
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న అనేకానేక పేర్లలో లీకు వీరుడన్నది ఒకటి. చేసే పనులతో సంబంధం ఉండదు. కానీ తనకు ప్రయోజనం కలిగే ప్రచారం మాత్రమే జరిగేలా జాగ్రత్త పడుతూంటారు. అయితే సోషల్ మీడియా లేని టైమ్‌లో ఈయన గారి చేష్టలు నడిచిపోయాయి కానీ.. ఇప్పుడు అసలు గుట్టును బయటపెట్టేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేల వల్ల చెడ్డపేరు వస్తే సహించనని ఆయన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో అన్నారట.
కూటమి ప్రభుత్వ వైఫల్యాల వల్ల తమకు చెడ్డపేరు వస్తోందని ఎమ్మెల్యేలు మొత్తకుంటూంటే.. చంద్రబాబు తెలివిగా దాన్ని తిరిగి ఎమ్మెల్యేలపైనే తోసేసే ప్రయత్నమన్నమాట ఈ వ్యాఖ్య! కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారని అంగీకరిస్తూనే, వారేదో చిన్న తప్పులు చేస్తున్న కలరింగ్ ఇవ్వడం ఇంకోసారి అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు లీక్ ఇచ్చి సరిపెట్టుకున్నారు. దీనర్థం... మీరెన్ని అకృత్యాలకు పాల్పడ్డ.. పెద్దగా ఇబ్బందేమీ ఉండదన్న సందేశం పంపడమే!
నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎమ్మెల్యేలు ఇసుక, మద్యం తదితర దందాలు సాగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. పలువురు మంత్రులపై కూడా విమర్శలున్నాయి. ఈ విషయాలపై చంద్రబాబు ఇప్పటికే 35 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఎల్లోమీడియా కథనం. అంటే ఇంకెంతమంది అక్రమ దందాల్లో మునిగి తేలుతున్నట్లు? ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేదెన్నడు? ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన ఆరోపణలే వచ్చాయి కానీ.. వాటిని కూడా చూసిచూడనట్టుగా సుతిమెత్తటి వార్నింగ్‌లతో సరిపుచ్చేస్తున్నారు తెలుగుదేశం అధినేత.
నెల్లూరు జిల్లాకు చెందిన ఒక రౌడీషీటర్, జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ ఇచ్చిన తీరు కలకలం రేపింది. ఆ జిల్లాకు చెందిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫారసు చేయడం, ఆ మీదట హోం మంత్రి అనిత ఒత్తిడి కారణంగా హోం శాఖ అధికారులు పెరోల్ మంజూరు చేశారని నిఘా విభాగమే నివేదిక అందించిందట. అయినా బాబు ఎమ్మెల్యేలను కానీ.. మంత్రిని కానీ ఏమీ అనలేదు. మంత్రి ఏమో.... అదేదో ఒవర్‌లుక్ వల్ల జరిగిందని బాధ్యత నుంచి తప్పించుకోచూశారు. ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి లోకేశ్ పెరోల్ ఇచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారట.
ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చారా? లేదా? వీరిపై చర్య తీసుకోవడం మాని వైసీపీ వారు దుష్ప్రచారం చేస్తున్నారని, క్రిమినల్ మాఫియాగా ఉన్నారని చంద్రబాబు అనడంలో అర్థం ఏమైనా ఉందా? ప్రస్తుతం ఏపీ అంతటా టీడీపీ వర్గీయులు మాఫియాగా మారి దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై వేధింపులు తదితర అకృత్యాలకు పాల్పడుతున్నట్లు నిత్యం వార్తలు వస్తుంటే, వాటి గురించి మాట్లాడకుండా వైసీపీపై విమర్శలు చేసి డైవర్ట్ చేస్తే సరిపోతుందా? టీడీసీ ఎమ్మెల్యేల గత చరిత్ర ప్రకారం ఎంతమందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయో ఆయనకు తెలియదా! ఈ పెరోల్ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ ఎక్కడ మరిన్ని నిజాలు చెబుతుందో అని అనుమానించి ఆమెను ఏదో కేసులో అరెస్టు చేసి భయపెట్టడం మంచి పాలన అవుతుందా? అన్న చర్చ కూడా ఉంది.
వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడుపై అగ్రోస్ జీఎం రాసిన లేఖ గురించి సీఎం ఏమంటారో తెలియదు. ఒక ఏపీ మంత్రి హైదరాబాద్‌లో కూర్చుని సెటిల్మెంట్లు చేస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. ఒక మంత్రి రాసలీలలు అంటూ టీడీపీ అధికార ప్రతినిధే వెల్లడించిన వైనం కనపడుతూనే ఉంది. అయినా చర్యలు నిల్. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి శ్రీశైలంలో అటవీశాఖ సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన తీరు పాశవికంగా ఉంది. చెక్ పోస్టు గేట్ తీయలేదని అటవీశాఖ సిబ్బందిపై తన అనుచరులతో కలిసి భౌతిక దాడికి దిగారని టీడీపీ మీడియా కూడా రాసింది. తప్పనిసరి స్థితిలో బుడ్డా రాజశేఖరరెడ్డిపై కేసు పెట్టారు కాని, బెయిలబుల్ సెక్షన్లు పెట్టి సరిపెట్టారు. అది ఎంత పెద్ద నేరం? అయినా ఇంతవరకు ఎమ్మెల్యేని అరెస్టు చేయలేదు. మొక్కుబడి తంతుగా మార్చారు.
ఇక్కడ ట్విస్టు ఏమిటంటే జనసేన నేతను ఏ-1గా కేసు పెట్టారట. దాంతో టీడీపీనే కాకుండా, వారి కేసుల్నీ కూడా జనసేన మోయాలా అన్న జోకులు వస్తున్నాయి. అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కమిటీ వేశారట.అంతే తప్ప ఆ ఎమ్మెల్యేని ఒక్క మాట అన్నట్లు కనినపించలేదు అదే తమకు గిట్టని వ్యక్తులు, తమ అరాచకాలకు మద్దతు ఇవ్వని జర్నలిస్టులపై సైతం చిన్న తప్పు చేసినా, అసలు తప్పు చేయకపోయినా, ఏదో ఒక తప్పుడు కేసు పెట్టి,పదేసి సెక్షన్లు రాసి బెయిల్ రానివ్వకూడదన్న లక్ష్యంతో జైలుకు పంపిస్తుంటారు. దీనినే మంచి ప్రభుత్వం అనుకోవాలన్నమాట. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక మహిళా ఎమ్మార్వోని బెదిరించారన్న అభియోగం రాగానే పోలీసులు కేసు పెట్టి స్టేషన్‌కు తీసుకువెళ్లారు.
ఆ రోజుల్లో శ్రీధర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ నాయకత్వం, 2024 ఎన్నికలలో ఆయనను తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ కూడా ఇచ్చింది.అలాగే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లపై తీవ్రమైన ఆరోపణలు చేసేవారు. పేకాట క్లబ్ లు నడుపుతారని, అవినీతిపరుడని ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే గత ఎన్నికలలో ఆయనకు గుంతకల్ టిక్కెట్ ఇచ్చారు.అలా ఉంటుంది. చంద్రబాబు స్టైల్. తన పార్టీలో ఉంటే ఎంత తప్పు చేసినా పునీతుడు అయిపోతాడు, అదే వేరే పార్టీవారైతే నోటికి వచ్చిన దూషణలు చేస్తుంటారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను, ఆయన తల్లిని దూషించారన్న అభియోగాలు ఎదుర్కుంటున్న అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పై ఎందుకు చర్య తీసుకోలేకపోయారో ఇప్పటివరకూ వివరణ ఇవ్వలేదు. అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలపై వచ్చిన అభియోగాలు ఏమీ చిన్నవి కావు.అయినా వారిని ఎవరూ టచ్ చేయలేరు. అరాచకాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసే బాధ్యత ఇన్‌ఛార్జి మంత్రులదేనని సీఎం చెప్పారట.
అసలు మంత్రుల మాట వినే ఎమ్మెల్యేలు ఎవరు అన్నది చర్చ. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబు ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా..ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అక్రమాలపై ప్రచారం జరగరాదట. ప్రభుత్వం చేసే మంచిపైనే చర్చ జరగాలట. నిజమే ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని చేస్తే ప్రచారం ఆశించడం తప్పుకాదు.కాని మంచి జరిగినా, జరగక పోయినా, అన్నీ జరిగిపోతున్నట్లు ప్రచారం జరగాలని కోరుకోవడమే ఇక్కడ ఆసక్తికర అంశం. ఎమ్మెల్యేలను మందలించినట్లు కనిపిస్తే వారు చేసిన తప్పులన్నీ ఒప్పులయిపోతాయా?
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.