ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన్ను భుజాన మోస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతులకూ ఈ విషయం కొరుకుడు పడటం లేదు. భేషుగ్గా ఉందని చెబుదామా అంటే... మరి ఎన్నికల హామీలు పూర్తిగా నెరవేర్చడం లేదు ఎందుకు? అని ప్రజలు నిలదీస్తారు. పోనీ బాగాలేదు అందామంటే.. అది చంద్రబాబుకు అపకీర్తి. కిం కర్తవ్యం? అని మధనపడుతున్నాయి ఈ పత్రికలు రెండూ. అందుకేనేమో.. ఒకసారి బ్రహ్మాండమని, ఇంకోసారి ఫర్వాలేదని చెబుతూ జనాల్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.
రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో రికార్డులు బద్ధలు కొడుతూనే ఉంది. ఇంకోపక్క ప్రజలపై పన్నుల మోత కూడా జోరుగా సాగుతోంది. సీఎం కూడా అధికారులు అప్పులు సరిగ్గా సమీకరించలేక పోతున్నారని విమర్శిస్తూంటారు కూడా. అదేనోటితో... 18 నెలల్లో రాష్ట్రాన్ని గట్టెక్కించామని నిట్టూర్పు విడుస్తూనూ ఉన్నారు. అచ్చం తమ నేత మాదిరిగానే ఎల్లోమీడియా కూడా ఒకదానికి ఒకటి పొంతన లేని విధంగా కథనాలు వండివారుస్తోంది. చంద్రబాబు కొన్ని వారాల క్రితం నల్లజర్లలో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉందని, అప్పులు పుట్టడం లేదన్నారు. ఎన్నికల హామీలు అన్నీ నెరవేర్చాలని ఉన్నా.. ఖజానా ఖాళీగా కనబడస్తా ఉందని చెప్పుకొచ్చారు.
కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన ఏపీ జీఎస్డీపీ భేష్ అని ఓ ప్రెజెంటేషన్ ఇచ్చేశారు. వృద్ధి జాతీయ సగటు కంటే 8.7 కంటే ఎక్కువుందని 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోశాం అని భుజాలు చరుచుకున్నారు కూడా. షరా మామూలుగానే వైసీపీపై తన అక్కసంతా వెళ్లగక్కుకున్నారు. వైసీపీ హయాంలో ఏడు లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ నష్టం జరిగిందని ఓ కాకి లెక్క కూడా చెప్పేశారు. జిల్లా కలెక్టర్లు, శాఖల అధిపతుల సమావేశంలోనైతే వైసీపీ పాలనలో పది లక్షల కోట్ల అప్పు చేశారన్నారు. వాస్తవం ఏమిటన్నది వారికి తెలియదా?
డిసెంబర్ 12న ‘‘లక్ష్యం మేరకు ఆదాయం రావడం లేదు..మీదే ఫెయిల్యూర్‘‘ అని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. నిధులు ఉన్నా ఎందుకు ఖర్చు చేయరని, పని చేయకపోతే పోస్టింగ్ ఇవ్వం అని బెదిరించారు కూడా. జీఎస్డీపీకి తగ్గట్లుగా ఆదాయం ఎందుకు లేదని ప్రశ్నించారు. అంటే దాని అర్థం ప్రభుత్వ లెక్కలు ప్రజలను మాయ చేయడానికే అన్న భావన వస్తుంది కదా! అదే సమయంలో మళ్లీ 18 నెలల్లో రాష్ట్రాన్ని పట్టాలెక్కించామని, ఇంకా స్పీడ్ పెంచాలని, 70 కొత్త పథకాలను అమలులోకి తెచ్చామని చంద్రబాబు అన్నారని ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది.
చిత్రంగా డిసెంబర్ 18న అందుకు భిన్నమైన ప్రకటన చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లను కలిసి రాష్ట్రం ఆర్ధిక ఒత్తిడిలో ఉందని, ఆదుకోవాలని, భారీగా నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఉద్యానవన హబ్ గా మార్చడానికి రూ.41 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని అడిగారు. దాని సంగతి ఏమైందో తెలియదు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటన చేస్తూ చంద్రబాబు అసలు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు అర్ధం కాకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారా అన్న సందేహం కలుగుతుంది. ఈ మొత్తం ప్రసంగాలలో ఎక్కడా ప్రభుత్వం చేసిన రూ.మూడు లక్షల కోట్ల పైబడి అప్పుల గురించి మాట్లాడడం లేదు. అలాగే ప్రభుత్వం పెంచిన రిజిస్ట్రేషన్ ఛార్జీలు, విద్యుత్ ఛార్జీల బాదుడు, రోడ్ సెస్ మొదలైన వాటి గురించి మాట్లాడడం లేదు.
