ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక స్థలం, హిందువుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల ఆంధ్రప్రదేశలో ఉండటం ఆంధ్రులందరికీ గర్వకారణం. ఉత్తరాది నుంచి కూడా ఎంతో మంది బాలాజీ దర్శనానికి విచ్చేస్తూంటారు. ఇంతటి వైశిష్ట్యమున్న క్షేత్రంపై ఎవరు అపసవ్యంగా మాట్లాడినా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించినా అది క్షమించరాని నేరమే అవుతుంది. దురదృష్టవశాత్తూ ఈ పాపానికి సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరీలే పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
ముందు వెనుక ఆలోచించకుండా.. పర్యవసానాల గురించి పట్టించుకోకుండా వీరు.. కోట్లాది మంది భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని, పంది కొవ్వు, చేపనూనె మిళితమైందని బహిరంగంగా ప్రకటించడం.. రాజకీయం కోసం ఈ పాపాన్ని ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నం చేయడం మనం చూశాం. కానీ చివరికేమైంది? నిజం నిగ్గుతేలింది. సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులేవీ లేవని విస్పష్టమైన నివేదిక ఇచ్చింది. అయితే.. పామాయిల్ వంటికి కలిసినట్లు సిట్ తన ఛార్జ్‌షీట్‌లో తెలిపిందని ఎల్లోమీడియా ‘ఈనాడు’, ఆంధ్రజ్యోతిలు ముందస్తు కథనాలు ప్రచురించాయి. జంతు కొవ్వులు కలవలేదన్న అంశాన్ని పక్కనబెట్టి ఈ కథనాలు అల్లడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది.
సిట్ ఛార్జ్‌షీట్ వేస్తే అందులోని అంశాలపై ఎందుకు మీడియా బ్రీఫింగ్ జరగలేదు? తెలుగుదేశం మీడియాకు మాత్రమే అవసరమైనంత వరకే ఎలా లీక్ అయ్యింది? జంతు కొవ్వు కలవలేదన్న విషయం అధికారికంగా చెబితే టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని దాచేశారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. ఎల్లో మీడియా కథనాల ద్వారా అర్థమవుతున్నది ఒక్కటే. ఎలాగైనా సరే.. లడ్డూలో ఏదో కల్తీ జరిగిందన్న అనుమానాలు వ్యాప్తి చేయించి వైసీపీకి చెడ్డపేరు తేవాలని!.
సిట్ ఎంత చిత్తశుద్ధితో ఈ కేసు విచారించిందన్నది కాసేపు పక్కనబెడదాం. పామాయిల్, డాల్డా వంటివి కలిసిన నెయ్యిని 2019-2024 మధ్యలో మాత్రమే వాడారా? లేక అంతకుముందు కూడా ఇలా జరిగిందా? అని చూస్తే సమాధానం దొరకదు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో విజయవాడలో ఒక కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. అక్కడ తయారైన కల్తీ నెయ్యిని తిరుమలకు కూడా పంపుతున్నట్లు అప్పట్లోనే పోలీసులు గుర్తించినట్లు వార్తలొచ్చాయి.
సుప్రీంకోర్టు సీబీఐతో మాత్రమే కాకుండా... రాష్ట్ర పోలీసు అధికారులు కూడా కలిసిన బృందంతో విచారణ జరిపించడంతో దర్యాప్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల హామీలను నెరవేర్చలేక తంటాలు పడుతున్న చంద్రబాబు నాయుడు ప్రజల దృష్టి మరల్చేందుకు శతధా ప్రయత్నిస్తూన్నారన్నది బహిరంగ రహస్యమే. ఆ క్రమంలోనే తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారన్న విమర్శ వస్తోంది.
లడ్డూ కల్తీ వ్యవహారం మొత్తం రాజకీయమేనని దర్యాప్తులో కూడా నిగ్గుతేలింది. జంతుకొవ్వు అంటూ నీచమైన ఆరోపణ చేసిన చంద్రబాబు, ఆ తర్వాత మరింత తీవ్రంగా ఆరోపణలు చేసి దుర్గమ్మ గుడి మెట్లు కడిగి, తదుపరి తిరుపతిలో ‘‘ఐ యామ్ అన్ అపాలిజిటిక్ హిందూ’’ అని అరచి గీపెట్టిన పవన్ కల్యాణ్‌లను సిట్ ఎందుకు ప్రశ్నించలేదు? వీరుభక్తుల మనోభావాలు దెబ్బతీసినట్లు కాదా అని ఎందుకు అడగలేదు? కేంద్రంలోను, రాష్ట్రంలోను కూటమి పాలనే సాగుతుండడంతో వారి జోలికి వెళ్లలేదనుకోవాలి.
జగన్‌ను హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు టైమ్‌లో కూల్చిన గుడులను జగన్ కట్టించినా, అంతర్వేదిలో కాలిన రథాన్ని పునర్మించినా, ఆయా ఘటనలలో తక్షణమే చర్యలు తీసుకున్నా ఏదో రకంగా చంద్రబాబు, పవన్ లు మతం రంగు పులిమేవారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన ఘటనలకు టీడీపీ కార్యకర్తలే బాధ్యులని తేలినా వైసీపీకే ఆపాదించేవారు. పైగా నిందితుడైన ఒక టీడీపీ కార్యకర్తకు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నగదు బహుమతి ఇచ్చారు.
ఇప్పుడే కాదు.. గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యత్నాలు చేసేవారు. టీడీపీ మీడియా ఆంధ్రజ్యోతి దినపత్రిక ద్వారా ఏడు కొండలు, రెండు కొండలు అంటూ లేని వివాదాన్ని సృష్టించారు. వైఎస్సార్ తిరుమల స్వామివారి నిమిత్తం ఎస్వీబీసీ ఛానెల్‌ను తీసుకువస్తే అదంతా డబ్బు దండగ అంటూ అసెంబ్లీలో చంద్రబాబు వాదించారు. అయినా చంద్రబాబు హిందూ మతోద్ధారకుడు, వైఎస్ కాదన్నట్లు పిక్చర్ ఇస్తుంటారు. జగన్ ఎంత పవిత్రంగా స్వామివారి సేవలో పాల్గొన్నా.. ఏదో ఒక వదంతి సృష్టించి టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయించారు. ఇప్పటికీ అదే పనిలో ఉంటారు. కూటమి హయాంలో తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు, సింహాచంలో గోడ కూలి ఏడుగురు, కాశిబుగ్గ వద్ద తోపులాటలో మరికొందరు మరణించినా వాటిని మాత్రం కూటమి పెద్దలు సీరియస్ గా తీసుకోరు.
లడ్డూ కల్తీ కేసుకు సంబంధించిన బోలేబాబా డెయిరీని 2018లోనే టీడీపీనే ఎంపిక చేసింది. ప్రమాణాలు పాటించడం లేదన్న కారణంగా జగన్ ప్రభుత్వం ఈ సంస్థపై నిషేధం విధించింది. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచిందే తడవు.. ఈ కంపెనీ ఇంకో రూపంలో తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టుదారుల్లో ఒకటిగా మారింది. ఇవన్నీ సిట్ చెప్పిన వాస్తవాలే. కానీ.. నిందలు మాత్రం వైసీపీపై మోపుతూంటారు.
2014-19 మధ్య చౌక ధరకు నెయ్యిని కొన్న టీడీపీ అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్పగలదు? టీడీపీ, వైసీపీల రెండింటి హయాంలోనూ టీటీడీ కొన్ని నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపింది. కానీ.. ఒక్క వైసీపీ హయాంలోనే కల్తీ జరిగిందని ఎల్లో మీడియా పనికట్టుకుని రాస్తూంటుంది. టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి కంపెనీ నుంచి జీతం తీసుకుంటున్న చిన్న అప్పన్న అనే వ్యక్తిని సుబ్బారెడ్డి కార్యదర్శిగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రభాకరరెడ్డి సతీమణి, ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ప్రస్తుత మంత్రి పార్ధసారధిలు అప్పట్లో వైసీపీలో ఉండేవారు. వారిద్దరూ టీటీడీ సభ్యులుగా పర్‌ఛేజింగ్ కమిటీలో పని చేసినప్పుడు ఏం జరిగింది? వారికి అసలు ఏమీ పాత్ర లేదని ఎలా చెప్పగలిగారు. వారిని కేసు నుంచి ఎలా తప్పించారు. వైవీ సుబ్బారెడ్డిపై రకరకాల కథనాలు రాసి అప్రతిష్టపాలు చేయడానికి టీడీపీ, ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు భగ్నమయ్యాయి. సుబ్బారెడ్డి తప్పిదం ఉన్నట్లు సిట్ ఎక్కడా చెప్పలేదు. అంటే ఇంతకాలం ఎల్లో మీడియా చేసిందంతా దుర్మార్గపు ప్రచారమే అవుతుంది కదా! మరో మాజీ చైర్మన్ కరుణాకరరెడ్డి ఈ ఆరోపణ రాగానే తిరుమల వెళ్లి ప్రమాణం చేశారే. అలాంటి పని టీడీపీ నేతలు ఎవరూ ఎందుకు చేయలేకపోయారు?
రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదిరులు తిరుమలను వాడుకున్నట్లు తేలింది కదా? ఇప్పుడు వారిద్దరూ ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు? ఎల్లో మీడియా చెంపలు వేసుకుంటుందా? అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక డిమాండ్ చేశారు. చంద్రబాబు తిరుమలలో ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలని, ఆయనకు వాతలు పెట్టాలని, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఏపీలో ఉన్న గుడుల మెట్లన్నీ కడగాలని కూడా సలహా ఇచ్చారు. వారు ఎటూ ఆ పని చేయరు. అది వేరే విషయం. కనీసం ఇకనైనా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా వీరు వ్యవహరిస్తారా? అన్నది డౌటే. ఏదైతేనేం... లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కల్తీ జరగలేదన్న విషయం స్పష్టం కావడం మాత్రం... కోట్లాది హిందూ భక్తులకు పెద్ద రిలీఫ్!.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


