బాబు పోకడలతో విశాఖ ఉక్కు భవిష్యత్తు ప్రశ్నార్థకం | Kommineni Srinivasa Rao Comments On Chandrababu Visakha Steel | Sakshi
Sakshi News home page

బాబు పోకడలతో విశాఖ ఉక్కు భవిష్యత్తు ప్రశ్నార్థకం

Dec 1 2025 12:22 PM | Updated on Dec 1 2025 5:19 PM

Kommineni Srinivasa Rao Comments On Chandrababu Visakha Steel

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పేమీ చేయలేదు.. ఆయన సహజ స్వభావాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. అంతే! విశాఖపట్నంలో పారిశ్రామిక సమ్మిట్ జరిగిన సందర్భంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపైన, అందులో పనిచేసే  కార్మికులపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా అని ఆయన అన్నారు. వినడానికి బాగానే ఉంటుంది కదా!  

కాని ఇదే పెద్ద మనిషి 2024 ఎన్నికలకు ముందు ఏమని ప్రచారం చేశారు? ఇది ఆంధ్రుల హక్కు, సెంటిమెట్, దీనిని ఎలాగైనా కాపాడుకుంటాం,పొరాడుదాం.. అని చెప్పారా?లేదా?ఆ రోజు కార్మికులు సరిగా పనిచేయకపోవడం వల్లే నష్టాలలో ఉందని ఎందుకు ధైర్యంగా చెప్పలేదు?ఇప్పుడు మాట మార్చి తమ నైజాన్ని మరోసారి ప్రదర్శించినట్లు అవ్వలేదా? ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్మికులను ఎలా రెచ్చగొట్టారు? తాను ఈ ప్లాంట్‌ను కాపాడడానికి సిద్దంగా ఉన్నానని, కార్మిక సంఘాలు కలిసి రావాలని అన్నారే కానీ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు పవన్ ఎత్తడం లేదు. 

విశాఖ స్టీల్ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని కృషి చేసిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వీరిద్దరూ ఎన్ని అభాండాలు మోపారు! కొద్దికాలం క్రితం శాసనమండలిలో మంత్రి లోకేష్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినా వైఎస్సార్‌సీపీ  దుష్ప్రచారం చేస్తోందని అన్నారని వార్తలు వచ్చాయి కదా! ఆయన కూడా ప్రస్తుతం దీని గురించి మాట్లాడడం లేదే! అంటే వీరంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నారని ఒప్పుకోవలసిందే కదా! 12వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చాం కనుక ఇప్పుడు దానిని ఏమి చేసినా ఫర్వాలేదన్నట్లు  చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆశ్చర్యమే అనిపిస్తుంది. 

ఎందుకంటే ఆ ప్యాకేజీ ఎందుకు ఇచ్చారు?దేనికి వాడారు? ప్రైవేటువారికి అప్పగిస్తే  రుణ బారం తగ్గించి ఇవ్వడానికి అలా చేశారన్న సంగతి అర్ధం అవుతూనే ఉంది కదా! ఈ సంస్థకు సొంత గనులు లేవని మొత్తుకుంటుంటే ఆ సంగతి చెప్పకుండా, అనకాపల్లి వద్ద ప్రైవేటు రంగంలో మరో స్టీల్ ప్లాంట్ తెస్తున్నామని, దానికి గనులు కేటాయించడానికి ప్రధాని మోదీని ఒప్పించామని చంద్రబాబు చెప్పారు. పైగా అది లాభాలలో నడుస్తుందని ఆయన జోస్యం చెబుతున్నారు.

 విశాఖ ఉక్కుకు ఎందుకు గనులు కేటాయించేలా కృషి చేయలేదో వివరించాలి కదా! ప్రైవేటుపై మోజు ఉంటే ఉండవచ్చు. కాని ఎన్ని కంపెనీలు ప్రభుత్వం నుంచి రాయితీలు , బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఆ తర్వాత వాటిని సరిగా నడపలేక చేతులెత్తేశాయి. మరికొన్ని సంస్థలు  మోసాలు చేసి దివాళాకు వెళ్ళాయి. ఇలా మూత పడ్డ పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు మాత్రం బ్రహ్మాండంగా, హాపీగా ఉంటున్నారే. రాజకీయాలలోకి వచ్చి మంచి పదవులు పొందుతున్నారే. టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వందల కోట్ల రుణాలను బ్యాంకులనుంచి పొంది ఎగనామం పెట్టారు కదా! గతంలో చంద్రబాబు టైమ్‌లో  కొండపల్లి వద్ద లాంకో పవర్ అన్న సంస్థ ఏర్పాటైంది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌కు  చెందిన  ఆ సంస్థ వివిధ కారణాలతో మూతపడింది.

