సాక్షి, అనంతపురం: అనంతపురంలోని శింగనమల నియోజకవర్గం యల్లనూరు పోలీసుల నిర్వాకం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీ యల్లనూరు జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. అయితే, వీరంతా ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు కావడమే ఇందుకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వివరాల మేరకు.. జనవరి ఒకటో తేదీన వైఎస్సార్‌సీపీ యల్లనూరు జెడ్పీటీసీ బోగాతి ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ప్రతాప్ రెడ్డి సహా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో యల్లనూరు టీడీపీ కన్వీనర్ రామాంజనేయులు సహా మరో 24 మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసును పోలీసులు నమోదు చేశారు. అయితే, నిందితులంతా శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులే కావడం గమనార్హం.
కాగా, ప్రతాప్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నిందితులు బాహాటంగా తిరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదే కేసులో 12 మంది వైఎస్సార్‌సీపీ నేతలను మాత్రం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే బండారు శ్రావణి కార్యక్రమాల్లో టీడీపీ నేత రామాంజనేయులు, ఆయన అనుచరులు పాల్గొంటున్న వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. కేసు నమోదు చేసినప్పటికీ ఎందుకు వారిని అరెస్ట్ చేయడం లేదని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, స్థానికులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు.


