ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది. పిఠాపురంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి చంద్రబాబును మరోసారి కీర్తించారు. తమిద్దరి మధ్య అరమరికలు లేవని అన్నారు. మంచిదే. తప్పు కూడా లేదు కానీ.. ఒకప్పుడు ప్రశ్నిస్తానంటూ పార్టీని పెట్టి, ఇప్పుడు ఎవరూ ప్రశ్నించరాదని, ప్రశ్నించవద్దని చెబుతూండటం ఏ రకమైన రాజకీయమన్నది మనం ప్రశ్నించాల్సిందే. స్వోత్కర్ష, కులమతాలకు అతీతమన్నట్టు, దేశం కోసమే పనిచేస్తున్నాన్న బిల్డప్పులు చూస్తే.. పవన్ ఇప్పుడు చంద్రబాబు స్టైల్లోకి వచ్చేశారనుకోవచ్చు. ఎన్నికలప్పుడు ఏ హామీలిచ్చి గద్దెనెక్కాము?కూటమి ప్రభుత్వం వాటిని ఎంతవరకు నెరవేర్చింది? మిగిలిన వాటి గురించి ఏం చేయాలి? వంటి అంశాల జోలికి పోకుండా సంక్రాంతి సంబరాలలో నృత్యం చేసి ప్రజలను ఆనందపెట్టామని సంతృప్తి చెందినట్లుగా ఉంది.
కొంతకాలం క్రితం వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక ఫంక్షన్ లో డాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అని ఆయన ఎద్దేవ చేశారు. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్ తాను మాత్రం సినిమాలలో నటించవచచ్చు.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని డాన్స్ చేయవచ్చన్న మాట. పవన్ డాన్స్ చేయడాన్ని తప్పు పట్టడం లేదు. కాని రాంబాబును ఆయన అన్నమాట గుర్తు చేయాల్సి వస్తుంది.చంద్రబాబుతో తేడా లేదని చెబుతూ రాజకీయాలలో కూటమి కట్టడం కష్టమని, విడగొట్టడం సులువు అని ఆయన అన్నారు. ఎవరు ఆ ప్రయత్నం చేస్తున్నారు. కూటమి వీక్ అయిపోతోందన్న భయమేదో పట్టుకున్నట్లుగా ఉంది.
2014లో జనసేన అభ్యర్ధులను పోటీలో దించకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తర్వాత రోజులలో ఆ కూటమికి దూరమై వామపక్షాలు, బీఎస్పీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? 2019లో ఓటమి పాలు కాగానే ఎందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడి ఆ పార్టీతో, తదుపరి టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలి కదా! 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్‌ల పై చేసిన అవినీతి ఆరోపణలకు పవన్ తూచ్ ఎలా పెట్టారు. తెలుగుదేశం మద్దతు లేకుండా తాను గెలవలేనన్న భయంతో 15 ఏళ్లపాటు కూటమి అంటూ కూనిరాగాలు తీసి జనసేన కార్యకర్తలను మభ్య పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు రాజకీయాలు తెలిసిన వాళ్లకు అర్థమవుతూనే ఉన్నాయి.
పవన్ ఒక రకంగా అధృష్టవంతుడు. ఆయన చంద్రబాబుకు డప్పు కొడితే సరిపోతుంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటువారికి అప్పగించినా నోరెత్తనక్కర్లేదు. మూడు లక్షల కోట్ల అప్పు చేసినా ఎందుకు అని అడగనక్కర్లేదు. 99 పైసలకే ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టడమేమిటిన ప్రశ్నించనవసరం లేదు. పదవిలో ఎంజాయ్ చేస్తే చాలు. ఈ మాత్రం దానికి వేరే పార్టీ అవసరమా అని కొందరు ప్రశ్నిస్తుంటారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆయన ఎన్ని గొడవలు పెట్టారు? వైసీపీ వారిని ఎన్ని బూతులు తిట్టారు?ఒకసారి కులం ఏమిటి? మతం ఏమిటి అని అంటారు. మరోసారి సనాతని హిందూ అంటూ ప్రజలను రెచ్చగొడతారు. తనకు కులమైనా మద్దతు ఇవ్వదా అంటూ కాపు వర్గాన్ని అభ్యర్ధించిన సంగతి ప్రజలు మర్చిపోతారన్నది ఆయన నమ్మకం కావచ్చు. కూటమిని ఎవరూ బలహీనపర్చనవసరం లేదు. ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ వారే కూటమిని కూల్చుతారు.
పోలీసు బలగంతో, రెడ్ బుక్ అరాచకాలను ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ గతంలో ఏదో జరిగిందంటూ అసత్యాలు చెప్పి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు. మాజీ మంత్రి వివేక హత్య ఘటనను అసందర్భంగా ప్రస్తావించడం ద్వారా ఆయన కూడా చంద్రబాబు బాటలోనే డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు. పిఠాపురంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి ఏమి చేస్తున్నది చెప్పకుండా ప్రజలకు సినిమా డైలాగులు చెబితే ఏమి ప్రయోజనం? అక్కడ పిల్లలు కుల వివక్షకు గురయ్యామని చెబితే, ఒక గ్రామంలో దళితుల బహిష్కారం వంటివి జరిగితే వాటిని చాలా చిన్న విషయాలుగా ఆయన పరిగణిస్తున్నారు. అది నిజమే అయితే ఇదే సమస్యపై వినతిపత్రం ఇవ్వడానికి రాబోయిన ఒక మహిళను ఎందుకు మూడు రోజులపాటు హౌస్ అరెస్ట్ చేశారని సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. అంతగా పవన్ కళ్యాణ్ ఎందుకు భయపడ్డారని వారు అడుగుతున్నారు.
పవన్ ఉప్పాడ రక్షణ గోడ నిర్మించేందుకు కృషి చేస్తే మంచిదే. కాని దానిని చూపించి అక్కడి వారిని బెదిరిస్తున్నట్లు మాట్లాడడం సరికాదు. తాము ఫలానా మంచి చేశామని చెప్పలేని ఆయన వైసీపీపై పిచ్చి విమర్శలు చేసినట్లు అనిపిస్తుంది. జగన్ పై, ఆయన కుటుంబంపై టీడీపీ సోషల్ మీడియా నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే కనీసం ఖండించని పవన్ కళ్యాణ్ నీతులు చెబుతున్నారు. ఆయన గత టర్మ్‌లో వైసీపీ వారిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టింది? చెప్పులు ఎలా చూపింది.. అన్ని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం సాగుతున్నది చంద్రబాబు ప్రభుత్వమా? లేక ఆయన కుమారుడు మంత్రి లోకేశ్ రెడ్ బుక్ ప్రభుత్వమా? చట్టవిరుద్దంగా కేసులు పెట్టడం, రోడ్లపై నడిపించడం, కాళ్లు, కీళ్లు విరగగొడతానని రౌడీ భాష మాట్లాడడం.. ఇవన్ని ఎవరు చేస్తున్నారు.
ఒకరకంగా జనసేన కేడర్‌ను చూసి జాలి పడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో జనసేనకు చెందిన వారు కూడా అవమానాలకు గురి అవుతున్నారు. శ్రీకాళహస్తిలో జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను ఒక టీడీపీ ఎమ్మెల్యే మనుషులు తీశారని వచ్చిన ఆరోపణలపై కనీసం స్పందించలేని నిస్సహాయ స్థితి పవన్ కళ్యాణ్‌ది. అంతేకాదు. ఆయనకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురుకాక పోలేదు. కాని టీడీపీ వారు ఏమి చేసినా సర్దుకుపోవాలని కార్యకర్తలకు చెబుతున్నప్పుడు ఆయన కూడా వాటిని భరించవలసిందే కదా! తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ యాగి చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ ఊసే ఎందుకు ఎత్తడం లేదో! మతాల మధ్య కూడా విద్వేషం పెంచేలా మాట్లాడింది కూడా కూటమి నేతలే కదా! చంద్రబాబును పొగిడినంత సేపే ఎల్లో మీడియా ఆయనకు మద్దతు ఇస్తుందన్న సంగతి గమనించినట్లు ఉన్నారు. అందుకే ప్రభుత్వం ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నా ప్రశ్నించకుండా పొగుడుతూ గడిపేస్తున్నారు. పదవే పరమావధిగా భావిస్తే ఇలాగే చేస్తారేమో! ఆత్మస్తుతి, పరనిందలతో రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దానిని పవన్ కూడా బాగానే వంట పట్టించుకుంటున్నారా!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