కొద్ది కాలం క్రితం వచ్చిన కాగ్ నివేదిక ప్రకారం ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం సజావుగా లేదు.రెవెన్యూ లోటు నానాటికి పెరిపోవడాన్ని కాగ్ తప్పు పట్టింది. దానికి తగినట్లే తాజాగా వెల్లడైన గణాంకాలు చూస్తే రెవెన్యూ లోటు రూ.60.5 వేల కోట్లుగా ఉంది. ద్రవ్యలోటు అయితే మరీ ఘోరంగా రూ.85.2 వేల కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనాలను మించి 108 శాతం ఇప్పటికే ఈ ఏడాది రూ.85 వేల కోట్ల మేర అప్పులు చేశారు. ఈ సంగతిని కప్పిపుచ్చుతూ ఈ మద్య ఎల్లో మీడియా మరో కోణంలో ఓ కథనాన్ని ఇచ్చింది. ఏపీ రాబడి ఈ తొమ్మిది నెలల్లో లక్ష కోట్లు దాటిందని పేర్కొంది. మంచిదే. అయినా ఎందుకు ప్రభుత్వం తాను ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో వివరించితే బాగుండేది కదా!
కాగా కొద్ది రోజుల క్రితం మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఇంకో కథనాన్ని ఇస్తూ ఏపీ ఆర్ధిక సంక్షోభాన్ని 'అదే వ్యధ, పాత కథ" అంటూ అప్పుల వలయం.. ఆర్థిక విలయం అని వ్యాఖ్యానించింది. కాకపోతే యథాప్రకారం అదేదో జగన్ హయాంలో గాడి తప్పిన ఆర్థికం అని రాసి తన కుళ్లు బుద్ది ప్రదర్శించింది. కూటమి సర్కార్ లోనూ గతుకుల ప్రయాణం సాగుతోందని, అన్ని రకాల ఆదాయాలు కలిపితే లక్షన్నర కోట్లే వస్తోందని, అది వడ్డీలు, అసలు చెల్లింపు, జీతాలు, పెన్షన్లకే సరిపోతోందని పేర్కొంది. పథకాలు, అభివృద్ధి, ఇతర ఖర్చులకి అప్పులే గతి అని వాపోయింది. అప్పుల తిరిగి చెల్లింపునకు ఏడాదికి రూ.75 వేల కోట్లు అవుతోందని, జీతాలు, పెన్షన్లకు మరో రూ.75 వేల కోట్లు అవుతోందని తెలిపింది.
డిసెంబర్ నాటికే లక్ష కోట్ల అప్పు దాటిందని కూడా వెల్లడించింది. కూటమి ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చు గురించి మాత్రం ప్రస్తావించలేదు. పైగా అమరావతిలో నిర్మాణాలకు పెడుతున్న అధిక వ్యయాన్ని సమర్థిస్తూ వార్తలు ఇస్తున్నారే. కేవలం చంద్రబాబు విమాన, హెలికాప్టర్ ఖర్చులకే ఏడాదికి ఏభై కోట్లుపైగా అవుతోంది. పథకాల పులిపై ప్రభుత్వాల స్వారీ, దశాబ్దాలు అమలు చేస్తున్నా తగ్గని పేదరికం అంటూ కొత్త కహాని వినిపించడానికి ఈ ఎల్లో మీడియా యత్నించింది. 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏడాదికి లక్షన్నర కోట్లు కావాలని, అది ఆచరణ సాధ్యం కాదని జగన్ చెబితే, చంద్రబాబు, పవన్‌లతో పాటు ఈ ఎల్లోమీడియా ఏమని వాదించింది? చంద్రబాబుకు సంపద సృష్టించడం తెలుసునని, అప్పులు చేయకుండానే సంక్షేమం చేస్తారని, కరెంటు ఛార్జీలు పెంచరని, తగ్గిస్తారని.. ఇలా ఎన్నో కోతలు కోశారు కదా!
టీడీపీ సూపర్ సిక్స్‌ను జగన్‌పై ఎక్కుపెట్టిన శరాలుగా అభివర్ణించారే. అంతే తప్ప ఏపీ ప్రజలను టీడీపీ, జనసేన నేతలు మాయదారి మాటలతో మోసం చేస్తున్నారని ఆనాడు రాయలేదే! తీరా అధికారం వచ్చేసింది కనుక ఇప్పుడు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందనా?మరో వైపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసేశామని బొంకుతున్నారా? లేదా? ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఇస్తామని చెప్పారా? లేదా?
నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.మూడు వేలు ఇచ్చారా? ఇలా అనేక హామీలకు ఎగనామం పెడుతూ అంతా హిట్ అని ప్రచారం చేస్తే సరిపోతుందా? ఎల్లో మీడియా ఆ పథకాల వల్ల పేదరికం తగ్గడం లేదని, వృథా ఖర్చు అన్నట్లుగా రాయడంలో ఆంతర్యం ఏమిటి? ఆంధ్ర ప్రజలు అమాయకులు, వారిని తేలికగా మోసం చేయవచ్చన్న భావన తోనే ఇలా పాలన చేస్తున్నారా? ఎల్లో మీడియా నిత్యం అసత్యాలను వండి వార్చడంలో ఆంతర్యం ఇదేనా?

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