ఆ కంపెనీకి బ్యాంకులు ఇచ్చిన 45వేల కోట్ల రుణాలలో ఎంత భాగం మాఫీ అయ్యాయో చంద్రబాబు వంటి వారికి తెలియదా? అప్పుడు తెల్ల ఏనుగులకు ప్రభుత్వ డబ్బు కట్టబెట్టినా ఫర్వాలేదా? దేశ వ్యాప్తంగా ఏటా లక్షల కోట్ల మేర బ్యాంకులు పరిశ్రమలవారికి ఇచ్చిన రుణాలను  రద్దు చేస్తున్నట్లు అధికారికంగానే ప్రకటిస్తున్నాయి కదా! ప్రైవేటు కంపెనీ లూలూ కు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా వందల కోట్ల విలువైన భూమిని అర్ధణా,అణాలకు ఇచ్చేసింది కదా! అదే కంపెనీ అహ్మదాబాద్‌లో ఎందుకు 519 కోట్లతో భూమి కొనుగోలు చేసింది. 

ఏపీలో మాత్రం అతి తక్కువ మొత్తానికి విలువైన భూమిని లీజుగా పొందింది? దీనికి ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు?ఆ కంపెనీ ఉత్పత్తులపై పవన్ కళ్యాణ్ అభ్యంతరం పెట్టినా పట్టించుకోలేదే! కొన్ని  కంపెనీలకు 99 పైసలకే భూములు ఇవ్వడం, మరికొన్నిటికి వేల కోట్ల రాయితీలు ఇవ్వడంం, ఉర్సా వంటి సంస్థలకు భూముల అమ్మకం వంటివి సమర్ధనీయమేనా? ఆ రాయితీలు  ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ఇచ్చేది. 

ప్రభుత్వ రంగ సంస్థలు సరిగా పనిచేయవని ఒక ముద్ర  వేసి వాటి ఆస్తులను ప్రైవేటువారికి కట్టబెట్టడంలోని మతలబు ఏమిటి?చంద్రబాబు హయాంలోనే  ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజ్ చేశారు. ఆ ప్రైవేటు కంపెనీలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయా? లేక కంపెనీలను మూసి  భూములు అమ్ముకుంటున్నాయా? అన్న శంక పలువురిలో ఉంది. 

దానిపై చంద్రబాబు వివరణ ఇవ్వగలిగితే బాగుంటుంది కదా? ప్రజల  పన్నులతోనే సమకూర్చుకున్న ఆస్తులను కొందరు వ్యక్తులను సంపన్నులను చేయడానికి వాడవచ్చా? దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన భూములు విశాఖ ఉక్కుకు ఉన్నాయా?లేదా? సెయిల్‌తో పోల్చితే సొంత గనులు లేకపోయినా    ఈ ప్లాంట్ ఉత్పాదకత ఎక్కువగా ఉన్న విషయాన్ని కార్మికులు గణాంకాలతో చెబుతున్నారు.  అలాంటి కంపెనీ నిలదొక్కుకోవడానికి ఏమి చేయాలన్నదానిపై దృష్టి పెట్టకుండా,ఎలాగైనా ప్రైవేటువారికి కట్టబెట్టాలన్న ఆలోచనతో ఎందుకు ముందుకు వెళుతున్నారు. 

ఎన్నికలకు ముందు అదే తమ విధానమని చెప్పి ఉంటే ఎవరూ  కాదనరు. కాని ఆ రోజు సెంటిమెంట్ అని ఆంధ్రుల హక్కు అని , ఈరోజు తెల్ల ఏనుగు అని అనడం, ప్రశ్నలు వేసిన మీడియావారిపై కస్సుమనడం చంద్రబాబుకే చెల్లింది. ఇవన్ని ఊసరవెల్లి మాటలుగా అనుకుంటారని కూడా ఫీల్ కారా? గొర్రె కసాయి వాడినే నమ్ముతుందన్నట్లుగా ఆ రోజుల్లో విశాఖ ప్రాంత ప్రజలు వీరి ప్రచారం నమ్మి భారీ మెజార్టీతో గెలిపించారు. 

