
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నియంతృత్వ పోకడకు సిద్ధమవుతోంది. పౌరుల ప్రాథమిక హక్కులు, భావ స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నాలు ఆరంభించింది. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఇప్పటికే రెడ్‌బుక్ పేరుతో అరాచకపు పాలన సాగిస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి సర్కారు సోషల్ మీడియా కట్టడికి రంగం తయారు చేస్తోంది. రెడ్‌బుక్ సృష్టికర్త, మంత్రి, ముఖ్యమంత్రి కుమారుడు నారా లోకేశ్ సార్థ్యలోనే ఈ కమిటీ పని చేయబోతుండడం ప్రభుత్వ ఉద్దేశాలను స్పష్టం చేస్తున్నాయి. మంత్రుల కమిటీ బాధ్యతల ఉత్తర్వులు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న వారే లక్ష్యంగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను రెడ్‌బుక్‌తో భయపెట్టడానికి చేసిన యత్నం విఫలమైన నేపథ్యంలో ఈ కొత్త అంకానికి తెరతీసినట్లు అర్థబవుతుంది. తమ దుర్మార్గపు పాలనకు పరాకాష్టగా తీసుకొస్తున్న ఈ కొత్త చట్టంపై వైఎస్సార్‌సీపీ నేతలు పలువురు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై 15 నెలల్లో 2300 అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లు రాష్ట్రంలోను, వందల కొద్ది ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని, తద్వారా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌పై నిరంతరం విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుఎ హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌తోపాటు విదేశాల్లోనూ ఉన్నాయని ఆరోపించారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలకు గురి అవుతున్న లోకేశ్ నేతృత్వంలో మంత్రుల కమిటీ ఎలాంటి సిఫారసులు చేస్తుంది? వాటికి ఉండే పవిత్రత ఏమిటి?
సోషల్ మీడియా నియంత్రణకు ప్రస్తుతమున్న చట్టాలనే దుర్వినియోగం చేస్తున్నారని న్యాయ వ్యవస్థ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇంకేదో చేయాలని తెగబడడమేమిటి? కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టాలు వీళ్లు ఎలా మారుస్తారు? అని మాజీ అదనపు ఆడ్వకేట్ జనరల్ పోన్నవోలు సుధాకరరెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియాతో పాటు, తన వైఫల్యాలను పదే, పదే గుర్తు చేసే ప్రదాన మీడియాను ముఖ్యంగా సాక్షి మీడియాను నియంత్రించడానికే ఈ ప్రయత్నంలా కనబడుతోంది. సోషల్ మీడియా వారిపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా, వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్న తీరు, మహిళల అక్రమ రవాణా కేసులు పెడుతున్న వైనం పై న్యాయ స్థానాలు తీవ్రంగా స్పందించాయి. సోషల్ మీడియా యాక్టివిస్టు సవిందర్ రెడ్డి కేసులో అయితే ఏకంగా సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం కూటమి ప్రభుత్వంలో కొందరు పోలీసుల అరాచకపు ప్రవర్తనను తేటతెల్లం చేసింది.
హోం మంత్రి అనిత కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాపై అసెంబ్లీలో మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు తమ పేరులో రెడ్డి అని ఉన్నప్పటికీ ఆ పదం వాడడం లేదని, మరికొందరు రెడ్డి అయినప్పటికీ చౌదరి అని పెట్టుకుంటున్నారంటూ కొన్ని ఉదాహరణలు ఇచ్చి అప్రతిష్టకు గురయ్యారు. ఆమె చెప్పిన వారిలో ఒకరైన విజయ్ కేసరి ఎప్పుడూ అభ్యంతరకర విశ్లేషణలు చేయలేదు. ప్రభుత్వం మంచి, చెడులను గణాంకాలతో సహా విశ్లేషిస్తారు. ఆయన రెడ్డి అని బాధ్యత కలిగిన హోం మంత్రి మాట్లాడడం అందరిని నివ్వెరపరచింది. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పులు ఏమైనా వస్తుంటే చెప్పాలి తప్ప, ఫలానా కులం అని చెప్పడం ఏపాటి విజ్ఞత? అలాగే మరొకరు చలపతి చౌదరి అని పేరు పెట్టుకుని యూ ట్యూబ్ నడుపుతున్నారని, అతని పేరు ముకేష్ రెడ్డి అని హోం మంత్రి అసెంబ్లీలో చెబితే, ఆ యువకుడు తన ఆధార్ కార్డు చూపి మరీ తాను చలపతి చౌదరినేనని రుజువు చేసుకున్నారు. దాంతో ఈ ప్రభుత్వ డొల్లతనం, మంత్రిగారి తొందరపాటుతనం అన్నీ బయటపడ్డాయి.
