కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలను బీఆర్‌ఎస్‌ ఎదుర్కోగలదా? | Can Brs Face Congress And Bjp Conspiracies | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌, బీజేపీ కుట్రలను బీఆర్‌ఎస్‌ ఎదుర్కోగలదా?

Aug 12 2025 10:34 AM | Updated on Aug 12 2025 1:34 PM

Can Brs Face Congress And Bjp Conspiracies

తెలంగాణకు చెందిన భారత రాష్ట్ర సమితిని బలహీన పరిచేందుకు కాంగ్రెస్‌, బీజేపీలు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ల వైఖరి ఈ అనుమానానికి కారణమవుతోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సాక్ష్యమిచ్చేందుకు సిట్‌ అధికారుల వద్దకు వెళ్లిన సందర్బంలో బండి సంజయ్‌ మీడియా వద్ద చేసిన వ్యాఖ్యలు వీటిని మరింత బలపరుస్తున్నాయి.

ప్రత్యర్థులను బలహీనపరిచి తద్వారా తాము బలపడాలని కోరుకోవడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ఇందుకు రకరకాల వ్యూహాలూ అమలు చేస్తూంటారు. తెలంగాణలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ వ్యూహాలకు, కుట్రల బారిన పడుతున్నది భారత రాష్ట్ర సమితే. ఒక ప్రాంతీయ పార్టీగా రెండు జాతీయ స్థాయి పార్టీలను ఎదుర్కుంటూ ఉండటం దీనికి కారణం. 2014 నుంచి తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 2023 శాసనసభ ఎన్నికలలో ఓడింది.

తొలి టర్మ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య సత్సంబంధాలే ఉండేవి కానీ ఆ తరువాత ఇరువురు దూరమయ్యారు. సొంత జాతీయ పార్టీ యోచనతో కేసీఆర్‌ మహారాష్ట్రలో శాఖను ప్రారంభించారు. అయితే స్వరాష్ట్రం తెలంగాణలోనే ఓటమి పాలు కావడంతో ఆయన ప్లాన్లు తలకిందులయ్యాయి. దీంతో ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలతో ఏర్పరచుకున్న సంబంధాలను కూడా పక్కన బెట్టవలసి వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా 39 అసెంబ్లీ స్థానాలతో బీఆర్‌ఎస్‌ ప్రధాన ప్రతిపక్షంగా ఉండగలిగింది. కాని వీరిలో పది మంది కాంగ్రెస్‌లో చేరిపోయారు.

ముఖ్యమంత్రి పదవి పొందిన రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌ను దెబ్బగొట్టే ఆలోచనతో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోలు లావాదేవీలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, గొర్రెల పంపిణీ వంటి వాటిపై దృష్టి పెట్టి విచారణకు ఆదేశాలు ఇచ్చింది. వీటన్నిటిలో కెసిఆర్ ను ఇరుకున పెట్టే వ్యూహం కనిపిస్తుంది. ప్రత్యేకించి కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో జ్యుడిషయల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

2024 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు బీఆర్‌ఎస్‌కు పెద్ద పరీక్ష అయ్యాయి. ఆ పార్టీ పూర్తిగా పరాజయం చెందడంతో లోక్‌సభ ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. కాంగ్రెస్, బీజేపీలు చెరో 8 సీట్ల చొప్పున విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాకపోవడం పెద్ద ఎదురుదెబ్బ అయ్యింది. అప్పటి నుంచి బీజేపీకి కూడా తెలంగాణపై ఆశలు పెరిగాయి. ఏ అవకాశం వచ్చినా బిజెపి నేతలు బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడటం మొదలుపెట్టారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు తామే ప్రత్యామ్నాయమన్నట్టు బీజేపీ నేతలు ప్రచారం మొదలుపెట్టారు.

తాజాగా బండి సంజయ్ బీఆర్‌ఎస్‌ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పోన్ ట్యాపింగ్‌ కేసులో సాక్ష్యం ఇవ్వడానికి  దర్యాప్తు అధికారుల  బృందం ముందుకు వెళ్లి తన అభిప్రాయాలు తెలియచేశారు. ఏమి ఆధారాలు ఇచ్చారో తెలియదు కాని ఫోన్ ట్యాపింగ్‌ ద్వారా కేసీఆర్‌, కేటీఆర్‌లు వ్యాపారుల నుంచి డబ్బు వసూలు చేస్తూ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, హరీష్‌రావు, కవితలతోసహా పలువురి పోన్లను టాప్ చేశారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నేతలలో, కేసీఆర్‌ కుటుంబంలో కలతలు సృష్టించడానికి సంజయ్ ఈ ఆరోపణలు చేశారా అన్న సందేహం వస్తుంది.

ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే కేసీఆర్‌, కేటీఆర్‌లను ఈపాటికి జైలులో పెట్టేవాళ్లమని సంజయ్ వ్యాఖ్యానించారు. ఇది మరీ సీరియస్ కామెంట్. ఎవరినైనా జైలులో పెట్టడానికి నిర్దిష్ట ఆధారాలు ఉండాలి. అవేమి చూపకుండా ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం?. సిట్ అధికారులు కూడా కేంద్రమే ఈ కేసు విచారించాలని, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఫోన్లను కూడా టాప్ చేశారని అధికారులు సంజయ్ కు చెప్పారని ఒక పత్రిక రాసింది. ఇందులో వాస్తవం ఉంటే కేంద్రానికి, అందులోను హోం శాఖకు తెలియకుండా ఉండదు.