అదికారం వచ్చాక వారిని ఏమి ప్రశ్నించలేని  పరిస్థితి ఉంది. ఇప్పటికే సుమారు 35 విభాగాలను ప్రైవేటువారికి అప్పగించడానికి రంగం సిద్దం చేశారు. కొన్నివేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించారు. ప్రభుత్వానికి ఈ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయం ఎంత అన్నదాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. విశాఖకు ఒక ఐడెంటిటిగా ఉన్న ఈ ప్లాంట్  భవిష్యత్తును గందరగోళంలోకి ప్రభుత్వమే నెడుతున్నట్లుగా కనిపిస్తుంది. కేంద్రం ఈ విషయంలో చాలాకాలం గా స్పష్టంగా ఉన్నా,చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ వంటివారు దీనిపై  కార్మికులను ఎన్నికలకు ముందు మభ్యపెట్టడానికి సెంటిమెంట్ డైలాగులువాడారు. పైగా విశాఖ స్టీల్ ను ప్రైవేటుపరం చేయవద్దని తీర్మానం చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వంనై అభాండాలు మోపారు.

ప్లాంట్ కు ఉన్న భూములలో కొంత భాగాన్ని అమ్మి ప్లాంట్ ను రక్షించుకుందామని ఆనాటి ప్రభుత్వం ప్రతిపాదిస్తే చాలా ఘోరం జరిగిపోతోందని చంద్రబాబు గగ్గోలు  పెట్టారే!ఇప్పుడు ఏకంగా భూమితో పాటు స్టీల్  ప్లాంట్ ను ప్రైవేటువారికి అప్పనంగా ఇచ్చేసేలా ఉన్నారు. దీనిపై కార్మిక సంఘాలు కాని, రాజకీయ పార్టీల  నేతలు కాని విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ప్రశ్నిస్తే కేసులు పెట్టడానికి పోలీసులు సిద్దంగా ఉంటారు. ఎక్కడ లేని విధంగా విశాఖ స్టీల్  ప్లాంట్ లో ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలుఇవ్వాలని యాజమాన్యం తలపెట్టిందట. 

ఇది పుండుమీద కారం చల్లడమే అవుతుందనిపిస్తుంది. పని చేయకపోయినా జీతాలు ఇవ్వాలా అన్న ప్రశ్న వేసిన చంద్రబాబుకు కార్మికులు కొన్ని ప్రశ్నలు వేస్తున్నారు.    సూపర్ సిక్స్ అని, ఎన్నికల మానిఫెస్టో అని 150 హామీలు ఇచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అనేక హామీలను ఎగవేస్తోంది కదా! అలాంటి ప్రభుత్వం కొనసాగడం ఎలా కరెక్టు  అవుతుందన్నది   వారి సందేహంగా ఉంది. నిత్యం అసత్య ప్రచారాలతో కాలాక్షేపం చేస్తున్న చంద్రబాబు సర్కార్ లోని మంత్రులకు ఎందుకు జితాలివ్వాలని జనం అడగవచ్చా? ప్రభుత్వంలోని సిబ్బందికి కూడా ఇలాగే ఏమైనా కండిషన్లు పెట్టబోతున్నారా?అని వారు అడుగుతున్నారు.  

మునుపెన్నడూ లేని విధంగా  ప్రత్యేక విమానాలలో , హెలికాప్టర్లలో  డిప్యూటీ సీఎం   పవన్ కళ్యాణ్‌, మంత్రి లోకేష్ లు తరచుగా పర్యటిస్తున్నారు కదా!వారికి అలా తిరిగే అధికారం ఉందా?లేకపోతే ఈ ఖర్చును జనం ఎందుకు భరించాలి. దేశవ్యాప్తంగా మరో నాలుగు ఉక్కు కర్మాగారాలను ప్రైవేటైజ్ చేయడానికి కేంద్రం ప్రతిపాదించి, ఆ రాష్ట్రాలలో వచ్చిన నిరసన దృష్ట్యా వెనక్కి తగ్గిందట.  

కాని ఆంధ్రులకు ఆ చేవ లేదని భావించిందో ఏమో కాని, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై ముందుకు వెళుతోందన్న అభిప్రాయం ఏర్పడింది.దానికి చంద్రబాబు  ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మద్దతు ఇవ్వడం విషాదం. ఏది ఏమైనా విశాఖ ఉక్కు విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా డబాయిస్తున్నానులే అనుకుంటుండవచ్చు. కాని ఉత్తరాంధ్రకే కాదు.. ఆంధ్ర ప్రజల సెంటిమెంట్‌కు  ఆయన ద్రోహం చేసినట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకుంటే మంచిది.


కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement