కర్షకుడికి కరెంటోళ్ల షాక్‌ | - | Sakshi
Sakshi News home page

కర్షకుడికి కరెంటోళ్ల షాక్‌

Jan 28 2026 7:10 AM | Updated on Jan 28 2026 7:10 AM

కర్షకుడికి కరెంటోళ్ల షాక్‌

కర్షకుడికి కరెంటోళ్ల షాక్‌

ఆ శాఖలో నెలవారీ జీతం కన్నా గీతం ఎక్కువగానే ఉంటోంది. చేయి తడపనిదే పని కాదన్న విమర్శలూ అధికమే. జిల్లాలోని విద్యుత్‌ శాఖ పనితీరు ఇది. ఒక్కో మీటర్‌ కనెక్షన్‌కు రూ.500 నుంచి రూ.1000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక నూతనంగా వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు మంజూరైతే చాలు కాసులపంటే. మామూళ్ల మత్తులో జోగుతూ పనిలో నాణ్యతకు తిలోదకాలిచ్చి కాంట్రాక్టర్లకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరిస్తుండడంతో అడుగడుగునా అన్నదాతలు దగా పడుతున్నారు.

ఆత్మకూరు: వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ మంజూరులో కంటికి కనిపించని అక్రమాలు రైతులను కుదేలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ డబ్బు వసూలు చేస్తుండడంతో రైతులు నిలువునా మోస పోతున్నారు. సరైన పత్రాలు ఉన్నప్పటికీ సామగ్రి అందుబాటులో లేదంటూ కాంట్రాక్లర్ల స్వార్థం కోసం ప్రక్రియను సాగదీస్తున్నారు. విద్యుత్‌ శాఖలోని కొంతమంది సిబ్బంది అక్రమాలకు రూ. వేలల్లో రైతులు నష్టపోతున్నారు.

మచ్చుకు కొన్ని

● ఆత్మకూరుకు చెందిన రైతు దామోదరరెడ్డి తన పొలానికి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం ఆ శాఖ అధికారులను సంప్రదించాడు. దీంతో క్షేత్ర స్థాయి పరిశీలన అనంతరం 9 విద్యుత్‌ స్తంభాలు, 120 కిలోల కండెక్టర్‌, 20 కిలోల కేబులు, ఇతర పరికరాలకు కలిపి రూ.38,500 ఎస్టిమేషన్‌ను అధికారులు అందజేశారు. ఈ మేరకు రైతు డీడీ చెల్లించాడు. పనులు ప్రారంభం కాగానే కండెక్టర్‌ తక్కువగా ఉందని, ఫీజు సెట్లు కావాలని.... ఇవి అందుబాటులో లేకపోవడంతో వాటిని ప్రైవేట్‌గా కొనుగోలు చేయాల్సి ఉంటుందని కాంట్రాక్టర్‌ సూచించాడు. ఇదే అంశాన్ని ఏఈ దృష్టికి సదరు రైతు తీసుకెళితే.. వాటిని కాంట్రాక్టర్‌ వేస్తాడని నమ్మబలికాడు. కాంట్రాక్టర్‌ను అడిగితే అవి ప్రభుత్వమే ఇస్తుందని, తమకు సంబంధం లేదని తెలిపాడు. వాటిని తెచ్చిస్తే వేస్తాం లేదంటే లేదనడంతో చేసేదేమీ లేక సదరు కాంట్రాక్టర్‌ అడిగిన రూ.20 వేలను రైతు అదనంగా చెల్లించాడు. అంతేకాక, విద్యుత్‌ స్తంభాల రవాణా ఖర్చును సైతం రైతుపైనే వేయడంతో ఆర్థిక భారం రెట్టింపైంది.

● ఆత్మకూరుకు చెందిన రైతు కొండారెడ్డిది కూడా దామోదరరెడ్డి పరిస్థితినే అయింది. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్‌ కోసం రూ.38 వేలకు పైగా డీడీ చెల్లించాడు. పరికరాలు లేవంటూ రైతు నుంచి అదనంగా రూ.25 వేలను వసూలు చేశారు.

గతంలో ఉచితం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైఎస్సార్‌ జలకళ పేరుతో రైతుల పొలాల్లో ఉచితంగా బోరు బావులు తవ్వించడం మొదలు.. విద్యుత్‌ కనెక్షన్‌ వరకూ అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నీ ఉచితంగా అందజేస్తూ వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆత్మకూరు మండల వ్యాప్తంగా 200 వరకు వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరయ్యాయి. ఇంకా 80 మంది రైతుల దరఖాస్తులు అధికారుల వద్ద ఉండిపోయాయి. అధికారుల ఎస్టిమేషన్‌ ప్రకారం డీడీలు తీసి చెల్లించినా... తమకు ఆర్థిక భారం తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన ఖరీదైన పరికరాలు సరఫరా లేదంటూ రైతులను మభ్య పెట్టి అందిన కాడికి దోచుకోవడం పరిపాటిగా మారింది. ఇదేమని అడిగితే ప్రభుత్వం సరఫరా చేయడం లేదని విద్యుత్‌ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు.

అన్ని పరికరాలు అందజేస్తున్నాం

కొన్ని పరికరాల సరఫరాలో జాప్యం చోటు చేసుకుంటున్న మాట వాస్తవం. అయినా ఎస్టిమేషన్‌లో రూపొందించిన మేరకు రైతులు డీడీ చెల్లిస్తే... ఆ మేరకే పరికరాలను సరఫరా చేస్తున్నాం. విద్యుత్‌ స్తంభాలను కూడా పొలాల వద్దకే కాంట్రాక్టర్లు తీసుకెళ్లాలి. కాంట్రాక్టర్డు డబ్బులు అడిగితే ఇవ్వొద్దని రైతులకు చెప్పాం.

– దాస్‌, విద్యుత్‌ శాఖ ఏఈ, ఆత్మకూరు

విద్యుత్‌ శాఖలో నయా దందా

ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటులో యథేచ్ఛగా అక్రమాలు

డీడీలు చెల్లించినా రూ.వేలకువేలు అదనపు భారం

నిలువునా మోసపోతున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement