డిజిటల్‌ బుక్‌ ముకుతాడు వేస్తుందా? | Kommineni Comments on YSRCP Digital Book: Jagan’s New Move to Protect Party Cadre | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ బుక్‌ ముకుతాడు వేస్తుందా?

Sep 30 2025 11:07 AM | Updated on Sep 30 2025 11:59 AM

Kommineni Comments On Ysrcp Digital Book

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్ అధినేత వైఎస్‌ జగన్‌.. పార్టీ కార్యకర్తల రక్షణకు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీ, సోషల్‌ మీడియా కార్యకర్తలు ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా, వేధింపులు ఎదురైనా పార్టీ లీగల్ టీమ్ వెంటనే రంగంలో దిగేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాక అవసరమైతే ఆయనే స్పందించి బాధితులతో మాట్లాడి ఓదార్చుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఆయన ప్రకటించిన విధంగా కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్‌ను ప్రవేశపెట్టారు. దీని వల్ల కార్యకర్తలకు ఒక భరోసా వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

తమకు జరిగిన అన్యాయాన్ని డిజిటల్‌ బుక్‌లో ఎలా నమోదు చేయవచ్చో కూడా పార్టీ సమావేశంలో ఆయన వివరించారు. దాని ప్రకారం ఏ కార్యకర్త అయినా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఏ పోలీసు అధికారి నుంచి అయినా వేధింపులు ఎదురైనా, అక్రమ అరెస్టు జరుగుతున్నా, వెంటనే వాటిని చిత్రీకరించి డిజిటల్ బుక్‌లో నమోదు చేస్తే లీగల్ సెల్  తక్షణమే చొరవ తీసుకుని పని చేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ బుక్‌లో తమ పేరు ఎంటర్ అవుతుందన్న భయంతోనైనా కొంతమంది పోలీసులు వైసీపీ, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టకుండా ఉండే చాన్స్ ఉంటుంది. అయినా కొంతమంది బరితెగించి వ్యవహరిస్తే పార్టీపరంగా గట్టిగా పోరాడవచ్చు. ఈ మధ్యకాలంలో వైసీపీ లీగల్ టీం బాగా యాక్టివ్ అయింది.

పోలీసులు మఫ్టీలో వచ్చి సవీంద్రరెడ్డి అనే సోషల్ మీడియా యాక్టివిస్టును అదుపులోకి తీసుకున్న వెంటనే లీగల్‌ టీమ్‌ అతని తరపున హెబియస్ కార్పస్ పిటిషన్ వేసి రక్షించారు. హైకోర్టు కూడా పౌర రక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. పోలీసులు చెప్పినవి కట్టుకథలన్న సంగతిని అర్థం చేసుకున్న కోర్టు సవీంద్రరెడ్డిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. ఒకరకంగా ఇదో రికార్డు. కేసును సీబీఐకి అప్పగించడం మరో విశేషం. ఏపీలో పోలీసులు కొన్నిసార్లు కిడ్నాపర్ల అవతారం ఎత్తుతున్నారని ఈ ఉదంతం తెలియచేస్తుంది.

అంతేకాదు.. సోషల్ మీడియా వారిపై కేసులు పెట్టడం ఇబ్బంది అవుతోంది కనుక వారిపై లేని గంజాయి కేసులు పెడుతున్నారట. అంటే పోలీసు స్టేషన్లలోనే గంజాయిని అందుబాటులో ఉంచుకుని ఇలాంటి తప్పుడు కేసులు పెడుతున్నారన్న భావన కూడా కలుగుతుంది. అందుకే హైకోర్టు సవీంద్ర విడుదలకు ఆదేశాలు ఇచ్చారనుకోవాలి. ఇంత జరిగినా కొందరు పోలీసులు మరో ఇద్దరు సోషల్ యాక్టివిస్టులను అదే రోజు అక్రమంగా పట్టుకుపోయారని వార్తలు వచ్చాయి. ఇలాంటి చట్ట విరుద్ద కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు పోలీసులు కూడా కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు ఈ డిజిటల్ బుక్ ఉపయోగపడుతుంది.

