బెంగళూరు: కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై రాజకీయం నడుస్తున్న వేళ సిద్దరామయ్యపై సర్కార్‌కు మరో ఝలక్ తగిలింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు సంబంధించి దాదాపు 6000 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో, మద్యం కుంభకోణం విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఖర్గే, రాహుల్‌కు లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ ప్రతినిధులు చెప్పుకొచ్చారు.
వివరాల మేరకు.. కర్ణాటకలో మద్యం అమ్మకాలకు సంబంధించిన సీఎల్-7 లైసెన్సుల జారీకి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నారని కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఒక్కో లైసెన్స్ జారీకి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేశారని, అలా మొత్తంగా దాదాపు 6000 కోట్లు తిన్నారని మండిపడ్డారు. ఈ కుంభకోణంలో ఎక్సైజ్ మంత్రి ఆర్బీ తిమ్మాపూర్‌తో పాటు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ముగ్గురు డిప్యూటీ కమిషనర్లు, తొమ్మిది మంది సూపరింటెండెంట్లు, 13 మంది డిప్యూటీ సూపరింటెండెంట్లు, 20 మంది ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు భాగమైనట్టు వారు చెప్పుకొచ్చారు. కాగా, మద్యం అమ్మకాల్లో అవినీతినిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి లేఖ రాయనున్నట్టు అసోసియేషన్ తెలిపింది.
మరోవైపు.. కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్‌పై కర్ణాటక వైన్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండేళ్ల సిద్ధరామయ్య పాలన అవినీతికి కేరాఫ్‌గా మారిందన్నారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో రూ. 700 కోట్ల స్కాం జరుగుతోందని 2024లోనే సీఎం సిద్ధరామయ్యకు, గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్‌కు, లోకాయుక్తాకు ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అయితే, మంత్రిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధూ సర్కారు ముందుకు రాలేదని.. దీంతో స్కాం తీవ్రత పెరిగిపోయిందని వాపోయారు. దీంతో, మద్యం వ్యవహారం కర్ణాటకలో కొత్త చర్చకు దారి తీసింది.
ఇదిలాఉండగా తమ కస్టమర్లకు మద్యాన్ని ఇవ్వడానికి బెంగళూరులోని ఖరీదైన ప్రాంతాల్లోని హోటల్స్, బోర్డింగ్ హౌజ్‌ల యజమానులు సీఎల్-7 పేరిట ప్రత్యేక లైసెన్సులను తీసుకొంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ లైసెన్స్ రూ. కోటి నుంచి 2 కోట్ల వరకూ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. అయితే, ఎక్సైజ్ శాఖ స్కాం వార్తలను మంత్రి తిమ్మాపూర్ కొట్టివేశారు. ఈ ఆరోపణల్లో నిజం లేదన్న ఆయన.. దీనిపై అసెంబ్లీలోనే మాట్లాడుతానన్నారు. ఈ స్కామ్‌పై ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. పాలనను పక్కనబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కుంభకోణాల్లో మునిగిపోయిందని ధ్వజమెత్తారు.


