తెలివితక్కువ కథ(నా)లకు కేరాఫ్‌గా.. | KSR Comments On Yellow Media Fake Stories About Liquor Scam Case, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

తెలివితక్కువ కథ(నా)లకు కేరాఫ్‌గా..

Oct 3 2025 12:44 PM | Updated on Oct 3 2025 1:06 PM

KSR Comment on Yellow Media Liquor Scam Fake Stories

మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్‌ అయిన రాజంపేట ఎంపీ, లోక్‌సభలో వైఎస్సార్‌ పార్టీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డికి బెయిల్‌ రావడం తెలిసిందే. ఈ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు వ్యవస్థకు చెంపపెట్టే. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి వత్తాసుగా రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో భాగంగా జరిగిన ఈ అక్రమ అరెస్ట్‌ ప్రత్యేక అధికారుల బృందం (సిట్‌)తోపాటు, కల్పిత కథలతో మద్యం కేసంటూ శివాలెత్తిన ఎల్లోమీడియాకూ పెద్ద హెచ్చరికగా కూడా చూడొచ్చు. 

ఎల్లోమీడియా కథనాలు చదివితే అర్థమయ్యేది ఒక్కటే. జర్నలిజానికి, నైతిక విలువలకు ఎప్పుడో పాతరేశారు అని. ఇంతకీ ఏసీబీ కోర్టు ఏమంది? మద్యం కేసులో మిథున్‌ రెడ్డి పాత్రను, మాస్టర్‌మైండ్‌ అనేందుకూ ప్రాథమిక ఆధారాలు కూడా లేవని స్పష్టం చేసింది. ముడుపుల వసూళ్ల ఆరోపణలకు, నేరపూరిత కుట్రకూ ఆధారాలెక్కడని ప్రశ్నించింది.  సహ నిందితుల వాంగ్మూలాలకు ఆమోదయోగ్యత ఉండదని తేల్చింది. ఒట్టి ఆరోపణల ఆధారంగా పౌరుల బెయిల్ హక్కును నిరాకరించలేమని వ్యాఖ్యానించింది. 

జర్నలిజానికి విలువిచ్చే ఏ మీడియా సంస్థ అయినా.. మిథున్‌ రెడ్డి అరెస్ట్‌ అయినప్పుడు, బెయిల్‌ వచ్చిన సందర్భంలోనూ వార్తకు సమ ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతిలు అరెస్ట్‌ను పతాక శీర్షికలకు చేర్చి బెయిల్‌ వార్తను అప్రధాన్యంగా మొక్కుబడిగా ఇవ్వడాన్ని బట్టే వీరి నైజం ఏమిటన్నది అర్థమైపోతుంది. ఈ క్రమంలో వారు కోర్టు వ్యాఖ్యలను అస్సలు పట్టించుకోలేదు. 

న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు అటు ఎల్లోమీడియా, ఇటు పోలీసులు అధికారుల వద్ద కూడా సమాధానాలు లేవు. దీన్నిబట్టి చూస్తే జగన్‌ హయాంలో స్కాముల కోసం ఎల్లోమీడియా భూతద్దం వేసి చూసినా ఏమీ దొరకలేదన్నది స్పష్టమైంది. అందుకే ఒక మద్యం కేసు కట్టుకథ సృష్టించారు. డిస్టిలరీ కంపెనీలు ముడుపులు ఇచ్చాయంటూ చిత్రమైన కథ అల్లారు. ముడుపులు ఇవ్వాల్సి వచ్చిందని, ఇచ్చామని కంపెనీలు కదా ఫిర్యాద చేయాల్సింది? కానీ ఈ కేసులో ఎవరో దారినపోయే దానయ్య ఫిర్యాదు ఇస్తే రెవెన్యూ ముఖ్య కార్యదర్శి ఆఘమేఘాల మీద విచారణకు ఆదేశించడం. హుటాహుటిన సిట్‌ ఏర్పాటు జరిపోయాయి. ఎన్నికల హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలల నుంచి ప్రజల దృష్టిని పక్కకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నం అన్నమాట. పైగా ఇదే కేసులో నిందితుడు అంటూనే సిట్‌ విజయసాయిరెడ్డి జోలికి అస్సలు వెళ్లకపోవడం అనుమానాలను ధ్రువీకరిస్తుంది. 

గత ఆగస్టులో సిట్ వేసిన ఛార్జ్‌షీట్‌పై న్యాయస్థానం 21 అభ్యంతరాలను లేవనెత్తింది. దారిమళ్లాయని చెబుతున్న రూ.3,500 కోట్ల వివరాలు ఎక్కడ అనడం ఒకటైతే... సిట్‌ అధికారులు న్యాయస్థానం నుంచి ఏమి అభ్యర్థిస్తున్నారో చెప్పాలని అడగడమే విశేషం. ఛార్జ్‌షీట్‌లోని లోపాలను తాము అడిగిన విధంగా కూడా సరిదిద్దలేదని న్యాయస్థానం పోలీసులు ఇచ్చిన జవాబుపై వ్యాఖ్యానించడం గమనార్హం. తర్వాత రోజుల్లో ఈ కేసులో నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు బెయిల్ మంజూరు చేస్తూ కూడా కోర్టు కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. 

ఛార్జ్‌షీట్‌ సక్రమంగా లేకుండా రిమాండును అరవై లేదా తొంభై రోజులకు మించి పొడిగించడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. సిట్ కప్పగెంతులు ఎప్పటికప్పుడు బయటపడుతున్నా ఎల్లో మీడియా మాత్రం ఏదో కొత్త విషయం కనిపెట్టినట్లు  కథనాలు వండుతూ ప్రజలను మోసం చేయడానికి విశ్వయత్నం చేసింది. తేదీలతో నిమిత్తం లేకుండా  ఈనాడులో వచ్చిన కొన్ని  స్టోరీలను చూద్దాం. 

‘‘మద్యం ముడుపులతో జాంబియాలో బిగ్ బాస్ పెట్టుబడులు, ‘‘డొల్ల కంపెనీలు, హవాలా ద్వారా రూ.400 కోట్ల తరలింపు’’ - మరికొన్ని మొత్తాలు యూకే, దుబాయి, అమెరికాకు తరలింపు.. ‘‘హవాలా ఏజెంట్ల విచారణలో సిట్‌కు కీలక అధారాలు లభ్యం’’ ..అని ఒక రోజు రాశారు. మరి  ఆ తర్వాత అది ఏమైపోయిందో తెలియదు. అలాంటి అభియోగాలతో వారు చెబుతున్న బిగ్ బాస్ పై కేసు పెట్టలేదే! అంటే తప్పుడు ప్రచారం కోసం అల్లిన కథేనని తెలియడం లేదూ! మద్యం ముడుపుల సొమ్ము విదేశాలకు తరలింపు అని పెద్ద హెడింగ్ పెట్టి ఈడీ సోదాలలో కీలక ఆధారాలు లభ్యం అని కొద్ది రోజుల క్రితం రాశారు. ఆ తర్వాత ఆ కథ ఏమైందో తెలియదు. 

మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై స్టోరీ ఇస్తూ డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు అన్నారు. దీన్ని చెవిరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి సవాల్ చేశారు. ఆ వార్తను  కప్పిపుచ్చారు. మిథున్ రెడ్డి అరెస్టు అయినప్పుడు భారీ కథనం ఇస్తూ బిగ్ బాస్ తరపున  దోపిడీకి కుట్ర, అమలులో ప్రధాన పాత్ర, ముడుపుల వసూళ్ల నెట్ వర్క్ రూపొందించింది ఆయనే అని ఈ పత్రిక పేర్కొంది. సిట్ ఆధారాలు సేకరించిందని కూడా రాసేసింది. మరి అది నిజమే అయితే ఆ  ఆధారాలేమిటో కోర్టు ముందుకు ఎందుకు ఉంచలేకపోయారో ఇప్పుడు రాయాలి కదా! ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు స్వయంగా తేల్చి చెప్పింది. మద్యం స్కామ్ ఛార్జ్‌షీట్‌లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావించారని ఈ పత్రిక తెలిపింది.  కల్పిత కథలో ఆయననే టార్గెట్‌గా పెట్టుకున్నప్పుడు ఆ పేరు రాయకుండా ఎలా ఉంటారు. కాని ఏ చిన్న ఆధారం ఉన్నా ఈ పాటికి అరెస్టు అంటూ హడావుడి చేసేవారు కదా!. 

గతంలో ఓటుకు నోటు కేసులో ఛార్జ్‌షీట్‌లో చంద్రబాబు పేరు 33 సార్లు ప్రస్తావించారు. అయినా ఆయన  నిందితుడు కాకుండా ఎలా తప్పించుకున్నారో ఈ మీడియా ఎన్నడూ రాయలేదు. ఆ సన్నివేశం  అంతా చూసిన ఓపెన్ కేసే అనే సంగతి తెలిసిందే. ఇప్పుడేమో కల్పిత స్కామ్ పేరుతో కథ నడుపుతున్నారు. మద్యం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి అంటూ ఇంకో రోజు ప్రచారం చేశారు. సిట్ కు ఆధారాలు దొరికపోయాయని కూడా సంబరపడ్డారు. ఇప్పటికీ అదేమీ తేలలేదు. పదహారు డిస్టిలరీల ముడుపులే రూ.1677 కోట్లు అని సిట్ వీరికి చెప్పిందట. ఇందులో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ కంపెనీలు బ్రాండ్ ప్రమోషన్ పేరుతో పలు సంస్థల ఖాతాలలోకి మళ్లించి, నగదు విత్ డ్రా చేయించి ఆ మొత్తాన్ని ముడుపులుగా చెల్లించి, తర్వాత వైకాపా ముఠా ఈ డబ్బును స్థిరాస్తి రంగంలోకి, డొల్ల కంపెనీలలోను పెట్టేదట. హవాలా ద్వారా అంతిమ లబ్దిదారుకు చేరేది అని సిట్ తేల్చిందట. ఇది చదువుతుంటే ఇంత తెలివితక్కువగా కథలు సృష్టిస్తారా అనిపించదా! 

.. బ్యాంకు ఖాతాల నుంచి ఇంత భారీ మొత్తాలలో విత్ డ్రా చేస్తే పట్టుకోవడం పోలీసులకు చేతకాదా?. మరి ఆ డబ్బు గురించి ఛార్జ్‌షీట్‌లో ఏమైనా రాశారా??.. అంటే అదీ ఉన్నట్లు లేదు. ఈనాడుతోపాటు ఆంధ్రజ్యోతి  కలిసే ఈ కల్పిత గాథలను సృష్టించాయన్న అభిప్రాయం ఉంది. పోలీసులు  వీరికి అండగా నిలుస్తూ వారి పాత్ర  వారు పోషించారనుకోవాలి. ఉదాహరణకు.. 

బాక్సులు బద్దలు-లిక్కర్ స్కామ్ సొమ్ము-రూ.11 కోట్లు సీజ్ అని ఒక రోజు గోలగోల  చేశారు. ఇదెలా అని అనుకుంటుండగానే, ఈ కేసులో నిందితుడు అయిన  రాజ్ కెసిరెడ్డి ఆ డబ్బు తనది కాదని, ఆ నోట్లపై నంబర్లు రికార్డు చేయండని అనగానే సిట్ అధికారులు జారుకున్నారు.  ఆ డబ్బును కోర్టులో జమ చేయలేకపోయారు. పైగా బ్యాంకులో జమ చేసేసినట్లు చెప్పి చేతులు  దులుపుకున్నారు. ఆ డబ్బు విడిగా ఉంచారో, లేదో తెలియదు. అలాగే వెంకటేష్ నాయుడు కథ మరొకటి. గుట్టలు, గుట్టలుగా నోట్ల కట్టలు.. దోచుకున్న సొమ్ముతో దొరికేశారు.. సిట్ కు చిక్కిన వీడియో అని ఈ ఎల్లో మీడియా హడావుడి చేసింది. తీరా చూస్తే తమ వద్ద ఎలాంటి వీడియో లేదని, వెంకటేష్ నాయుడి ఫోన్‌ను తెరవనే లేదని సిట్ కోర్టుకు చెప్పింది. ఈ వార్తను మాత్రం తమ పాఠకులకు పూర్తిగా తెలియనివ్వకుండా జాగ్రత్తపడ్డారు. పైగా వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌ తదితరులతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటపడడంతో తేలుకుట్టిన దొంగల మాదిరి గప్ చుప్ అయిపోయారు. ఈ కేసులో ఏ ప్రముఖుడిని అరెస్టు చేస్తే అతనే కీలకమని సూత్రధారి అని, ముడుపుల వసూళ్లు అతని ద్వారానే జరిగాయని అందరిమీద రాస్తూ వచ్చారు. అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే బెవరేజ్ కార్పొరేషన్ నుంచి డేటా పోయిందని, అదేదో మూడు లక్షల జీబీలు  ఉంటుందని, కోట్ల పేజీలతో సమానం అంటూ ఒక కథను ఈనాడు అల్లింది. అది చూసి జనం నవ్వుకున్నారు. ఆ తర్వాత బెవరేజ్ కార్పొరేషన్ తమ వద్ద నుంచి ఎలాంటి సమాచారం పోలేదని చెప్పడంతో ఈ మీడియా పరువు మరోసారి పోయింది. 

ఇలా ఒకటి కాదు..గత ఏడాది కాలంలో ఏదో రకంగా వైసీపీని, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టడం కోసం రకరకాల విన్యాసాలను అటు చంద్రబాబు సర్కార్ పోలీసులు, ఇటు ఎల్లో మీడియా ఎడతెగని పాట్లు  పడుతూనే ఉంది. ఎటు తిరిగి మిథున్‌ రెడ్డి తదితరులను కొన్నాళ్లపాటు జైలులో ఉంచి శునకానందం పొందడడం తప్ప, సాధించింది ఏమీ లేదని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మిథున్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల అయ్యాక  మీడియాతో మాట్లాడుతూ తనను జైలులో టెర్రరిస్టు మాదిరి చూశారని ఆవేదన చెందారు. అయినప్పటికీ ఈ  తప్పుడు కేసులకు  భయపడేది లేదని,  ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.  ఏది ఏమైనా ఎపి లిక్కర్ స్కామ్ అన్నది ఒక ఊహాజనిత కథ అని ఎప్పటికప్పుడు అర్థం అవుతూనే ఉంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement