
2024 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అధికారంలోకి రావడమే తరువాయి.. ‘‘మీ ఇష్టం ...మీరు ఎక్కడకు కావాలంటే అక్కడికి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు’’ అని ఇద్దరూ తెగ ఊరించారు. ఇంకో అడుగు ముందుకేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘‘ఎవరైనా టిక్కెట్ అడిగితే చంద్రన్న చెప్పాడని బస్ కండక్టర్‌కు తెలపండి.. నేను సేఫ్ డ్రైవర్‌ని’’ పదే పదే చెప్పారు కూడా. ఈ హామీకి సంబంధించిన ప్రచారం కోసం తయారు చేసిన ప్రకటనల్లో ‘‘మహిళలు ఏపీలోని ఏ పుణ్యక్షేత్రానైన్నా ఉచితంగా దర్శించి రావచ్చు’’ అని ఉండేది.
ఒక యాడ్ ఎలా ఉందంటే... ‘‘టీ కూడా పెట్టకుండా బిజీగా రాసుకుంటున్నావు..’’ అని భర్త తన భార్యను ప్రశ్నిస్తాడు..‘‘మొక్కులు తీర్చుకోవడానికి యాత్రలకు గాను పుణ్యక్షేత్రాల జాబితా తయారు చేస్తున్నా’’.. అని భార్య జవాబు.. ‘‘అసలే ఖర్చులు ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఎలా’’ అని భర్త ప్రశ్న.. ‘‘మనం ఒక పనిచేస్తే సగం ఖర్చు తగ్గించుకోవచ్చు’’ అని భార్య సమాధానం..‘‘జనసేనకు ఓటు వేస్తే ఉచిత బస్ ప్రయాణం చేయవచ్చు. దాంతో సగం ఖర్చు తగ్గిపోతుంది’’ అని భార్య వివరణరిప్లై.. ఇక అంతే కూటమికి ఓటు వేస్తే ఫ్రీబస్ అంటూ ఊదరగొట్టేశారు..
అధికారం అయితే వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కాని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 14 నెలల వరకు అందుబాటులోకి రాలేదు. ఆడబిడ్డ నిధితోసహా పలు స్కీములు అమలు చేయకుండా కాలం గడుపుతున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలలో ముఖ్యంగా మహిళలలో తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో, దాన్ని ఎంతో కొంత తగ్గించాలన్న ఉద్దేశంతో ఇచ్చిన హామీలలో కొన్ని అయినా, కొంత మేర అయినా అమలు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. కాని వీటిని అరకొరగా చేస్తుండడంతో ప్రజలలో వ్యతిరేకత పెద్దగా తగ్గుతున్నట్లు కనిపించడం లేదు. టీడీపీ జనసేనలు తమను మోసం చేశాయని మహిళలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఉచిత బస్సు ప్రయాణాన్ని పేరుకే తప్ప పెద్దగా ప్రయోజనం లేకుండా అమలు చేయ సంకల్పించారని విమర్శిస్తున్నారు. దానికి కారణం ఆడవారు ఏపీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లే అవకాశం కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు రకరకాల షరతులు పెట్టడమే. ఉచిత బస్ స్కీమ్‌పై కూటమి మంత్రులు ఇంతకాలం పలురకాల పిల్లి మొగ్గలు వేశారు. జిల్లాల వరకే ఉచితం అని ఒకసారి, ఉమ్మడి జిల్లాలలో ప్రయాణాలకు అనుమతిస్తామని మరోసారి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా జిల్లా స్థాయిలో ఉచిత ప్రయాణాలు ఉంటాయని అన్నప్పుడు అంతా నవ్వుకున్నారు. యథా ప్రకారం మరో మోసం చేశారని విమర్శించారు. దీనికి తోడు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేస్తున్న విమర్శల ఒత్తిడి ఉండనే ఉంది. కడప నుంచి అమరావతి ఎప్పుడు ఉచిత బస్‌లలో వెళదామని స్త్రీలు ఎదురు చూస్తున్నారని ఒక సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆలోచన చేసి రాష్ట్రమంతా పర్యటించవచ్చంటూ చెబుతూనే లిటిగేషన్ పెట్టారు.
