సాక్షి, కృష్ణా: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది. చంద్రబాబు, పవన్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
నూజివీడులో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లపై పేర్ని నాని విమర్శలు గప్పించారు. అయితే రాజకీయ విమర్శలను.. దూషణలుగా పేర్కొంటూ టీడీపీ నేతలు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఎన్‌ఎస్ సెక్షన్లు.. 196 (1), 353 (2), 351 (2), 352 కింద కేసు నమోదు అయ్యింది.
ఈ పరిణామంపై వైఎస్సార్‌సీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు కిందకు వస్తుందని చెబుతోంది. కూటమి నేతలు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా.. వైఎస్సార్‌సీపీ ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు టీడీపీ నేతల ఫిర్యాదునకు సత్వరమే స్పందించడమేంటని నిలదీస్తోంది.
ఇదిలా ఉంటే.. పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపులకు దిగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రేషన్ బియ్యం కేసుతో పాటు సీఐ యేసు బాబుతో పీఎస్‌లోనే గొడవకు దిగారని, మంత్రి అనగాని ప్రసాద్‌ను అవమానించారని.. ఇలా రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసింది.


