ఎల్లో మీడియా సృష్టి అది.. బాబూ చూసుకోవాలి కదా! | AP CM Chandrababu Under Fire: Pension Cuts, Urea Shortage & Amaravati Flood Controversy | Sakshi
Sakshi News home page

ఎల్లో మీడియా సృష్టి అది.. బాబూ చూసుకోవాలి కదా!

Aug 29 2025 11:18 AM | Updated on Aug 29 2025 11:32 AM

KSR Comments On Chandrababu Govt And AP Pensions

దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న వార్తా కధనం వచ్చింది. అంతవరకు  సంతోషమే.  అదే రోజు, ఆ మరుసటి రోజు వచ్చిన కొన్ని వార్తలు చూస్తే ఆవేదన కలుగుతుంది. యూరియా కోసం రైతులు పడుతున్న పాట్లు, పెన్షన్ కోసం దివ్యాంగులు నానా  అగచాట్లు పడుతున్న వైనంపై సచిత్ర కథనాలు వచ్చాయి. నిజంగా ఈ పరిస్థితి బాధాకరమే. అంతేకాదు.. పెన్షన్‌కు అనర్హులు అంటూ నోటీసు రావడంతో ఆందోళనకు గురైన దివ్యాంగ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవడం మరింత కలచివేస్తుంది.

ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక నెలకొన్న దయనీయ పరిస్థితికి ఇది దర్పణం పడుతుందనుకోవాలి. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ పెన్షన్ దారుల విషయంలో, యూరియా సరఫరాపై దుష్ప్రచారం జరుగుతోందని అన్నారట. అలాగే అమరావతి మునిగిందని చెబుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇది మరింత విచారకరమని చెప్పాలి. ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై, లేదా  ఇబ్బందులపై వార్తలు వస్తే వాటిని సరిచేసుకోవాల్సిన ముఖ్యమంత్రి తన ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని ఇలాంటి ప్రకటనలు చేయడం డబుల్ స్టాండర్డ్స్ గా కనిపిస్తుంది. విశేషం ఏమిటంటే ఈ రెండు అంశాలకు సంబంధించి ఎల్లో మీడియా కూడా తమ జిల్లా పత్రికలలో పెన్షన్ దారులు పడుతున్న పాట్లు, యూరియా ఇక్కట్లు, అమరావతిలో వరద మొదలైన అంశాలపై  కథనాలు ఇచ్చాయి.

రాష్ట్రస్థాయిలో  మాత్రం వాటిని కప్పిపుచ్చి చంద్రబాబు చేసిన దుష్ప్రచారం అన్న వ్యాఖ్యకే  ప్రాధాన్యం ఇచ్చాయి. ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల మొత్తాన్ని వారి వైకల్యాన్ని బట్టి ఆరువేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు పెన్షన్ ఇస్తామని కూటమి  పార్టీలు టీడీపీ, జనసేన ఎన్నికల హామీగా  ఇచ్చాయి. ప్రభుత్వం వచ్చాక పెన్షన్ పెంచినట్లు పెంచి, అనర్హుల పేరుతో చాలా మందిని ఆ జాబితా నుంచి తొలగించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి పార్ధసారధి తదితరులు దివ్యాంగ పెన్షన్లు అనర్హులకు అందుతున్నాయని, పెన్షన్‌దారులలో దొంగలు ఉన్నారని ఆరోపిస్తూ స్పీచ్‌లు ఇచ్చారు. డాక్టర్లకు డబ్బులు ఇచ్చి దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారని ఈ పెద్దలు కొందరు ఆరోపిస్తున్నారు. అంగవైకల్యంపై నోటీసులు వచ్చినవారికి వచ్చే నెల పెన్షన్ రాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన చేశారు. ఎవరైనా కోరి అంగవైకల్యం తెచ్చుకుంటారా? అలా అని చెప్పుకుంటారా?. కానీ, దురదృష్టవశాత్తు పాలకులు దివ్యాంగులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు. వారి పెన్షన్లు తొలగించడానికి నోటీసులు ఇస్తున్నారు.

దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఆందోళనకు దిగుతున్నారు. వారు తమ వైకల్యాన్ని టీవీల ముందు చూపుతున్న వైనం ఆవేదన కలిగిస్తుంది. అయినా ఎల్లో మీడియా మానవత్వం లేకుండా పెన్షన్లపై ఫేక్ రచ్చ అంటూ వార్తలు రాసి చంద్రబాబును సంతోషపెడుతోంది. నిజానికి ఎల్లో మీడియా చేస్తున్న అబద్దపు ప్రచారానికే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలలో పలచన అవుతుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ విషం అని ఈ మీడియా రాసింది. దివ్యాంగుల ఫించన్ల తొలగింపుపై అసత్యాలు అని సత్యదూరమైన వార్తలు ఇచ్చి ప్రజలను మోసం చేయడానికి ఎల్లో మీడియా  ప్రభుత్వంతో కుమ్కక్కైంది. ఇప్పుడు నిత్యం కలెక్టరేట్ల వద్ద దివ్యాంగులు చేస్తున్న ఆందోళన అబద్దమా?.

శ్రీకాకుళంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా?. పోనీ ఎల్లో మీడియా పెన్షన్‌దారులకు జరుగుతున్న అన్యాయంపై రాయలేదా?. అంటే వారు తమ జిల్లా పత్రికలలో రాస్తున్నారు. ఉదాహరణకు ఆగస్టు 21న ఇదే ఆంధ్రజ్యోతి అన్నమయ్య జిల్లా పత్రికలో అర్హులకు అన్యాయం అని హెడ్డింగ్‌ పెట్టి ఒక పేజీడు వార్తలు రాసింది. అంటే ప్రభుత్వంపై వారు విషం చిమ్మినట్లేనని ఒప్పుకుంటారా?. లేక నిజమే  రాశారా?. అలాగే చిత్తూరు జిల్లా ఎడిషన్‌లో వీరే రాసిన మరో వార్త ఏమిటంటే కొందరి పాపం.. వీరికి శాపం అని ఈ మొత్తం నెపాన్ని అధికారులు, డాక్టర్లపై నెట్టేసే యత్నం చేశారు. మంచానికే పరిమితమైన ఒక వ్యక్తికి నెలకు నాలుగు వేలే ఇస్తున్నారని ఇదే ఎల్లో మీడియా వారు ఫోటోతో సహా ప్రచురించారు. రెండు కాళ్లు పనిచేయకున్నా పూర్తిగా పెన్షన్ రద్దు చేశారని కూడా ఫోటోతో కూడిన మరో  వార్తను ప్రచురించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జిల్లాలలో ఇదే పరిస్థితి నెలకొంది.

సాక్షి పత్రిక రాసినా, వైఎస్సార్‌సీపీ విమర్శలు చేసినా, అవి ఫేక్ ప్రచారం అయితే మరి ఇదే విషయాన్ని ఎల్లో మీడియా రాస్తోంది కదా?. దానిని ఏమంటారు. రాష్ట్ర స్థాయిలో ఒకరకంగా, జిల్లాలలో మరో రకంగా రాస్తున్న టీడీపీ మీడియా ఫేక్‌ అవుతుందా? లేదా?. అన్నది వారే ఆలోచించుకోవాలి. సాక్షిలో వచ్చిన కధనాలు కాని, వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఆరోపణలు కాని నిజం కాకపోతే ప్రభుత్వం ఈ దివ్యాంగుల పెన్షన్లను యధాతధంగా ఉంచుతామని ఎల్లో మీడియాకు ఎందుకు లీక్ ఇచ్చారో చెప్పాలి. అంగవైకల్యంపై సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లపై కేసులు పెడతామని మంత్రివర్గ సమావేశంలో బెదిరించడంతో వారు తమ వద్దకు వచ్చినవారికి ఎలాంటి అంగవైకల్యం ఉన్నా అనర్హులుగా ప్రకటించేశారట. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించదా!.

