
‘పీ-4 పిచ్చిలో చంద్రబాబు’’ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచురితమైన ఒక కథనం శీర్షిక ఇది. ఇలాంటి కథనం ఏదైనా సాక్షిలోనో.. లేదా టీడీపీకి సంబంధం లేని ఏ ఇతర మీడియాలోనో వచ్చి ఉంటే ఆ పార్టీ, దాని మద్దతుదారులు అంతెత్తున లేచి ఉండేవారు. ముఖ్యమంత్రి చంద్రబాబును పట్టుకుని అంత మాట అంటారా అని మండిపడేవి. ఏ మాత్రం అవకాశం ఉన్నా కేసులు పెట్టడానికి ప్రయత్నించి ఉండేవారు. కాని టీడీపీ మీడియా యజమానే అనడంతో వాళ్లెవరూ కిక్కురుమనలేకపోతున్నారు. కనీసం ఖండన కూడా ఇచ్చినట్లు కనిపించలేదు.
చిత్రమైన విషయం ఏమిటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లు ఇద్దరూ ఎన్నికల ప్రణాళికను ప్రకటించిన సందర్భంలోనూ ఈ ‘పీ-4’ అంశం గురించి చెప్పడం. అప్పుడు టీడీపీ మీడియా ఆహా, ఓహొ అంటూ ప్రచారం చేశారు. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల ప్రణాళికలోని అంశాలన్నీ అద్భుతం అని, పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని తెగ ప్రచారం చేశాయి.
ఏడాది కాలంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏ పిచ్చి పని చేసినా అది రైటే అన్నట్లుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాయి. కొన్ని సంస్థలకు 99 పైసలకే ఎకరా భూమి ఇస్తామని ప్రకటించినా, విజయవాడలో అత్యంత విలువైన ఆర్టీసీ స్థలం లులూ మాల్‌కు ఇచ్చేస్తున్నా టీడీపీ మీడియా అలా చేయడం తప్పు అని ఎక్కడా కథనాలు ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఏమైందో.. చిత్తశుద్దితోనే రాశారా? లేక ఏదైనా తేడా వచ్చి రాశారా? లేక బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశంతో రాశారా? లేక ప్రజలలో ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి రాశారా? అన్నది తెలియదు కాని ‘పీ-4’ గురించి రాసిన కథనంలో చంద్రబాబు ‘పీ-4 పిచ్చిలో ఉన్నారని అంటున్నారు. శీర్షికలో పిచ్చి అని రాసి చంద్రబాబును తప్పుపట్టినా, మేటర్లో మాత్రం తప్పు సలహాదారులు, అధికారులపై నెట్టే యత్నం చేశారు.
ఆ సందర్భంలో కొన్ని వాస్తవాలను తమకు తెలియకుండానే ఒప్పుకున్నారు. చంద్రబాబు నేల విడిచి సాము చేస్తుంటారట. ఆచరణ సాధ్యం కాని ‘పీ-4’ వంటి ఆలోచనలంటే ఆయనకు మా చెడ్డ ఇష్టమట. ఈ బలహీనతను గుర్తించిన కొందరు ప్రతి టర్మ్‌లోను పక్కన చేరి దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనను అందులోకి లాగుతారట. ఇప్పుడు ఇలా రాశారు కాని, టీడీపీ సూపర్ సిక్స్ ప్రకటించినప్పుడు ఇదే మీడియా అబ్బో ఇంకేముంది..జగన్‌పై శరాలు సిద్ధం అంటూ తెగ పొగిడింది. అది ఆచరణ సాధ్యమేనని ఈ మీడియాతో పాటు ఇతర టీడీపీ మీడియా సంస్థనలు కూడా హోరెత్తించాయి కదా! అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహిత సలహాదారులలో ఈ మీడియా అధినేత కూడా ఉంటారని చెబుతారు. కాని ఇప్పుడు సడన్‌గా చంద్రబాబులో ఫలానా అవలక్షణం ఉందని ఆయనే చెబుతున్నారు. అదే టైమ్‌లో పుణ్యానికి పోతే, పాపం ఎదురైనట్లు చంద్రబాబుకు రాజకీయంగా నష్టం జరుగుతోందని అంటున్నారు. ఇందులో చంద్రబాబు చేసిన పుణ్యమేమిటో తెలియదు. ‘పీ-4’ కొత్త పల్లవి అందుకున్నారని రాశారే తప్ప ఎన్నికల ప్రణాళికలోనే దీనిని పెట్టిన విషయాన్ని మాత్రం కప్పిపుచ్చుతున్నారు. ఇప్పుడేమో అది దిక్కుమాలిన సలహా అని అంటున్నారు.
2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తామని చంద్రబాబు చెప్పడాన్ని ఈ మీడియా కూడా నమ్మడం లేదు. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు అంటూ ముద్దు పేర్లు పెట్టి, కొంతమందికి పేదలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఈ మీడియా యజమాని చెబుతున్నారు. ఇలాంటి సమాచారంతో కూడిన వార్తను సాక్షిలో వస్తే, టీడీపీ సోషల్ మీడియా తెగ విమర్శించింది. ఇదంతా అక్కసుతో కూడిన విమర్శలని ఆరోపించింది. మరి ఇప్పుడు స్వయంగా టీడీపీ మీడియానే ఆ విషయం రాస్తే నోరు విప్పలేకపోయింది.
పేదరికం లేని సమాజం ఎక్కడైనా ఉందా? పూర్తిగా నివారించడం మన దగ్గర ఎలా సాధ్యం అన్న సందేహం ఎందుకు కలగలేదో తెలియడం లేదట. దాతలు స్వచ్ఛంగా ముందుకు వచ్చి అమలు చేసే ఇలాంటి కార్యక్రమాలను నిర్భందం చేయడం ఏమిటని ఆ మీడియా ప్రశ్నించింది. కోటి మంది పేద కుటుంబాలు ఉంటే 11 లక్షల కుటుంబాలనే ఎంపిక చేశారని, దీనివల్ల మిగిలిన వారు టీడీపీకి దూరం కారా అన్నది ఈ మీడియా యజమాని బాధ. చంద్రబాబు కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారని, దానివల్ల మిగిలిన పేద కుటుంబాలు కినుక వహించవా అని ఆయన అన్నారు. వారు ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారట, ఇప్పటికే ఎంపికైన కుటుంబాలలో 26 శాతం అనర్హమైనవని కూడా అధికారులు చెబుతున్నారట.
ముఖ్యమంత్రి చంద్రబాబు ‘పీ-4’ అమలు కోసం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులను పిలిచి గంటల కొద్ది చర్చలు జరుపుతుండడాన్ని కూడా ఈ మీడియా ఆక్షేపించింది. ఈ సమావేశాలకు వెళ్లిన వారు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకున్నారని కూడా వెల్లడించారు. దత్తత తీసుకునే వారిని ఇంతమందిని ఎంపిక చేయాలని కలెక్టర్లకు టార్గెట్లు పెడుతున్నారని ఈ మీడియా యజమాని అంగీకరించారు. ఇదే మాట సాక్షి మీడియా చెబితే ఇంతెత్తున ఎగిరిపడిన ప్రభుత్వం, టీడీపీ సోషల్ మీడియా ఇప్పుడు నోరు మెదపడం లేదు.
‘పీ-4’ పథకం అమలు కమిటీ వైస్ ఛైర్మన్ కుటుంబరావును దీనికంతటికి బాధ్యుడు అన్నట్లుగా ఈ మీడియా యజమాని చెబుతున్నారు. తొలుత ముఖ్యమంత్రి ‘పీ-4’ పిచ్చిలో ఉన్నారని రాసిన ఈయన చివరికి దానినంతటిని ఒక సలహాదారుపై నెట్టేశారన్న మాట. ‘పీ-4’ వల్ల కూలీలు దొరకరని ఈయన సూత్రీకరిస్తున్నారు. అంటే ఎవరైనా నిజంగానే బాగుపడితే కూడా ఈయనకు నచ్చదు అనుకోవాలన్నమాట. అయితే టీడీపీతోసహా కూటమి ఎమ్మెల్యేలు కొందరు అరాచకాలకు పాల్పడుతున్నారని, ప్రజలను పీడిస్తున్నారని ఈ టీడీపీ మీడియా అంగీకరించడం విశేషం. ఎమ్మెల్యేలకు కప్పం కడితేనే ఏ పని అయినా అవుతోందని, చివరికి పోలీస్ స్టేషన్లలో కేసు కట్టడానికి, రిజిస్ట్రేషన్లకు కూడా వీరు అనుమతి ఉండాలట.
రాజధాని అమరావతి విషయంలో కూడా పరిస్థితి గందరగోళంగా ఉందని కూడా ఈయన చెబుతున్నారు. ఇన్నాళ్లకు ఈ మీడియా ఒక నిజం రాసినా, ఇందులో వారికి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తున్నారు. గతంలో ఒక నేతపై కథనం రాస్తూ ఆయన చానా పైరవీలు చేస్తున్నారని, లోకేశ్ పేరుతో దందాలు చేస్తున్నారంటూ చెప్పారు. ఈ స్టోరీ సరిగ్గా రాజ్యసభ ఎన్నికల ముందు వచ్చింది. అయినా ఆయనకే ఎంపీ పదవి దక్కింది. ఆ తర్వాత ఈ మీడియా కలం, గళం మూతపడిపోయింది. దీని భావమేమి తిరుమలేశ! అని అంతా ప్రశ్నించుకున్నారు.ఇప్పుడు ఈ కథనం ఇవ్వడం ద్వారా ఎవరిని బెదిరించడానికి అన్న చర్చ టీడీపీ వర్గాలలోనే జరుగుతుండడం ఆసక్తికరం!
కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత