దావోస్ సమావేశాలు నిజంగానే పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయా? లేక అవి విహార యాత్రల్లా మారిపోయాయా? ప్రత్యేక విమానాలు వేసుకుని మరీ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్లి సాధిస్తున్నది ఏమిటి? పదిహేనుసార్లు దావోస్‌కు వెళ్లి రికార్డు సృష్టించినట్టు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ భారీ కంపెనీ లేదా పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకువచ్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వెతికే ప్రయత్నం చేస్తే నిరాశే ఎదురవుతుంది.
ఎందుకంటే.. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి చేస్తున్న దావోస్ పర్యటనలు మొత్తం సొంత డబ్బాలకే వాడుకుంటున్న భావన కలుగుతుంది. ప్రజా ప్రయోజనం ఎంతో కాని, ప్రభుత్వ నేతలకు మంచి టైమ్‌పాస్ అన్న విశ్లేషణలు వస్తున్నాయి. అలా అని ఇవి పూర్తిగా నిష్ప్రయోజనమనీ చెప్పలేము కాని కాలక్రమంలో షో బిజినెస్‌గా మారుతోందన్నది ఆర్ధిక రంగ నిపుణుల అభిప్రాయం. చంద్రబాబు నాయుడు ప్రకటనలు కొన్ని గమనించినా ఈ విషయం స్పష్టమవుతుంది.
గత ఏడాది దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక్క ఒప్పందమూ చేసుకోలేకపోయింది. మరోవైపు మహారాష్ట్ర, తెలంగాణ, తదితర రాష్ట్రాలు ఓ మోస్తరు నుంచి భారీ ఒప్పందాలే కుదుర్చుకున్నాయి. అందని ద్రాక్ష పుల్లన అంటారు చూడండి.. అచ్చం అలాగే.. చంద్రబాబు అప్పట్లో ‘దావోస్‌కు వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య’ అని వ్యాఖ్యానించారు. అటువంటి నెగిటివ్ ఆలోచనల నుంచి మీడియా బయటకు రావాలని కూడా ఒక సలహా పారేశారు. అయితే ఇతర రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని సాగతిస్తున్నానని తెలిపారు. విశేషం ఏమిటంటే ముందుగా ఆయన సరైన సూచన ఇవ్వాల్సింది తన కుమారుడు లోకేశ్‌కే. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దావోస్ వెళ్లినప్పుడు గ్రీన్‌కో వంటి కంపెనీలతో కొన్ని ఒప్పందాలు చేసుకువచ్చారు. కానీ అప్పట్లో లోకేశ్ అండ్ కో ‘విదేశాలకెళ్లి దేశీ కంపెనీని తీసుకొస్తారా’ అని ఎద్దేవా చేశారు. ఈ రకమైన నెగెటివ్ మైండ్‌సెట్ సరికాదని చంద్రబాబు.. లోకేశ్‌కు అప్పుడే చెప్పిఉండాల్సింది.
తాజా పర్యటనలో చంద్రబాబు టాటా సన్స్ ఛైర్మన్‌తో సమావేశమైన సందర్భంలో మాట్లాడుతూ గత ఏడాది దావోస్ పర్యటనతో ఇప్పటికే రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తాజా పర్యటనతో కూడా సత్ఫలితాలే అని అన్నారట. అప్పుడేమో మిథ్య అన్నారు.. ఇప్పుడు మాత్రం బోలెడంత పెట్టుబడి వచ్చిందంటున్నారు. ఏది నిజం? ఈయన అబద్ధాలు ఆడుతున్నారన్న సంగతి పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? అది రాష్ట్రానికి అప్రతిష్ట కాదా?. ఏపీ ఈసారి కూడా పెట్టుబడి ఒప్పందాలు ఏవీ చేసుకున్నట్లు కనిపించలేదు. అందువల్లే తెలుగుదేశం మీడియా అయిన ఈనాడు పత్రికలో చంద్రబాబు దావోస్‌లో తొమ్మిది సెషన్లు, సమావేశాలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీ పెంచేలా ప్రసంగించారని రాసింది. అంతే తప్ప ఇన్ని వేల లేదా లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయని రాయలేకపోయింది. ఆయా రాష్ట్రాలు చేసుకునే ఒప్పందాలు అన్నీ ఆచరణలోకి వస్తాయా? రావా? అన్నది వేరే విషయం. కనీసం పెట్టుబడి పెడతామని ఆయా కంపెనీల సీఈవోలు హామీ కూడా ఇవ్వలేదన్నమాటే కదా!.
కాకపోతే చంద్రబాబు కుమారుడు మంత్రి లోకేశ్ పెట్టుబడులు పెట్టాలని బెంగుళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్.ఎమ్.జడ్‌ను కోరితే వారు అంగీకరించారట. ఈ విషయాన్ని మరో ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి తాటికాయంత అక్షరాలతో రాస్తూ ఆ కంపెనీ రూ.91 వేల కోట్ల పెడుతుందని, లక్ష ఉద్యోగాలు వస్తాయని గప్పాలు కొట్టింది. తీరా చూస్తే ఆ కంపెనీ టర్నోవర్ రూ.500 కోట్లు కూడా లేకపోగా ఉద్యోగుల సంఖ్య వెయ్యి మంది మించడం లేదు. పైగా రియల్ ఎస్టేట్ కంపెనీతో లక్ష ఉద్యోగాలు ఎలా వస్తాయో తెలియక నిపుణులు తలపట్టుకుంటున్నారు. పోనీ ఈనాడు రాసినట్లు ఏపీ బ్రాండ్ ఇమేజీని చంద్రబాబు, లోకేశ్‌లు పెంచారా అంటే ఉన్న పరువు కూడా తీశారన్న విమర్శలు వస్తున్నాయి. లోకేష్ 16 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, చంద్రబాబు 23 లక్షల ఉద్యోగాలని, ఆ సందర్భంలో తాను ఏమి చెబుతున్నానో మర్చపోయి 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని ఒక ఇంటర్వ్యూలో అనడంతో జాతీయ స్థాయిలో పరువు తీసుకున్నట్లయింది.
