తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికి గౌరవమే. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదమూడేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా చేయని పనిచేసి ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్‌పై అభిమానం ఉంటే ఓకే కానీ.. ప్రజాధనాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఆక్షేపణీయమే.
ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్‌ను అవమానించినట్లే కూడా. ఎందుకంటే.. ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని రామరావు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు. పైగా గుజరాత్‌లో రూ.3,500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో రూ.మూడు వేల కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తుందా? అని అప్పట్లో బాబుగారు నిలదీశారు కూడా. ఇప్పుడు ఆ జోరు లేదనుకోండి.
ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో టాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒకపక్క నిధులు లేవని నిత్యం వాపోతూ, ఇంకోపక్క ఇలా విగ్రహానికి అంత ఖర్చు పెట్టడంపై అందరి అభ్యంతరం.
చిత్రమేమిటంటే ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌కు విలువలు లేవని, సినిమా వాళ్ల రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే, తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో తిరునల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఏపీలో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి దానిని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి, మరికొందరి విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్‌ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్‌కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్‌లో ఈ కార్టూన్లు కూడా పెడతారా? అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు.. దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏడాదిన్నర కాలంలోనే రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే, ఎన్టీఆర్ విగ్రహస్థాపనకు రూ.1750 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు రూ.250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. నిజంగానే ఏడాదిన్నరగా నిరర్ధకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు అడుగుతుంటే, వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజల కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు.
గత టర్మ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది కాని, పనులు ముందుకు తీసుకువెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా, విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ,ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్లకపోగా.. దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేవారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటివారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు.
నీరుకొండలో 1986 ప్రాంతంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండేది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్నివర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలియదు కాని, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1750 కోట్లు వ్యయం చేయడానికిపూనుకోవడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నమాట నిజం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