ఎన్నికల ప్రచారంలో అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుకునేలానే చెప్పేవారు. తిరుమల, శ్రీశైలం, సింహాచలం, అన్నవరం.. ఏ గుడికి అయినా, ఎంత దూరం అయినా హాపీగా వెళ్లి రావచ్చనుకున్న ఆడవాళ్ల ఆశలపై నీళ్లు చల్లే పరిస్థితి ఏర్పడింది. మొత్తం పదహారు రకాల బస్ సర్వీసులు ఉంటే ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారట. దాని ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌లు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలోనే ఫ్రీ. ఇవేవి దూర ప్రాంతాలకు వెళ్లేవి కావు. ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించినా, అవి సరిపడా ఉండవు. పైగా వీటిలో చాలా బస్సులు నాన్‌స్టాప్‌లుగా మార్చారు. అన్ని కలిపి 8458 బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుందని టీడీపీ మీడియా మహిళలను మభ్య పెట్టాలని యత్నించింది. ఈ లెక్కలు కూడా కావాలని పెంచి చెప్పినవే.
ఏ మహిళైనా విశాఖ నుంచి తిరుపతికి వెళ్లాలంటే పది బస్సులు మారి వెళ్లాల్సి వస్తుందని, మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అల్ట్రా డీలక్స్, సూపర్ లక్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైన్, ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ బస్సుల్లో ఉచిత ప్రయాణం వీల్లేదు. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోకాని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కాని టిక్కెట్ తీసుకోవల్సిందే. అంటే సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే స్త్రీలు టిక్కెట్లు తీసుకోవల్సిందే అన్నమాట. మహిళలు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులు మారుతూ గంటల తరబడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏపీ సరిహద్దు వరకే ఉచితం కనుక, ఆ తర్వాత టిక్కెట్ తీసుకుని మరో బస్సు ఎక్కాలన్నమాట. అమరావతి బస్సుల్లో కాని, ఆర్టీసీ అద్దెకు తీసుకుని నడిపేవాటిల్లోనూ ఉచిత ప్రయాణం అవకాశం లేదు.
నాన్‌స్టాప్ బస్సులు ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి ఉంటాయి. వాటిలో ఎక్కడానికి వీలు లేదు. ఉదాహరణకు విజయవాడ-గుంటూరు మధ్య ప్రతి పావుగంటకు నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. అలాగే విశాఖ- శ్రీకాకుళం, తిరుపతి-కడప, నెల్లూరు-ఒంగోలు ,విజయవాడ-ఏలూరు, కాకినాడ- రాజమండ్రి, అనంతపురం-కర్నూలు, నంద్యాల-కర్నూలు ఇలా వివిధ పట్టణాల మధ్య పెద్ద సంఖ్యలో నాన్‌స్టాప్ బస్సులు ఉంటాయి. ఇవి ఉచిత పథకంలో భాగం కాదు. తిరుమల, పాడేరు, శ్రీశైలం ఘాట్ రోడ్డులలో కూడా టిక్కెట్ కొనాల్సిందేనట. అలాంటప్పుడు పుణ్య క్షేత్రాలకు ఉచితంగా వెళ్లడం ఎలా సాధ్యం. చివరికి గిరిజనులు అధికంగా ప్రయాణించే పాడేరు ఘాట్ రోడ్డులో కూడా ఈ స్కీమ్ ఉండదట. అంటే ప్రజలను మభ్య పెట్టడానికే ఎన్నికల సమయంలో అన్నీ ఫ్రీ అని అబద్దపు ప్రచారం చేశారన్నమాట. అప్పుడేమో ఎలాంటి షరతులు పెట్టకుండా నమ్మబలికి , ఇప్పుడేమో అన్నీ కండిషన్స్ పెడతారా అని మహిళలను మండిపడుతున్నారు.
ఇంకో విషయం చెప్పాలి. ఎల్లో మీడియాలో మే నెల18 న రాసిన ఒక స్టోరీలో ఉచిత స్కీమ్ అమలుకు ఏపీ ప్రభుత్వంపై రూ.3182 కోట్ల భారం పడుతుందని లెక్కవేశారు. అదే మీడియా ఆగస్టు 10న రాసిన ఒక కథనంలో ఏడాదికి ఈ స్కీమ్ కింద భారం రూ.1942 కోట్లు అవుతుందని అంచనా వేశారని తెలిపారు. అంటే దాదాపు 1200 కోట్ల మేర భారం తగ్గించారంటే ఆ మేరకు ఉచిత బస్ ప్రయాణ సర్వీసులలో కోత పెట్టినట్లే. నిజానికి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ స్కీమును అమలు చేశారు. ఆ పథకం అమలులో ఆ రాష్ట్రాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి. తెలంగాణలో నెలకు సుమారు రూ.300 కోట్లు ఖర్చు అవుతున్నదని అంచనా. ఏపీలో కూడా తొలుత సుమారు రూ.250 కోట్ల వ్యయం అంచనా వేసినా, ఆ తర్వాత దానికి కోత పెట్టుకుంటూ స్కీమ్‌ను నామమాత్రం చేశారా అన్న సంశయం కలుగుతుంది.
తెలంగాణలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులను రీయింబర్స్ చేయడం లేదు. దాంతో పలు సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. నిధుల కొరత కారణంగా తెలంగాణలో గౌలిగూడ ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని తాకట్టు పెట్టి రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోందని ఒక వార్త వచ్చింది. ఏపీలో గత జగన్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ సిబ్బందిగా మార్చినందున కొంత భారం తగ్గుతుంది. అయినా స్కీమ్ అమలులో తీవ్ర జాప్యం చేశారు. ఇది ఇలా ఉండగా, ఉచిత బస్ స్కీమ్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆటోలు, టాక్సీల వారు వాపోతున్నారు.స్వయంఉపాధి కింద వేలాది మంది బతుకుతున్న వారికి ఇది ఒక గండంగా మారుతుంది.
ఫ్రీ బస్ స్కీమ్ హామీ వల్ల ఆటోలవారు నష్టపోకుండా వారికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని, రుణ సదుపాయం, రాయితీల కల్పన వంటివి చేస్తామని హామీ ఇచ్చినా, ఇంతవరకు అవి అమలు కావడం లేదు. దాంతో ఆటో యజమానులు, డ్రైవర్లు ఆందోళనకు గురి అవుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మొత్తమ్మీద చూస్తే విజయవాడ, విశాఖ వంటి పెద్ద నగరాలలో సిటీ బస్సుల్లో తిరిగే మహిళలకే కాస్త ఉపయోగం.అదేమీ పెద్ద ఖర్చు కాదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానానికి, ఆచరణలో అమలు చేస్తున్నదానికి చాలా తేడా ఉందన్నమాట.ఉచిత బస్ స్కీమ్ వల్ల వేల రూపాయలు ఆదా అవుతాయని చేసిన ప్రచారం అంతా ఉత్తదే అన్నమాట. పుణ్య క్షేత్రాలన్నీ తిరిగేసి మొక్కులు తీర్చుకోవాలనుకున్న ఏపీ మహిళలు, కనీసం టీడీపీ, జనసేనలకు మద్దతు ఇచ్చిన వనితలకు ఇది పెద్ద నిరాశ మిగుల్చుతుందని భావించవచ్చు. ఇదన్నమాట! స్త్రీ శక్తి పేరుతో అమలు చేయతలపెట్టిన ఉచిత బస్ ప్రయాణం పథకం అసలు రంగు.

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.