మంత్రి అనిత చెప్పేది ప్రామాణికం అయితే స్వాతిరెడ్డి అనే పేరుతో సోషల్ మీడియాలో వైసిపిని విమర్శించే ఒకరు చౌదరి అట. పైగా ఆమెను గతంలో చంద్రబాబు అభినందించిన ఘట్టం కూడా జరిగిందట. ఆమె గురించిన సమాచారం అనిత వద్ద లేదా? లేక ఆమె తమ పార్టీ కనుక వదలి వేశారా అని కొందరు ప్రశ్నించారు. ఇక జగన్ ను ఉద్దేశించి మంత్రి ఎంత అనుచితంగా మాట్లాడేది అందరికి తెలిసిందే. అంతేకాదు. గతంలో ఈ మంత్రిగారు జగన్ కుటుంబ సభ్యులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు చట్టసమ్మతమేనా అని మరికొందరు ప్రశ్నించారు. ఇప్పుడు ఈ మంత్రిగారు కూడా ఈ కమిటీలో సభ్యురాలు. ఇక ప్రభుత్వ పెద్దలు నిత్యం అబద్దాలు ఆడుతారన్న విమర్శలు ఉన్నాయి.
ఉదాహరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చేసిన దారుణ వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని లోకేశ్ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందా? గతంలో పవన్ కళ్యాణ్ 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ చేసిన దారుణమైన అబద్దపు ప్రచారంపై ఈ కమిటీ ఏమైనా విశ్లేషిస్తుందా! సోషల్ మీడియా యాక్టివిస్టులు వ్యతిరేక ప్రచారం చేయకుండా కట్టడి చేయాలని చూస్తున్న ఈ కమిటీ ప్రభుత్వంలో అబద్దాలు ఆడే వారిపై కూడా కేసులు పెట్టవచ్చని సిఫారస్ చేయగలుగుతుందా? అప్పుడు ఈ కమిటీకి విలువ వస్తుంది.
కాని అలా చేయలేరు. విపక్షంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎంత దుష్ప్రచారం చేసింది చంద్రబాబు, లోకేశ్ లకు తెలిసినట్లుగా మరెవ్వరికి తెలియకపోవచ్చు. దానిని ఎవరూ గుర్తు చేయకుండా ఉండడం కోసం, ఇప్పుడు ఈ కమిటీ ప్రయత్నిస్తుందన్న విమర్శ ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్దిష్టమైన గైడ్‌లైన్స్ ఇచ్చింది.వాటిని ఎపి పోలీసులు సరిగా పాటించడం లేదు. ఏడేళ్ల శిక్షకు అవకాశం ఉన్న సోషల్ మీడియా కేసులలో నోటీసు ఇచ్చి పంపాలి. అలా చేయడం ఇష్టం లేని రెడ్‌బుక్ రాజ్యంగం అమలు చేస్తున్న పోలీసులు పలు తప్పుడు కేసులు పెడుతున్నారు. ఈ కమిటీ అలాంటి పోలీసులపై చర్య తీసుకోవడానికి సిఫారస్ చేస్తుందా? ఈ కమిటీ జవాబుదారితనం గురించి ఆలోచిస్తుందట.
ముందుగా ప్రభుత్వంలో ఉన్నవారి జవాబుదారితనం గురించి ఈ కమిటీ చర్చించి, నిర్ణయాలు చేసి, అప్పుడు సోషల్ మీడియావారి జోలికి వెళితే మంచిది కదా! అంతర్జాతీయ ఉత్తమ పద్దతులను అధ్యయనం చేస్తారట. అదేమిటో తెలియదు. హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, జాతీయ భద్రతకు ముప్పు వంటి అంశాలలో ఎలా స్పందించాలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వీటిపై అప్రమత్తంగానే ఉంటుంది. అయినా ఆ పేరుతో పద్దతిగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులను నియంత్రించాలన్న ఉద్దేశం ఉందేమో అని పలువురు అనుమానిస్తున్నారు. పౌరహక్కులను కాపాడడంపై సలహా ఇవ్వాలన్నది ఈ కమిటీ బాధ్యతట. అదే నిజమైతే ప్రభుత్వం ఇంతవరకు అక్రమంగా అరెస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టుల కేసులన్నిటీని సమీక్షించి, అన్యాయంగా అరెస్టు అయినవారిని విడుదల చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్య తీసుకోవాలి. అప్పుడు ఈ కమిటీకి విలువ పెరుగుతుంది.
ఆ పని చేస్తారా? నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలను పెట్టాలట. అంటే ఇప్పుడు ఉన్న పోలీసుల బెదిరింపులు చాలవన్నట్లుగా కొత్తగా కొన్ని సంస్థలను సృష్టించి వారికి కోట్ల రూపాయలు చెల్లించి సోషల్ మీడియా వారిని బెదిరించడమో, భయపెట్టడమో చేస్తారన్న డౌటు రావడం లేదా? ఇదంతా మీడియా గొంతు నొక్కడమేనని వైఎస్సార్‌సీపీ అభిప్రాయపడింది. ఈ కమిటీలో బీజేపీ నుంచి మంత్రి సత్య ప్రసాద్, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్, మరో మంత్రి పార్థసారథి కూడాఉన్నప్పటికీ, అంతిమంగా లోకేశ్ ఏమి డిక్టేట్ చేస్తే అది ఫైనల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే! ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. తెలంగాణ డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి తమ రాష్ట్రంలో రెడ్ లేదా పింక్, లేదా బ్లూ బుక్ లు ఏవీ ఉండవని, ఖాకీ బుక్ మాత్రమే ఉంటుందని, అది చట్టాల ప్రకారమే నడుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ పోలీసులకు, ఏపీలో రెడ్ బుక్ అరాచకపు పాలనకు చెంపపెట్టు అనడానికి ఈ ఒక్క వ్యాఖ్య చాలదా!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత