! ఇవేవీ ఎందుకు చేయలేదు! ఇక్కడే చంద్రబాబు సర్కార్ దొరికిపోతోంది. వేల కోట్ల రూపాయల మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసును మాఫీ చేయించుకున్న ఈనాడు మీడియా పరకామణిలో డెబ్బేవేల రూపాయల చోరీ కేసు చాలా పెద్దదిగా భావిస్తున్నట్లుగా ఉంది. దీనిని జగన్ చిన్న కేసు అన్నారని రాయడం, పిమ్మట చంద్రబాబు మాట్లాడడం, సంబంధం లేని వివేకా హత్యకేసుకు ముడిపెట్టడం ఇదో వింతగా ఉంది.
పరకామణి కేసు నిందితుడు తను చేసిన తప్పుకు పశ్చాతాపంగా తన ఆస్తులను రాసిస్తే, వందల కోట్ల స్కామ్ కేసులను ఎదుర్కుంటున్న చంద్రబాబు విచారణ ఎదుర్కోకుండా భయపడి ఆ కేసులను తానే ఎలా మాఫీ చేయించుకుంటున్నారు? ఎవరు ధర్మంగా ఉన్నట్లు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబు దొరుకుతుందా?. ఈ విషయాలతో పాటు ఏపీలో సాగుతున్న రెడ్ బుక్ అరాచకాలపై కూడా జగన్ గట్టిగా ప్రశ్నించి సిట్‌ల పేరుతో సాగుతున్న దర్యాప్తు తంతులను ఎండగట్టారు. ఈ విషయాలలో ఒక్కదానికి కూడా చంద్రబాబు లేదా ఇతర కూటమి నేతలు జవాబు ఇవ్వలేకపోయారు. అందుకే జగన్ వారిని రాజకీయంగా ర్యాగింగ్ చేశారని, రఫ్పాడించారని అనాల్సి వస్తోంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


