ఏపీ బడ్జెట్‌... కాకిలెక్క.. స్వోత్కర్ష! | KSR Comment On AP Budget 2026 27 | Sakshi
Sakshi News home page

ఏపీ బడ్జెట్‌... కాకిలెక్క.. స్వోత్కర్ష!

Feb 19 2026 10:17 AM | Updated on Feb 19 2026 10:50 AM

KSR Comment On AP Budget 2026 27

పౌరులు తప్పు చేస్తే ప్రభుత్వం జరిమానా లేదా శిక్ష వేయడం సాధారణంగా జరిగేది మరి... ప్రభుత్వమే తప్పుడు గణాంకాలిస్తే? ‍ప్రజలను తప్పుదోవ పట్టిస్తే? ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ అసెంబ్లీలో పెట్టిన బడ్జెట్‌ గురించి ఈ ప్రస్తావన. ఊహాజనిత వాస్తవాలతో సంబంధం లేకుండా, ఊహాజనిత అంచనాలతో చేసిన ఈ అంకెల గారడీపై ఇప్పుడు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడ్జెట్‌లో ఒకలా.. ప్రసంగంలో ఇంకోలా కూడా లెక్కలు చెప్పగలగడం ఈయనకే చెల్లిందేమో. నిజానికి ప్రజలు బడ్జెట్‌ను పట్టించుకోవడం మానేసి చాలాకాలమైంది. 

ఎందుకంటే అందులో ఉన్న దానికి.. వాస్తవానికి అసలు పొంతనే ఉండటం లేదు మరి. ఏటా ఇదో మొక్కుబడి తంతుగా మారిపోయింది. ఎన్నికల్లో తాము చెప్పిందేమిటి? వాటిని ఏ విధంగా అమలు చేస్తున్నదీ.. అడ్డంకులను అధిగమించేందుకు రచిస్తున్న ప్రణాళికలేమిటన్న వివరాలతో ఉంటే బడ్జెట్‌కు కాస్తో కూస్తో విశ్వసనీయత వస్తుందేమో కానీ.. ఇలా ఓ సోదిలా మాట్లాడేసి పోతే ఫలితం సున్నా. ఈ ప్రభుత్వం, ఆర్థిక మంత్రి పోకడలు రెండేళ్లుగా ఇలాగే ఉంది. మూడోసారి కూడా భిన్నంగా ఏమీ లేదు. 

2019-2024 మధ్యకాలంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించే ప్రయత్నం జరిగింది. అయితే బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి... ఎక్కడ తమ డొల్లతనం బయటపడుతుందో అని ఆ రకంగా చేసే సాహసం చేయలేకపోతోంది. అందుకే ఏదో చేసేయబోతున్నామంటూ బడ్జెట్ ప్రసంగం చేయడం... పది రోజులపాటు అసెంబ్లీ, మండళ్లలో చర్చించినట్టు నటించడం ఆ తరువాత ఎవరి దోవన వారు వెళ్లిపోవడం. ఇదీ తంతు. 

ఒక ఉదాహరణ చూద్దాం. ఈ ఏడాది రెవన్యూ రాబడిని రూ. 2.34,140 కోట్లుగా అంచనా వేశారు. పన్ను, పన్నేతర ఆదాయాల ద్వారా ఇంత మొత్తం వస్తుందన్నమాట. అయితే గత ఏడాది రూ.217976 కోట్ల ఆదాయాన్ని కాస్తా రూ.196903 కోట్లకు మార్చారు. పోనీ ఇంతైనా వచ్చిందా? ఊహూ అనుమానమే. ఎందుకంటే  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి ఆఖరు వరకు వచ్చిన ఆదాయం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే. అంటే ఇంకా యాభై వేల కోట్ల వరకూ తక్కువందన్నమాట. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఉన్న రెండు నెలల్లో ఇంత మొత్తం సంపాదించాలంటే ప్రజల నడ్డి విరిచేంత భారం మోపాలి. లేదంటే ఈ అంచనాలకు కేవలం లెక్కలకు మాత్రమే పరిమితం చేయాలి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో ఆదాయం రూ.2.34 లక్షల కోట్లని ఆర్థిక మంత్రి ఎలా ఊహించారో మరి?

రెవెన్యూ లోటు విషయంలోనూ కేశవ్‌ అంచనాలు డొల్లగానే ఉన్నాయి. రెవెన్యూ లోటు గత ఏడాది కన్నా తక్కువ ఉంటుందని బడ్జెట్‌ ప్రసంగంలో చెప్పారు. గత ఏడాది రెవెన్యూ లోటు రూ.33 వేల కోట్లని అంచనా వేస్తే అది కాస్తా రూ.41 వేల కోట్లకు పెరిగింది. చిత్రంగా వచ్చే ఆర్ధిక సంవత్సరం రెవెన్యూ లోటు రూ.22 వేల కోట్లే అంటున్నారు ఆర్థిక మంత్రివర్యులు. నమ్మే మాటేనా? చివరికి వారికి బాకాలూదే ఎల్లో మీడియా కూడా ఇదే  సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఒక చిన్న వార్తను ‍ప్రచురించాయి ఇవి. 

అప్పుల విషయానికి వస్తే కొత్త ఏడాదిలో రూ.98 వేల కోట్లకు పైగా తీసుకుంటామని బడ్జెట్ పుస్తకంలో తెలిపారు. అది ప్రభుత్వం నేరుగా తీసుకునే అప్పు. కార్పొరేషన్ల ద్వారా  ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి తీసుకునే అప్పు గురించి గుట్టుగా ఉంచారు.ఇంతవరకు  వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణం మొత్తం రూ.311182 కోట్లుగా ఉంది. కొత్త  బడ్జట్లో ఎన్ని వేల కోట్లు తీసుకుంటారో ఊహించలేం. పెండింగ్ బిల్లులు సుమారు రూ.24 వేల కోట్లు చెల్లించినట్లు బడ్జెట్‌లో తెలిపారు తప్ప, ఇంకెంత పెండింగు బిల్లుల మొత్తం ఉందో దాచిపెట్టారు. ఉద్యోగులకే సుమారు రూ.40 వేల కోట్ల మేర బాకీలు ఉన్నట్లు  వార్తలు వస్తున్నాయి. ఇతరత్రా బిల్లులు కూడా లెక్కవేస్తే తడిసిమోపెడు కావచ్చు. ఇవి ఒక కోణం అయితే ప్రభుత్వం తాను ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో పెక్కింటిని గాలికి వదలి వేసింది.ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500, నిరుద్యోగ భృతి కింద రూ.మూడు వేలు ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించారు. వాటి ఊసే లేదు. 

తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, గ్యాస్ సిలిండర్లు తదితర స్కీములకు అవసరమైన మొత్తాలకన్నా బాగా తక్కువ కేటాయించారు. బడ్జెట్లో వాటికి ఇంత, వీటికి ఇంత అని చెబుతారు కాని, అవేవి అయ్యేవి కావన్న సంగతి ప్రభుత్వంలోని వారికి, ప్రతిపక్షానికి తెలుసు.అయినా దీనిని ఒక తంతుగా ,ప్రభుత్వ ప్రచారానికి వాడుకుంటారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కూటమి నేతలు ప్రచారం చేసిన అంకెలన్నీ బోగస్ అని తేలిపోతుండడంతో ఈసారి బడ్జెట్లో ఆ వివరాలు ఏవీ ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు.

అయినా మంత్రి ప్రసంగంలో మాత్రం గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పు చేసిందని తప్పుడు ఆరోపణ చేసి వదలి వేశారు.  మంత్రి కేశవ్ మొత్తం 16 సార్లు చంద్రబాబును పొగడడం కూడా అతిగానే ఉంది. మథా ప్రకారం జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం అంటూ ఆవు కథ చెబుతూ, ఆర్థిక  వ్యవస్థను గాడిలో పెట్టడానికి రెండేళ్లు సరిపోలేదని వాపోయారు. కూటమి నేతలు సంపద సృష్టిస్తామని ఎన్నికలలో ఊదరగొట్టారు.కాని అధికారంలోకి  వచ్చాక అప్పులేమో లక్షల కోట్లు చేశారు.ప్రజల సంపదను ప్రైవేటువారికి అర్ధణాకు,అణాకు కట్టబెట్టేస్తున్నారు.మరో వైపు 8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయని అసత్యాలు  వల్లె వేస్తూ బడ్జెట్ ప్రసంగం చేయడం వల్ల ప్రజలకు ఉపయగం ఏమి ఉంటుంది. స్థూలం గా చూస్తే ఏపీ బడ్జెట్‌ ప్రజల జ్ఞానానికి సవాలు విసురుతున్నట్లే.

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement