
ఇండియా టుడే కంక్లేవ్‌లో నారా లోకేశ్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేశ్ తాజాగా ఒక వ్యాఖ్య చేశారు. ఏపీలో ప్రతీకార రాజకీయాలకు చోటు లేదట. కావాలనుకుంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపి ఉండేవారట!. జాతీయ టీవీ చానల్ ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు లోకేశ్ జవాబు ఇచ్చారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలలో ఎంతవరకు నిజం ఉందన్నది చర్చనీయాంశం. ఒక్కసారి రెండేళ్లు వెనక్కు వెళదాం..
..అప్పట్లో లోకేశ్ ప్రతిపక్ష పార్టీ నేత. రాష్ట్రమంతటా యువగళం పేరుతో పడుతూ లేస్తూ ఓ యాత్ర లాంటిది చేశారు. రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని గ్రామాలను చుట్టేసి వచ్చారు కానీ.. తనతోపాటు ఓ ఎర్రటి పుస్తకాన్ని మోసుకెళ్లారాయన. జేబులో ఉంచుకున్నాడా? లేదు.. ఎక్కడికక్కడ సమావేశాల్లో పైకెత్తి అందరికీ చూపించాడు. శత్రువుల జాబితా సిద్ధం చేస్తున్నాని.. వాళ్ల భరతం పడతానని సవాళ్లూ విసిరారు. ఈ క్రమంలో బట్టలిప్పిస్తానని.. అదని ఇదనీ అవాకులు, చెవాకులు చాలానే మాట్లాడారులెండి. ఎన్నికలొచ్చాయి. సూపర్ సిక్స్‌ను నమ్మారో.. ఈవీఎంల గందరగోళమో తెలియదు కానీ..జాతీయ స్థాయి విశ్లేషకులు, ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తెలుగుదేశం, జనసేన బీజేపీల కూటమి అధికారంలోకైతే వచ్చింది. రాష్ట్రంలో అరాచకానికి, అవ్యవస్థకు నాందీ పడింది కూడా అప్పుడే!..
.. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయో లేదో రెడ్‌బుక్ పేరుతో టీడీపీ రాజ్యాంగం మొదలైంది. ఒకట్రెండు చోట్ల హోర్డింగ్‌లు పెట్టిమరీ తాము వైసీపీ వారిపై కక్ష తీర్చుకోబోతున్నామని ప్రకటించారు కూడా. అందుకు తగ్గట్టుగానే టీడీసీ కార్యకర్తలు వైసీపీ వారి ఇళ్లపై, ఆస్తులపై విరుచుకుపడ్డారు. దాడులు చేశారు. పల్నాడు ప్రాంతంలో కొంతమంది వైసీపీ నేతలు వీరి ఆగడాలను తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. తప్పుడు కేసుల బనాయింపు, ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కొత్త కేసు పెట్టడం వంటి కొత్త కొత్త మార్గాలు సృష్టించి మరీ అమలు చేశారు టీడీపీ పెద్దలు. కొందరిని సుదూర ప్రాంతాలలోని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి నరకయాతన పెట్టారు. వైసీపీ నేతలపై అక్రమ కేసు బనాయించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేసింది.
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లడానికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సుప్రీంకోర్టు వరకూ వెళ్లాల్సి వచ్చిందంటే ఏపీలో కక్ష రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని దూషించిన టీడీపీ ఎమ్మెల్యేపై కనీస చర్య తీసుకోకపోవడం ప్రభుత్వ పనితీరుకు ఒక నిదర్శనం.
కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధించినా కేసులే కట్టరు. ఇతర అరాచకాల సంగతి సరేసరి.
నేతల పరిస్థితి ఇలా ఉంటే.. సోషల్ మీడియా వారినైతే దారుణంగా హింసించే విధంగా అక్రమ అరెస్టులు సాగించారు. అదే టీడీపీ, జనసేనలకు చెందిన వారు హింసకు పాల్పడినా, అరాచక పోస్టులు పెట్టినా చూడనట్టు వ్యవహరించడం ఇంకో విచిత్రం. నామ్ కా వాస్తే ఒకటి, అరా కేసులు పెట్టినా అవి తూతూ మంత్రం కేసులే. పోలీసు రాజ్యం ఎలా నడపాలో, కక్షలు ఎలా తీర్చుకోవాలో భవిష్యత్తు ప్రభుత్వాలకు కూటమి సర్కార్ తీరు మార్గదర్శకం అయ్యే ప్రమాదం కనిపిస్తుంది.
చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్ వంటివారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని, ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఏ రకంగా దూషించారో అందరికి తెలుసు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవి, అధికారుల పేర్లు కూడా రెడ్‌బుక్ లో రాస్తున్నామని బెదిరిస్తూ లోకేశ్ ప్రచారం చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ప్రభుత్వం ఇంత ఘోరంగా లేదు. ప్రస్తుతం ప్రభుత్వం మీద చంద్రబాబు పట్టు ఏమీ లేదని, మొత్తం కథ లోకేశే నడిపిస్తున్నారని, పోలీసు అధికారులకు నేరుగా ఆదేశాలు ఇస్తూ ఎవరెవరిని హింసించాలో సూచిస్తుంటారని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు కూడా ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో అక్కడక్కడా తిరుగుతూ ప్రసంగాలకే పరిమితం అవుతున్నట్లు అనిపిస్తుంది. ముఖ్యమైన అంశాలన్నిటిని లోకేశ్ హాండిల్ చేస్తున్నారని అంటున్నారు. దానికి తగినట్లే లోకేశ్ ప్రధాని హోం మంత్రులను కలిశారు. జాతీయ టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రభుత్వ విధానాలపైన, అభిప్రాయ వ్యక్తీకరణ చేస్తున్నారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక పద్దతిగా వ్యవహరించవలసిన లోకేశ్ తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అసత్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నది విమర్శ..
.. రాజ్‌దీప్ సర్దేశాయి నిర్వహించిన సమావేశలో చంద్రబాబును జగన్ జైలులో పెట్టారు కాబట్టి జగన్‌ను జైలుకు పంపుతారా అన్న ప్రశ్నకు లోకేశ్ జవాబిస్తూ, 'అది మా ఎజెండా కాదు. చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. మా ప్రాధాన్యం ఏపీ అభివృద్ది. చట్టాన్ని ఉల్లంఘిస్తే నాతోపాటు ఎవరైనా దాని పర్యవసానం అనుభవించాల్సిందే. నేను తప్పు చేసినా మా నాన్న నన్ను జైలుకు పంపుతారు. మరో ఆలోచన లేదు" అని లోకేష్ చెప్పారట. ఈ వ్యాఖ్యలలో నిజమెంత అన్నది ఆయన ఆత్మకు స్పష్టంగా తెలుసు. కావాలంటే జగన్‌ను ఎప్పుడో జైలుకు పంపేవాళ్లమన్నది అహంభావంతో కూడిన సమాధానం కాక మరేమిటని వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు.
జగన్‌పై కక్షతోనే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించి పలువురిని జైలుపాలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ కేసులో జగన్‌ను కూడా జైలుకు పంపించాలని విశ్వయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలో రోజూ తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. దీనిని ప్రతీకార రాజకీయం అనరా? రాజ్ దీప్ సర్దేశాయికు ఏపీలో ఏమి జరుగుతున్నదో తెలియకపోవచ్చు. లోకేశ్ జవాబు విన్నవెంటనే మరి రెడ్‌బుక్ మాటేమిటి అని ప్రశ్నించి ఉండాల్సింది..!!
కొద్ది రోజుల క్రితం కడపలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ తాను ఏదీ మర్చిపోలేదని, తన తండ్రిని 53 రోజులు అక్రమంగా నిర్భంధిస్తే కుమారుడిగా మర్చిపోతానా? తప్పు చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రెడ్ బుక్ తన పని తాను చేస్తోంది అని లోకేశ్ చెప్పారు. నిజానికి లోకేశ్ ప్రస్తుతానికి మంత్రి మాత్రమే. కాకపోతే సకల శాఖల మంత్రిగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్నది ప్రశ్న. మిగిలిన మంత్రులను డమ్మీలుగా మార్చారా?లోకేశ్ చెప్పే దానినే పరిగణనలోకి తీసుకుంటే తండ్రి మీద వచ్చిన కేసులను నీరు కార్చకుండా చట్టం తన పని తాను చేసుకుపోయేలా వ్యవహరించే ధైర్యం ఉందా? అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించారు. చిత్తశుద్ది ఉంటే ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు, రెడ్‌బుక్ గోల మానుకుని, హుందాగా నడిస్తే మంచిది. లేకుంటే ఆయన ప్రత్యర్థులపై వేస్తున్న ఉచ్చులో తానే పడిపోయే అవకాశం ఉంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.