
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి చుట్టూ ఒక రోడ్డు వేసేందుకు పాతిక వేల కోట్లు ఖర్చు అవుతుందట. ఇంత మొత్తం పెట్టేందుకు కేంద్రం, రాష్ట్రం కూడా సిద్ధమేనట. ఈ భారీ ఖర్చుకు తోడు.. రాజధాని ప్రాంతాన్ని వరదనీరు ముంచేయకుండా ఉండేందుకు రెండు ఎత్తిపోతల పథకాలు. వీటి కోసం రూ.ఆరు వేల కోట్ల ఖర్చు! ఇంతింత ఖర్చు పెట్టేందుకు సిద్ధమంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద సామాన్యులకు చౌకగా వైద్యం అందించేందుకు పనికొచ్చే వైద్యకళాశాలల నిర్మాణానికి మాత్రం పైసా లేకపోవడం విచిత్రమే! డబ్బుల్లేకే వైద్య కళాశాలలను పీపీపీ మోడల్‌లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది పాపం!
అమరావతిలో 34 వేల ఎకరాల రైతుల భూమి, ఇరవై వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో అంతర్జాతీయ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014లో తెగ చెప్పేవారు.. ఇప్పుడేమో ఆ భూమి మున్సిపాల్టీ స్థాయిది అంటున్నారు. అంతర్జాతీయ నగరం కావాలంటే ఇంకో 44 వేల ఎకరాలైనా కావాలంటున్నారు. ఈ రెండు విషయాలను వింటే ఏమనిపిస్తుంది? ఏపీలోని టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎటు తీసుకెళుతోందన్న అనుమానం వస్తుంది.
రియల్ ఎస్టేట్ వారి ప్రయోజనాల కోసం, ప్రైవేటు పెట్టుదారుల లాభాల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని, పేదలను విస్మరించిందన్న విమర్శలకు ఆస్కారం ఇస్తోంది. ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వం ఇలా అణ, కాణీలకు ప్రైవేటు వారికి కట్టబెడుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. ప్రైవేటు సంస్థలు సొంత డబ్బు పెట్టుబడి పెట్టి ,ప్రభుత్వం నుంచి రాయితీలు పొందితే ఫర్వాలేదు. అలా కాకుండా ఉత్తిపుణ్యానికి ప్రభుత్వ ఆస్తులు పొందడమే కాకుండా, రాయితీలు కూడా అనుభవిస్తే ప్రజలలో తీవ్రమైన అసహనం వ్యక్తం అవుతుంది.
విశాఖపట్నంలో రిషికొండపై కేవలం రూ.450 కోట్ల వ్యయంతో గతంలో ఉన్నవాటి స్థానంలో ఏడు కొత్త భవనాలను నిర్మిస్తే వృథా ఖర్చు, పర్యావరణానికి విఘాతమని విమర్శించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట తీసేసుకున్నప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. అమరావతి ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ విస్పష్టంగా చెప్పినా పట్టించుకోలేదు. స్వభావరీత్యా అక్కడి భూమి భారీ భవనాల నిర్మాణానికి అనువు కాదని నిపుణులు కూడా చెబుతున్నారు. కానీ... చంద్రబాబు ప్రభుత్వం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు అన్న చందంగా ముందుకు సాగుతోంది.
పరిపాలన కేంద్రమైన రాజధాని కోసం అన్ని వేల ఎకరాల భూమి అవసరం లేదని అప్పట్లోనే చాలామంది చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు సరికదా విమర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేసేది. పోనీ.. అప్పట్లో తీసుకున్న ముప్ఫైవేల పైచిలుకు భూముల్లో నిర్మాణాలు పూర్తి చేసిన రైతులకు ఇస్తామన్న భూమి ఇచ్చారా? ఊహూ లేదు. అలా చేసి ఇప్పుడు అదనపు భూమి కోసం అడిగితే రైతుల నుంచి అభ్యంతరాలు పెద్దగా వచ్చేవి కావేమో. ఒకపక్క అప్పుడప్పుడూ భూములు బలవంతంగా తీసుకోమని చెబుతూనే ఇంకోపక్క దానికి భిన్నంగా వ్యవహరించడం ప్రభుత్వానికి అలవాటైపోయింది.
తమ భూమిని ఒక రియల్ ఎస్టేట్, హోటల్ యాజమాన్యం బలవంతంగా తీసుకుందని ఇద్దరు చిన్నకారు రైతులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవగా భూములిచ్చేయమని సలహాలు పారేస్తున్నట్లు తెలుస్తోంది. సీఆర్‌డీయే కూడా భూములను బలవంతంగా లాక్కొనేందుకు సిద్ధమవుతోంది రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని వారు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రతినిధులకు కూడా స్పష్టం చేశారు. ఇక దీనిపై విష ప్రచారం ఆరంభిస్తారు. అమరావతి దేవతల రాజధాని అని, రాక్షసులు కొందరు దానిని చెడగొట్టాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మొదలు అందరూ విమర్శించడం ఆరంభిస్తారు.
రైతుల పాట్ల మాటేమిటి అని ఎవరూ ప్రశ్నించకూడదు. లక్షల కోట్లు వ్యయం చేసి ప్రభుత్వం ఒక నగరాన్ని నిర్మించడం ఎలా సాధ్యమని చాలామందిలో అనుమానం ఉన్నా ఎవరికి వారు ఏమోలే అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త, కొత్త ప్రతిపాదనలలోకి వెళుతుండడంతో గతంలో భూములు ఇచ్చిన వారిలో సందేహాలు, భయం మొదలయ్యాయి. దానికితోడు ఇప్పుడు ఇది చిన్న మున్సిపాల్టీ అవుతుందని సీఎం స్వయంగా అనడం మరింత నిశ్చేష్టులను చేస్తోంది.
మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అన్నట్లు ప్రభుత్వం రాజధానికి అవసరమైన నిర్మాణాలు చేస్తుందా? లేక ఒక నగరం నిర్మిస్తుందా? ఏది ఆచరణాత్మకం? మరో నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాము అమరావతికి వ్యతిరేకం కాదని, వచ్చేసారి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడనుంచే పాలన చేస్తారని స్పష్టం చేశారు. అయితే లక్షల కోట్ల వ్యయం ఒకే చోట చేయడం కన్నా, అవసరమైన రాజధాని భవనాలు నిర్మించి, ఆ తర్వాత అభివృద్ది ఎప్పటికప్పుడు చేసుకుంటూ పోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని అన్నారు. సజ్జల ప్రకటనను కూడా వక్రికరిస్తూ ఎల్లో మీడియా పిచ్చి రాతలు రాసింది. అది వేరే విషయం. సజ్జలకాని, బుగ్గన కాని చెప్పినట్లు ఒకే చోట లక్షల కోట్లు వ్యయం చేస్తే మిగిలిన రాష్ట్ర ప్రజల మాటేమిటి?
ఆ ప్రాంతంలో అభివృద్ది సంగేతేమిటి? విశాఖలోని ప్రభుత్వ భూములను 99 పైసలకే కట్టబెడుతూ అమరావతిలో మాత్రం కోట్ల రూపాయల ధరలు చెబితే పరిశ్రమలు ఎలా ఇక్కడకు వస్తాయి? అన్నది కూడా చర్చ అవుతుంది. అనంతపురంలో జరిగిన సభలో అమరావతి రాజధానికి లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఇందుకోసం అప్పులు కూడా తీసుకు వస్తున్నామని ధైర్యంగా ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోయారు? ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆరువేల కోట్లు ప్రభుత్వం వద్ద లేకపోతే, అమరావతి రాజధానికి మాత్రం ఇన్నివేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయి.
రాష్ట్రానికి వచ్చిన మెడికల్ సీట్లను వదులుకోవడం ఏపాటి తెలివైన పని. సభలు,ఉచిత ఉపన్యాసాలు ఇతర ప్రాంతాలకి, లక్షల కోట్ల ఖర్చు మాత్రం అమరావతికి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తే ప్రాంతీయ అసమానతలు ఏర్పడవా? ఆ తరహా చర్చ జరగడం ఏపీకి మంచిదా? పోనీ ఇక్కడి రైతులకు న్యాయం జరుగుతోందా అంటే అదీ కనిపించడం లేదు. వారు ప్రభుత్వానికి అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ వంటివాటికి ఫిర్యాదు చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు.
కేవలం బెదిరింపులు, పోలీసుల ద్వారా భయపెట్టి వేల ఎకరాలను సమీకరించుకోవాలనుకోవడం విపరిణామాలకు దారి తీయవచ్చు.వీటన్నిటిని గమనించి సమతుల్యతతో కూడిన సమిశ్ర అభివృద్ధి వైపు కూటమి ప్రభుత్వం ఆలోచించకపోతే ఏపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడుతుందని హెచ్చరించవలసి ఉంటుంది.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.