ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు తరచూ కోటలు దాటుతూంటాయి. చిత్రి విచిత్రంగానూ అనిపిస్తాయి. ఒకసారేమో అనుభవజ్ఞుడైన డాక్టర్‌లాంటి వాడినైన తనకే రాష్ట్రం నాడి అంతచిక్కడం లేదంటారు. ఇంకోసారి... అర్థం కాకున్నా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబరిచే ప్రయత్నం చేస్తున్నా అంటారు. మరోసారి.. ఇంకోటి. చంద్రబాబు గారికి అనుభవమున్న మాట నిజమే కానీ.. ఎందులో? అన్నదే ప్రశ్న. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కడంలోనా? పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడంలోనా? రాజకీయాల కోసం వ్యక్తిత్వాలను హననం చేయడంలోనా? పదవి దక్కించుకునేందుకు నాడు ఎన్టీఆర్‌పై.. నిన్న మొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎన్ని రకాల అసత్య ప్రచారాలు, కుట్రలు పన్నారో ప్రజలందరూ చూశారు కాబట్టి ఆయన అనుభవం వీటిల్లోనే అని అనుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారనాలి.
ఇంకో విషయంలోనూ ఈయనగారి నేర్పరితనం మెండు. ఇతరులు చేసిన గొప్ప పనులను తన ఖాతాలో వేసేసుకోవడం. జగన్ దీన్నే క్రెడిట్ చోరీ అన్నమాట. అధికారంలోకి వచ్చేవరకు ఒక మాట, ఆ తరువాత ఇంకోమాట మాట్లాడటంలోనూ మాంచి అనుభవం సంపాదించారు. ఒకప్పుడైతే ఈయన గారి పరస్పర విరుద్ధ ప్రకటనలతో ఉపయోగం ఉండేదేమో కానీ.. సోషల్‌మీడియా రాజ్యమేలుతున్న ఈ కాలంలో మాత్రం చెల్లడం లేదు.
చంద్రబాబుతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాటలు మార్చే విషయంలో ఘనమైన రికార్డే సృష్టించారు. జగన్ ప్రభుత్వంపై వీరిద్దరు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేశారో, ఇప్పుడేమి మాట్లాడుతున్నారో పోల్చుతూ అనేక వీడియోలు కనిపిస్తుంటాయి. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అప్పట్లో వీరితోపాటు చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా విపరీత ప్రచారం చేశారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉన్న అప్పు రూ.14 లక్షల కోట్లను జగన్ ఒక్కడే చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత దీంట్లోని డొల్లతనం ఏమిటన్నది అసెంబ్లీ సాక్షిగానే బట్టబయలైంది. పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదిన్నర కాకముందే రికార్డు స్థాయిలో రూ.2.20 లక్షల కోట్ల అప్పులు చేసి దేశంలోనే నెంబర్ ఒన్‌గా నిలిచారు.
ఈ అప్పు ఏపీ కొంప ముంచుతుందని తెలిసినా ప్రజలు మాట్లాడకుండా ఉండేందుకు ఆయన తన అనుభవాన్ని ఉపయోగించగలరు. మద్యం విషయంలోనూ ఇంతే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కారణంగా 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారని లేని ఆరోపణలు చేశారు.. తాము పెత్తనం చెలాయించే సమయంలో సొంత పార్టీ వారే అన్ని రకాల నకిలీ దందాలు చేస్తూ పట్టుబడ్డా నిమ్మకు నీరెత్తడంలేదు. ఎన్నికల సమయంలో ఏటా రూ.1.5 లక్షల కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని నమ్మబలికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అదెలా సాధ్యమని ప్రశ్నించిన వారికి... సంపద సృష్టి చంద్రబాబు అనుభవం ఉందంటూ చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం సంపద సృష్టికి సలహాలు ఇవ్వండని బాబే ప్రజలనే కోరడం ఆరంభించారు.
1994లో ఎన్టీఆర్ కేబినెట్లో ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా ఉన్న చంద్రబాబు మునుపటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించడానికి శ్వేతపత్రాల తంతు నిర్వహించారు. ఇలాంటి జిమ్మిక్కులు ఆయనకు అప్పటి నుంచే తెలుసన్నమాట. ఆ తర్వాత ఎన్టీఆర్ పాలనను విమర్శిస్తూ మీడియా ద్వారా కథనాలు రాయించేవారట. కాంగ్రెస్‌తో కలిసి జగన్‌పై కేసులు పెట్టడంలో, ఆయనపై వచ్చిన ఆరోపణలను వంద రెట్లు అధికం చేసి ప్రచారం చేయడంలోను చంద్రబాబు తన అనుభవం మొత్తాన్ని రంగరించారు. స్వార్ద రాజకీయ ప్రయోజనాలకే తన అనుభవాన్ని వాడుతున్నారని తెలిసి ప్రజలు కొన్నిసార్లు ప్రజలు చంద్రబాబును ఓడించారు. తదుపరి ఆయన వ్యూహం మార్చి కాపీ రాగంలోకి వచ్చేస్తుంటారు. ఉదాహరణకు జగన్ తన ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అనేక కొత్త వ్యవస్థల పేర్లు మార్చి అవేవో తాను సృష్టించిన వాటిగా చూపించే యత్నం చేయడం.
జగన్ 2019లో తీసుకొచ్చిన నవరత్నాలను అప్పట్లో గేలి చేసిన చంద్రబాబు ఆ తర్వాత కొద్దిపాటి మార్పులు, చేర్పులతో 2024 మానిఫెస్టోలో పెట్టుకున్నారు. జగన్ అమలు చేసినవాటిని కొనసాగిస్తూనే అనేక అదనపు స్కీములను ప్రజలకు అందచేస్తానని ఊరించారు. వాటిని ఇప్పుడు అమలు చేయలేక చతికిలపడి, ఆ మాట నేరుగా చెప్పకుండా జగన్ టైమ్‌లో ఏదో విధ్వంసం అయిందని, అందువల్ల తాను చేయలేకపోతున్నానని ప్రజలను నమ్మించడానికి తన అనుభవాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఏపీలో సుపరిపాలన కూడా వచ్చేసిందట.సెల్ ఫోన్ లోనే పనులన్నీ అయిపోతున్నాయట.అది నిజమే అయితే కొద్ది రోజుల క్రితం లోకేశ్ పార్టీ ఆఫీస్ కు వెళితే నాలుగు వేల మంది ఎందుకు క్యూలో నిలబడి తమ సమస్యలు తీర్చాలని అర్ధించారో చెప్పాలి. గ్యాస్ ఇచ్చే బాయ్ టిప్ అడుగుతున్నాడా అని తెలుసుకుంటున్న చంద్రబాబుకు తన పార్టీ ఎమ్మెల్యేలు వసూలు చేస్తున్న డబ్బుల గురించి, టిక్కెట్ల అమ్మకాల గురించి తెలుసుకోలేకపోయారని అనుకోవాలి.ఉమ్మడి ఏపీకి చంద్రబాబు 21 ఏళ్ల క్రితం సీఎంగా ఉండేవారు. అయినా ఇప్పటికీ హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని గప్పాలు పోతుంటారు. ఔటర్ రింగ్ రోడ్డుతోసహా ఆయన పాలన తర్వాత జరిగిన అభివృద్ది అంతటిని తన ఖాతాలో వేసుకోవడంలో దిట్ట అని ఒప్పుకోవల్సిందే.
హైదరాబాద్‌ను ఇటుక,ఇటుక పేర్చి అభివృద్ది చేశానని ప్రచారం చేసుకునే ఆయన ఆంధ్ర ప్రాంతాన్ని ఎందుకు అభివృద్ది చేయలేకపోయారో చెప్పరు. మొన్నటిదాక పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, వస్తున్నాయని చెప్పేవారు.ఇక ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పేశారు. విశాఖ సదస్సు ద్వారా మరో రూ.13 లక్షల కోట్లు వస్తాయని చెబుతున్నారు. ఇలా అతిశయోక్తులతో కూడిన మాటలు చెప్పడంలో అసత్యాలు వల్లె వేయడంలో చంద్రబాబు మొనగాడని చెప్పక తప్పదు. ఏది ఏమైనా చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రాభివృద్ది ఆశించడం అత్యాశే అవుతుందేమో!

కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


