
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మళ్లీ మాట మార్చారు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేనే లేదని, యూరియాతోపాటు మొత్తం 94,892 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని సెప్టెంబరు మూడో తారీఖున ప్రకటించిన బాబుగారు.. పదహారవ తేదీ వచ్చేసరికి యూరియా సరఫరాలో విఫలమయ్యామని, మానవ తప్పిదం జరిగిపోయిందని, అధికారులు తానిచ్చిన ప్రణాళికను అమలు చేయకపోవడంతోనే ఈ విపత్తు అన్నట్టుగా జిల్లా కలెక్టర్ల సమావేశంలో వాపోయారు! తద్వారా ఏం తేలింది? రాష్ట్రంలో యూరియా నిల్వలు ఉన్నాయనడం తన ఘనతగానూ.. లేమికి కారణం అధికారులదిగానూ తేల్చేసినట్ట అయ్యింది!
యూరియా కొరత లేదని దబాయించినప్పుడు... వాస్తవపరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినప్పుడు బాబుగారు ఎంత హడావుడి చేశారని? వైఎస్సార్ కాంగ్రెస్ బుద్ది, జ్ఞానం లేకుండా వ్యవహరిస్తోందని, దుష్ప్రచారం చేస్తూ తప్పుడు పోస్టులు పెడుతోందని, వారు మనుషులా, పశువులా అని కూడా పెడబొబ్బలు పెట్టారు. ఇలాంటి ప్రచారాన్ని ఆపకపోతే బొక్కలో పెడతా.. ఖబడ్డార్! అని హెచ్చరించారు కూడా. వైసీపీ రాజకీయంలో భాగం కావద్దని రైతులు, రైతులుగా ప్రవర్తించాలని కూడా ఆయన బెదిరించారు. ఈ హూంకరింపులన్నీ సోషల్‌మీడియాను బెదిరించేందుకే అన్నది స్పష్టం. టీడీపీకి వంతపాడే ఎల్లో మీడియా కూడా జిల్లా పత్రికలలో యూరియాపై రైతులు పడుతున్న పాట్లను ఫోటోలతో సహా కథనాలు ఇస్తూంటే ఆ విషయం బాబుగారికి తెలియకుండా పోతుందా? స్టేట్ పేజీలలో తన బెదిరింపు ప్రకటనలకే టీడీపీ మీడియా ప్రాధాన్యం ఇస్తుండడంతో అదే నిజమని జనం నమ్మాలని భావించారా అన్నది తెలియదు.
యూరియా సమస్యపై నెల రోజులుగా రైతులు అల్లాడుతున్నారు. కేంద్రాల వద్ద బారులు కడుతున్నారు. కొన్ని చోట్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఏదో బుకాయిస్తే సరిపోదన్న సంగతి అర్థమై ఉండాలి. దాంతో ఇప్పుడు యూరియా సరఫరాపై ప్లాన్ ఇచ్చానని నాలుక మడతేశారు. అదేమిటో చెబితే అధికారులకు తెలిసేది కదా! టీడీపీ నేతలు యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించడంతో రైతులకు ఈ కష్టాలొచ్చాయని అంటున్నారు. యూరియా ఎక్కువగా వాడితే ఆ పంటలు వల్ల ప్రజలకు కేన్సర్‌వస్తుందని భయపెడుతున్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించాలని, భూసార పరీక్షలు నిర్వహించ లేదని, రైతులకు సూక్ష్మ పోషకాలను పంపిణీ చేయలేదని, వ్యవసాయ అవసరాలకు సంబంధించి అధికార్లు ముందు జాగ్రత్తలు తీసుకోలేదని చంద్రబాబు చెప్పారు.ఇందుకు బాధ్యత ఎవరిది? ఇంత నిర్లక్ష్యంగా ఉన్నవారిపై ఏ చర్య తీసుకున్నారు? ఉల్లి, టమోటా ధరలు కూడా పడి పోయాయని, ఈ టైమ్‌లో రైతులు రోడ్డున పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కలెక్టర్ లను కోరడం మంచిదే అయినా, కాని వాస్తవంలో రైతులు తమ ఉత్పత్తులను కాల్వలలో, రోడ్ల పక్కన పారబోస్తున్నారు. వారికి జరిగిన నష్టంపై ప్రభుత్వం ఏమైనా దృష్టి పెడుతుందా అన్నది చెప్పి ఉంటే బాగుండేది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా బెనిఫిట్ షో టిక్కెట్ ధర రూ.వెయ్యిగా నిర్ణయించిన నేపథ్యంలో పలువురు నెటిజన్లు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. . ఆయన చెబుతున్న సంగతులన్నిటికి కేవలం అధికారులే బాధ్యులా? అంటే కాదనే చెప్పాలి. ఎప్పుడూ ఏదో ఒక రివ్యూ, ఏదో ఒక కార్యక్రమం పెడుతూ అసలు పనులు చేయనివ్వకుండా ప్రచారానికి వారిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిరోజు చంద్రబాబు ఏదో ఒక చోట టూర్ చేస్తుంటారు.దాంతో అధికారులంతా ఆ ఏర్పాట్ల మీదే దృష్టి పెట్టవలసి ఉంటుంది. పైగా ప్రభుత్వానికి తరచుగా ఆయా నివేదికలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట. ఏదో రకంగా కాకి లెక్కలతో రిపోర్టులు తయారు చేసి పంపే పనిలో అధికారులు ఉంటున్నారని ఎల్లో మీడియానే ఒక వార్త రాసింది. ఒక ఉదాహరణ చూద్దాం. రాయలసీమలో టమోటా, ఉల్లి పంటలు అధికం.
ప్రతి నెల మొదటి తేదీన అదనపు ఫించన్ వెయ్యి రూపాయలతో కలిపి నాలుగువేలు ఇవ్వడానికి హెలికాఫ్టర్ వేసుకుని జిల్లాలకు సి.ఎమ్. వెళుతున్నారు.అలాగే ఆయా చోట్ల ఇతర మంత్రులు కూడా ఆ పని చేస్తుంటారు. ఆ సందర్భంలో యూరియా సమస్య వంటివాటిపై ఎందుకు వీరు దృష్టి పెట్టలేదు? లేదా రాజంపేట, కర్నూలు, అనంతపురం వంటి చోట్లకు చంద్రబాబే వెళ్లారు కదా! ఈ మధ్య ఆయన బడ్డి కొట్టు వద్దకు, కుండలు చేసేవారి వద్దకు వెళ్లడం, ఆటో ఎక్కి ప్రయాణం చేయడం వంటివి చేస్తున్నారు కదా! ఆ క్రమంలో ప్రధానంగా ఆ జిల్లాలో ఉన్న సమస్య ఏమిటో తెలుసుకుని ఆ వర్గాల వారిని కలిసి మాట్లాడితే ముందుగానే యూరియా కొరత గురించి, టమోటా, ఉల్లి, మామిడి వంటి పంటల ధరల గురించి తెలిసేది కదా!
యూరియా అవసరమైన మేర వేయకపోతే పంటలు దెబ్బతింటాయని రైతులు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు యూరియా వాడవద్దని, కాన్సర్ వస్తుందని చెబితే రైతులకు పుండుపై కారం చల్లినట్లు ఉండదా? అందుకే సోషల్ మీడియాలో ఒక ప్రశ్న వేస్తున్నారు. యూరియా వినియోగిస్తే కేన్సర్ వస్తుందని చెబుతున్నారు. మరి మద్యం తాగితే ఎలాంటి జబ్బు రాదా? దానిని ఎందుకు విచ్చలవిడిగా అమ్మిస్తున్నారని కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. యూరియా వాడకపోతే బస్తాకు రూ.800 ప్రోత్సాహకం ఇస్తామని చెబితే ఎవరు నమ్ముతారు? పైగా అందుకోసం ఇప్పుడు ఉన్న పంటను ఎవరైనా కోల్పోవడానికి సిద్దపడతారా? ఇలాంటి వాటిని ఎప్పుడు చెప్పాలి. సీజన్ రావడానికి నెలల ముందు కదా! అందుకు తగు ప్రత్యామ్నాయాలు ఏమిటో రైతులకు వివరించాలి కదా? అవన్ని వదలివేసి ఇప్పుడే ఏదో తెలిసినట్లు మాట్లాడితే రైతులు విశ్వసిస్తారా? అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల రూపాయల చొప్పున ప్రతీ రైతుకు ఇస్తామని చెప్పి, ఒక ఏడాదిపాటు ఒక్క రూపాయి ఇవ్వలేదు.
రెండో సంవత్సరం ఐదువేలు ఇచ్చారు. ఆ అనుభవం రైతులకు గుర్తు ఉండదా? భూసార పరీక్షలు జరగలేదని ఆయనే చెప్పారు.అవి ఎప్పుడు జరగాలి. ఎందుకు జరగడం లేదు? దానికి ఆయన, వ్యవసాయ మంత్రి బాధ్యులు కారా? ఇలాంటి సమస్యలన్నిటిని తీర్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి రైతులకు విత్తనం నుంచి ఉత్పత్తి వరకు అన్న అధికార యంత్రాంగం ఏ విధంగా అందుబాటులో ఉండాలో నిర్దేశిస్తూ పని చేయిస్తే, ఆ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నీరు కార్చిందా? లేదా? రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా అయ్యేవా? కావా? ఆ ఐదేళ్లు ఎప్పుడైనా రైతులు ఈ రకంగా ఆందోళన చెందారా? రైతుల వద్దకే అవసరమైతే ఎరువులు సరఫరా చేస్తామని చంద్రబాబు చెబుతున్నారంటే జగన్ ప్రభుత్వం అమలు చేసిన సేవావిధానాన్ని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! తప్పులేదు. గతప్రభుత్వం ఏదైనా మంచి పనిచేస్తే దానిని కొనసాగించవచ్చు.
అలా కాకుండా ద్వేషంతోనో, జగన్‌కు పేరు వస్తుందనో వ్యవస్థలను ధ్వంసం చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి. జగన్ ప్రభుత్వం పంటల ధరలు తగ్గినప్పుడు రైతులను ఆదుకోవడానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద సుమారు మూడువేల కోట్లను కేటాయించి ఖర్చు చేసేది. మరి ఇప్పుడు ఆ పని చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతోంది? ఏది ఏమైనా ఒక సంగతిని చంద్రబాబు గుర్తించారని అనుకోవచ్చు. పది,పన్నెండు రోజుల కిందట బొక్కలో వేస్తానని సోషల్ మీడియాను బెదిరించిన చంద్రబాబు ఇప్పటికైనా తన ప్రభుత్వ వైఫల్యాన్ని అంగీకరించినందుకు సంతోషం. ఇకనైనా ఇలాంటి అనుచిత మాటలు మానుకుని ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే మంచిది.
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.