ఈ బుక్‌లో సాక్ష్యాధారాలు  కూడా నమోదు అవుతాయి కనుక అవి ఎప్పటికి అందుబాటులో ఉంటాయి. అదే టైమ్‌లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అభ్యంతర పోస్టులు పెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రభుత్వం కక్షకట్టి కేసులు పెడుతుంది. అదే టీడీపీ వారు ఎంత అరాచకంగా పోస్టులు పెడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.

పరకామణి వ్యవహారంలో జగన్‌పై నీచమైన ఆరోపణలు చేస్తూ టీడీసీ సోషల్ మీడియా ప్రచారం చేసిందట. అది తప్పా? కాదా? అన్నది పోలీసులు ఆలోచించుకోవాలి. అలాగే మహిళలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరకర పోస్టులు పెట్టరాదు. కాని టీడీపీ వారు ఏమీ చేసినా పోలీసులు కేసులు పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఎవరు తప్పు చేసినా ధర్మబద్దంగా చర్య తీసుకోవల్సిన పోలీసులు పక్షపాతంగా ఉండకూడదు. అలాంటివి జరుగుతున్నప్పుడు వెంటనే డిజిటల్ బుక్ ద్వారా పార్టీకి తెలియచేయవచ్చు. బహుశా ఇది ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుందేమో తెలియదు. అప్పుడు వారు కూడా తమకు జరిగే అన్యాయాలపై ఫిర్యాదు చేయవచ్చు. కాని డిజిటల్ బుక్ పరిధి పెరుగుతుంది. ఎంతవరకూ ఆచరణ సాధ్యం అవుతుందో లేదో తెలియదు. అలాగే డిజిటల్ బుక్‌ జరగకుండా జాగ్రత్తపడాలి.అంతే కాకుండా కొంతమంది టీడీపీ వారు కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎంటరై తప్పుడు ఆరోపణలు చేయకుండానూ జాగ్రత్తలు తీసుకోవాలి.

డిజిటల్‌ బుక్‌తో పాటు నేతలు, కార్యకర్తలకు జగన్ దిశా నిర్దేశం కూడా చేశారు. కమిటీల ఏర్పాటు మొదలు, కూటమి ప్రభుత్వం అక్రమాలు, హామీల ఉల్లంఘనపై ప్రజలను జాగృతం చేయవలసిన తీరుపై కూడా జగన్ వివరించారు. పార్టీ విస్తృత సమావేశంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వబోతున్న తీరు, వారికి  ధైర్యం ఇచ్చిన వైనం కచ్చితంగా పార్టీ కేడర్‌కు మంచి సంకేతమే అవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు అమలు చేసే బాధ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో కార్యకర్తలకు అంత ప్రాధాన్యత లభించలేదన్న భావన ఉంది.

కార్యకర్తలు చాలామందికి పదవులు వచ్చినా వివిధ కారణాల వల్ల కేడర్‌లో అలాంటి అభిప్రాయం నెలకొంది.. అది వేరే విషయం. ఈ సమావేశంలోనే జగన్ కూటమి సర్కార్‌పై విరుచుకుపడ్డారు. బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ అన్న నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్లడానికి  కూడా ఆయన డైరెక్షన్ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రస్తావించి స్కూళ్లు, బస్సులు ఆస్పత్రులు వంటివాటిని ఎందుకు ప్రభుత్వాలు నడుపుతాయో తెలియదా అని ప్రశ్నించారు.

అట్టర్ ఫ్లాఫ్ అయిన సూపర్ సిక్స్‌కు విజయోత్సవ సభ జరిపారని ఎద్దేవా చేశారు. ఓవరాల్ గా చూస్తే ఒకవైపు ప్రభుత్వ ఫెయిల్యూర్ పై దాడి, మరో వైపు కార్యకర్తలలో స్పూర్తి నింపడానికి ఈ సమావేశంలో జగన్  ప్రయత్నించారు. అందులో భాగంగానే డిజిటల్ బుక్ తెచ్చారు. దీని  ప్రభావంతోనైనా ఏపీ పోలీసులు అక్రమ కేసులు పెట్టే విషయంలో కాస్త  అయినా వెనక్కి తగ్గుతారా! ఏమో చెప్పలేం!


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement