న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్‌! | KSR Comment: Yellow Media Twisted SIT Probe On Liquor Scam | Sakshi
Sakshi News home page

న్యాయస్థానం ప్రశ్నలకు జవాబేదీ ఎల్లో ఫెలోస్‌!

Sep 2 2025 9:32 AM | Updated on Sep 2 2025 9:47 AM

KSR Comment: Yellow Media Twisted SIT Probe On Liquor Scam

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం స్కామ్‌ పేరుతో ‍ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు సమర్పించిన ఛార్జ్‌షీట్‌పై కోర్టు పలు సందేహాలు వ్యక్తం చేసింది. ఈ స్కామ్‌లో రూ.3500 కోట్లు దారి మళ్లాయన్న ఆరోపణపై తగిన సమాచారం ఇవ‍్వకపోవడం కోర్టు సందేహాల్లో కీలకమైంది. ఛార్జ్‌షీట్‌లన్నింటిలోనూ మొత్తం 21 అభ్యంతరాలను వ్యక్తం చేసిన న్యాయస్థానం వాటిపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను కోరింది. వారు ఎలాంటి జవాబిస్తారో తెలియదు కానీ.. ఇప్పటివరకూ ప్రజలకు వచ్చిన సందేహాలే న్యాయస్థానం కూడా వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. 

కోర్టు అభ్యంతరం చేసిన అంశాలలో సాంకేతికమైనవి కూడా ఉన్నాయి. ‘‘రూ.3500 కోట్లు దారి మళ్లాయని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తం వివరాలు టేబుల్ రూపంలో లెక్కలు సరిపోయే విధంగా సమర్పించాలి’’ అని కోర్టు స్పష్టం చేసింది. సిట్ అధికారులు నిజంగానే ఆ స్థాయిలో స్కామ్‌ను కనుక్కుని ఉంటే రూ.3500 కోట్ల అవినీతి ఎలా జరిగింది? ఆధారాలు ఏమిటి? డబ్బు ఎలా వక్రమార్గం పట్టింది? వంటి వివరాలు తెలిపి ఉండేవారని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గతంలో స్కిల్ స్కామ్ ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో ఆయన అరెస్టు అయ్యారు. ఆ సందర్భంలో సీఐడీ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు పాత్ర ఏమిటి? డబ్బు ఎలా దారి మళ్లింది? ఆయా షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది?  చివరికి ఆ స్కామ్‌ డబ్బు టీడీపీ ఖాతాలోకి ఎంత చేరిందన్నదీ వివరిస్తూ కేసు పెట్టారు. పైగా అప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా స్కిల్ స్కామ్‌ను దర్యాప్తు చేసి మనీ లాండరింగ్‌ను గుర్తించింది. పలువురిని అరెస్టు కూడా చేసింది.  

స్కిల్ స్కామ్‌ విచారణ పకడ్బందీగా చేశారన్న కోపంతోనే అప్పటి సీఐడీ ఛీఫ్ సంజయ్‌ను ఇప్పుడు ఏదో అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ఆయన మార్గదర్శి కేసును కూడా హాండిల్ చేశారు. ఆ కోపంతో ఈనాడు మీడియా ఆయనపై కుట్రపూరిత కథనాలు ఇస్తోందన్న విమర్శలు ఉన్నాయి. 

మద్యం కేసుకు సంబంధించి ఈ ఏడాది కాలంలో ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలు చూస్తే ఎవరికైనా మతి పోవల్సిందే. ఒక రోజు రాసిన దానితో నిమిత్తం లేకుండా మరుసటి రోజు పరస్పర  విరుద్దంగా ఏవో కొత్త,కొత్త ఊహాగానాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మద్యం స్కామ్‌ను ప్రభుత్వమే సృష్టించి, ఎల్లో మీడియా ద్వారా నిత్యం తప్పుడు స్టోరీలు రాయిస్తూ, వైసీపీ నేతలు, మరికొందరు అధికారులను పోలీసుల చేత అరెస్టు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంటుంది. సిట్‌ కోర్టుకు సమర్పించే ఛార్జ్‌షీట్లలో కూడా పుక్కిటి పురాణాలు కనిపిస్తున్నాయని కొందరు లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలో.. 

కోర్టువారు సైతం  ఈ  అంశాలపై పలు ప్రశ్నలు వేశారు. పోలీసులు ఏమి కోరుతున్నది కూడా ఛార్జ్‌షీట్‌లో స్పష్టంగా రాయాలని కోర్టు సూచించిందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఎల్లో మీడియా ఒక్కోసారి ఒక్కో రకంగా చేసిన ప్రచారం.. సిట్ అధికారుల లీక్‌లు, ఛార్జ్‌షీట్ లో ఉన్న అంశాలను విశ్లేషించుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.

సిట్ అధికారులు జూలై నెలాఖరులో హైదరాబాద్ శివారులోని ఒక ఫామ్‌హౌస్‌లో 12 పెట్టెలలో రూ.11 కోట్లు పట్టుకున్నారని అవి మద్యం నోట్ల కట్టలని, నిందితుడైన రాజ్ కెసిరెడ్డి వని ఈనాడు, ఆంధ్రజ్యోతి రెచ్చిపోయి రాశాయి. మధ్యం స్కామ్‌లో ఇది కీలక పరిణామమని కూడా దబాయించి చెప్పాయి. బాక్సులు బద్దలు అంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇచ్చింది. ఆ తర్వాత ఆ రూ.11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలపడమే కాకుండా, ఆ నోట్ల నెంబర్లను రికార్డు చేయాలని, ఆ నోట్లపై తన వేలి ముద్రలు ఉన్నాయోమో పరిశీలించాలని కోరారు. అంతే! 

అటు సిట్.. ఇటు ఎల్లో మీడియా గప్‌చుప్‌! ఆ అంశంపై కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు నీళ్లు నమిలారని వార్తలు వచ్చాయి. అంతకుముందు ఒక రోజు మద్యం స్కామ్ కు సంబంధించిన 3.58 లక్షల జీబీల డేటాను నాశనం చేసిన వైకాపా ముఠా అంటూ ఈనాడు మీడియా ఏదో పెద్ద పరిశోధన చేసి కనిపెట్టినట్లు ప్రచారం చేసింది. అలాంటిదేమీ జరగలేదని బెవరేజ్ కార్పొరేషన్‌ సమాధానం చెప్పడంతో ఈనాడు మీడియా పరువు పోయింది. అయినా ఏ మాత్రం సిగ్గుపడకుండా అలాంటి పిచ్చి కథనాలను రాస్తూనే ఉంది. మరో నిందితుడు వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ లో ఒక వీడియో కనిపించిందని, దాని ప్రకారం ఐదు కోట్ల మొత్తం ఓటర్లకు పంచడానికి ఉన్న డబ్బు కట్టల వద్ద అతను ఫోటో దిగాడని అంటూ మరో కథనాన్ని ఇచ్చారు. అందులో అప్పటికే రద్దు అయిన  రెండువేల రూపాయల నోట్లకట్ట ఉన్నట్లు కనిపించడంతో వారి ప్రచారం తుస్సు అయింది. అంతేకాక తామసలు వెంకటేష్ సెల్ ఫోన్‌ను ఓపెన్ చేయలేదని ఏకంగా సిట్ అధికారులే న్యాయస్థానానికి చెప్పడంతో ఎల్లో మీడియా కల్పిత కథలెలా ఉంటాయో ప్రజలకు తెలిసిపోయింది. 

వెంకటేష్ నాయుడు ఒక సినీ నటితో కలిసి విమానంలో ప్రయాణించిన ఫోటో, జగన్‌ను ఎక్కడో కలిసి కరచాలనం చేసిన ఫోటో చూపించి అదిగో మద్యం స్కామ్ లింక్ అని ఎల్లో మీడియా ఊదర గొట్టింది. ఆ తర్వాత అదే వెంకటేష్ నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్‌లను కలిసి సత్కారం చేస్తున్న దృశ్యాల ఫోటోలు వెలుగులోకి రావడంతో టీడీపీ మీడియా అవాక్కయింది. అంతేకాదు రూ.11 కోట్లు దొరికినట్లు చెబుతున్న ఫామ్ హౌస్ యజమానితో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ కలిసి ఉన్న ఫోటో కూడా వెలుగు చూసింది. దానికి వివరణ ఇస్తూ అబ్బే అది ఏదో కార్యక్రమంలో తీసుకున్న ఫోటో అని చెప్పే యత్నం చేశారు. మరి జగన్ తో కరచాలనం చేస్తే ఆయనకు లింక్ పెట్టిన ఇదే పత్రిక తనవరకు వచ్చేసరికి అలా తప్పించుకుంటుందన్న మాట. రాధాకృష్ణ గురించి తెలిసిన వారెవ్వరూ ఆ పత్రిక వివరణను నమ్మలేదనుకోండి. వెంకటేష్ సెల్ ఫోన్లో నుంచి సిట్ వీడియోలు రిట్రీవ్ చేసినట్లు కూడా ఎల్లో మీడియా రాస్తే ఆ సిట్ అధికారులేమో దానిని ఖండించారు. సెల్ ఫోన్ లాక్ తీసేందుకు వెంకటేష్ సహకరించలేదని, ఫోన్లో ఏముందో తెలియదని తెలిపారు.దాంతో మరోసారి ఎల్లో మీడియా పరువు  పోయింది. అలా అనధికార తప్పుడు సమాచారం ఇచ్చిన మీడియాకు ఆ స్వేచ్ఛ ఉన్నట్లు సిట్ వాదించడం విశేషం. ఈ కేసులో ఎవరిని అరెస్టు చేస్తే వారే కీలకమైనవారని, సూత్రధారులని సిట్ చెప్పడం, ఆ ప్రకారం వీరు రాసేయడం మామూలై పోయింది. 

కొద్ది రోజుల క్రితం మాజీ ఉప ముఖ్యమంత్రి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి  నారాయణస్వామిని సిట్ విచారించింది. ఆయనేమి చెప్పారో కాని, ఎల్లో మీడియా మాత్రం అంతా పైవాళ్లకే తెలుసునని అన్నట్లు  భారీ కథనాన్ని ఇచ్చింది.ఆ తర్వాత రోజు నారాయణ స్వామి వాటిని ఖండించి కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ ను సృష్టించారని ఎల్లో మీడియా అభూత కల్పనలు రాస్తోందని, తనకు లేని ల్యాప్‌టాప్‌ను ఎలా స్వాధీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కోర్టు ప్రస్తావించిన అభ్యంతరాలపై ఎల్లో మీడియా కిక్కురుమనలేదు. 

సిట్  వేసిన ఛార్జ్‌షీట్లకు సంబంధించి పలు అభ్యంతరాలను కోర్టువారు లేవనెత్తితే, ఎల్లో మీడియా రాసిన కల్పిత కథనాలపై ఎవరు అభ్యంతరం చెప్పాలి? తాము ఇచ్చే స్టోరీలకు  రెండో వర్షన్ లేకుండా ఇష్టారీతిన రాస్తూ ఎల్లో మీడియా జర్నలిజాన్ని నీచమైన  స్థాయికి తీసుకువెళ్లడం దురదృష్టకరం.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement