తెలుగు రాష్ట్రాల్లో గురుశిష్యుల రాజకీయం భలే గమ్మత్తుగా ఉంది. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలని, పంచాయతీ కాదు..పరిష్కారం కావాలని, గొడవలతో ప్రయోజనం లేదని, సామరస్యంగా ముందుకు వెళితేనే మేలని గురువు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకేరోజు కూడ బలుక్కున్నట్లు చేసిన ప్రకటనలు ఆసక్తికరమైనవే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో తాను అనుకోకుండా చేసిన తప్పును దిద్దుకునేందుకు రేవంత్ తన స్వరం మార్చారా? లేక.. ఇద్దరికి సన్నిహితులైన వారు తమకు వివాదాలు అక్కర్లేదని.. నీళ్లు కావాలని ప్రకటన చేయించినట్లుగా ఉందీ వ్యవహారం. అయితే..
తెలంగాణ ప్రాజెక్టులకు ఓకే చేయాలని రేవంత్ రెడ్డి చంద్రబాబును కోరడం కొన్ని అనుమానాలకు తావిస్తోంది. రేవంత్‌తో ఎలాంటి రహస్య ఒప్పందమూ లేదని చంద్రబాబు స్పష్టంగా చెప్పలేకపోయారు. పైగా రేవంత్ కోరినట్లు రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని నిలిపివేయడమే కాకుండా, చివరికి ఆ స్కీమే వృథా అన్న ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ పార్టీలను సంతృప్తి పరచడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఏపీకి జరిగే నష్టాన్ని పట్టించుకోలేదు. ఇది ఒకరకంగా దుస్సాహసమే. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపడం తమ ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టడమేనని ఆ ప్రాంత మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. రాయలసీమ స్కీమ్‌కు వ్యతిరేకంగా విజయవాడలో టీడీపీ అనుకూల మేధావులతో ఆలోచనపరుల పేరుతో సదస్సు పెట్టించడంంపై కూడా సీమలో అసంతృప్తి ఏర్పడింది. ఇది చాలదన్నట్లు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణకు కూడా నీరు ఇస్తారట. చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతం ఎత్తుకుని ప్రమాదకర క్రీడ అడుతున్నారన్న అనుమానం కలుగుతుంది.
తనకు తెలుగు జాతి ముఖ్యమని తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు అంటున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకు సీఎం కాదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే అనే సంగతి మర్చిపోరాదు. తనకు ఏపీ ప్రయోజనాలే ముఖ్యమని గతంలో పలుమార్లు అన్న చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంతలా బలహీనంగా మాట్లాడుతున్నారు? రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ముందుకు తీసుకువెళితే జగన్‌కు పేరు వస్తుందనా? లేక రేవంత్‌కు ఇచ్చిన మాట తప్పితే తెలంగాణలో కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందనా? లేక తన సొంత ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందనా?..
గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్నిసార్లు తెలంగాణ ప్రభుత్వంతో ఘర్షణకు దిగారు?.. విమర్శలు చేశారు?.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడానికే కుట్రపన్నారు?. ఓటుకు నోట కేసులో ఎలా దొరికిపోయారు? అప్పుడు తెలుగు రాష్ట్రాలు, తెలుగు జాతి ఏమైపోయినా ఫర్వాలేదా? కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు తదితర ప్రాజెక్టులను ఎలా వ్యతిరేకించారని చంద్రబాబును బీఆర్‌ఎస్ నేతలు అడుగుతున్నారు. మరి నాగార్జున సాగర్ వద్ద పోలీసుల మొహరింపు మాటేమిటి? కేసీఆర్, జగన్ భేటీ అయి ఆయా ప్రాజెక్టులపై చర్చిస్తే ఎన్ని ఆరోపణలు చేశారు. అప్పుడు తెలుగుజాతి గుర్తుకు రాలేదా?..
చంద్రబాబే కాదు.. రేవంత్ కూడా తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్‌ను విమర్శిస్తూ జగన్‌కు పంచభక్ష్య పరమాణ్ణాలు పెట్టారంటూ కొద్ది రోజుల క్రితం కూడా ఎద్దేవ చేశారే! పోతిరెడ్డిపాడు విస్తరణ ప్రాజెక్టు సమయంలో చంద్రబాబు అనుసరించిన విధానం ఏమిటి? తెలంగాణలో టీడీపీ నేతలతో నిరసనలు, కోస్తాలో ఆ ప్రాంత టీడీపీ నేతలతో వ్యతిరేక ప్రదర్శనలు చేయించారు కదా? అంటే రాయలసీమ ప్రజలకు, తెలంగాణ, ఏపీ ప్రజలకు మధ్య తగాదా పెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందా? లేదా? అప్పుడు తెలుగుజాతి ఒక్కటిగా లేకపోయినా ఫర్వాలేదా! కెసిఆర్ ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు కలిసి ఉండనక్కర్లేదన్నమాట. రేవంత్ తన శిష్యుడు కాబట్టి, ఆయన కాంగ్రెస్ అయినా, తాను బీజేపీ కూటమిలో ఉన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడేమో రాయలసీమ ప్రయోజనాలను పణంగా పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి పని చేయాలని అంటున్నారు.
తెలంగాణకు ఓడరేవు లేదు కనుక ఏపీతో సఖ్యంగా ఉండాలని రేవంత్ భావిస్తున్నారట. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడరాదని షరతు పెట్టారు. కేంద్రానికి తెలంగాణ ప్రాజెక్టులపై చేసిన ఫిర్యాదులను చంద్రబాబు ప్రభుత్వం ఉపసంహరించుకోవడానికి ఒప్పుకుంటుందా? ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుని అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. ఒక్క నీటి విషయంలో అన్న మాటేమిటి? విభజన చట్టం ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు రూ.75 వేల కోట్ల విలువైన ఆస్తి రావల్సి ఉంటుందని, గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సు లెక్కకట్టింది కదా! అది ఇవ్వడానికి రేవంత్ సర్కార్ ఓకే అంటుందా? అసలు చంద్రబాబు ఉమ్మడి ఆస్తుల విభజన గురించి డిమాండ్ చేస్తారా? దీనిపై అవగాహన కుదిరితే అప్పుడు నీళ్ల సంగతి ఆలోచించవచ్చు కదా!.
ఇంకో సంగతి చెప్పాలి.. మచిలీపట్నం పోర్టు నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేసి, అందులో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదన వస్తే ఇదే చంద్రబాబు, టీడీపీ నేతలు ఏమని అన్నారు? జగన్ బందరు పోర్టును కేసీఆర్‌కు రాసిచ్చేస్తున్నారని, ఏపీకి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారా? లేదా? అది తెలుగుజాతి మధ్య గొడవలు పెట్టినట్లు కాలేదా? రాయలసీమ లిఫ్ట్ వల్ల కేవలం 22 టీఎంసీల నీరే వస్తుందని, ఆ ప్రాంతానికి ప్రయోజనం పెద్దగా ఉండదని చంద్రబాబు అంటున్నారు కదా! ఆ విషయమే రేవంత్‌కు వివరించి, ఈ చిన్న స్కీమ్ వల్ల తెలంగాణకు నష్టం లేదని చెప్పి ముందుకు తీసుకువెళ్లవచ్చు కదా!
తెలంగాణకు పోర్టు కనెక్టివిటి కోసం ఏపీ సహకారం కావాలని, అమరావతి అభవృద్దికి హైదరాబాద్ సహకారం అవసరమని రేవంత్ చిత్రమైన వాదన తెచ్చారు. వీళ్లిద్దరు మాచ్ ఫిక్సింగ్ ప్రకటన చేస్తున్నారేమో!. కానీ అదే సమయంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కమార్ రెడ్డి ఒక ప్రకటన చేస్తూ పోలవరం-నల్లమలసాగర్ స్కీమ్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మొత్తంగా చూస్తే తను చేసిన వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయంగా చంద్రబాబుకు జరిగిన నష్టాన్ని తగ్గించడం కోసం రేవంత్ రెడ్డి ఏదో కంటితుడుపు ప్రకటన చేసినట్లుగా ఉంది. అలాగే చంద్రబాబు మళ్లీ రెండు కళ్ల సిద్దాంతంతో ఇరు ప్రాంతాల ప్రజలను మభ్య పెట్టడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తోంది.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