కేంద్రంలోని వారి ఫోన్లు టాప్ అయి ఉంటే, దానిని కనిపెట్టడం కాని, సీబీఐకి అప్పగించడం కాని కేంద్రం చేతిలో పనే కదా అన్న ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంటుంది. కానీ బండి సంజయ్ తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను వీక్ చేయడం కోసం, ఆ పార్టీ నేతలను భయపెట్టడానికి ఈ ఆరోపణలు చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలుపొందినా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినంత వరకు బీఆర్‌ఎస్‌ పార్టీనే కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ బాగా పుంజుకుందన్న అభిప్రాయం కూడా ఉంది. దాంతో బీఆర్‌ఎస్‌ నేతలు నైతికంగా ఇబ్బంది పడేలా సంజయ్ మాట్లాడి ఉండవచ్చు.

దానికి తోడు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు సిటింగ్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. మరో విషయం చెప్పాలి. ఏపీకి బీజేపీ ఎంపీ సీ.ఎం.రమేష్‌కు చెందిన కాంట్రాక్ట్ కంపెనీకి రేవంత్ రెడ్డి భారీ కాంట్రాక్టు ఇప్పించారని కేటీఆర్‌ ఆరోపించారు. ఆ  సందర్భంలో రమేష్ రియాక్ట్ అవుతూ తనవద్ద బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం ప్రతిపాదనను కేటీఆర్‌ చేశారని అన్నారు. కేటీఆర్‌ దాన్ని ఖండించినా అలాంటి ఆరోపణలు రావడం ఏ పార్టీకి అయినా కాస్త ఇబ్బందికరమైన వ్యవహారమే. సంజయ్ ప్రకటనను కూడా కేటీఆర్‌ తోసిపుచ్చి క్షమాపణ డిమాండ్ చేశారు.

అలా చేయకపోతే లీగల్ నోటీసు ఇస్తానని అన్నారు. సంజయ్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కాగా కాళేశ్వరం కమిషన్ నివేదిక రూపంలో కేసీఆర్‌, హరీష్ రావులను చికాకు పెట్టాలని కాంగ్రెస్ యత్నిస్తోంది. కేసీఆర్‌ను అరెస్టు చేయాలని అనుకోవడం లేదని రేవంత్ అన్నప్పటికీ, పరిణామాలు ఏ వైపు మళ్లుతాయో అప్పుడే చెప్పలేం. వీటన్నిటిని గమనిస్తే, బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసి, ఆ స్థానాన్ని తాను ఆక్రమించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఆ అవకాశం బీజేపీకి రాకుండా చేసి, తనే లాభపడాలని కాంగ్రెస్ సహజంగానే యత్నిస్తుంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నాయకత్వం ముందున్న సవాలు. ఈ రెండు పార్టీలలో ఏదో ఒకదానితో బీఆర్‌ఎస్‌కు  సంబంధాలు ఉండి ఉంటే ఈ సమస్యలు అంతగా ఉండేవికావు. దేశవ్యాప్తంగా స్వతంత్రంగా ఉండే ప్రాంతీయ పార్టీలను అణచి వేయడానికి జాతీయ పార్టీలు యత్నిస్తున్నాయి. అందులో బీజేపీ మరీ ముందు ఉంటోందనిపిస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు బీజేపీ అమలు చేసిన వ్యూహాలు అన్నీ, ఇన్నీ కావు. ఆనాటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను సైతం జైలులో పెట్టింది. బీహారులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఒకసారి  బీజేపీ, మరోసారి కాంగ్రెస్‌తో జతకట్టి ప్రభుత్వాన్ని నడుపుకుంటున్నారు.

అదే పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కూడా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూటమితో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం ఎవరితో కలవడం లేదు.అక్కడ కాంగ్రెస్, సీపీఎంల స్థానాన్ని బీజేపీ ఆక్రమించేసింది. తమిళనాడులో కాంగ్రెస్‌తో డీఎంకే కూటమి కడితే, ఏఐఏడీఎంకే ఈ మధ్యనే  బీజేపీతో కలిసింది. కర్ణాటకలో జేడీఎస్‌ కూడా కొంతకాలం కాంగ్రెస్‌తో, ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలో భాగస్వామి అయింది. ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్ ఒంటరిగానే ఉండడానికి సిద్దపడడంతో, బీజేపీ నాయకత్వం తనను తీవ్రంగా దూషించిన టీడీపీతో  పొత్తు పెట్టుకోవడానికి వెనుకాడలేదు. కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చి తమను బతిమలాడేలా చేసుకున్నారు.

దరిమిలా చంద్రబాబుపై ఎలాంటి కేసులు ముందుకు సాగలేదు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌ కాంగ్రెస్ మాత్రమే ఉండగలిగింది. ఇక్కడ కాంగ్రెస్ దాదాపు జీరో స్థాయిలో ఉండడం వల్లే ఇది సాధ్యమైంది. అయినప్పటికీ వైసీపీకి జనంలో పెరుగుతున్న ఆదరణను తగ్గించడానికి కూటమి పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. తెలంగాణలో మూడు పార్టీలు ఆధిపత్య పోరులో ఉండడం వల్ల బీఆర్‌ఎస్‌ రెండు జాతీయ పార్టీలతో పోటీ పడవలసి వస్తోంది. ఈ రకంగా సాగుతున్న రాజకీయంలో వచ్చే మూడేళ్లు బీఆర్‌ఎస్‌ రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల నుంచి తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుని నిలదొక్కుకోవలసి ఉంటుంది.


- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement