మేడారం.. మహాశివరాత్రి ఉత్సవాలతో ఆశాజనకంగా పెరిగిన ధరలు
వెయ్యి కాయ ధర రూ.20 వేలు
రెండు రోజుల్లో రూ.4 వేల వరకు పెరుగుదల
గండేరా వెయ్యి కాయ ధర రూ.31,500
ఊపందుకున్న ఎగుమతులు
సాక్షి, అమలాపురం/అంబాజీపేట: నాలుగు నెలలుగా ధరలేక దిగాలుగా ఉన్న కొబ్బరి రైతుల్లో ఒక్కసారిగా జోష్ వచ్చింది. తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగే సమ్మక్క, సారక్క (మేడారం) జాతర.. ఉత్తరాదిన మహాశివరాత్రి ప్రభావంతో కొబ్బరి ధరలకు రెక్కలొచ్చాయి. పచ్చి కొబ్బరి.. కురిడీ కొబ్బరి ధరలు పెరగడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుంచి కొబ్బరి ఎగుమతులు ఊపందుకున్నాయి.
గత ఏడాది దీపావళి తర్వాత కొబ్బరి ధరలు తగ్గడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రైతులు నిరాశలో ఉన్నారు. అంతకు ముందు వెయ్యి కాయల ధర రూ.24 వేల నుంచి రూ.27 వేల వరకూ ఉంది. రాష్ట్ర కొబ్బరి మార్కెట్ చరిత్రలోనే ఇది రికార్డు స్థాయి ధర. అయితే దీపావళి నుంచి ధర తగ్గుతూ వచ్చింది. వారం రోజుల క్రితం అంబాజీపేట మార్కెట్‌లో పచ్చి కాయ ధర రూ.15 వేల నుంచి రూ.16 వేలు మాత్రమే ఉంది.
ఈ నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు సాగే మేడారం జాతర పుణ్యమా అని లక్షలాదిగా తరలివచ్చే ఈ ఉత్సవాలకు భక్తులు బెల్లంతో పాటు కొబ్బరికాయలను పెద్ద ఎత్తున మొక్కుబడిగా చెల్లించుకుంటారు. దీంతో జిల్లాలోని కొబ్బరికి డిమాండ్ వచ్చింది. కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల నుంచి మేడారానికి కొబ్బరి ఎగుమతులు ఊపందుకున్నాయి.
ఇదే సమయంలో వచ్చే నెల మహాశివరాత్రి పర్వదినం రానుండడంతో ఉత్తరాది రాష్ట్రాలకు కొబ్బరి ఎగుమతులు సాగుతున్నాయి. దీంతో డిమాండ్ పెరిగి కొబ్బరి మార్కెట్‌లో వెయ్యి కొబ్బరికాయల ధర రూ.19 వేల నుంచి రూ. 20 వేలకు చేరింది. మూడు జిల్లాల నుంచి రోజుకు సుమారుగా 60 నుంచి 70 లారీల పచ్చికొబ్బరి (నీటికాయ) ఎగుమతి అవుతోందని వ్యాపారులు చెప్తున్నారు. కొబ్బరి ధరలు, మళ్లీ పెరగడంతో రైతులకు ఊరట లభించింది.
మాఘమాసం ప్రారంభం కానుండడంతో స్థానికంగా కూడా కొబ్బరి ధర మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాతో రైతులు ఆచితూచి అమ్మకాలు సాగిస్తున్నారు. అంబాజీపేట మార్కెట్ పచ్చి కొబ్బరితో పాటు కురిడీ కాయల ధరలు సైతం ఆశాజనకంగా పెరిగాయి. కురిడి కొబ్బరిలో పాతకాయ గండేరా రకం (పెద్ద కాయ) వెయ్యింటికి రూ.32,500, గటగట రకం (చిన్న కాయ) రూ.29 వేలు, కొత్తకాయ గండేరా రూ.29,500, గటగట రూ.27 వేలు పలుకుతోంది.
ధర పెరిగి ఊరటనిచ్చింది
వరుస శుభకార్యాలు, శివరాత్రి సందర్భంగా కొబ్బరి కాయ ధరలు పెరడం కొంత ఊరటనిచ్చింది. కొబ్బరి కాయకు ధర ఉన్నప్పుడు దిగుబడులు ఉండటం లేదు. ఈ సమయంలో ధరలు పెరగడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. రానున్న రోజుల్లో నీటి కొబ్బరి కాయ ధరలు పెరిగే అవకాశం ఉందని ఆశిస్తున్నాం. – మట్టపర్తి బాలాజీ, రైతు, గంగలకుర్రు అగ్రహారం