‘ఒక కుటుంబం, ఒక పారిశ్రామిక వేత్త’ విధానం తెచ్చానని, కనీసం లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతానని గత ఏడాది మహిళా దినోత్సవం నాడు ప్రకటించానని, ఈ ఏడాది ఐదు లక్షల మంది స్త్రీలను తీర్చిదిద్దాలని ప్రకటిస్తున్నానని చంద్రబాబు మరో సమావేశంలో అన్నారు. ఈ లక్ష్యం సాధిస్తే తర్వాత పది లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది తన ఆలోచన అని దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తల గోష్టిలో చెబితే వాళ్లు ఏమనుకుంటారు? పైకి ఏం అనకపోయినా తర్వాత అయినా నవ్వుకోరా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్‌ను హైదరాబాద్ తెస్తానని అంటూ కొన్ని అతిశయోక్తులు చెప్పినా తన గురించి కాకుండా.. తెలంగాణ, హైదరాబాద్‌లను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. సుమారు రూ.29 వేల కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నారు. రేవంత్ తన ఇంటికి సమీపంలో ఉండే గ్రీన్ కో సంస్థతో దావోస్‌లో ఒప్పందం చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, రాజీవ్ శుక్లాలు సైతం దావోస్‌లో ఎంఓయూల తీరును ఆక్షేపించడం విశేషం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అయితే తన మంత్రివర్గ సభ్యుడు ప్రభాత్ లోధాకు చెందిన కంపెనీతో రూ.1.30 లక్షల కోట్ల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకున్నారని జైరాం రమేష్ సెటైర్లు చేశారు.
2014-19 టర్మ్‌లో చంద్రబాబు దావోస్ పర్యటనలో చేసిన ప్రకటనలు, రాసిన వార్తలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని ఉదాహరణలు చూడండి. ఏపీకి రక్షణ పరికరాల సంస్థ లాక్ హీడ్, హైబ్రిడ్ క్లౌడ్, రాష్ట్రానికి సౌదీ అరాంకో, హై స్పీడ్ రైళ్ల కర్మాగారం, అలీబాబా రెండో డేటా సెంటర్ ఏపీలోనే.. రాష్ట్రానికి ఎయిర్ బస్, రాష్ట్రానికి 150 సంస్థలు, ఇలా అనేక శీర్షికలతో ఎల్లో మీడియా జనాన్ని ఊరించింది. వాటిలో ఒక్కటైనా వచ్చిందా? ఈసారి కూడా అదే రీతిలో ఎల్లో మీడియా ఎలివేషన్ ఇస్తూ, ఏపీ బ్రాండింగ్ @దావోస్ అంటూ పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. అంటే దీని అర్థం ఈ విడత కూడా పెట్టుబడులు పెద్దగా ఆశించవద్దనే కదా! దీనివల్ల ఒక నష్టం కూడా జరుగుతోంది. గతంలో బ్రాండ్ ఇమేజీ లేదని మనమే దావోస్‌లో డప్పు కొట్టుకున్నట్లుగా ఉంది. పైగా 99 పైసలకే భూములు ఇస్తామన్న ప్రచారం వల్ల రాష్ట్ర ఇమేజీ పడిపోయిందో, పెరిగిందో ఆలోచించుకోవచ్చు.
ఇక రెడ్‌బుక్ అరాచకాల విషయం జిందాల్ వంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలకు అనుభవమే. దావోస్ వరకు వెళ్లి తండ్రి, కొడుకులు ఒకరినొకరు పొగుడుకోవడం అంతా గమనించారు. దావోస్‌లో తెలుగువారి పేరుతో తెలుగుదేశం కార్యకర్తలు లేదా అభిమానుల సమావేశం పెట్టి వైఎస్సార్‌సీపీని, వైఎస్ జగన్‌ను విమర్శించడం వల్ల ఏపీకి ఏం మేలు కలిగినట్లు!. సీపీఎం నేత బీవీ రాఘవులు దావోస్ పర్యటనలను ప్రజాధనంతో జరిగే తీర్ధయాత్రలుగా అభివర్ణించారు. దావోస్‌లో చంద్రబాబు, లోకేశ్‌లు సొంత డబ్బా కొట్టుకున్నారని, చంద్రబాబు బ్రాండ్ ఇమేజీతో కాకుండా, తెలుగుదేశం బ్యాండ్ మేళంతో వెళ్లినట్లు ప్రజలకు కనిపిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
ప్రముఖ ఆర్థిక మీడియా సంపాదకురాలు సుచేత దలాల్ ఒక ట్వీట్ చేస్తూ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ సదస్సులో పాల్గొనడం ఒక నవ్వులాటగా మారిందని వ్యాఖ్యానించారు. దావోస్ వ్యవహారం అంతర్జాతీయ ఇబ్బందికర వ్యవహారంగా మారిన సంగతిని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నించారు. ప్రజాధనంతో ముఖ్యమంత్రులు దేశంలో చేసుకోగల ఒప్పందాలను దావోస్‌లో చేసుకోవడం ఏమిటి? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రుల ప్రచార ఆర్భాటం అసహ్యం కలిగిస్తోందని, ప్రపంచం నవ్వుతోందని సుచేత వ్యాఖ్యానించారు. ఏపీ అనుభవం చూస్తే ఇవన్నీ నిజమే అనిపిస్తాయి. 
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