ఇదే సందర్భంలో గతంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు రావడానికి ఒక ప్రైవేటు ఆసుపత్రి వారు ఇచ్చిన సర్టిఫికెట్‌ను వాడుకున్న విషయాన్ని కొందరు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇక యూరియా సరఫరాపై కూడా ఇలాగే ఎల్లో మీడియా చేస్తోంది. రైతులు నిత్యం యూరియా కోసం క్యూలు కట్టి ఇబ్బందులు పడుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అన్నారని ఎల్లో మీడియా రాసింది. మరో వైపు ఎరువుల బ్లాక్ మార్కెట్ పై నిఘా పెట్టాలని కూడా ఆయన ఆదేశించారట. యూరియా సరఫరాకు చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు అదేమీ లేదన్నట్లు దుష్ప్రచారంగా కొట్టిపారేస్తే  ఏమి ప్రయోజనం!. చెప్పులను కూడా  క్యూలో ఉంచి రైతులు ఒక టైమ్ అంటూ లేకుండా ఎదురుచూపులు  చూస్తున్న సన్నివేశాలు  రాష్ట్రం అంతటా కనిపిస్తున్నాయి. పలు చోట్ల సొసైటీలలో, రైతు సేవా కేంద్రాలలో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. సమస్య ఉంటే దానిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాకుండా ఎలా మాయ చేయాలన్న ఆలోచన చేస్తున్నారు. దానికి ఎల్లో మీడియా డప్పులు వాయిస్తోంది.

అమరావతి విషయంలో కూడా అలాగే చేస్తున్నారు. ఒకవైపు పెద్ద పెద్ద మోటార్లతో వరద నీరు తోడే  పనిలో కనిపిస్తుంటారు. మంత్రి  నారాయణ వరద నీరు పోవడానికి గండ్లు పెడుతున్నామని చెబుతారు. ఇంకోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు వరద ఏమీ లేనట్లు మాట్లాడి అమరావతి మునగలేదని బుకాయిస్తుంటారు. టీడీపీ మీడియా అయిన ఆంధ్రజ్యోతి మరికొన్ని పత్రికలలో సైతం అమరావతి ప్రాంతంలో వరదవల్ల ఆయా గ్రామాలలో ప్రజలు పడిన పాట్లను వివరిస్తూ వార్తలు వచ్చాయి. అయినా చంద్రబాబు కోపం ఎంతసేపు సాక్షిపై, వైఎస్సార్‌సీపీపైనే ఉంటుంది. ఏమి చేస్తాం. ఆయన ధోరణే అంతే. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో విపక్షం ఆధారాలు లేకుండా విమర్శలు  చేసే అవకాశం ఉందా?.

టీడీపీకి  అనుకూలంగా ఉన్న మీడియా తప్ప మరే ఇతర మీడియా అయినా నిజం లేని వార్తలను సృష్టించే అవకాశం ఉందా? ఇష్టం వచ్చినట్లు కేసులు పెట్టి వేధిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇందులో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైనా సమస్యలపై వార్తలు వస్తే వెంటనే సంబంధిత శాఖలతో ఖండన లేదా వివరణ ఇవ్వాలని చెప్పేవారు. కాని ఇప్పుడు అలాంటిదేమీ లేకుండానే స్వయంగా ఆయనే  సమస్యలపై అక్షర సత్యాలు రాస్తున్న మీడియాపైన విరుచుకుపడుతున్నారు. లేదంటే తప్పుడు కేసులు పెట్టి జర్నలిస్టులను వేధిస్తూ కొత్త పుంతలు తొక్కుతున్నారు. దీని ద్వారా చంద్రబాబు తనకు తాను ఎంత బలహీనుడుగా మారుతున్నారో ప్రజలకు చెప్పకనే చెబుతున్నారనుకోవాలి.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement